Rss Feed

చలనచిత్రము యొక్క ప్రప్రధమ పరిశోధకుడు, సృష్టి కర్త ఫ్రీస్ గ్రీన్

ఫిలిం పరిశ్రమకు , ఫిలిం పరిశోధనలకు ఫిలిం సృష్టి కర్తలకు కూడా అమెరికా జన్మస్థానము అని చాలా మంది అభిప్రాయము. కాని, ఫిలిం పరిశ్రమ విషయంలో అన్ని విధములా అగ్రస్థానం ఇంగ్లండుది. అసలు చలన చిత్రం యొక్క సృష్టి ఇంగ్లండులో జరిగింది. ప్రపంచం అంతటిలోనూ ప్రపధమ చలనచిత్రము ఇంగ్లండులో తయారు చేయబడింది. ప్రపంచం అంతటిలోనూ మొట్టమొదట సినిమా హాలు ఇంగ్లండులోనే నిర్మింపబడింది. చలన చిత్రమునకే కాక మాట్లాడే ఫిలిమునకు కూడా ఇంగ్లండే జన్మస్థానం. మాట్లాడే ఫిల్ము ప్రప్రధమములో ఇంగ్లండులో తయారు చేయబడినది. ఈ చలనచిత్రము యొక్క ప్రప్రధమ పరిశోధకుడు, సృష్టి కర్త ఇంగ్లండులో జన్మించాడు. అమెరికా దేశస్థులకి ఫిలిం అంటే యేమిటో తెలియని రోజులలో ఇంగ్లండు దేశీయుడైన ఫ్రీస్ గ్రీన్ (Friese Greene) అనే అతడు, ప్రస్తుత ఫిలిం పరిశ్రమలో ఉపయోగింపబడే సెల్యులాయిడ్ ఫిలిం మీద ఒక చలనచిత్రాన్నితయారుచేశాడు.ఇదే ప్రపంచంలో మొట్టమొదట తయారు చేయబడిన చలనచిత్రం. ఈ ఫిలిం బ్రిటిష్ పేటెంటు కార్యాలయంలో, 1889 వ సంవత్సరంలో, జూన్ 21వ తేదీన పేటెంటు చేయబడింది. ఫ్రీస్ గ్రీన్ తన మొదటి చలనచిత్రాన్ని తయారు చేసిన నాలగైదు సంవత్సరాల తర్వాత, అనగ1894 ప్రాంతముల వరకు, అమెరికా శాస్త్రజ్ఞుడైన ఎడిసన్, ఫిలిం నిర్మాణానికి పరిశోధనతో తంటాలు పడుతూనే వున్నాడు. గ్రీన్ తన మొదటి ఫిలిమును తయారుచేయుటకు ముందనేక సంవత్సరాలనుంచీ కూడా, ఫిల్ము నిర్మాణమును గూర్చి అనేక పరిశోధనలు చేస్తూండేవాడు, అనేక దినములు రాత్రింపగళ్ళు, నిద్రాహారాములు లేక, తదేక దీక్షతో ఆలోచనలు సాగిస్తుండేవాడు. అతని ఆలోచనలకు అంతూపొంతూ లేకుండా నెలలు, సంవత్సరాలు, గడుపుతూ, ఒక్కక్కప్పుడు తనను తానే మరిచిపోతుండేవాడు. ఒక్కక్కప్పుడతని ఆలోచనలు అతనికే కలలుగాను, ఆకాశ పుష్పాలు గానూ భ్రమింపచేసి, నిరుత్సాహం కలిగించేవి. కాని, ఆలోచనలూ, పరిశోధనలు మాత్రము యధాప్రకారం సాగుతూనే వుండేవి. ’ఎప్పటికైనా జీవరహితమైన చిత్రములను చలనచిత్రాలుగా చేసి తీరాలి’ అని దీక్షవహించాడు. చలనచిత్ర సృష్టియే తన జీవితాశముగా, అదియే తన జీవిత లక్ష్యముగా నిశ్చయించాడు. ఎల్లప్ప్పుడూ తన లక్ష్యమును గూర్చి అనేకములైన కలలు కంటూండేవాడు. దీనికితోడు దారిద్ర్య దేవత కూడా అతన్ని ఆశ్రయించింది.ప్రతిరోజూ దినదిన గండంగా వుండేది. అతని సంసారిక జీవితమంతా అయోమయంగా, అనేక కష్టపరంపరంలతో కూడుకొని వుండేది.అతనియొక్క జీవితమంతా నిరాశ దు:ఖములతో కూడివుండేది. కా్, గ్రీన్ జీవితలక్ష్యమునకు మాత్రము వీటి వలన భంగం కలగలేదు. అన్నిటినీ యదార్థమైన వీరుని వలె యెదుర్కొని, చలించక తన దృక్పథమును కొంచెము కూడా మార్పు చెందనీయలేదు. అది 1889 వ సంవత్సరంలో ఒక నాటి నిశిరాత్రి-యధారీతిగా రాత్రి పండ్రెండు గంటలవరకూ తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నాడు.