Rss Feed

పిలుపు

'గెలుపూ ఓటమికి మధ్య పోటీ పెడితే ఓటమే ముందు గెలుస్తుంది' అని చైనా సూక్తి. ప్రతి విజయానికీ వెనక ఓ ఓటమి ఉంటుంది. బావి తవ్వేవాడి చేతికి తొలుత మట్టే అంటుకుంటుంది. శరీరం తప్ప మరే ఆధారం లేని జీవజాలానికి పోరాడటం, ఎలాగైనా బతకాలనే ఆరాటం మినహా గెలుపూ ఓటములూ పట్టవు. కష్టపడి కట్టుకున్న గూడు చెదిరిందని సాలీడు ఏనాడైనా ఆత్మాహుతి చేసుకుందా? ఎండలు మండిపోతుంటే మళ్ళీ చినుకులు పడి చెరువులు నిండేదాకా కప్పలు బండల మధ్య రోజులు గడుపుతాయికానీ, గుండెలు పగిలి చావవు. శీతోష్ణాలూ, రాత్రింబవళ్ళు, చీకటి వెలుగులూ మాదిరే గెలుపూ ఓటములు! రాయిని రాతితో కొట్టి ఎవరూ నేర్పకుండానే నిప్పును పుట్టించినప్పటినుంచీ, చంద్రమండలం మీది నీటి జాడలు పట్టుకున్న దాకా అసలు ఓటమంటే తెలియకుండానే నెట్టుకొచ్చాడా మనిషి? అమ్మ కడుపులో పడిన క్షణంనుంచే మనిషికి పరీక్షలు మొదలవుతాయి. ఒలింపిక్సు పరుగుపందెంలో మొదట వచ్చిన విజేత కూడా బుడిబుడి అడుగుల వయసులో ఎన్నోసార్లు తడబడి పడిపోయే ఉంటాడు. 'పరుగాపక పయనించవె తలపుల నావ/ కెరటాలకు తలవంచితె దొరకదు తోవ...' అని ఓ సినీకవి అన్నదీ- కష్టాల వారధి దాటినవాళ్లకే అవరోధాల దీవిలోని 'ఆనంద నిధి' సొంతమవుతుందని చాటడానికే. 'మనిషి ఎన్ని శాస్త్రాలు చదివి పుణ్యకార్యాలు ఆచరించినా ప్రాణం ముందు అవన్నీ తృణప్రాయమే'నన్నది మహర్షి యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించిన జీవనసూత్రం. ప్రాణం అంత తీపి కనకనే అమృతం కోసం దాయాది వైరాన్ని సైతం పక్కనపెట్టి క్షీరసాగరమథనానికి పూనుకున్నారు దేవదానవులు. సాక్షాత్‌ మృత్యుస్వరూపుడైన యమధర్మరాజే దండంతో ప్రాణాలు హరించటానికి వచ్చినా శివలింగాన్ని పట్టుకుని వదలలేదు మార్కండేయుడు! పెద్దలు 'జాతస్య మరణం ధ్రువమ్‌' అన్నారని చేతి గీతలను చేజేతులా చెరిపేసుకోవాలనుకోవడం పిరికితనమే అవుతుంది. మన ప్రమేయంతో మనం పుట్టామా... మన ప్రమేయంతోనే పోవటానికి? తల్లి తొమ్మిదినెలలు మోసి జన్మనిస్తే తండ్రి పందొమ్మిదేళ్లు కంట్లో పెట్టుకుని పెంచిన శరీరం ఇది. మన ఆటపాటలకు, ముద్దు ముచ్చట్లకు, సుఖసంతోషాలకు వాళ్ల జీవితాలను చాదితే చేవదేరిన దేహం ఇది. 'ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు భూతాలు. వాక్‌ పాణి పాద పాయూపస్థలనే అయిదు కర్మేంద్రియాలు, త్వక్‌చక్షు శ్రోత జిహ్వాఘ్రాణాలనే అయిదు జ్ఞానేంద్రియాలు... మనోబుద్ధి చిత్తాహంకారాలనే అంతఃకరణ చతుష్టయంతో కలిసి పందొమ్మిదిమంది దేవతల ఆవాసం మనిషి శరీరం' అని ప్రశ్నోపనిషత్తు పేర్కొంది. అది శాస్త్రోక్తమైనదా, కాదా అనే వాదనను పక్కనపెట్టినా నేటి సామాజిక జీవనరంగంలో ఏ వ్యక్తి జీవితమూ ఉలిపికట్టె మాదిరి ఒంటరిగా సాగేటందుకు వీలులేనిది. 'పుటక'నీది, చావునీది, బతుకంతా దేశానిది' అంటూ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌కు ప్రజాకవి కాళోజీ నివాళులర్పించారు. మన బతుకంతా దేశానిది అనిపించుకునేంతగా కాకపోయినా అది- కనీసం మన కన్నవారిది, మనం కన్నవారిది, మనల్ని నమ్ముకుని బతుకుతున్నవారిది అని అయినా ఒప్పుకొనితీరాలి! తిండికి బిడ్డ ఒక్కపూట పాలుమాలితే- పాలు కుడిపిన తల్లి రొమ్ము ఎలా తల్లడిల్లిపోతుందో తెలుసా! ఆకాశంలో అకాల చుక్క పొద్దువుతాడని కాదుగా కన్న తండ్రి కండల్ని చాది బిడ్డను చెట్టంతవాణ్ని చేసిందీ! 'నాతి చరామి' అని ఇచ్చిన హామీని నమ్మి ఓ బిడ్డకు తల్లిగా మారిన పిచ్చితల్లి 'అమ్మా! నాన్నేడే!' అని ఆ బిడ్డ అడిగితే బదులేమి చెబుతుంది? పంట పొలాలు ఎండిపోయాయనో, ప్రేమించిన పిల్లకి వేరే అబ్బాయితో పెళ్ళి అయిపోయిందనో, ఉద్యోగం వూడి బతుకూ పరువూ బజార్న పడ్డాయనో, స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి షేర్లు 'బేర్‌' మన్నాయనో, అభిమాన కథానాయకుడి సినిమా మొదటి ఆటకు టిక్కెట్లు దొరకలేదనో, మార్కులు నూటికి నూరు రాలేదనో, ఇష్టమైన ప్రజానాయకుడు హఠాత్తుగా పోయాడనో, క్రికెట్‌ ట్వంటీ20లో మనవాళ్ళు ఓడిపోయారనో, నిరాహారదీక్షలకు కూర్చున్న ప్రజాప్రతినిధులు నిమ్మరసం తాగారనో, తాగలేదనో ప్రాణాలు నిష్కారణంగా తీసుకునే ధోరణులు సమాజంలో క్రమక్రమంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నిరుడు 1.22లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14,224 మంది బలవన్మరణం పాలయ్యారు. స్వహననమే సమస్యలకు పరిష్కారం కాదు. విసుగుకీ ఓటమికీ ఉసురు తీసుకోవటం విరుగుడు కానేకాదు. జీవన సమరాంగణంలో యోధులుగా మారి ప్రతి అడుగునూ ఓ దీక్షా శిబిరంలా మార్చుకోవాలి. ఒడుపుగా మలుపు తీసుకోవడం మరిచిపోనంతకాలం మన ప్రయాణాన్ని ఏ వంకర టింకర మలుపూ ఆపలేదని తెలుసుకోవాలి. 'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది...' అనే పాట అర్థం ఒంటపట్టించుకొంటే మంచిది.
(ఈనాడు, సంపాదకీయం, ౨౭:౧౨:౨౦౦౯)

భాష ముఖ్యోద్దేశం

భాష ముఖ్యోద్దేశం మన భావం అవతలివారికి చక్కగా తెలియడం. ఈ విషయాన్ని పట్టించుకోకుండా పూర్వ పండితులు, కవులు కొందరు ఎవరికీ అర్థంకాని పాషాణ పాకంలో గ్రంథాలు రాసి ప్రజలపైకి విసిరేశారు. గ్రంథం ఎంత అర్థం కాకుండా ఉంటే అంత గొప్ప అన్న అభిప్రాయమూ ఒకప్పుడు ప్రబలిపోయింది. ఆ దశలో ఏ కవిత్వమైనా, కావ్యమైనా తేలికభాషలో నలుగురికీ అర్థమయ్యేట్లు ఉండాలనీ అలా ఉంటేనే వాటికి సార్థకత చేకూరుతుందనే వాదన పుట్టుకొచ్చింది. వాదాలు ముదిరి గ్రాంథిక, వ్యవహార భాషా పండితుల మధ్య సిగపట్లదాకా వెళ్ళింది వ్యవహారం. ''గ్రాంథిక గ్రామ్య సంఘర్షణమ్మున జేసి మరిచిపోయితిని వాఞ్మయపు సొగసు, వ్యర్థవాద ప్రతివాదమ్ములనొనర్చి వదలి వైచితిని భావ ప్రశస్తి...'' అంటూ ఆ సందర్భంలోనే ఓ కవి చింతించాడు. భాషల విషయమై ఇటువంటి వాదోపవాదాలు ఎన్నెన్నో. ''జీవలోకమందు జీవించు భాషలు జనుల తలపుదెలుపు సాధనములు'' అన్నారో కవి. భాష మన ఆలోచనలు తెలపటానికే కాదు, వాటిని దాచుకోవటానికీ ఉపయోగపడుతుంది- అన్నాడు తన మాటలతో బమ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేయగల చతురుడొకడు. ''నాతో మాట్లాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌'' అంటాడు గిరీశం. ఆయనతో రోజుల తరబడి మాట్లాడిన వెంకటేశం ఎంత విద్యను ఒంటపట్టించుకొన్నాడో కాని - పరీక్షలు మాత్రం ఆనవాయితీగా ఫెయిలవుతూనే వచ్చాడు. ఒకప్పుడు లాటిన్‌, సంస్కృతం వంటివి రాజభాషలుగా చలామణీ అయ్యాయి. సంస్కృతంలో నుంచే అన్ని భాషలూ పుట్టాయని భారతీయులు నమ్మితే, లాటినే సర్వభాషలకు పుట్టినిల్లని పాశ్చాత్య దేశాలవారు భావిస్తారు. ప్రస్తుతానికి ఈ రెంటినీ మృతభాషలుగా కొందరు పరిగణిస్తున్నారు. ''ఎల్లభాషలకు జనని సంస్కృతమె'' అని నమ్మే సంస్కృత భాషాభిమానులు ఆ విషయాన్ని ఒప్పుకోరు. సంస్కృతం మృతభాషకాదు అమృతభాష అని వారు వాదిస్తారు. ప్రపంచంలో భాషా పరిజ్ఞానం బహుముఖాలుగా విస్తరించి ఉంది. మారుమూల ప్రాంతాల్లో కొద్దిమంది మాత్రమే మాట్లాడే భాషలు ఎన్నో ఉన్నాయి. కథా సాహిత్యానికి ఒరవడి అని చెప్పదగ్గ 'బృహత్కథ' అనే గ్రంథాన్ని గుణాఢ్యుడు అనే కవి పండితుడు పైశాచీ భాషలో రాశాడు. సంస్కృతం, ప్రాకృతం, దేశీ భాషలన్నీ తెలిసిన మహా విద్వాంసుడాయన. అయినా తన గ్రంథ రచనకు పైశాచీ భాషనే ఎన్నుకున్నాడు. ఆ భాషలో తన రక్తంతో భూర్జపత్రాలపై ఆ ఉద్గ్రంధాన్ని రచించాడు. బృహత్కథ మొదట్లో పండితాదరణను పొందకపోయినా తరవాత ఎన్నో భాషల్లోకి అనువాదమై ఇప్పటికీ సాహిత్యాభిమానుల ఆదరణకు పాత్రమవుతోంది. పైశాచిక భాష ప్రస్తుతం ఉందో లేదో ఎవరికన్నా తెలుసో తెలియదో కాని, బృహత్కథ మాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది. తెలిసి చెప్పగలిగినవాళ్లుంటే అందులోని కథలు పిల్లలకు ఆకర్షకంగానే ఉంటాయి. పైశాచివంటి అంతరించిపోయిన అంతరించిపోతున్న భాషలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరికొన్ని భాషలు ఇతర భాషా ప్రభావంతో తమ అసలు స్వరూపాన్నే కోల్పోతున్నాయి. ''గంగతల నుండి కావేరి కాళ్ళదాక వెలిగిన'' తెలుగు ఠీవి ప్రస్తుతం ఇంగ్లిష్‌ ప్రభావంలో పడి ఏవిధంగా మసకబారిపోతున్నదీ వేరే చెప్పనక్కరలేదు. ప్రపంచం మొత్తంమీద ఏడు వేలకు పైగా భాషలున్నట్లు ఒక అంచనా. వాటిలో సగానికిపైగా భాషలకు లిపి లేదు. లిపి ఉన్నా లేకపోయినా ప్రస్తుతం వాడుకలో ఉన్న భాషల్లో సగానికిపైగా అంతరించిపోయే దశలో ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రతి రెండు వారాలకు ఒక భాష అంతరించిపోతోందంటున్నారు. ముఖ్యంగా ఉత్తర ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని మధ్యప్రాంతం, తూర్పు సైబీరియా, ఓక్లహామా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే కొన్ని భాషలు వేగంగా అంతరించిపోతున్నాయి. ఈ శతాబ్దం చివరినాటికి సగానికిపైగా భాషలు అంతర్థానమై పోగలవని అంటున్నారు. అదృశ్యమై పోవటానికి సిద్ధంగా ఉన్న భాషల గురించి అధ్యయనం చేయటానికి డేవిడ్‌ హారిసన్‌ అనే భాషా శాస్త్రవేత్త పూనుకొన్నాడు. ఈయన మరికొందరు శాస్త్రజ్ఞులతో కలిసి అంతరించిపోయే ప్రమాదమున్న భాషల వివరాలను సేకరిస్తున్నాడు. అందుకోసం హారిసన్‌ బృందం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తోంది. అంత్య దశలో ఉన్న భాషలు తెలిసినవారిని కలిసి ఆయా భాషలలో వారిని మాట్లాడించి హారిసన్‌ బృందం రికార్డు చేస్తోంది. దీనివల్ల ఆ భాషలు పూర్తిగా మరుగునపడకుండా కొంతవరకన్నా కాపాడవచ్చునని శాస్త్రజ్ఞుల భావన. అమెజాన్‌ తీర ప్రాంతంలోని ఆండీస్‌ పర్వత సానువుల్లో నివసించే ప్రజలు మాట్లాడే భాషలపై స్పానిష్‌, పోర్చుగీస్‌ భాషల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాల ప్రజలు తమ భాషలకు బదులుగా స్పానిష్‌, పోర్చుగీస్‌ భాషలనే ఉపయోగిస్తుండటంతో వారి అసలు భాషలు అంతరించిపోతున్నాయి. ఇంగ్లిష్‌ భాషా ప్రభావంవల్ల కొన్ని భాషల అసలు స్వరూపమే మారిపోతోంది. ఉదాహరణకు తెలుగుపై ఆంగ్ల ప్రభావం ఎంతగానో ఉంది. రెండు మూడు ఇంగ్లిష్‌ ముక్కలు లేకుండా తెలుగులో మాట్లాడటం కుదరటంలేదు. ఒకవేళ అలా మాట్లాడినా అవతలివారికి అర్థంకాని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎవరి భాషలపట్లవారు శ్రద్ధ వహించి అవి మరుగునపడిపోకుండా కాపాడుకోవాలి. పరాయిభాషల ప్రభావంవల్ల తమ మాతృభాష అసలు స్వరూపమే మారిపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరమూ ఎంతైనా ఉంది!
(Eenadu, 30:09:2007)

