-
సుబ్రమణ్యపురం
తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు.
ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రమణ్యపురం సినిమా ఈ దశాబ్దపు ఉత్తమ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.
ఈ సినిమా కథ చెప్పి ఈ సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులను నిరాశ పరచడం ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే “1980 లలో మధురై లోని సుబ్రమణ్యపురం లో నివసించే ఒక ఐదుగురి యువకుల కథ ఇది”.
కథ, కథనం తో పాటు బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, సరైన సంగీతం ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ గా నిలబెడుతుంది.ఈ సినిమా నాకు బాగా నచ్చడానికి కొన్ని కారణాలు:
1. కథ మొదలైన తీరు నచ్చకపోయినా సినిమా ముగిసే సరికి కథ అలానే మొదలవ్వాలని దర్శకుడు కన్విన్స్ చేయగలగడం.
2. అంతా కొత్త వారైనా ప్రతి నటుడూ తమ పాత్రను అధ్భుతంగానే కాదు అవలీలగా పోషించారు.
3. ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ లేకపోవడం.
4. 1980 కాలాన్ని అత్యంత నేర్పుగా రిక్రియేట్ చేయడం.
5. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా తీసి దాన్ని బ్లాక్ బస్టర్ గా మలచిన తీరు.
6. మన టివిల్లో యాంకర్ గా ఒక వాగుడుకాయగా పరిచయమున్న స్వాతి కళ్ళతోనే గొప్ప నటన ప్రదర్శించింది.
7. పరుతి వీరన్, కల్లూరి, తమిళ్ MA సినిమాలలో క్లైమాక్స్ సెన్సేషనలైజ్ చేయకుండా ఈ సినిమా క్లైమాక్స్ కేవలం అంతకముందు జరిగిన సంఘటనల natural consequence గా మాత్రమే వుంటుంది.
8. వయొలెన్స్ అధికంగా వున్న సినిమా అయినా ఈ సినిమాలో అధిక శాతం వయొలెన్స్ మన మైండ్ లో ఊహించుకుంటాం కానీ తెరపై మనకి కనిపించదు.
9. ఈ సినిమాలో అణువణువనా వ్యక్తమయ్యే రియలిజం.
10. మొదటి పదిహేను నిమిషాలు తప్పితే ఊపిరి సలుపుకోలేని వేగంతో నడిచే కథనం.
ఒక వేళ మీకు పరుతి వీరన్, ఆటోగ్రాఫ్, కల్లూరి లాంటి సినిమాలు నచ్చుంటే ఈ సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చకపోతే ఈ సినిమా మీకు గ్యారంటీగా నచ్చుతుంది.
ఇంకా కాదు అంటే మీకు పల్ప్ ఫిక్షన్, సిటీ ఆఫ్ గాడ్స్ నచ్చి వుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చలేదంటే దయచేసి ఈ సినిమా కి దూరంగా వుండండి.ఈ సినిమా మీలాంటి టేస్ట్ లేని వాళ్ళకు కాదు.
rock on
నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం ఆసక్తి వున్నా, ఈ సినిమా ‘GOD’ సినిమా అనిపించి తీరుతుంది. ఈ సినిమాలో లోట్లు వున్నాయి కానీ, నేను సినిమాలో ఎంత మైమరచి పోయానంటే, అవన్నీ ఏం తట్టలేదు.
ఇప్పుడు ఆలోచిస్తే, సినిమాలోని కొన్ని లోట్లు,
౧) జో నౌక ఎక్కడానికి వెళ్తూంటే, కారు సరిగ్గా వీళ్ళ కాంసెర్ట్ ముందు ఆగడం. ముంబాయి లాంటి మహానగరాల్లో ఇలాంటిది జరగడం, కొంత కష్టమే.
౨) రాబ్ కి బ్రెయిన్ ట్యూమర్ పెట్టడం కొద్దిగా పాత సినిమా తరహాలో వుంది. కానీ కథలో కాంప్లికేషన్ కోసం ఇలాంటిది చేయాల్సివుంది.
