Rss Feed

చిత్తూరు నాగయ్య

చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యాడు. దక్షిణభారత దేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది - తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు. ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు. చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన అసలు పేరు "ఉప్పల దడియం నాగయ్య". కొంతకాలం పాత్రికేయునిగా పనిచేశారు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యారు. విషయ సూచిక * 1 సినీరంగ ప్రవేశం * 2 వ్యక్తిత్వం * 3 దర్శకత్వం * 4 చివరి దశ * 5 ప్రశంసలు * 6 నటించిన చిత్రాలు * 7 ఇతర వనరులు * 8 చూడండి సినీరంగ ప్రవేశం 1938లో హెచ్.ఎమ్.రెడ్డి చిత్రం గృహలక్ష్మితో నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. చిత్తూర్లో పత్రికా విలేకరిగా వుంటూ, నాటకాల్లో నటిస్తూ గ్రామఫోన్ రికార్డులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న నాగయ్యను సినిమారంగం ఆహ్వానించింది. ఆ రోజుల్లో పర్సనాలిటీ ఎలావుందని ఎవరూ చూసేవారు కాదు. 'పాటా పద్యం వచ్చునా - ఓకే!' అన్న రోజులు. రంగస్థలం మీద సంభాషణ చెప్పడంలో కూడా కొత్త విధానాన్ని చూపించారనీ, ఉచ్చారణ స్పష్టంగా వున్నదనీ నాగయ్యను హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గృహలక్ష్మి (1938) చిత్రములో నటించడానికి పిలిచారు. అందులో ఈయన ఒక దేశభక్తుడి పాత్ర పోషించాడు. గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొని ప్రాచుర్యం పొందాయి. తొలిచిత్రంతోనే చిత్తూరు వి.నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు. 1939లో బి.యన్.రెడ్డి వందేమాతరం చిత్రంలో నాగయ్యకు కధానాయకుని పాత్ర లభించింది. అదే చిత్రంలో నాగయ్య సంగీతాన్ని కూడా కూర్చారు. అప్పుడు 'హీరో ఇమేజ్' వుంటుందీ, పోతుందీ అన్న భావన లేనేలేదు. వెంటనే 'సుమంగళి (1940) లో వృద్ధపాత్ర ధరించారాయన. తర్వాతి చిత్రం దేవత (1941) లో హీరోయే. ఈ సినిమాలన్నీ తమిళనాడులో కూడా బాగా నడవడంతో, నాగయ్యకు తమిళ చిత్రాల్లో కుడా మంచి అవకాశాలొచ్చాయి. తమిళభాషను ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నారు. గ్రాంథికభాష కూడా అలవరుచున్నారు. తన పాటలు తానే పాడుతూ 'సిసలైన తెలుగు సినిమా హీరోగా' గొప్ప వెలుగు వెలిగారు నాగయ్య. స్వర్గసీమ (1945) ఒక ఉదాహరణ. భక్త పోతన (1942), త్యాగయ్య (1946), యోగి వేమన (1947) చిత్రాలు నాగయ్య జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ పాత్రల ప్రభావం ఆయన మీద బాగా పడింది. 1938-1973 మధ్య నాగయ్య 200పైగా తెలుగు, తమిళ సినిమాలలో నటించారు. సుమంగళి, భక్త పోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య ఆయన నటించిన కొన్ని విశేష చిత్రాలు. అప్పటిలో నాగయ్య అత్యధిక పారితోషికం తీసుకొనే నటుడు. 