నా కవిత్వానికి

నా కవిత్వానికి గుక్కెడు కన్నిళ్ళ విలువ తెలుసు నా కవిత్వానికి పిడికెడు ఆనందాక్షణలు తెలుసు నా కవిత్వానికి ప్రశ్నించటం తెలుసు నా కవిత్వానికి బదులివ్వటము తెలుసు నా కవిత్వానికి తలెత్తి నిలబడటం తెలుసు ఏ అస్తిత్వానికి లోనుకానీది నా కవిత్వం ఏ బంధానికి ఏ అనుబంధానికి మరే బావబంధానికి లొంగిపొంది నా కవిత్వం బాధో ఆనందమో , కష్టాలో నష్టాà ��ో,రాజకీయాలో ఆరాచకియాలో అన్నీ కాగితంపై కవితక్షరాలై ముద్రించబడతాయ్.. నా కవిత్వం గూడు లెనివడికి నీడనిస్తున్ది, నా కవిత్వం కూడు లేని వాడికి ముద్ద పెడుతుంది, నా కవిత్వం నీలకాశపు తాను చించి వివస్థ్రల వస్త్రం అవుతుంది .. నా కవిత్వం వెన్నెలై వెలుగునిస్తుంది, చినుకై గొంతు తడుపుతుంది.. నా కవిత్వం రాబంధుమానవుల గుండెల్లో ఉరుమై భయం నింపుతుంది.. అసలు విటన్నిటికన్నా నా కవిత్వానికి మానవత్వం ఉంది.. ............సుమన్.గద్దె

నాగరికత

nagarikatha short film from sumangadde on Vimeo.

సిరివెన్నెల సాంగ్

భలే ఉంది ..ఇది

Eclectic 2.0: Earth, Water, Sky from Ross Ching on Vimeo.

Very touching with a strong message. I wish we could educate our citizens a little more on this.


నవలాశిల్పం కొన్ని పరిశీలనలు


 -వడ్డెర చండీదాస్‌
నాటకానికీ కథకీ వున్నంత వయసులేదు, నవలకి. అవి పెద్దవి. యిది పసిది. ఐనా-రజస్వలయిన కుర్రది అర్జంటుగా హర్రీగా యెదిగి,  కట్నం యిచ్చుకోలేని తన తండ్రిని భయపెట్టినట్లు  దయ్యప్పిల్లలా తయారై కూచుంది  నవల.
యింతకీ నవల అంటే యేవిటి ? అడక్యూడని ప్రశ్న. నవల అంటే నవలే.
మరేదో విషయం గురించి చెబుతూ, ‘నాకు తెలుసు. యేవిఁటో చెప్పమంటే  నాకు తెలియదు’ – అని కొన్ని శతాబ్దాల క్రితం వో జిజ్ఞాసువన్నాడు. మాయామర్మం కింద కొట్టిపారేయదలిస్తే నేనో చిన్న ప్రశ్న అడుగుతాను-తీపి అంటే యేమిటి ? తీపి అంటే తియ్యగా వుండేది. తియ్యగాఅంటే ? చక్కెరలాగా వుండేది. చక్కెర యెలా వుంటుంది? తియ్యగా. తియ్యగా అంటే యెలా వుంటుంది? చక్కెరలాగా. చక్కెర యెలా వుంటుంది. తియ్యగా. తియ్యగా అంటె యెలా వుంటుంది? మూడురోజులు ‘కుస్తీ’ పట్టినా ఫలితం వుండదు. తీపి తినిపించండి. యిట్టే తెలిసిపోతుంది. తదనుభవం రవ్వంత కూడా లేని వ్యక్తికి, యే మౌలిక ప్రాతిపదికను గానీ నిర్వచనంలోకి యిమిడ్చి అందించటం సాధ్యపడదు.
నవలాశిల్పం గురించి నాకు తెలుసు. యేవిఁటో చెప్పమని అడిగితే మాత్రం నాకు తెలియదంటాను. అనుభవం లోంచి గ్రహించేందుకు వుపకరించే వివరణలు చెప్పటం వరకే. ఫలానా ఫలానా పుస్తకాలు (నవలలు) చదవండి నవలంటే యేవిఁటో మీకే అవగతవుతుందని చెప్పాల్సొస్తుంది. యీ దృష్ట్యా, నవలాశిల్పం గురించి కొంత ముచ్చటించుకోవొచ్చు.
నవల-నాటకం, కథ-అని అంటాం కాబట్టి నవల, నాటకం కాదు, కథకాదు. మరేవిఁటి?
నాటకంలో, యేదో యితివృత్తాన్నాధారం చేసుకుని కథేదో వుంటుంది – కథలో నాటకీయత దాదాపు లేనట్లే. నాటకంలో పాత్రల చేష్టలూ మాటలూ వుంటాయి. పానకంలో పుడకలా, రచయిత కాలికీ వేలికీ అడ్డు పడేందుకు అవకాశం లేదు. నాటకం చేష్టా ప్రదానం. వేదికమీద ఆడేందుకు తద్వారా ప్రేక్షకుల్లో (శ్రోతలుగూడా) నేరుగా ప్రత్యనుభూతిని కలిగిస్తుంది. కథ, ప్రధానంగా కథన రూపంలో (narrative) వుంటుంది. అంచేత, కథ చెప్పటంలో నేర్పు లేకపోతే విసుగ్గా (boring) తయారవుతుంది.
నాటకీయతనూ కథా కథనాన్నీ సంలీనం చేసి, సంభాషణులు తొడిగి, కథ చెబితే నవల అవుతుంది. అంచేత, చిన్నదైతే (సైజు) కథ, పెద్దదైతే నవల-అని నేను భావించను. నవల నవలే  చిన్నదీ పెద్దదీ అంటూ వుండదు. పేజీల దృష్ట్యా దప్ప (సైజు) యిది నవలా శిల్పానికి మూలకందం.
వంద పేజీలకి పైగా సాగినంత మాత్రాన కథ, నవల అవదు. అరవై పేజీలకి మించనంత మాత్రాన నవల కథ అవదు.
నాటకం, కథ, నవల-వీటిని తులనాత్మకంగా పరిశీలిస్తే కొన్ని మౌలిక సామ్యాలూ విభేదాలూ కనిపిస్తాయి. వీటికీ వ్యాసానికీ (essay) చుక్కెదురు. వీటిలో వ్యాసపు ధోరణిని చొప్పించితే పరమఛండాలంగా తయారవుతాయి. నిజానికి మంచి నవలలుగా, కథలుగా నాటకాలుగా రూపించి నిలవ తగ్గ కొన్ని రచనలు, కేవలం కర్ట్‌ లెక్చర్స్‌ చొప్పించటం వల్ల భ్రష్టవఁయ్యాయి. యిందుక్కారణం, ఆయా శిల్పాల తత్వం బాగా తెలియకపోవటమూ కావచ్చు, మరేదైనా ‘బలహీనతా’ కావొచ్చు.
విసృత వర్గీకరణ దృష్ట్యా నవలా శిల్పంలోని రీతులను పరిశీలిస్తే.
ముఖ్యపాత్ర తనకి తానుగా కథ నడపటం-దృక్కోణం యెంత విసృతవైఁనదయినా, అది వైయక్తికమే అవుతుంది. యీ ధోరణిలో రాసిన నవలలో, ముఖ్యపాత్రకి తెలియటానికి వీలులేని సంఘటనలో విషయాలో దిగబడే పొరపాటు అప్పుడప్పుడూ జరిగితే జరగడానికి అవకాశం వుంటుంది. యీ పద్ధతి, నవలకంటే కథకి బాగా నప్పుతుంది.
కథాకథనం రచయిత నడపటం-యిది నవలా ప్రక్రియకి బాగా నప్పుతుంది. యిందులోనే మధ్యలోనే అక్కడక్కడా రచయిత మౌనవ్రతం ప్రారంభించి, పాత్రలచేత తమ గురించి తాము కొన్ని పిట్టకథల్లాటివి చెప్పుకునేలాగా చెయ్యటం, యింకో పద్ధతి. ఆ తరువాత-రచయిత తానే పూర్తిగా కథాకథనం సాగించటంలో రెండు రకాలున్నాయి. వకాల్తా పుచ్చుగుని, పుచ్చుకోకుండానూ. వకాల్తా పుచ్చుగుని చెప్పటం బాగా పాతపద్ధతి. పాత్రల ప్రవర్తనను మెచ్చుకుంటూనో నిరశిస్తూనో నైతికంగానో మరోరకంగానో తీర్పు చెబుతూ సంతోషించటమో విచారపడటమో కోపగించుకోవటమో లాంటి పనులు చేస్తూ కథాకథనం సాగిస్తారు. అవన్నీ చెయ్యాల్సింది మేమూ, మధ్య వీడెవడు (యిదవత్తె) అని విసుక్కుంటారు పాఠకులు. ఐతే, ముఖ్య పాత్ర తానుగా కథాకథనం సాగించే పక్షంలో అటువంటివన్నీ బాగానే వుండొచ్చు. నవలలోని పాత్రల గురించి అదే నవలలో వైయక్తికంగా ఫీల్ అవటానికి గానీ యేరకంగానైనా తీర్పు చెప్పటానికి గానీ, ఆ రచయితకి హక్కులేదు పొమ్మన్నారు, యిటీవలి దశాబ్దాలలో కొందరు ప్రముఖ ప్రపంచ సాహితీ వేత్తలు. యీ ధోరణిలో సాగినవాటిని యీ నాటి ‘ఆధునిక నవల’ (Modern Novel) గా చెప్పేందుకు యెంతమాత్రం వీలులేదు. వకాల్తా పుచ్చుకోకుండా చెప్పటం ఆధునిక నవలా శిల్ప లక్షణాలలో వొకటి. పాత్రలను రూపొందించి వాళ్ళని నేరుగా పాఠకులకు అప్పగించటం, ఆ పైన పాఠకులతో పాటు రచయిత తానూ వొక పాఠకుడిగా వాళ్ళ మీద తీర్పు చెప్పొచ్చు. తన అభిప్రాయాలనూ అభిరుచులనూ అనుసరించి ఫీలవనూవొచ్చు.