నాకీ రెండే తడుతున్నాయి. ఇంకా చిన్న చిన్నవి వున్నా, వాటిని పెద్దగా పట్టించుకోనక్కరలేదు.
ఇక ఫర్హాన్ , రాంపాల్ పాత్రల విషయమై,
ఫర్హాన్ పాత్ర ఆదిత్యలో కంటే, అర్జున్ పాత్ర జోలోనే ఎక్కువ డెప్త్ వుంది. ఆదర్శాలు ఎక్కువ వున్న పాత్ర జో. కాబట్టి ఎప్పటికైనా ఆ పాత్రకే మంచి గుర్తింపు వస్తుంది. ఈ సినిమా అర్జున రాంపాల్ కి మంచి గుర్తుంపునివ్వాలి. ఫర్హాన్ కూడా మరీ అతిగా చేయకండా, మిగిలిన నటులకు తగిన ప్రాముఖ్యతనిచ్చాడు.
ఇక మంచి విషయాలు చెప్పవస్తే,
౧) ఇండియన్-రాక్ ఇష్టముంటే, ఈ సినిమాలో సంగీతం చాలా చాలా బాగుంటుంది (నా అభిప్రాయం - నేనైతే సీడి కొన నిశ్చయించాను), మీరు రెహమాను సంగీతమో, ఇళయరాజ సంగీతమో ఆశించివెళితే, కాస్తంటే కాస్త నిరాశ కలుగవచ్చు.
౨) స్క్రిప్టు - ఆదిత్యకి అతని భార్యకి మధ్య సంఘర్షన చాలా బాగుంది. అలానే, బ్యాండులో చిన్నచిన్న చీలికలు వచ్చి అవి పెద్దగా మారడాన్ని చాలా నెమ్మదిగా సహజంగా చిత్రీకరించారు. (మన అత్తకోడళ్ళ మధ్య ఒక పూటలో గొడవలు జరగడం లాంటిది కాకుండ.)
౩) కెడి, రాబ్ ల సంబంధం వారి పాత్రల చిత్రీకరణ చాలా బాగున్నాయి.
౪) మన తెలుగు సినిమాల్లో, హీరో గారు ఏదో వాయిస్తూవుంటారు, అక్కడ సంగీతం ఏదో వస్తూంటుంది. అలా కాకుండా, చాలా సహజంగా వుంది, రాంపాల్ గిటారు వాయించడం, మఱియు కెడి డ్రమ్ములు వాయించడం.
౫) నాన్ లీనియర్ కథనం - ఈ తరహా కథనం చాలా కష్టం, గమ్యంలో క్రిష్ ఇలాంటిది ప్రయత్నించాడు కాని, అంత సఫలమవ్వలేదు. అదీ పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళడమంటే, ఇంకా కష్టమవుతుంది. (జుట్టూ మీసాలు పెంచేస్తే సరిపోదు). ఈ సినిమాలో ఈ టెక్నిక్ ని చాలా బాగా ఉపయోగించుకున్నారు.
౬) కాంసెర్ట్ సన్నివేశాలన్నీ చాల సహజంగా వచ్చాయి. ఇంగ్లీషు సినిమాల్లోలాగ (వాసు సినిమాలోలో కాకుండ).
స్థూలంగా చెప్పాలంటే,
ఈ సినిమాలోని సాంకేతికాంశాలను చాలా పటిష్ఠంగా ఉంచుతూనే, చాలా మంచి అనుభూతిని కలిగించింది. దీన్ని మాస్టర్ పీస్ అని అనలేమేమోగాని, ఒక కొత్త పుంత త్రొక్కి అందులో చాలా దూరం వెళ్ళవచ్చని నిరూపించిన సినిమా ఇది. ‘దిల్ చాహతా హైఁ’ కంటే ఒక పదడుగులు ముందుకు వేసింది.
వీలైతే ఈ సినిమా చూడండి, లేకుంటే డీవీడి కొనండి. సినిమాలో చెప్పినట్లు అక్రమంగా దిగుమతి చేసుకోవద్దు. (ఇది అష్టా-చెమ్మా కు కూడా వర్తిస్తుంది.)