1948లో తమిళ సినిమా "భక్యదలి (?)" కి నాగయ్యకు లక్ష రూపాయలు పారితోషికం. నాగయ్య మంచి గాయకుడు, సంగీత దర్శకుడు కూడాను. స్వర్గసీమ సినిమాకు నేపధ్యగాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు. త్యాగయ్య సినిమా చూసి మైసూరు మహారాజా నాగయ్యను 101 బంగారు నాణేలు, ఒక కంఠాభరణంతో సత్కరించారు. తెలుగు సినీరంగంలో మొట్టమొదటి పద్మశ్రీ సత్కారం గ్రహించింది నాగయ్యే. మాన్యులు, సామాన్యులు కూడా నాగయ్యను విపరీతంగా అభిమానించే వారు. తరువాత భాగ్యలక్ష్మి సినిమాతో చిత్రనిర్మాణంలోకి దిగారు. రామదాసు సినిమాలో ఆయన బాగా నష్టపోయారు. సినిమా నిర్మాణంలోను, దాన ధర్మాల వలన ఆయన ఆస్తి బాగా కరిగిపోయింది. సినిమా ప్రభావం మంచైనా, చెడైనా ప్రజల మీద వుంటుందంటారు. అది చూస్తూనే వున్నాం, వింటూనే వున్నాం. పోతన, వేమన పాత్రల ప్రభావంతోనే ముమ్మడివరం బాలుడు బాలయోగిగా మారాడన్నది తెలిసిన విషయమే. అప్పుడే బాబూరావు పటేల్ తన 'ఫిల్మిండియా' పత్రికలో 'మనదేశంలోనూ ఒక పాల్ ముని వున్నాడు' అని నాగయ్యను ప్రస్తుతించాడు. తెలుగునటుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న తొలినటుడు నాగయ్య. ఆ చిత్రం పక్షిరాజా వారి 'బీదలపాట్లు (50). దక్షిణభారతంలో 'పద్మశ్రీ' పురస్కారం పొందిన తొలినటుడూ నాగయ్యే. 'అదేదో నా ఘనత కాదు. నాకే వచ్చిన ప్రశంస కాదు. ఇదినటులందరిదీ!' అని చెప్పేవారు నాగయ్య ఎవరు కనిపించినా. వ్యక్తిత్వం ఆయన మాటతీరూ, చిరునవ్వూ అన్నీ శాంతం ఉట్టిపడుతూ వుండేవి. ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలూ, కోపతాపాలూ వుండేవి కావు. పోతన - తన దగ్గర లేకపోయినా, ఉన్నదేదో దానం చేసినట్టు, - నాగయ్య కూడా దానాలు చేసి చేసి, ఆస్తులన్నీ హరింప జేశారు. కొందర్ని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. 'త్యాగయ్య తీస్తున్నప్పుడు వారి రేణుకా ఆఫీసు ధర్మసత్రంలా వుండేదని చెప్పుకుంటారు. చిన్న చిన్న వేషాలు వేసేవాళ్లూ, చిన్న టెక్నీషియన్లూ, అక్కడే బసా, భోజనాలూ! 'పొట్టిప్లీడరు (1966) సినిమా తీస్తున్నప్పుడు పద్మనాభం ఆయనతో మాటల సందర్భంగా చెప్పారు తను కూడా 'రేణుక' ఆఫీసులో కొంతకాలం వున్నానని. దానికాయన ఎంతో స్పందించి, 'అలాగా నాయనా! నీకు అప్పుడు ఏ లోపం జరగలేదు గదా, నువ్వెవరో నాకు తెలియకపోయెనే!' అని బాధపడ్డారు. అవుట్ డోర్ షూటింగులకి వెళ్తే, మధ్యాహ్నం భోజనసమయంలో షూటింగు చూడవచ్చిన జనానికి భోజనం పెట్టమనేవారు నాగయ్య. 'వాళ్లు కూడా పొద్దున నుంచి మనతోపాటే ఇక్కడ వున్నారుగదా!' అన్నది ఆయన సమాధానం. మద్రాసులో స్కూళ్లూ, కాలేజీలూ తెరిచే రోజుల్లో ఆయన ఇంటిముందు విపరీతంగా జనం గుమిగూడేవారు - ఆయన లేఖలురాసి ఇస్తే కాలేజీ, హైస్కూళ్లలో సీట్లు దొరకడం సులభయయేది. దర్శకత్వం దర్శకుడుగా త్యాగయ్య ఆయన తొలిచిత్రం. త్యాగయ్య సినిమాను ఆయనే నిర్మించి, దర్శకత్వము చేశారు. నాయిల్లు (1953), భక్త రామదాసు (1964) చిత్రాలూ డైరెక్టు చేశారు - నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ. కొంతకాలం క్రితం మద్రాసులో నాగయ్య స్మారకదినోత్సవం జరిగితే, 'త్యాగయ్య' ప్రదర్శించారు. ఆ చిత్రం చూసిన ప్రసిద్ధదర్శకుడు కె.విశ్వనాథ్ 'ఈ చిత్రంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగానూ, ఉన్నతంగానూ ఉన్నాయి. ఆయన తీసిన కొన్ని షాట్స్ నాలాంటి దర్శకుల ఊహకు అందనివీ అని కీర్తించారు. 