చేతనా స్రవంతి (Stream of Consciousness) మరొక పద్ధతి. యిది మరీ యిటీవలి కాలంలో వచ్చింది ప్రముఖంగా. యీ శతాబ్దంలో వొచ్చిన కొన్ని తాత్విక మానసిక సిద్ధాంతాల ప్రభావం వల్ల యీ పద్ధతి రూపొందినట్లు భావించవచ్చు. యిందులో పాత్రల మనోస్రవంతిని కళ్ళెంలేని గుఱ్ఱంలా పరిగెత్తనిస్తారు. చేతనలో చేతనా విచేతనా అంశాలూ, గతవూఁ వర్తమానవూఁ భవిష్యత్తూ బాహ్య అంతర అవధులూ అన్నీ కలగా పులగంగా అలుముకు పోతాయి. పోయి  ఝరీ ప్రవాహంలా ముంచెత్తుతుంది. యిందులో రచయిత తానుగా చేసే పని చాలా తక్కువ. తీసుకున్న ఆ కొద్ది వర్తమాన సమయంలో బహిరంగంగా జరిగేవాటి మధ్య లింకుల్లో, ఆ ఝరీ ప్రవాహంలో యిమడజాలని వాటిని, రచయిత తానుగా తగిలిస్తాడు అనేకానేక కారణాల వల్ల పాత్రల మానసం విస్ఫులింగంలా సంచలితవైఁ మరొక వ్యక్తి రచయిత వివరణలోకి నప్పేలాగా యిమడని స్థితిలో యీ పద్ధతి బాగా వుపకరిస్తుంది. రచన మొత్తం యీ రీతిలో సాగితే, యెక్కువ మంది పాఠకులకు కొంత అయోమయం, అవగాహన, రవంత విసుగు కలిగే ప్రమాదం వుంటుంది. పాఠకపరిణతి వొక స్థాయికి వొస్తే తప్ప, యీ రీతికి అంతగా ఆదరణ వుండదు. నాకు తెలిసినంతలో – తెలుగులో చేతనా స్రవంతి నవల వొకే వొకటి వొచ్చింది, యిప్పటికి శ్రీ ‘నవీన్‌’ రాసిన ‘అంపశయ్య’.
కథాకథన ప్రధానమైన రీతి. పాత్రలు అన్నదీ అనుకున్నదీ అనుకోనిదీ, చేసిందీ చెయ్యాలనుకున్నదీ చెయ్యాలనుకోనిదీ, అమాంబాపతూ  సోది చెప్పినట్లుగా చెప్పుకుపోతారు. యిది నవలా శిల్పానికి దూరమవుతుంది.  ముఖ్యంగా, నాటకీయత లోపిస్తుంది.
సంభాషణ ప్రధానమైన రీతి. నాటకంలో సంభాషణలతో పాటు, నటనకి సంబంధించి బ్రాకెట్లో యిచ్చే దానికి బ్రాకెట్లు తీసేసి  సంభాషణల దండ గుచ్చుతారు.  నాణెంకి వొకవైపే చూపెట్టినట్లు, పాత్రల ఆంతర్యం పాఠకులకు అంతగా చిక్కదు. పూర్తిగా బిహేవియరిస్టు సైకాలజీ సిద్ధాంతానికి కట్టి పడేసుకుంటే తప్ప, యీ రీతి అభిలషణీయమవదు. పైగా కథనం లోపిస్తుంది.
సమగ్రరీతి నాటకీయతనూ కథాకథనాన్నీ సంలీనం (synthesise) చేసి  పాత్రల స్వభావాన్ని విశదపరచే, కథా గమనానికి వుపకరించే, వాళ్ళ జీవితాల్లోని ముఖ్యమైన మలుపుల్ని తెలియజేసే లేదూ అటువంటి మలుపులకి దారి తీసే, సంభాషణలను జోడించి కథ నడుపుకు పోవటం. పాత్రలు తాము అనుకున్నది అంతాకాదు గానీ, వాళ్ళ అంతర్యపుటాంతర్యాన్ని వివరించే మానసిక సంఘటనల స్రవంతిని వాళ్ళకై వాళ్ళే వెలిబుచ్చుకోవటం పాత్రల మానసిక పరిస్థితినీ మూడ్‌నీ అనుసరించి బాహ్య ప్రకృతిని చిత్రించాల్సినపుడు వాళ్ళ ద్వారానే వర్ణించటం. అవసరమనిపించిన చోట్ల తాను ”రచయిత”గా చిత్రించటం. నైతికంగానో చట్టరీత్యానో మరోరకంగానో మరో మరో రకంగానో యెక్కడికక్కడ పాత్రల పీకల మీద ‘జడ్జీ’ఐ కూచోకుండా, అదంతా పాఠకులకి వొదిలెయ్యటము. అంతగా అనిపిస్తే నవల ముగించేసి, దాని మీద ‘జడ్జివ్యాసం’ రాసుకోవచ్చు. సూచన మాత్రంగా అందించే (suggestivity) ధోరణిని అవలంబించటం, వీటంటినీ మించి కూర్పులో ‘బిగి’.
యీనాటి ‘ఆధునిక నవల’ యీ సమగ్రరీతిలో సాగినట్లు చెప్పుకోవచ్చు. అన్నీ, కనీసం కొన్ని లక్షణాలైనా వున్నప్పటికీ, నవలాశిల్పం దృష్ట్యా చెప్పుకో తగిన రచనలా చాలా తక్కువ. అన్నీ వున్నా  అవకతవకగా అస్తవ్యస్తంగా బిగిలేకండా కూర్పటంతో శిల్పం దెబ్బతింటోంది.
పత్రికలలో నవలలు సీరియల్స్‌గా రావటం మొదలయ్యాక రీడర్‌షిప్‌ పెరిగినమాట వాస్తవమే గానీ, పాఠకుల స్థాయి చెప్పుకోతగినంతగా పెరగలేదు. యీ సీరియళ్ళు, పత్రికాధిపతులకూ రచయితలకూ వ్యాపార ప్రకియగా మారుతున్నదేమోనని నా అనుమానం. వొకే కథావస్తు యితివృత్తాన్ని తిరగాబోర్లావేస్తూ, సంఘటనలు, స్థితిగతులు, పేర్లు సంభాషణలు తదితరాలను అటు ఇటూ చేస్తూ డజనో డజన్నరో కవలనవలలు వొకే రచయిత రాయటవూఁ కనిపిస్తోంది. తీసుకున్న యే అంశాన్ని గాని లోలోతులకు తరచని నేలబారు తనం (surfacial crawling) యెక్కువగా వున్నట్లనిపిస్తోంది. సంభాషణ, కథమెలిక, సంఘటన, వారవారం మలుపు, అపోహలు, అపార్థాలు, సెంటిమెంటు, రహస్య సంఘటనలు వంటి వాటిని అవుచిత్యాన్ని మించి వాడుకుంటూ  యింకా యెదగాల్సిన పాఠకుల్ని యింకాకిందికి దిగలాగే ధోరణి యెక్కువగా కనిపిస్తోంది. యీ తాపత్రయంలో పడటం వల్ల నవలాశిల్పం అధోగతికి జారిపోతోంది. కొందరు పాత్రలు,  కాసిన్ని సంభాషణలు, సంఘటనలు వుండి యే రెండొందల పేజీల దాకానో, లాక్కుపోతే నవల అవుతుందనే అభిప్రాయం అస్పష్టంగా యిటీవలి కాలంలో స్థిరపడిపోతున్నదేమోనని నా అనుమానం. తాళ ప్రమాణంలో టన్నుల తూకంలో దయ్యప్పిల్లలా తయారవుతున్న యీరకం సరుకు చూస్తుంటే  తెలుగు నవలా సాహిత్యం చివరకేం కాబోతున్నట్లని దిగులు పుట్టుకొస్తుంది.
యీ దృష్ట్యా, తెలుగులో, చెప్పుకోతగిన ”ఆధునిక నవలలు” యేపాటి వున్నదీ గ్రహిస్తే  తెలుగు నవలా భవిష్యత్తుకు వుపకరిస్తుంది.
యిటీవల, విప్లవనవల అని వినిపిస్తోంది. నాకు తెలిసినంతలో ఈ పేరున నవల యేది గానీ రాలేదు. విప్లవనవల అంటే నవలాశిల్ప రీతిలో విప్లవమా? ఐతే  అభిలషణీయమే. లేక, శిల్ప విధ్వంసనలో విప్లవమా? శిల్పాన్ని కాలదన్నిన రచన, నిలిచే అవకాశం వుండదు. వొక్కొక్క సందర్భంలో ప్రచార సాధనంగా కొంత ప్రయోజనం సాధించవచ్చు. శిల్పాన్ని మన్నిస్తూనే ప్రయోజనాన్ని సాధించే రీతిలో రాయనూవొచ్చు. నాలుక్కాలాలపాటు నిలిచేలా మలచనూవొచ్చు. ధూత్తేరీ, అదంతా మాకొద్దు పొమ్మంటే, యెవరు మాత్రం యేం చెప్పగలరు ! లేక, శిల్పం గురించి కాక నవలా వస్తువు గురించా ? వస్తువుకి సంబంధించి విప్లవమంటే పరిశీలించాల్సిన అంశమే. యెంచేతంటే వస్తువు నుంచి పూర్తిగా విడదీసినప్పుడు, శిల్పం ‘తూతూమంత్రం’ ఐపోతుంది.
నవలాశిల్పమూ – వస్తువూ.
కళ కళ కోసమే అని అన్నా, కళ ప్రయోజనం కోసమే అని అన్నా రాసింది ‘సాహిత్యం’ అవ్వాలంటే శిల్పమూ వస్తువూ అనివార్యావసరం.
వస్తు ప్రసక్తి రాగానే వాస్తవమూ అవాస్తవమూ అనే అంశం తలెత్తుతుంది. యింతకీ వాస్తవం (realism) అంటే యేవిఁటి ? యీ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలంటే, యీ ప్రస్తుతన ”రచన” పరిధిని మించిపోతుంది. అంచేత, దేనినైతే యింద్రియాల ద్వారా నిర్ధారించవొచ్చునో, అది అనే దగ్గర ఆగిపోయి ముచ్చటిస్తాను అంతర బహిర శారీరక మానసిక అంశాలను యింద్రియాల ద్వారా నిర్ధారించవొచ్చు. దహించి వేసే అవమానమూ వాస్తవమే, తీపుగా కోస్తున్న చర్మం క్రింది పొక్కు వాస్తవమే. సంవేదనా వాస్తవమే, నడుస్తున్ననేలా వాస్తవమే. తీసుకునే వస్తువు, అసంబద్ధమూ అసంగతమూ కాకుండా వుండాలంటే  అది వాస్తవ పరిధిలోనిదై వుండాలి. అంతర బహిర జగత్తులు, వ్యక్తీ సంఘమూ, శరీరమూ మనసూ-వీటిని వొకదాని నుంచొకటి పూర్తిగా వేరుచేసినప్పుడు మిగిలేది శూన్యం. మనిషి యెదుర్కుంటున్న సమకాలీన సమస్యలన్నీ, వస్తువే  వాస్తవమే. వొకదాన్లో నుంచి వొకదాన్ని గమనిస్తూ గ్రహిస్తూ – ఆ సమస్యలకి పరిష్కారం కనుక్కొనే ప్రయత్నాలన్నీ ప్రయోజనాలే. మానవత్వం దృష్ట్యా, సమస్య ఐకూచున్న ప్రతిదీ సాహిత్యవస్తువే.
శిల్పమూ వుంది. వస్తువూ వుంది. మరి పేచీ యొక్కడున్నట్లు !!
(సేకరణ : కడప జిల్లా రచయితల సంఘం సావనీర్‌ నుండి  సానెట్‌)
Permalink