తక్షణమే గ్రీన్ మందహాసం చేస్తూ పరిశోధనాలయంలోకి పోయాడు. అది ఒక చిన్న గది. గోడలన్నీ మాత్రం సున్నం చేయబడి తెల్లగా ఉన్నాయి. ఆ తెల్లగోడలనే గ్రీన్ తన పరిశోధనలకు తెరగా ఉపయోగించేవాడు. యధాప్రకారం పరిశోధనలు ప్రారంభించాడు. సంవత్సరాలనుంచీ కొయ్యబొమ్మల్లా నిల్చివుండే చిత్రాలన్నీ, ఆనాడు ప్రాణములు ధరించినట్లు గోడల మీద ఆడడం ప్రారంభించాయి. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశయం కొరకు గ్రీన్ తన రక్తమాంసముల నాహుతిచేశాడో, ఆ ఆశయం సిద్ధించింది. అటువంటి సమయంలో గ్రీన్ సంతోషానికి హద్దుంటుందా! గ్రీన్ ఆశాజ్యోతి అప్పుడే ప్రజ్వలించింది.అనేక సంవత్సరముల నుండి అతని హృదయవీధిలోసంచరిస్తూన్న కలలూ నాడతని హృదయఫలకం మీద నిల్చి నిజస్వరూపంలో తాండవించాయి. సంవత్సరములనుండి అతని దృష్టిలో తాండవిస్తూన్న ఆకాశపుష్పములన్నీ మాలయై అతని కంఠసీమ నలంకరించాయి. అప్పుడతనిలో నుండి పొంగి పొంగ్ వచ్చిన ఉత్సాహాన్నీ సంతోషాన్నీ ఆపుకోలేకపోయాడు గ్రీన్. అతనిలో ఆశ్చర్యం ఆనందం ఉదభవించి, అతన్ని పిచ్చివాడిని చేశాయి. పిచ్చి యెత్తినవాడిలా పట్టారాని సంతోషంతో వీధిలోపడి పరుగులు ప్రారంభించాడు. అక్కడవున్ పోలీసువాడొకడాతనిని వెంటాడి పట్టుకున్నాడు. గ్రీన్ “కొయ్యబొమ్మలకి ప్రాణాలుపోసి నా గది గోడల మీద ఆడుస్తూన్నాను, చూడు చూడు” అని ఆ పోలీసును బరబర తన గదిలోకి ఈడ్చుకుపోయాడు. ఆ పోలీసుకూడా చూసి ఆశ్చర్యంతో కొయ్య బారి చూడడం ప్రారంభించాడు. ఈ హడావుడంతా చుసి చుట్టుప్రక్కలవాళ్ళంతా జేరి ఆశ్చర్యపడ్డారు. తక్షణం గ్రీన్ నాల్గు విస్కీ బాటిల్సు విప్పి జన్మదినోత్సవం చేసేశాడు. మరునాటినుంచే పారిశ్రామికలనేకులు గ్రీన్ చుట్టూ మూగటం ప్రారంభించేరు. అక్కడక్కడనేక స్టూడియోలు బయలుదేరి ఫిలింపరిశ్రమను ప్రారంభించాయి. ’కల్నర్ రాబర్ట్ హేమిల్టన్ వెచ్’ అనే ఒక ప్రభుత్వోద్యోగికి ఈ పరిశ్రమలో అభిరుచి కలిగింది. ఒకనాడు తన ఆఫీసుకు రావలసిందని గ్రీన్ కు కబురుచేశాడు. గ్రీన్ తన మామూలు చింపిరిగుడ్డలతో దీర్ఘంగా ఆలోచిస్తూ పరధ్యానంగా బయల్దేరాడు. ఆఫీసుదగ్గరకు రాగానే గుమ్మం దగ్గిర నౌకరు ’నీ పేరే’మని అడిగాడు. కాని గ్రీన్ మనస్సు అక్కడలేదు, ఆ నౌకరుకేమీ సమాధానం చెప్పలేదు. ఆ నౌకరు మళ్ళి రెండు మూడు సార్లు గద్దించి అడిగాడు. అప్పడులికిపాడి, నిద్దురలేచినట్లు కళ్ళు నులుముకుంటూ తనకు వచ్చిన ఆహ్వానం తీసి చూపించాడు. అది చూసి ఆ నౌకరు గ్రీన్ ను, హామిల్టన్ దగ్గరు తీసుకుపోయాడు. కొంత సంభాషణ అయ్యాక గ్రీన్ చేత ఒక ఫిలిం తీయించడానికి నిర్ణయించుకున్నాడు హేమిల్టన్. నిర్ణయప్రకారం బెలూన్ లో పైకిపోయి, క్రింద సైన్యములను, చలనచిత్రంగా తీశాడు గ్రీన్. ఇదే ఫిలిం ప్రపంచానికి మొదటి చలనచిత్రం. ఇప్పుడీ చలనచిత్ర నిర్మాతలు కోటీశ్వరులవుతూంటే అప్పుడా చలనచిత్ర జన్మధాత కూటికి లేకచనిపోయాడు, అతని జీవితమంతా దినదిన గండములుగా గడిపాడు. తరచూ గ్రీన్ తినుటకు తిండిలేక మలమల మాడుతూనే వుండేవాడు. అవసరం నిమిత్తం అనేక అప్పులు చేశాడు. అంత్యదశలో అప్పులవారాతని ఆస్తిని వేలంవేసి అతన్ని ఖైదులో పెట్టించారు. ఆ విజ్ఞాన శాస్త్ర కోవిదుడు, ఫిలిం జన్మధాత గ్రీన్, బెంగతో ఆకలిబాధతో కృశించి, సలసల కాగి స్రవించిన దు:ఖాశ్రుజాలంతోమరణించాడు.