'త్యాగయ్య సినిమాలోని 'ఎందరో మహానుభావులూ' పాట విన్న ప్రసిద్ధ గాయకుడు జేసుదాసు త్యాగరాజు ఎలా పాడివుంటారో, నాగయ్యపాట విన్నాక, ఊహించుకోవచ్చును. త్యాగరాజ సంప్రదాయాన్ని పాటిస్తూ, ఆకౄతిని అతిభక్తిశ్రద్ధలతో ఇంకొకరు పాడగలరా - అనిపిస్తుందీ అని చెప్పారు. ఆ చిత్రంలోని ఆయన గానామృతానికి పరవశించి, మైసూరుమహారాజా, తిరువాస్కూర్ మహారాజా, నాగయ్యను అతిఘనంగా సత్కరించారు. తిరువాస్కూరు రాజావారు, ఏకంగా తన సింహాసనం మీదనే కూర్చోబెట్టారుట. 'రామదాసు' చిత్రం వేళకే ఆయన ఆస్తులు కొండెక్కిపోయాయి. ఆయనకు నాలుగైదు తోటలు వుండేవి. రామదాసు సినిమా తీస్తున్నప్పుడు, రామదాసు పడిన కష్టాలన్నీ నాగయ్య అనుభవించారు. చిత్రం పూర్తి కావడానికి చాలాకాలం పట్టింది. చివరి దశ చివరి రోజులలో పేదరికాన్ని అనుభవించారు. కేవలం వందల రూపాయలకు చిన్న చిన్న వేషాలు వేశారు. తెలుగు సినీరంగములో ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య, ఆ తరువాత దశలో ఉదరపోషణకు చిన్న వేషాలు వేస్తూ అల్ప పారితోషికాలూ అందుకున్నారు. నా జీవితం అందరికీ ఒక పాఠం. తనకు మాలిన ధర్మం చెయ్యకండి. అపాత్రదానాలు చెయ్యకండి. ఎందరో గోముఖవ్యాఘ్రాలు వుంటారు. అందర్నీ నమ్మకండి! అని చెప్పేవారు - ఇళ్లు అన్నీ పోయి అద్దె ఇంట్లో వున్నప్పుడు! మద్రాసు పానగల్ పార్కులోని ఆయన విగ్రహం, వాణీ మహాల్ ఆడిటోరియం, ఆయన చలనచిత్ర ఉదాత్తపాత్రలూ ఆయన ఘనతను మనకు అనునిత్యం గుర్తుకు తెస్తూవుంటాయి. 1973లో నాగయ్య మరణించారు. ] ప్రశంసలు ] నటించిన చిత్రాలు 30వ దశకం 1. గృహలక్ష్మి(1938) 2. వందేమాతరం (1939) 40వ దశకం 1940 1. సుమంగళి 2. మహాత్మాగాంధీ (డాక్యుమెంటరీ) 3. విశ్వమోహిని 1941 1. దేవత 1943 1. భాగ్యలక్ష్మి 2. చెంచులక్ష్మి 3. భక్తపోతన 1945 1. స్వర్గసీమ 1946 1. త్యాగయ్య 2. యోగి వేమన 1949 1. మనదేశం 50వ దశకం 1950 1. బీదలపాట్లు 1953 1. నా ఇల్లు 2. ఇన్స్‌పెక్టర్ 3. ప్రపంచం 4. గుమస్తా 1954 1. మా గోపి 2. సంఘం 3. జాతకఫలం 1955 1. అనార్కలి 1956 1. భక్త మార్కండేయ 2. ముద్దు బిడ్డ 3. తెనాలి రామకృష్ణ 4. నాగపంచమి 1957 1. సతీ సావిత్రి 2. పాండురంగ మహత్యం 3. నలదమయంతి 1958 1. బొమ్మల పెళ్ళి 2. ఎత్తుకు పైఎత్తు 3. గంగా గౌరి సంవాదం 4. శ్రీ రామాంజనేయ యుద్దం 5. సంపూర్ణ రామాయణం 6. పార్వతీ కళ్యాణం 1959 1. బండరాముడు 2. జయభేరి 3. సిపాయి కూతురు 60వ దశకం 1960 1. అభిమానం 2. భక్త రఘునాథ్ 3. భక్త శబరి 4. మా బాబు(అతిధి) 5. సమాజం 6. శాంతినివాసం 7. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం 1961 1. భక్త జయదేవ 2. ఇంటికి దీపం ఇల్లాలే 3. సీతారామ కళ్యాణం 4. వాగ్దానం(అతిధి) 5. పెళ్ళిపిలుపు(అతిధి) 6. సతీ సులోచన(అతిధి) 7. ఋష్యశృంగ 1962 1. నాగార్జున 2. దక్షయజ్ఞం(అతిధి) 3. ఆరాధన(అతిధి) 4. స్వర్ణమంజరి 5. పెళ్ళి తాంబూలం 6. పదండి ముందుకు(అతిధి) 7. గాలి మేడలు 8. సిరిసంపదలు 9. మమకారం 1963 1. బందిపోటు 2. కానిస్టేబుల్ కూతురు 3. లవకుశ 4. అనురాగం(అతిధి) 5. శ్రీకృష్ణార్జున యుద్ధం 6. తల్లీ బిడ్డలు 7. లక్షాధికారి 8. ఇరుగు పొరుగు 1964 1. అగ్గిపిడుగు 2. ఆత్మబలం 3. అమరశిల్పి జక్కన 4. రామదాసు 5. వివాహ బంధం 6. గుడిగంటలు 7. దాగుడుమూతలు(అతిధి) 8. నవగ్రహ పూజా మహిమ 9. బొబ్బిలి యుద్ధం(అతిధి)