మతాల చరిత్ర

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
మతాల్లో నమ్మకం ఉండడం పూర్తిగా వ్యక్తిగతమైన విషయమని అనుకుంటాం. దేవుణ్ణి నమ్మమని ఎవరూ మనని నిర్బంధపెట్టరు కనక అది స్వచ్ఛందంగా ఆమోదించిన విషయంలాగా అనిపిస్తుంది. ఇది ఏ మాత్రమూ నిజంకాదు. ప్రత్యక్షంగా కాకపోయినా చుట్టూ ఉన్న సమాజమూ, సంస్కృతీ దేవుడున్నాడనే విషయాన్ని నిత్యమూ మనకు గుర్తుచేస్తూనే ఉండే అవకాశముంది. ఒకప్పుడు సమష్టి ప్రయోజనాలకు పనికొచ్చిన మతవిశ్వాసాలు తరవాతి దశల్లో మనుషులను ఏకాకులను చేశాయి. ఇదొక సామాజికపరిణామం.
మతవిశ్వాసాలు ఎంతో ప్రాచీనమైనవి. వాటిని ఈ రోజుల్లో ప్రశ్నించేవాళ్ళే తక్కువ. వాటిని నమ్మడం ఎంతో సహజమని ఎక్కువమంది అనుకుంటారు. అవి వేల ఏళ్ళుగా కొనసాగుతున్నాయనేది ఒక బలమైన కారణంగా వారికి కనిపిస్తుంది. అతీతశక్తుల గురించిన నమ్మకం ఆదిమమానవుల్లో సహజంగా తలెత్తడం ఒక ఎత్తయితే, ఆ భ్రమలూ, తప్పుడు నమ్మకాలూ ఇన్నాళ్ళుగా కొనసాగడానికి దోహదపడిన సామాజిక, ఆర్థిక, రాజకీయకారణాలన్నీ మరొక ఎత్తు. వీటన్నిటి గురించీ స్థూలంగానైనా తెలుసుకోకపోతే మతాలవల్ల నేటికీ కలుగుతున్న అయోమయమూ, అనర్థాలూ, హింసా, రక్తపాతమూ మొదలైనవాటికి కారణాలు అర్థంకావు.
మతాల చరిత్రయొక్క అధ్యయనం పంతొమ్మిదో శతాబ్దంనుంచీ మొదలయింది. దానివల్ల చారిత్రక వివరాలెన్నో బైటపడుతూవచ్చాయి. ప్రపంచంలో అనేకచోట్ల క్రీస్తుకు సుమారు 3 వేల ఏళ్ళ క్రితం లిపుల వాడకం మొదలయింది. అప్పటినుంచీ మతవిశ్వాసాలు ఏదో ఒక రూపంలో నమోదు అవుతూవచ్చాయి. మానవసమాజాలు రూపొందిన దశలో తెగలుగా జీవించిన ప్రజలు ఎందరో దేవతలను ఆరాధించేవారు. గణాచారులు నడిపిన తంతుల్లో రకరకాల జంతువులూ, చెట్లూ చేమలూ, ప్రకృతిశక్తులూ అన్నిటికీ పూజలు జరిగేవి. సమాజం విస్తృతమై సమాజజీవితాలు జటిలం అవుతున్నకొద్దీ దేవుడు ఒక్కడేనన్న భావన బలపడసాగింది. కారణాలేమిటో ఇప్పుడు ఖచ్చితంగా తెలియదు కాని మొత్తంమీద ఏకేశ్వరోపాసనకు భూమిక ఏర్పడింది. తెగలుగా జనపదాల్లో జీవించిన ప్రజలు చిన్న, పెద్ద సామ్రాజ్యాల పాలనకు లోనయారు. వ్యవసాయం పెద్దఎత్తున వ్యవస్థీకృతం అవడం వల్ల ప్రజల వ్యక్తిగత జీవితంకూడా అపూర్వమైన మార్పులకు గురి కాసాగింది.
తెగలు చిన్న రాజ్యాలుగానూ, చిన్న రాజ్యాలు పెద్ద సామ్రాజ్యాలుగానూ ఏకీకృతం అవుతున్న దశలో పాతకాలపు ఆచారాలకు కొత్త స్వరూపాలు ఏర్పడ్డాయి. టర్కీలో క్రీస్తుకు 9 వేల ఏళ్ళ క్రితమే మొదలైన ప్రాచీన దేవతారాధన గ్రీస్‌లో పెంపొందిన మతభావనలకు రూపాన్నిచ్చింది. అదే పద్ధతిలో గ్రీక్ దేవతలు రోమన్ నాగరికతకు భూమికను సిద్ధం చేశారు. ప్రాచీన గాథలూ, పురాణాలకు కొత్త రూపాలు ఏర్పడ్డాయి. తెగల్లో విడివిడిగా రూపొందిన మతభావనలన్నీ క్రమంగా ఏకం అవుతూ వచ్చాయి. తెగలమధ్య జరిగిన కొట్లాటల్లో జయం పొందినవారి దేవతలందరిదీ కొత్త సంస్కృతిలో పైచెయ్యి అయింది.
మతాలు బలపడిన తీరు కేవలం మనుషుల భావనలమీద అధారపడి, వారి ఇచ్ఛానుసారం జరగలేదు. సమాజాల్లో ఎటువంటి శక్తులు బలం సంపాదించుకోగలిగాయో వారు నమ్మిన మతాలే బలవత్తరం అవుతూవచ్చాయి. యేసుక్రీస్తును న్యాయవిచారణ జరిపి మరణదండనకు గురిచేసిన రోమన్ ప్రభుత్వం మొదట్లో క్రైస్తవమతాన్ని తీవ్రంగా అణగదొక్కింది. తరవాతికాలంలో రోమన్ చక్రవర్తులు అదే మతాన్ని అవలంబించాలని నిశ్చయించుకున్నాక క్రైస్తవమతం బలపడడమే కాక, దానికి అడ్డొచ్చినవారందరినీ రోమన్ ప్రభుత్వం మట్టుబెట్టసాగింది. మతాలకు స్వతహాగా బలమేమీ ఉండదు. పాలకవ్యవస్థ తలుచుకున్నప్పుడల్లా మతాల ప్రాబల్యం తగ్గడం, పెరగడం చరిత్రలో కనబడుతుంది.
చిన్న తెగలుగా వేటా, ఆహారసేకరణ ఆధారంగా జీవించిన దశతో పోలిస్తే వ్యవసాయం మొదలయాక జనాభా పెరగసాగింది. జనవాసాలు ఏర్పడి వాటిమధ్య సహకారసంబంధాలు పెరిగాయి. వస్తువుల మార్పిడి, వాణిజ్యం మొదలైన కొత్త ప్రక్రియలు ఆరంభమయాయి. శ్రమవిభజన ద్వారా అనేక చేతిపనులూ, వృత్తులూ చేపట్టడం వీలయింది. వ్యక్తులమధ్య కేవలం ఒకే తెగకూ, కుటుంబానికీ చెందిన సమష్టి భావనకు ప్రాధాన్యత తగ్గసాగింది. దగ్గర సంబంధీకులు కాకపోయినా ఎక్కువమంది వ్యక్తులు సమీపాన నివసించడం తప్పనిసరి అయింది. ఇటువంటి అపరిచితులమధ్య పొరపొచ్చాలూ, కొట్లాటలూ తలెత్తకుండా సహజీవనం కొనసాగేందుకు అందరినీ ఏకం చెయ్యగలిగిన మతవిశ్వాసాలకు అవసరం ఏర్పడింది. పురాతనపద్ధతిలో ఏ తెగకాతెగలో జరిగినట్టుగా పక్షుల, జంతువుల చిహ్నాలను ఆరాధించడం సాధ్యంకాలేదు గనకనే దేవతల సంఖ్యకూడా తగ్గుతూవచ్చింది. అందరికీ వర్తించి, అందరూ పాటించగలిగే మతవిశ్వాసాలకు రూపలక్షణాలు ఏర్పడ్డాయి. సంబంధీకులు కానటువంటి వ్యక్తులు పరస్పరం కలహించుకోకుండా శాంతియుత సహజీవనం కొనసాగించేందుకు అందరినీ కలిపే మతాలు రూపొందాయి. దీని ఫలితంగా వ్యక్తులందరూ ఎవరికి వారేననే భావనకూడా పెరిగింది. ఒకనాడు గణజీవితంలో ప్రవర్తిల్లిన ఐకమత్యం బలహీనపడి, ప్రతివ్యక్తీ ఏకాకి అనీ, ప్రతి ఒక్కడూ దేవుణ్ణే నమ్ముకుని జీవించాలనే దృక్పథం ఏర్పడి, ఈనాటికీ కొనసాగుతోంది. అప్పట్లో ఇదొక విప్లవాత్మకమైన మార్పు. దీనికి అధ్యాత్మిక, అతీత కారణాలేమీ లేవు. ఇదంతా ఆర్థిక, సామాజిక పరిణామాల ఫలితమే.
అలాగే సమాజంలోని కట్టుబాట్లూ, పరిపాలకవ్యవస్థా, చట్టాలూ, నిబంధనలూ అన్నీ వ్యక్తిగత పద్ధతులకు అతీతంగా రూపొందే అవసరం ఏర్పడింది. కారణాలు ఏవైనప్పటికీ మునుపటికన్నా అతి దగ్గరగా జీవించసాగిన ప్రజలందరూ ఎవరికివారుగా ఏకాకులైపోయారు. అటువంటి పరిస్థితిలో దేవుళ్ళని నమ్ముకోవడంతప్ప వారికి గతి లేకుండాపోయింది. తెగలుగా, ముఠాలుగా జీవించినప్పుడు వారందరికీ ఉండిన పరస్పర సహకారం, ఐక్యతా క్రమంగా తగ్గిపోయాయి. వారంతా మతాధికారుల, పాలకవర్గాల చెప్పుచేతల్లో మెలగవలసిన అవసరం ఏర్పడింది.
సమాజాలు విస్తరించి, సామ్రాజ్యాలుగా రూపొందుతున్నకొద్దీ పాలకుల బలం పెరగసాగింది. రాజు స్వయానా దేవుడికి ప్రతినిధి అనీ, అందరూ అతనికి తలఒగ్గి జీవించడం దైవశాసనమేననీ మతాధికారులు ప్రజలను నమ్మించసాగారు. ఈనాటి పత్రికలూ, వార్తామాధ్యమాలూ డబ్బుకోసమూ, ప్రాపకం కోసమూ పనికిమాలిన రాజకీయనేతలనూ, చెత్తరకం సినిమాతారలనూ ఆకాశానికెత్తి అతిశయోక్తులు వల్లించే పద్ధతిలోనే అప్పటి పూజారివర్గాలూ, కవిపుంగవులూ పాలకులను కీర్తిస్తూ ఉండేవి. చంద్రవంశమనీ, సూర్యవంశమనీ పేర్లు పెట్టి, ఒక్కొక్క చక్రవర్తీ ఏ దేవత అంశాన జన్మించాడో చెపుతూ ప్రజలను నమ్మించడం అప్పటి వ్యవస్థల్లో మామూలే. ఇది మనదేశంలోనే కాక, ప్రపంచంలో తొలి నాగరికలన్నిటిలోనూ కనిపిస్తుంది.
ఈ పాలకవ్యవస్థలో చట్టాలను అమలుచెయ్యడం, పన్నులూ, శిస్తులూ వసూలు చెయ్యడం, సామాన్యులకు కొంత శాంతిభద్రతలను ఏర్పాటుచెయ్యడం మొదలైనవి ఉండేవి. దొంగలూ, దోపిడీదార్లూ, శత్రుదేశాలూ దాడులు చేసి కొల్లగొట్టకుండా ఉండేందుకు ఆత్మస్థైర్యాన్నిచ్చే విధంగా ఈ పాలకుల గురించిన ప్రశంసలు కొంతవరకూ ఉపయోగపడేవి. అతీతశక్తులూ, వరాల గురించి ఏం చెప్పినప్పటికీ అవన్నీ నిత్యజీవితంలోని అవసరాలకనే నిర్దేశించబడిన అతిశయోక్తులు. వీటి గురించిన సరైన అవగాహన మనకు లేకపోతే ప్రతిదానికీ విపరీతమైన వ్యాఖ్యానాలు చెప్పి సమర్థించే అర్థంలేని ప్రయాసే మనకు మిగులుతుంది.
సమాజం ఆర్థికంగా, ఆహారోత్పత్తి తదితర మౌలికవ్యవస్థల్లో పరిణామాలకు లోనవుతున్నప్పు డల్లా గతితార్కిక భౌతికవాదం చెప్పినట్టుగా పాతవ్యవస్థల స్థానంలో కొత్తవి పుట్టుకురావడం, అవి కొత్తరకం స్పర్ధలకు దారితియ్యడం వగైరాలన్నీ జరుగుతాయి. ప్రజలు తెగలుగా జీవించిన పరిస్థితి మారి గణజీవితం, జనపదాలూ, రాజ్యాలూ, సామ్రాజ్యాలూ, వైయక్తిక ధోరణులు పెరగడం మొదలైనవన్నీ అనివార్యంగా తలెత్తినటువంటి సంఘటనలే. గుహావాసులుగా దుర్భరజీవితాలు గడిపిన తొలిమానవులను మతభావనలు ఏకం చేసి ఉండవచ్చుగాని, చరిత్ర మొదలైనప్పటినుంచీ మతాలు ప్రజలను వేరుచెయ్యడానికే ఎక్కువగా ఉపయోగపడ్డాయనిపిస్తుంది.

‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ : శ్రీశ్రీ ‘భూమ్యాకాశాలు’

వరవరరావు
‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ : శ్రీశ్రీ ‘భూమ్యాకాశాలు’
‘తన రక్షణ కోసం ఒక తలారి తప్ప ఏ సాధనమూ లేదనుకునే వ్యవస్థ ఏ స్థితిలో ఉన్నదనుకోవాలి? తన క్రూరత్వాన్నే శాశ్వతమైన శాసనంగా ప్రకటించుకునే వ్యవస్థ. చాల మంది నేరస్తులను ఉరితీసి ఇంకా కొత్త నేరస్తులు పుట్టుక రావడానికి దోహదం చేసే ఈ తలారి వ్యవస్థను గొప్ప చేయడం కన్నా, ఈ నేర బీజాలను నాటుతున్న వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకునే అవసరం గురించి మనం తీవ్రంగా పూనుకోవాల్సి ఉంది.’
- కార్ల్‌ మార్క్స్‌, 1853
మరో డెబ్భై అయిదేళ్లు పోయాక ‘సుప్తాస్థిలు’ ధరాగర్భంలో నుంచి ఏవియో కనరాని, వినరాని రహస్యాలు చెప్తున్నాయని పించింది శ్రీశ్రీకి.
‘ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ ఈ తలారి వ్యవస్థ అని 1937 నాటికి స్పష్టంగా అర్థమయింది.
పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టులు, బతుకు కాలి, పనికిమాలి, శని దేవత రథచక్రపుటిరుసులలో పడి నలిగిన దీనులు, హీనులు, కూడులేని, గూడులేని పక్షులు, భిక్షులు, సఖుల వలన పరిచ్యుతులు, జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులు, జితాసువులు, చ్యుతాశయులు, హ్రుతాశ్రయులు, హతాశులు – ఒక్క మాటలో నోరు, ఊరు, పేరు లేని పీడితుల పక్షం కవి ఉండాలని నిర్ణయించుకున్నాడు.
శ్రీశ్రీ కవిగానే కాకుండా తాను ఇంకేమి కాగలిగితే ఇది సాధ్యమవుతుంది.
తాను కార్మికవర్గం అయితే సాధ్యమవుతుంది.
అందుకే శ్రీశ్రీ కవిత్వం నిండా కార్మికవర్గం పీడిత ప్రజలకు ఆశ్వాసం ఇచ్చే గీతాలది ఒక పాయ అయితే, పీడిత ప్రజలు, అలగాజనం, పతితులు, భ్రష్టులు – చోటు చేసుకునే కవితా పాయ మరొకటి. అంటే ఉత్పాదక రంగానికి, ఉత్పత్తిలో పాల్గొంటున్న శ్రామిక వర్గానికి సంబంధించిన కవిత్వం ఒక పాయ అయితే, అనుత్పాదక రంగానికి చెందిన ప్రజలు (వాళ్లు శ్రమజీవులు కూడా కాకపోవచ్చు, భిక్షువర్షీయసి, కాలువలో జారిపడిన ఉన్మత్తుడు, తాగుబోతు కూడ కావచ్చు) ఎవరైనా కావచ్చు కాని వాళ్లు స్వార్థ ప్రయోజనాలు ఉన్నవాళ్లు కాదు. ఆస్తిపరులు కాదు. ప్రైవేట్‌ ఆస్తిని విభజన రేఖగా గుర్తిస్తే – అది ఉన్నవాళ్లు, దానిని కాపాడుకోవడానికి అణచివేత, దోపిడీలను రాజ్యం ద్వారా, వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్నవాళ్లు ఒకవైపు – వీళ్లను స్థూలంగా పాలకవర్గాలు అనవచ్చు – ఈ అణచివేతకు, దోపిడీకి, విస్తృతికి, పరిచ్యుతికి గురయినవాళ్లు – మార్జినలైజ్‌ అవుతున్న వాళ్లు ఒక వైపు కనిపిస్తారు.
ముఖ్యంగా ‘మహాప్రస్థానం’ లోని గీతాలన్నింటినీ ఈ రెండు పాయల కవిత్వంగా వింగడించవచ్చు – అప్పుడు పైన మార్క్స్‌ చెప్పిన నేరనిర్ణయ దృష్టి నిజంగా తలకిందులుగా మారుతుంది. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, నీతి అవినీతి, హింసా హింసలు, మంచీ చెడు – ఏ ప్రమాణాలతో నిర్ణయించబడుతున్నాయి. ఎవరు నిర్ణయిస్తున్నారు. ఈ నిర్ణయించే అధికారం వారికెవరిచ్చారు. అసలు అధికారం ఎక్కడి నుంచి వస్తుంది. ఒకరు పాలకులు, మరొకరు పాలితులు ఎట్లా అయ్యారు. పాలకుల సంస్కృతి పాలితుల సంస్కృతి ఎట్లా అయింది? ఎందుకు అయింది, ఎందుకు కావాలి.
ఒకరు తలారి ఎట్లా అయ్యారు? మరొకరి తల తీసి వేసే అధికారం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తానికి వ్యవస్థయే తలారి పాత్ర ఎందుకు నిర్వహిస్తున్నది?
మార్క్స్‌నో, ఎంగెల్స్‌నో అడిగితే తడుముకోకుండా ఇది వర్గ సమాజం ఏర్పడిన నాడు ఏర్పడిన ప్రమాణమని, ఈ ప్రమాణాన్ని రద్దు చేయడానికి వర్గ సమాజం ఏర్పడిన నాటి నుంచీ పీడితులు పోరాడుతున్నారని చెప్తారు.
ప్రపంచంలో మార్పుకోరినవాళ్లు అనివార్యంగా ఉన్న వ్యవస్థ మీద తిరుగుబాటును ప్రోత్సహించారు. ఉన్న స్థితికి ఆందోళన చెందారు.
అలజడి మా జీవితం
ఆందోళన మా ఊపిరి
తిరుగుబాటు మా వేదాంతం
జీసస్‌ క్రైస్త్‌ ఒక గొర్రెపిల్లను చేరదీసాడు. పులి చంపిన లేడి నెత్తురును చూసి ఆందోళన చెందాడు. నలుగురూ రాళ్లు రువ్వే మాగ్దలినా పక్షం వహించాడు. మనలో పాపం చేయని వాడు ఎవరు – అని వ్యవస్థ నిర్ణయించిన, పితృస్వామ్యం ప్రకటించిన పాపం అనే ప్రమాణాన్ని ప్రశ్నించాడు. బుద్ధుడు, మార్క్స్‌ ప్రతి ప్రవక్తా అదే చేసాడు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రచయితలంతా అదే చేసారు.
రాజ్య వ్యవస్థ þ వసంత సేన (మృచ్ఛ కటికం), బ్రాహ్మణీయ వ్యవస్థ þ మధురవాణి (కన్యాశుల్కం), పెట్టుబడి þ మేడం బావరీ (ఫ్లాబర్ట్‌ నవల) ఎదురెదురు పెట్టి చూస్తే ప్రతి మహా రచయిత ఎవరి పక్షం వహించి ఎవరిని ప్రశ్నించారో గ్రహించవచ్చు.
అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు రాచరిక వ్యవస్థ కోసం శాపం, శాప విమోచన వంటి జిమ్మిక్కులు ఉపయోగించాడు కానీ భారతంలో శకుంతల మాత్రం ఇంద్రియ జ్ఞానం ప్రమాణంగా సత్యమనే ఆయుధంతో రాజరికాన్ని, పురుష స్వామ్యాన్ని ప్రశ్నించింది.
విక్టర్‌ హ్యూగో నవలలో దొంగ, ‘జాగుతేరహో’ సినిమాలో దొంగ, బౌద్ధ జాతక కథల్లో దొంగ – కళ్ల నుంచి మనకు నేర వ్యవస్థ కనిపిస్తుంది.
శ్రీశ్రీ కవిత్వమంతా ఈ నేర వ్యవస్థ పదఘట్టనలో నలుగుతున్న అసహాయులు, వాళ్లకు అండగా నిలిచే కార్మికవర్గం, పోరాట యోధులు కనిపిస్తారు.
ఒకరాత్రి బహుళ పంచమి జ్యోత్స్నను చూసి, ఆ రేయి రేగిన ఇసుక తుపానును చూసి, గాలిలో కనరాని గడుసు దయ్యాలకు దడుసుకొని, నోరెత్తి, హోరెత్తి నొగలు సాగరం ముందు అప్రతిభుడై, కరికళేబరం వలె కదలని కొండను గుండెల మీదనే మోస్తున్నట్లు భయపడి, చివరకు తన వలెనే ఆకాశపుటెడారిలో కాళ్లు తెగిన ఒంటరి ఒంటె లాగ జాబిల్లిని ఆరోపించుకొని బహుళ పంచమి జ్యోత్స్నను కూడ వెలిబూదిగా తప్ప చూడలేని భయస్తుడు (బహుళ పంచమి జ్యోత్స్న)
ఉదయం ఆరున్నరకు
గదిలో ఆరిపోయిన దురదృష్ట జీవి (ఆకాశ దీపం)
కూటికోసం, కూలి కోసం పట్టణంలో బతుకుదామని…. బయలుదేరి మూడు రోజులు ఒక్కతీరు నడుస్తున్నా దిక్కు తెలియక దారి తప్పిన బాటసారి
కళ్లు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్లో తల్లి
శ్రీశ్రీ కవితా వస్తువు.
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది.
పల్లెటూళ్లో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది
కవి ఒక అసహాయ భయానక స్థితి నుంచి పాఠకుల్లో ఒక కారుణ్యమానవ అనుబంధాన్ని సున్నితంగా తాకాలి. తల్లికేదో పాడు కలలో పేగు కదిలితే పాఠకుల పేగులు ఘార్లిల్లాలి.
మేల్కొన్న చైతన్యం నించి కర్తవ్య నిర్దేశం, నిర్ణయం ఆ తర్వాత. ఇంకాస్త ముందుకు వెళ్లి
దారి పక్క, చెట్టు కింద, ఆరిన కుంపటి విధాన
కూర్చున్న ముసల్దాని
ని, ఆమె స్థితిని కళ్లకు కట్టినట్లు పరిచయం చేసి
‘ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి’దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది
అంటాడు. ఆ వెర్రిగాలి శ్రీశ్రీ. అతడు కుక్క నుంచి, తొండ నుంచి సమాధానం ఆశించలేదు. కమ్మిన చిమ్మచీకట్లలో రేగిన దుమ్ములో ఎగిరివచ్చిన ఎంగిలాకు ‘ఇది నా పాపం కాద’న్నది. కానీ కడుపునిండా తిని త్రేన్చి ఎంగిలాకును చీకట్లలో విసిరేసిన వాళ్లదే ఈ పాపమని మనకు తెలుసు.
అలసిన కన్నుల, చెదరిన గుండెల, విసిగిన ప్రాణుల పరాజితులు, అలకలన్నీ అట్టకట్టిన, బొమికలన్నీ ప్రోవుపట్టిన, కాగితం వలె పలచబారిన ఉన్మాది, శ్రీశ్రీ కవిత్వంలోని ఒక పాయ.
ఎందుకంటే ఆయన
‘కవితా! ఓ కవితా!’
అని కవిత్వాన్ని ఆవాహన చేసుకున్న నాడే
నడిరేనిద్దురలో
అప్పుడే ప్రసవించిన శిశువు నెడదనిడుకొని
రుచిరస్వప్నాలను కాంచే జవరాలి
మనః ప్రపంచపుటావర్తాలూ
శిశువు చిత్ర నిద్రలో
ప్రాచీన స్మృతులూచే చప్పుడు-
శస్త్రకారుని మహేంద్రజాలంలో
చావు బ్రతుకుల సంధ్యాకాలంలో
కన్నులు మూసిన రోగార్తుని
రక్తనాళ సంస్పందన
    - తోపాటు
కాలువ నీళులలో జారిపడి
కదలగనైనా చాలని
త్రాగుబోతు వ్యక్యావ్యక్తాలాపన
ప్రేలాపన
కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్ధనిమీలిత నేత్రాల
భయంకర బాధల పాటల పల్లవి
కూడా విన్నాడు.
ఊరవతల నీరింకిన
చెరుపు పక్క, చెట్టునీడ
గోనెలతో, కొండలతో
ఎటు చూస్తే అటు చీకటి
అటు దుఃఖం, పటు నిరాశ
చెరసాలలు ఉరికొయ్యలు
కాలువలో ఆత్మహత్య -
దగాపడిన తమ్ముల బాధలు ఆయనకు తెలుసు. అవి ఆయనకు అవగాహన అవుతాయి. ఆ వ్యథావనిష్ఠుల, ఆ కథావశిష్ఠుల బాధా సర్పదష్టుల కథలు ఆయన కవితా వస్తువు. దగాపడిన తమ్ముల కోసమే కలం పట్టి జగన్నాథ రథచక్ర ప్రళయ ఘోషను భూమార్గం పట్టించి భూకంపం పుట్టించడానికి ఆయన కవిత్వం రాసాడు.
ధర్మాధర్మాలు, న్యాయన్యాయాలు, హింసాహింసలు మొదలైనవి ఎవరు నిర్ణయిస్తారు – వాటికేం ప్రమాణం అని ఆరంభంలో ప్రశ్నించుకున్నాం. దానికి ఆయనే స్వయంగా ‘వ్యత్యాసం’ అనే కవితలో స్పష్టమైన సమాధానం ఇచ్చాడు.
ఒక సరళ రేఖ ఉంది. అది ఆస్తి – అది భద్రత.
మంచికీ చెడ్డకూ నడుమ కంచుగోడలున్నాయి మీకు
నిశ్చల నిశ్చితాలు మీవి.
మీ కన్నుల చూపులు సరళ రేఖలో!
రేఖ చెదిరితే గొల్లుమని పోతారు.
రేఖ కవతలి వాళ్లంతా నేరగాళ్లు
రేఖను రక్షించడానికే
న్యాయస్థానాలు, రక్షక భటవర్గాలు
చెరసాలలు, ఉరికొయ్యలు.
ఈ రేఖను కాపాడడానికే
మార్క్స్‌ చెప్పిన తలారిని నియమించుకున్నది ఈ వ్యవస్థ.
ఈ దగాపడిన తమ్ముల తరఫున
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ
ఒక జాతిని వేరొక జాతీ
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు
అని ‘జయభేరి’ మోగించాడు శ్రీశ్రీ.
చీనాలో రిక్షావాలా, చెక్‌ దేశపు గనిపని మనిషి, ఐర్లాండున ఓడ కళాసీ, అణగారిన ఆర్తులందరూ,
హాటెన్‌టాన్‌, జూలూ, నీగ్రో, ఖండంతార నానా జాతులు చారిత్రక యధార్థ తత్వం చాటిస్తారొక గొంతుకతో నన్నాడు.
ప్రపంచానికి సమిధ నొక్కటి ఆహుతిచ్చిన వారు
విశ్వవృష్టికి ఆశ్రువుధార పోసినవారు
భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోసినవారు
మాత్రమే
ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించగలరని
విశ్వవీణకు తంతుృలై మూర్ఛనలు పోగలరని
భువన భవనపు బావుటాలై పైకి లేవగలరని
కార్మికలోకపు మాగ్నా కార్టా ప్రకటించాడు.
పొలాలనన్నీ హలాలదున్నీ
ఇలా తలంలో హేమం పిండి
జగానికంతా సౌఖ్యం నింపే
కర్షకవీరుల ఘర్మజలానికి
ధర్మజలానికి
ఖరీదు కట్టే షరాబులేడని ప్రకటించి
లోకపుటన్యాయాలూ! కాల్చే ఆకలి, కూల్చే వేదన
దారిద్య్రాలు, దౌర్జన్యాలు
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ
శ్రామికలోకపు సౌభాగ్యానికి నవ్య కవిత్వాన్ని అందించాడు.
శ్రీశ్రీ ‘పేరు లేని, మొహం లేని’ (నేమ్‌లెస్‌ అండ్‌ ఫేస్‌లెస్‌) అశేష పీడిత ప్రజల తరఫున, ఆయన మాటల్లో ‘పతితుల, భ్రష్టుల, బాధాసర్పదష్టుల’ కోసం ఏయే శక్తులను ఆవాహన చేసాడో. ‘మహాప్రస్థానం’ కాలం నుంచి ‘మరోప్రస్థానం’ వరకు ఎందరో చెప్తూనే ఉన్నారు. జయభేరి, మహాప్రస్థానం, ఆశాదూతలు, ప్రతిజ్ఞ, కవితా ఓ కవితా, దేశ చరిత్రలు, జగన్నాథుని రథ చక్రాలు వంటి ‘మహాప్రస్థానం’ కవితా సంకలం లోని గీతాలు, ‘ఖడ్గసృష్టి’, ‘యిప్లవం యాడుందిరా, ఝంఝ, తుదిపయనం, తొలి విజయం’ వంటి ‘మరోప్రస్థానం’లోని గీతాలు మొదలైనవెన్నో అందుకు ఉదహరించవచ్చు.
ఈ పోరాట శక్తులకు ప్రాతినిధ్య ప్రతీకగా ‘ఉరి తీయబడ్డ శిరస్సు’ను శ్రీశ్రీ ఎందుకు ఎంచుకున్నాడో అవి ఆయా కాలాల్లో ఎట్లా నిర్దిష్టమవుతూ వచ్చాయో వీటినొక ప్రత్యేక దేశకాలాల పాత్రల్లో చెప్పడానికుద్దేశించిందీ రచన.
బానిస వ్యవస్థ కాలం నుంచి కూడ వర్గపోరాటాల్లో ఆస్తి పర దోపిడీ వర్గాలు శ్రామిక, పీడిత వర్గాలను వివిధ రూపాల్లో చంపుతున్నాయి. అణచివేత, చిత్రహింసలు మాత్రమే కాకుండా ఆకలి, అనారోగ్యం, దారిద్య్రాలకు గురిచేసి చంపుతున్నాయి. కొరడా దెబ్బలు మొదలుకొని అధునాతన మారణాయుధాలతో చంపుతున్నాయి. సామూహికంగా కాల్పులు జరిపి, జెనోసైడ్‌లతో కూడా చంపుతున్నాయి. మార్కెట్ల పునఃపంపకాలలో యుద్ధాల్లో చంపుతున్నాయి. ఇవన్నీ చరిత్రలో నమోదవుతూనే ఉన్నాయి. పాలకవర్గ చరిత్రలో కాకున్నా పోరాట వర్గాల చరిత్రలో మౌఖికంగా, జానపదగాథల్లో, పాటల్లో, అన్నిటికీ మించి ఆయా పోరాట తరాలు వారసత్వంగా అందించుకునే జ్ఞాపకాల్లో నమోదవుతూనే ఉన్నాయి. కాని ఆశ్చర్యంగా, సింబాలిక్‌గా ఉరితీయబడిన పోరాట యోధులు చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయారు. బహుశా మావన శరీరంలో ఆలోచనకు, జ్ఞానానికి, వ్యక్తీకరణకు ప్రధానస్థానంలో ఉన్న శిరస్సును ఛేదించడం అనేది – ఆ మూడు మానవ ప్రక్రియలను నిరోధించే అతి అభివృద్ధి నిరోధక చర్యగా మానవ సమాజం భావించడం వల్ల కావచ్చు. తొట్టతొలి బానిసల తిరుగుబాటు యోధులందరినీ స్పార్టకస్‌తో సహా దీపస్తంభాలకు వేలాడదీసి వేలాదిగా ఉరితీసినప్పటి నుంచి కావచ్చు నమోదయిన పోరాట చరిత్రలో ఉరికంబాలకు సాహిత్యంలో ఒక కుఖ్యాతి లభించింది. జీసస్‌ క్రైస్తును శిలువ వేసారు. 1987లో వరంగల్‌ జిల్లా ముస్త్యాలపల్లి గ్రామస్తుడైన ఒక దళిత యువకుడు మేఘ్యాను మొహం చెక్కేసి, పోలీసు స్టేషన్‌లోనే చిత్రహింసలతో చంపి హనుమకొండ చౌరస్తాలో ట్రాన్స్‌ఫార్మర్‌కు వేళ్లాడదీసారు. ఈ మధ్యకాలమంతా ప్రపంచ చరిత్ర నిండా ఇటువంటి ఎన్ని గాథలో. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మంగల్‌పాండే, ఆ తర్వాత బ్రిటిష్‌ వారి మీద మొదటి బాంబు విసిరి ఉరికంబం ఎక్కిన ఖుదీరాంబోసు (అమ్మా, మళ్లీ నీ కడుపుననే పుడతాను, అప్పుడు నా గొంతు మీద ఉండే గాటుతో నన్ను గుర్తు పెట్టుకో అని చెప్పిందట ఆ ఉరి తీయబడ్డ శిరస్సు – తన దేశంతో), కానూ, సిద్ధూ, బిర్సాముండా, వీరనారాయణ సింగు, జోడెన్‌ఘాట్‌ యోధులు కొమురం భీంతో సహా పదకొండు మంది ప్రతి ఆదివాసీ పోరాట యోధుని గురించి ఇదే గాథ. అష్ఫాఖుల్లా ఖాన్‌, రాంప్రసాద్‌ బిస్మిల్‌ మొదలు భగత్‌సింగు, రాజగురు, సుఖదేవ్‌, కయ్యూరు కామ్రేడ్స్‌, కాశ్మీర్‌ విమోచనోద్యమంలో మఖ్బూల్‌భట్‌ – ఇది ఎడతెగని జాబితా.
బ్రిటిష్‌ వలస పాలన మొదలయిన దగ్గరి నుంచీ మన దేశంలో మాత్రమే కాకుండా, అమెరికాలోకి యూరపియన్లు ప్రవేశించిన దగ్గర్నించీ నమోదయిన దస్తావేజులన్నీ ఈ ఆదివాసీ పోరాట యోధులను గానీ, ఇతర పోరాట శక్తులనకు గానీ విచారించి ఉరితీసిన ఉదంతాలను రికార్డు చేసాయి. బహుశా ఉరిశిక్షకు లేదా మరణశిక్షకు ఇది మరొక క్రూర ప్రత్యేకత. అంటే చట్ట ప్రకారం విచారణ చేసి ఒక మనిషిని ఒక వ్యవస్థ చంపే అధికారం, ఈ అధికారం మనం రాజ్యాంగాలు, శాసనాలు, చట్టాలు ఇచ్చాయనుకుంటాం. కాని ఆస్తి – ప్రైవేట్‌ ఆస్తి ఇచ్చిందని అసమ సమాజాన్ని ఏమాత్రం విశ్లేషించినా అర్థమవుతుంది. సాహిత్యం స్పార్టకస్‌ కాలం నుంచి భూమయ్య కిష్టాగౌడ్‌ల కాలం దాకా ‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ వివరించడానికి చేసిన, చేస్తున్న ప్రయత్నమంతా ఈ ప్రైవేట్‌ ఆస్తి దోపిడీ న్యాయం గుట్టు విప్పి చెప్పడమే. ‘సుప్తాస్థికలు’ గీతం రాసిన తొలి నాళ్ల నుంచి ‘భూమ్యాకాశాలు’ గీతం రాసిన 1975 దాకా శ్రీశ్రీ దాదాపు ఒక ఏభై సంవత్సరాలు ఈ ప్రతీక ద్వారా, ఈ సంకేతం ద్వారా మార్క్స్‌ చెప్పిన తలారీ వ్యవస్థను – అది దళారీ వ్యవస్థగా మారిన కాలం దాకా మన కళ్ల ముందుంచి – ఆ ఉరి కంబం ఎక్కిన యోధుల నోట వెలువడిన పోరాట సత్యాలను తన కవిత్వంగా మలిచాడు.
బానిస వ్యవస్థను రద్దు చేయడానికి స్పార్టకస్‌ చేసింది తొలి పయనం అయితే (మనకు తెలిసిన చరిత్రలో) నక్సల్బరీ పంథాలో విప్లవకారులు చేస్తున్న (వర్తమాన చరిత్రలో) పయనం తుది పయనం. ఇందులో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైతే ఇది తొలి విజయం మాత్రమే అవుతుంది. ఎందుకంటే మనం – నూతన ప్రజాస్వామికం నుంచి, సామ్యవాదంలోకి, అంతిమంగా వర్గరహితమైన సమాజంలోకి పయనించవలసి ఉన్నది. శ్రీశ్రీ నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట యోధుల ‘తుది పయనం: తొలి విజయం’ గురించి అదే చెప్పాడు.
ఊగరా, ఊగరా, ఊగరా
ఉరికొయ్య అందుకొని ఊగరా
ఉరికొయ్య అంటుకొని ఊగరా
చావన్నది నీకు లేనే లేదురా
పేద ప్రజానీకానికి, పీడితులకు, తాడితులకు
చేదోడుగ, వాదోడుగ, సైదోడుగ మెలిగేవు
పువ్వులాంటి యవ్వనాన్ని నిగ్గబట్టి నిలిచావు
నిప్పులాంటి నిజాయితీ నెత్తికెత్తి నడిచావు
కార్యదీక్ష కదిలిస్తే కదనానికి దూకావు
అంటూ వంగపండు ప్రసాదరావు అజరామరమైన పాట ‘ఏం పిల్డో ఎల్దమొస్తవా – శ్రీకాకుళంలో సీమకొండకు’ రాయడానికి ప్రేరణ అయిన చరణాలు శ్రీశ్రీ రాసాడు
నెత్తురు కార్చిన కళ్లే నిప్పులు చెరుగుతాయి
వంకర టింకర రాళ్లే గుళ్లయి ఎగురుతాయి
శ్రీకాకుళం అడవుల్లో చీమలు పాముని చంపుతాయి
సింహాది శిఖరం మీద చిలుకలు పిల్లిని చెండుతాయి
అయితే ఈ పోరాటం మాంచాల, మల్లమ్మ, ఝాన్సీలక్ష్మి, సరోజినీ దేవి వంటి వాళ్ల పోరాటం వంటిది కాదు. (బాలచంద్రుడు, తాండ్రపాపారాయుడు, బహదూర్‌ షా, గాంధీల కన్న ఆయా కాలాల్లో ఆయా వర్గాల పోరాటాల ప్రయోజనాల కోసం మెరుగయిన ప్రతీకలే అయినప్పటికీ) మార్క్స్‌ చెప్పినట్లు వీళ్లంతా తమ తమ వర్గాల ‘విముక్తి’ కోసం యుద్ధాలు చేసినవాళ్లు. మొత్తం మానవ సమాజ విముక్తి కోసం పోరాడిన పంచాది నిర్మల చెప్పింది, చూపింది ‘మార్క్స్‌ చెప్పిన తీరం’.
చావులేని ఆ సత్యం జ్వలిస్తుంది అనునిత్యం!
అందుకే ఆస్తిపర వర్గాలు
మాంచాలను కొలుస్తారు, మల్లమ్మను తలుస్తారు
ఝాన్సీ లక్ష్మీబాయికి బాష్పధార విడుస్తారు
సరోజినీ దేవి ఫొటో పటం కట్టి పొగుడుతారు
పంచాది నిర్మలంటే భయం పుట్టి వణుకుతారు
అని మాత్రమే ఆగకుండా ఇందులోని సార్వజనీనమైన గతితార్కిక చారిత్రక సారాన్ని మనముందు ఉంచుతాడు.
తెల్లవాడు నిన్ను నాడు భగత్సింగు అన్నాడు
నల్లవాడు నువ్వు నేడు నక్సలైటువన్నాడు
ఎల్లవారు రేపు నిన్ను వేగు చుక్క అంటారు.
‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అని ముగిసిన ఈ గీతం శ్రీశ్రీ 1971లో రాసాడు. ఆయనెక్కడా ప్రస్తావించక పోయినా బహుశా శ్రీకాకుళ పోరాటంలో పాల్గొన్న నాగభూషణ్‌ పట్నాయక్‌కు ఉరిశిక్ష పడిన సందర్భంలో శ్రీశ్రీ ఈ పాటరాసి ఉంటాడు. ఆ తర్వాత కాలంలో ‘ఉరికంబం మీద నిలిచి ఉజ్వల గీతం పాడెద’ అని శివసాగర్‌ రాసిన అజరామరమైన గీతంతోపాటు ఒక వ్యక్తిగా కన్నా తలారీ వ్యవస్థ మీద బలాదూర్‌ ప్రతిఘటనా స్వరాలుగా ఈ రెండు గీతాలు సాహిత్య చరిత్రలో నిలిచి ఉంటాయి.
మరోప్రస్థానం – గీతాలన్నీ నిర్దిష్ట స్థలకాల పాత్రలకు చెందినవి. ఒక నిర్దిష్ట ప్రత్యేక అంశం నుంచి ఒక విశ్వజనీనమైన సత్యం వైపు మనను తీసుకపోయేవి. అటువంటి నిర్దిష్ట ఉద్దిష్ట వ్యక్తులు భూమయ్య కిష్టాగౌడ్‌లు – కాని శ్రీశ్రీ వాళ్లను మనకు ‘భూమ్యాకాశాలు’గా విస్తరించి చూపినపుడు అవును కదా అని తలలూపకుండా ఉండలేం.
భగత్‌సింగు, రాజగురు, సుఖదేవ్‌ల తర్వాత, కయ్యూరు (కేరళ) కామ్రేడ్స్‌ తర్వాత భారత రైతాంగ విముక్తి పోరాటంలో రాజకీయ కారణాల కొరకు ఉరిశిక్షకు గురైన రైతాంగ గెరిల్లా యోధులు భూమయ్య, కిష్టాగౌడ్‌లు. వారిని 1975 డిసెంబర్‌ 1న ఎమర్జెన్సీ చీకటి రోజులు ఇచ్చిన పిరికి ధైర్యంతో ఉరితీసింది ఇందిరా వెంగళరావు రాజ్యం.
1929-30లలో అంటే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన తొలి రోజుల్లో పుట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు కోసుగంటి భూమయ్య. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి తాలూకాకు చెందిన ముత్తనూరులో వీరమల్లయ్య, రాజవ్వ అనే జంగమ దంపతుల సంతానం.
1933లో ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ తాలూకా కసర్‌గామ గ్రామంలో గున్నల ఎల్లాగౌడ్‌, చిన్నక్కలకు పుట్టిన కిష్టాగౌడ్‌ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనడమే కాదు ఆనాడు తొడలో దిగిన పెలెట్లు ఉరిశిక్ష నాటికి కూడా ఆయన శరీరంలో పోరాట చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి. (తోటారాముని తొడకు కాటా తగిలిందని అడవి కన్నీరు పెట్టిందితని కోసమే).
కమ్యూనిస్టు పార్టీతోనే ప్రయాణం చేస్తూ నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు గోదావరి లోయకు విస్తరించినపుడు గోదావరికి అద్దరి, ఇద్దరి ఉన్న ఈ ఇద్దరూ నక్సలైటు ఉద్యమంలో చేరి ఒక హత్య కేసులో 1970 ఏప్రిల్‌లో అరెస్టయ్యారు. నెలల తరబడి పోలీసు స్టేషన్‌లలో చిత్రహింసలకు గురయి వరంగల్‌ జైల్లో ఉండగా 72లో వీరికి సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది.
తెలంగాణలో ఉరిశిక్షలు అమలయ్యే జైలు ముషీరాబాద్‌ (సికిందరాబాద్‌) కనుక వీరినక్కడికి మార్చారు. ఉరిశిక్షలు పడిన వారిని గంజ్‌ (కండెమ్డ్‌ సెల్స్‌) లో ఉంచుతారు. మొదట 72లో అరెస్టయిననపుడు కె.జి. సత్యమూర్తి, ఎమర్జెన్సీలో సుమంతో బెనర్జీ, ఇంగువ మల్లికార్జునశర్మ కూడా వీరితో చాలాకాలం ఉన్నారు. వీరి ఉరిశిక్ష అమలు చేయడానికి మొదట ప్రభుత్వ ఉత్తర్వులు 1974 డిసెంబర్‌ 25న వచ్చాయి. అంటే వాళ్లు పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి కూడా తోసిపుచ్చాడు గనుక – ఇంక ఉరితీయవచ్చునని. ఉరికంబం ఎక్కవలసిన వారికి ఈ ఉత్తర్వులు జైలు అధికారులు సరిగ్గా ఇరవై నాలుగు గంటల ముందు చెప్తారు. ఆ సమయానికి సికిందరాబాద్‌ కుట్ర కేసులో ముద్దాయిలుగా విరసం రచయితలు ఆరుగురు కూడా అదే జైల్లో ఉన్నారు. వారి ద్వారా ఆ వార్త బయటి ప్రపంచానికి, ఎపిసిఎల్‌సి కార్యదర్శి పత్తిపాటికి తెలిసి, వారి కృషి వల్ల ఆ రాత్రి వాళ్ల ఉరిశిక్ష తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తర్వాత పత్తిపాటితో పాటు కలిసివచ్చి శ్రీశ్రీ జైల్‌ గంజ్‌లో భూమయ్య, కిష్టాగౌడ్‌లను స్వయంగా కలిసి పలకరించాడు. అప్పటి నుంచీ వాళ్ల ఉరిశిక్ష రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షునిగా రాష్ట్రమంతటా సభలు, సమావేశాల్లో, ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. ఆ ఇద్దరూ ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన వాళ్లు కావడం వల్ల (వాళ్లు అమరులయ్యాక కరీంనగర్‌ జిల్లా కుక్కల గూడూరులో కామ్రేడ్‌ దేవేందర్‌ రెడ్డి నాయకత్వంలో ప్రజలు వాళ్ల స్మృతిలో, గోదావరి తీరంలో అమరులయిన ఇతర విప్లవకారుల స్మృతిలో ఎమర్జెన్సీ తర్వాత స్మారక స్థూపాన్ని నిర్మించుకుని వేలాది మందితో ప్రదర్శన, సభ నిర్వహించుకున్నారు) బెల్లంపల్లి, మందమర్రి, హుజూరాబాద్‌ మొదలైన అన్ని చోట్ల 74-75లలో జరిగిన భూమయ్య కిష్టాగౌడ్‌ ఉరిశిక్షల రద్దు సభలన్నింట్లోనూ శ్రీశ్రీ పాల్గొన్నాడు.
అటువంటి ఒక సభ యాదృచ్ఛికంగానే కావచ్చు 11 మే 1975న హుజూరాబాద్‌లో జరిగింది. ఆ సభలు నిర్వహించిన నల్లా ఆదిరెడ్డి, శనిగరం వెంకటేశ్వర్లు తర్వాత కాలంలో శ్యాం, సాహులుగా విప్లవోద్యమ చరిత్రలో రక్తాక్షరాలుగా నిలిచిపోయారు. ఆ సభకు వేలాదిమంది జనం హాజరయ్యారు. వేదిక మీద వక్తలు మాట్లాడుతుంటే ఆ సభ కరపత్రం చదివి వెనుకవైపు శ్రీశ్రీ రాసిన మాటలు ఆ తర్వాత కాలానికి ఉరిశిక్షల రద్దు ఉద్యమానికి ప్రేరణ అయినవి. జార్‌ చక్రవర్తి పరిపాలనలో రష్యాలో సుప్రసిద్ధ నవలా రచయిత డాస్టొవస్కీకి ఒక హత్య కేసులో ఉరిశిక్ష పడింది. అది అమలు చేయడానికి అప్పటి రష్యా ప్రభుత్వం చట్టం ప్రకారం అతణ్ని కాల్చి చంపే గోడ దగ్గరికి తీసుకపోయిన మారక బృందానికి ఆఖరి క్షణాన – మరణశిక్ష రద్దు చేస్తూ జార్‌ చక్రవర్తి తరఫున ఉత్తర్వులందాయి. జార్‌ చక్రవర్తికి అప్పుడే డాస్టొవస్కీ గొప్ప నవలా రచయిత అని తెలిసిందట. ఆ విషయం శ్రీశ్రీ తనదైన సులభ శైలిలో చెప్పి ఇందిరాగాంధీ భూమయ్య కిష్టాగౌడ్‌లనకు ఉరితీసి జార్‌ చక్రవర్తి కన్నా అన్యాయం అనిపించుకోరాదని ఆయన విజ్ఞప్తి చేసాడు.
ఇందిరా-వెంగళరావులు జార్‌చక్రవర్తే కాదు, నిజాం రాజు కన్నా అన్యాయం అనిపించుకున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉరిశిక్షలు పడిన పదకొండు మంది ఉరిశిక్షలు అమలు కాలేదు. ఖురాన్‌ మీద ఉన్న భయభక్తులతో పాపం తగులుతుందని మరణశిక్ష అమలు ఉత్తర్వులపై నిజాం రాజు సంతకం చేయకుండా ఉండిపోయాడు – పోలీసు చర్య (1948 సెప్టెంబర్‌) కాలం దాక కూడ.
1975 మే 10న భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరితీత కోసం రెండవ మారు ఉత్తర్వులు వచ్చాయి. అమరుడు మధుసూదన్‌ రాజ్‌ ద్వారా ఆ వార్త బయటి ప్రపంచానికి, కన్నబిరాన్‌కు, యువ న్యాయవాదులకు తెలిసి, వారి కృషి వల్ల రెండోమారు ఉరిశిక్ష ఆగిపోయి, ‘భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు కమిటీ’ ఏర్పడి ఉద్యమం రాష్ట్రాల, దేశాల ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తమయింది. ఫ్రాన్స్‌లో, ఇంగ్లండ్‌లో కూడ భారత రాయబార కార్యాలయాల ముందు ప్రదర్శనలు జరిగాయి. దేశంలో జయప్రకాశ్‌ నారాయణ్‌, వాజ్‌పేయి మొదలు కె.ఎ. అబ్బాస్‌, మృణాళ్‌సేన్‌ల వరకు ఉరిశిక్షల రద్దు కొరకు విజ్ఞప్తి చేసారు. జార్జి ఫెర్నాండెస్‌, చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్‌ గుప్తల కృషి సరే సరి. జీన్‌పాల్‌ సార్త్ర్‌, తారిక్‌ అలీ, నోమ్‌ చామ్‌స్కీ వంటి ప్రపంచ మేధావులు కూడా స్పందించారు.
12 మే 1975న హైదరాబాద్‌లో శ్రీశ్రీ ఒక విజ్ఞప్తి చేసాడు.
‘ఏదో చారిత్రకమైన పొరపాటు వల్ల ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌, ఇందిరాగాంధీలను ఉరి తియ్యడం జరిగితే ఎక్కడో అలాస్కాలో ఉన్న ఎస్కీమోలు పట్టించుకోక పోవచ్చును. అలాగే భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీస్తే అహ్మద్‌, ఇందిరాగాంధీలకు చీమకుట్టి నట్లయినా ఉండక పోవచ్చును. కాని ఒకప్పుడు సక్కో, వాంజెట్టీలను ఎలక్ట్రిక్‌ కుర్చీలపై ఎక్కించి అమెరికా ఆర్జించుకున్న అప్రతిష్టకు ఏమాత్రమూ తగ్గిపోదు ఇండియా ఈనాడు భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీస్తే! సాటి దేశాల చేత ఇండియా ఇప్పటికే ‘ఛీ ఛీ’ అనిపించుకుంటోంది. (సిక్కింను కబళించడం లాంటి చర్యలతో) ఎన్నో సభ్య రాజ్యాలు నిషేధించిన ఉరిశిక్షను రద్దు చెయ్యకపోవడంతో ఇండియా ఇప్పటికే పాతరాతి యుగంలోనే జీవిస్తున్నట్టు మరోమారు నిరూపించుకుంటుంది. కనీసం భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షలను రద్దు చేసే అవకాశం ఇండియా ప్రభుత్వానికి ఇప్పటికైనా లేకపోలేదని హెచ్చరిస్తున్నాను.’
అదే సమయంలో స్పెయిన్‌లో అయిదుగురు తిరుగుబాటుదార్లకు ఉరిశిక్ష పడింది. ఆ అయిదుగురు యువకుల ఉరిశిక్ష రద్దు చేయవలసిందిగా నియంత ఫ్రాంకోకు ‘భారత సామ్యవాద గణతంత్ర ప్రధాని’ ఇందిరాగాంధీ విజ్ఞప్తి చేసింది. కాని ఎమర్జెన్సీ విధించిన నియంతగా మారి ఆమెయే భూమయ్య, కిష్టాగౌడ్‌లను వెంగళరావు ద్వారా 1 డిసెంబర్‌, 1975న ఉరితీసింది.
బెల్లంపల్లిలో గజ్జెల గంగారామ్‌, పెద్ది శంకర్‌ వంటి రాడికల్స్‌ (ఆ తర్వాత కాలంలో అమరులయిన విప్లవకారులు) పూనికతో వేలాది మందితో జరిగిన సభలో శ్రీశ్రీ పాల్గొన్నాడు. మందమర్రిలో భోరున వర్షం కురుస్తుంటే వేలాదిమంది జనం ఇంటి చూరుల కింద నిలబడి, వానలో తడుస్తూ
బానిసకొక బానిసకొక బానిసవోయ్‌ బానిసా
అని జలగం వెంగళరావుపై ‘ఇందిరమ్మ బాజాభజంత్రీ’గా ‘జలగవునీ పేరంటే కడుపునొప్పి’ అని రాసిన ‘దూది పులి మీద పుట్ర’ గీతాన్ని శ్రీశ్రీ ఉత్తేజకరంగా వినిపించాడు. ఆ సభలో పాల్గొన్న పత్తిపాటి వెంకటేశ్వర్లు మర్నాడు భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు గురించి ముఖ్యమంత్రిని కలిసినపుడు
‘నక్సలైటు పోల్చినాడురా – నీ నెత్తిన
నాటుబాంబు పేల్చుతాడురా’
అని మీ మహాకవి మందమర్రిలో చెప్పినపుడు వంతపాడినావు కదా అని వ్యంగ్యంగా తన వర్గస్వభావాన్ని బయట పెట్టుకున్నాడు వెంగళరావు.
ముషీరాబాద్‌ (సికిందరాబాద్‌) జైల్లో మొదటిసారి చూసినపుడే శ్రీశ్రీ భూమయ్య, కిష్టాగౌడ్‌లను భూమ్యాకాశాలతో పోల్చాడు. డిసెంబర్‌ 1న ఉరితీసారని చదివినపుడు డైరీలో నోట్‌ చేసుకొని డిసెంబర్‌ 3న వాళ్లపై భూమ్యాకాశాలు – అని గీతం రాసాడు.
వాళ్లిద్దరినీ ఉరితీసారని
అరవ పత్రికలో చదివినపుడు
వాళ్లిద్దరినీ ఉరితీశారని
డైరీలో నోట్‌ చేసుకున్నాను
ఒద్దు కన్నీటి కవిత్వం రాయొద్దు
సమాజానికి కాలం పెట్టిన అప్పును
ప్రాణాలతో వారు తీర్చుకున్నారు
ఎల్లప్పుడూ వాళ్లలో రగిలే పగ
ఎన్నటికీ తీరనే తీరదు
వాళ్లలో ఆరని ఆశ
తీరే రోజు చేరువలోనే ఉంది
- – - – - – -
చీకటిని పిడికిళ్లతో పిండి
చెడుగుడును చీల్చి చెండాడారు
చెరిగిపోని వాళ్ల శిలాశాసనం మీద
నక్షత్రాలు సాక్షి సంతకం చేసాయి
- – - – - – -
మరణం లేని మహదాశయమే
మనకు వాళ్లిచ్చిన నిధి
రోజెన్‌బర్గ్‌ దంపతుల్లా వాళ్లు
మేధావులు కారు
సాక్కో వాంజెట్టీ ల్లాగ
మెతక మనుషులు కారు
వాళ్లిద్దరిలో ఒకడు భూమి
రెండోవాడు ఆకాశం.
కిష్టాగౌడ్‌వి వంకీల తుమ్మెద రెక్కల వంటి శిరోజాలు. వాటి నీడలు పడే నీలాకాశం వంటి కళ్లు. భూమయ్య పేరుతో భూమి ఉందిగానీ ఆయనది జంగమ వృత్తి. జంగమ దేవరలకిచ్చే రెండెకరాల ఇనాం భూమిని భూమయ్యకు ఉరిశిక్ష పడినాక ఆయన భార్య, కొడుకు నెత్తికొట్టి ఆ ఊరి భూస్వామి ఆక్రమించుకున్నాడు. కనుక అక్షరాలా ఈ వ్యవస్థ భూమ్యాకాశాలను ఉరితీసింది. దున్నేవారికి భూమి కావాలన్నందుకు, ఆకాశం వలె పంచభూతాలు ప్రజలందరివీ అన్నందుకు, పోరాటానికి భూమ్యాకాశాలే హద్దు అన్నందుకు ఈ తలారి వ్యవస్థ ఆ ఇద్దరినీ ఉరితీసింది.
ఆ ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన ఈ రహస్యాన్ని శ్రీశ్రీ మనకు ‘జాతి జనులు పాడుకునే మంత్రంగా, తన ఆకాశాలను లోకానికి చేరువగా, తన ఆదర్శాలను సోదరులంతా పంచుకొనే వెలుగుల రవ్వల జడిగా’ వినిపించాడు.
శ్రీశ్రీకి నూరేళ్లు నిండాయి. ఆయన కవిత్వం ఆగిపోయి కూడ 26 ఏళ్లు గడిచిపోయాయి. భూమయ్య కిష్టాగౌడ్‌లను ఉరితీసి కూడా 34 ఏళ్లు గడిచిపోయాయి. ఎమర్జెన్సీ చీకటి రోజులు ‘తొలిగిపోయి’ కూడా 32 ఏళ్లు అయింది. కనుక ఈ అన్నిటికీ ఇపుడేమిటి సంబద్ధత? సమకాలీనత? అని మనం ప్రశ్నించుకోవచ్చు. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన కాలపు ఆర్థిక మాంద్యం, ప్రజాస్వామ్యంపై ఫాసిస్టు దాడి – ఇవ్వాళ అమెరికా సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న సంక్షోభం, ప్రపంచం మీద చేస్తున్న అణుయుద్ధం ప్రపంచీకరణ రూపంలో మనను మార్కెట్‌ మాయలో పడవేసినవి. ఇవ్వాటికీ శ్రీశ్రీ మాటల్లోనే ‘కర్మాగారము, కళాయతనము, కార్యాలయముల కన్నా మిక్కుటముగా’ కారాగారాల్లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది మగ్గుతున్నారు.
నక్సలైటు ఉద్యమంలోను, జాతివిముక్తి ఉద్యమాల్లోను ఉరిశిక్షలు పడిన వాళ్లు కూడ దేశం జైళ్లలో మృత్యువుతో తలపడుతున్నారు. వారిలో పార్లమెంట్‌ మీద దాడి కేసులో ఉరిశిక్షను సుప్రీం కోర్టు కూడా ఖాయపరచి కేవలం రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం నిరీక్షిస్తున్న అఫ్జల్‌ గురు ఉన్నాడు. ఎమర్జెన్సీ దేశంలో గ్రీన్‌హంట్‌ పేరు మీద తన ప్రజల మీద తానే సైనిక దాడి చేసే బీభత్స రూపాన్ని సంతరించుకున్నది. అందుకే శ్రీశ్రీ కవిత్వం శిశిరం ముగింపుగా వచ్చే ఉగాదిగా ఇవ్వాటికీ ‘తొలి యౌవనాన్ని పునర్జీవిస్తున్నది’.

ద పోస్ట్ మాన్

- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
కావడానికి అవి అంత ప్రాముఖ్యం లేని సంగతులే గాని వాటి ఫలితంగా మారియో హిమేనెజ్ జీవితం కొత్త పుంతలు తొక్కింది. అదృష్టం కొద్దీ ఆ పరిస్థితులవల్లనే జూన్ 1969లోమారియో కొత్త ఉద్యోగంలో కుదురుకోవలసి వచ్చింది.
మారియోకు చేపలుపట్టడం అంటే మాచెడ్డ చిరాకు. నిజం చెప్పాలంటే తెల్లవారకముందే పక్కమీదినుంచి లేవడమంటే మరీ చిరాకు. అవును గదా, తెలతెలవారేటప్పుడు నిద్ర ఎంత మజాగా ఉంటుంది! అప్పుడేగదా శాన్ ఆంటోనియో మూవీ థియేటర్ లో తెరమీద కనబడి కళ్లు జిగేలుమనిపించే అమ్మాయిలతో ఎన్నెన్నో సాహసకార్యాలు చేస్తున్నట్టు కలలు కనొచ్చు. అలా మాగన్ను నిద్రలో కనేకలల వల్లనే అప్పుడప్పుడు నిజంగానూ అప్పుడప్పుడు ఉత్తుత్తిగానూ జలుబు చేసిందని చెపుతూ వచ్చాడు. తండ్రి పడవకోసం వలలు తయారుచేసే పని నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. దక్షిణాది ద్వీపాల నుంచి వచ్చే లావుపాటి బొంతలమధ్య ముడుచుకుని పడుకుని నిండుగా కలలు కనేవాడు. తన సోమరి స్వప్నగీతాలకు మరింతగా మెరుగు దిద్దుకుంటూ ఉండేవాడు.
అటువంటి సమయంలో ఈ సంగతి జరిగింది. తండ్రి హోస్ హిమేనెజ్ అప్పుడే సముద్రంమీద చేపల వేటకు వెళ్లి వచ్చి, కుప్పగా తడిసిపోయి, బాగా అలసిపోయి ఆకలితో ఇల్లు చేరాడు. ఆ సమయానికి ఇంట్లో ఉన్న మారియో అపరాధభావనతో అన్నట్టుగా తండ్రికి మధ్యాహ్న భోజనం తయారుచేశాడు. అప్పుడే కాల్చిన రొట్టెలు పెట్టాడు. టమాటాలు, ఉల్లిపాయలు ముక్కలు తరిగాడు. కాసింత పుదీనా, కాసింత కొత్తిమీర చల్లాడు.
తనకోసం మాత్రం ఒక తలనొప్పి మాత్ర పట్టుకుని కూచున్నాడు.
తన చేతి అన్నం తింటున్న ఆ పెద్దమనిషి వెటకారం నిండిన ముఖంతో “అలా పనీపాటా లేకుండా ఉండే బదులు ఏదన్నా ఉద్యోగం వెతుక్కోవచ్చుగా” అనేసరికి, ఆ మాట మారియో ఎముకల మూలుగుల్లోనుంచి లోలోపలికి జారింది. ఆ గొడవలో తలనొప్పి మాత్ర ఎంత నాటకీయంగా గొంతులోకి జారిందో తెలియలేదు.
“వెళ్లి పని వెతుక్కో” అని ఆ తండ్రినోటినుంచి వెలువడినది పదునైన మాట. సూటి మాట. ఆ మాటకుముందు ఆయన కొడుకువేపు పది నిమిషాలో ఐదు నిమిషాలో ఒక తృణీకార దృక్కు విసిరాడు.
“సరే” అన్నాడు మారియో, చొక్కా చేతితో ముక్కు తుడుచుకుంటూ.
ఇక రెండో పరిణామంలో ప్రధాన పాత్రధారి మారియో పెంపుడు ఆస్తి లెగానో సైకిల్. ఆ వాహనం మారియోను ఆ పల్లెకారుల తీరపు సంకుచిత దిగంతంనుంచి శాన్ ఆంటోనియో రేవుపట్నపు వైశాల్యంలోకి తీసుకుపోతూ ఉంటుంది. ఆ రేవు పెద్ద పట్టణమేమీకాదు గాని పుట్టిపెరిగిన ఆ చిన్న పల్లెకారుల గూడెంతో పోలిస్తే మారియో కళ్లకు ఆ పట్నం బాబిలోనియన్ లాగ కనిపిస్తుంది.
అబ్బ, ఆ పట్నం ఎంత మజాగా ఉంటుందో. ఎక్కడపడితే అక్కడ ఉన్న సినిమా పోస్టర్లలో కవ్వించేలా బుంగమూతి స్త్రీలు. పొడవాటి చుట్టలకొసలు నములుతూ పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ ఉండే మొరటు మగవాళ్లు. ఆ బొమ్మలు చూస్తుంటేనే మారియోకు మైకం ఎక్కిపోయేది. ఇక ఆ మైకం దిగాలంటే ఒకటే మందు. రెండుగంటలపాటు చీకటి గుయ్యారపు సినిమాహాల్లో కూచోవలసిందే. ఆ సినిమా అయిపోయాక నిరాశగా ఈడుస్తూ సైకిలు తొక్కుతూ వెనక్కి వచ్చేవాడు. సరిగ్గా ఆ సమయానికే కొన్నిసార్లు చిత్తడి వాన కురిసేది. ఆ వానలో తడవడంతో మారియోకు ఎక్కడలేని జలుబూ, తలనొప్పీ పట్టుకునేవి.
ఒకవైపు మారియో కోరికలకేమో అంతులేదు. ఆ కోరికలన్నిటినీ తీర్చడానికి తండ్రి ఔదార్యం ఎప్పటికీ సరిపోయేదీకాదు. అందుకని మారియో చాల తరచుగా పాతపత్రికల దుకాణం ముందర నిలబడి ఆ పత్రికల్లో తన అభిమానతారల బొమ్మల వేపు ఆబగా చూస్తూ ఆ పత్రికలను మరింతగా నలిపేస్తూ ఉండేవాడు.
అలాంటి ఒక రోజున మారియోకు ఎదురుగా పోస్టాఫీసు కిటికీలో ఒక ప్రకటన కనబడింది.
చిన్నపిల్లల లెక్కల నోటుబుక్కులోంచి ఒక కాగితాన్ని అశ్రద్ధగా చింపి ఆ ప్రకటన రాసినట్టు ఉంది. అసలే లెక్కలంటే మారియోకు భయం గాని ఆ ప్రకటన చూడగానే మాత్రం కాళ్లు నేలమీద నిలవలేదు.
మారియో తన జీవితంలో ఎన్నడూ టై కట్టుకోలేదు. కాని ఇప్పుడు మాత్రం టై కట్టుకుంటున్నట్టే చొక్కా గొంతు దగ్గర సరిచేసుకున్నాడు. బీటిల్స్ ను అనుకరిస్తూ పెంచుకున్న తన జుట్టును జాగ్రత్తగా సరిచేసుకున్నాడు.
పోస్టాఫీసుకు వెళ్లి అక్కడ కూచుని ఉన్న పెద్దమనిషితో, బర్ట్ లాంకాస్టర్ లాగ చిరునవ్వు నవ్వుతూ “పని ఉందని మీరు రాసిన ప్రకటన చూసి వచ్చాను” అన్నాడు.
“నీ దగ్గర సైకిలుందా?” అడిగాడా పెద్దమనిషి ఇంకే సంగతీ పట్టించుకోనట్టుగా.
“ఉంది” అన్నమాట పెదాలన్నాయో, హృదయం ఎగిరొచ్చి అందో, రెండూ ఒక్కసారే అన్నాయో తెలియలేదు.
“మంచిది” అన్నాడాయన. కళ్లజోడు తీసి తుడుచుకుంటూ “మాకు ఇస్లా నెగ్రా కోసం ఒక పోస్ట్ మాన్ కావాలి” అని జోడించాడు.
“వారెవ్వా. భలే. నేనుండేది సరిగ్గా అక్కడే. అక్కడ తీరం మీదనే మా ఇల్లు.”

“సరే, మంచిది. కాని అబ్బాయ్, ఒక చిన్న ఇబ్బంది ఉంది, నువ్వక్కడ ఒకేఒక్కరికి మాత్రమే పోస్ట్ తీసుకుపోవాలి.”
“ఒక్కరికేనా?”
“అవును. అక్కడ మిగిలినవాళ్లందరూ పొట్టకోసినా అక్షరం ముక్క రానివాళ్లు. వాళ్లు పన్నుల కాగితాలే చదవలేరు.”
“మరి పోస్టు వచ్చేది ఎవరికి?”
“పాబ్లో నెరూడా.”
మారియో హిమేనెజ్ గుండె గొంతులోకొచ్చింది. అవాక్కయి నోటినిండా నిండిన ఉమ్మిని ఒక్కగుక్కలో మింగేశాడు. “ఇదింకా బాగుందే, భలే, వారెవ్వా” అన్నాడు.
“భలేగా అనిపిస్తోందేం? ఆయనకు ప్రతిరోజూ మణుగులకొద్దీ పోస్టు వస్తుంది. ఆ సంచీ నీ భుజానికి తగిలించుకుని ఆ సైకిలు మీద పోతుంటే మజా తెలుస్తుందిలే. నీ భుజాలమీద ఏనుగును మోస్తూ పోయినట్టే. నీకన్న ముందు ఈ పని చేసిన మనిషి వీపు ఒంటెలాగయిపోయి గూని వచ్చింది తెలుసా?”
“కాని నా వయసు పదిహేడేళ్లేనండి.”
“మంచి ఆరోగ్యమేనా?”
“నాకా? ఆరోగ్యం సంగతా? గుర్రంతో సవాల్. ఎప్పుడూ జిర్రున చీది ఎరగను.”
పోస్టాఫీసు పెద్దమనిషి ముక్కుదూలంమీదినుంచి కళ్లజోడు కిందికి జార్చి, పైనుంచి అదోరకంగా మారియో వైపు తేరిపార చూశాడు.
“మరి మేమిచ్చే జీతం గుడ్డిగవ్వకు సరిపోదు. వేరేచోట్ల పోస్టు తీసుకుపోయేవాళ్లకు ఆసాములు ఇచ్చే బక్షీసు అంతకూడ ఉండదు మాజీతం. ఈ ఒక్క ఆసామి పోస్టు తీసుకుపోతే నీకు వారానికి ఒక్క సినిమా చూడడానికి సరిపోయే డబ్బులు గిడతాయేమో.”
“అయినా సరే, నాకీ పని కావాలి.”
“సరే, సరే, నాపేరు కోస్మె.”
“కోస్మె?”
“నువ్వు నన్ను కోస్మె గారూ అనాలి తెలిసిందా?”
“సరేనండి కోస్మె గారూ!”
“నేను నీ పై అధికారిని.”
“సరే సార్.”
కోస్మె తన నీలంరంగు బాల్ పాయింట్ పెన్ బయటికి తీశాడు. ఆ ముల్కి చివరన వెచ్చ చేస్తున్నట్టు ఒకసారి ఊదాడు. తలఎత్తి చూడకుండానే “పేరు” అని అడిగాడు.
“మారియో హిమేనెజ్” అని గంభీరంగా జవాబిచ్చాడు మారియో.
ఆ ముఖ్యమైన సమాచారాన్ని అందజేయగానే పని అయిపోయినట్టుగా కిటికీ దగ్గరికి నడిచి ఆ ప్రకటన కాగితాన్ని చించి వెనుకజేబులో కుక్కుకున్నాడు.
శాంత మహాసముద్రం తన అనంత సహనంతో సాధించలేకపోయిన మార్పులను ఆ చిన్న, ముద్దొచ్చే శాన్ ఆంటోనియో పోస్టాఫీసు తీసుకొచ్చింది. మారియో హిమేనెజ్ ప్రతిరోజూ పొద్దుపొడవకుండానే లేవడం మొదలుపెట్టాడు. లేచీలేవగానే హుషారుగా ఈలలు వేయడం కూడ మొదలుపెట్టాడు. ఇదివరకు లేచీలేవడంతోనే బాధించే ముక్కు దిబ్బడ ఇప్పుడు లేదు. తన ఉద్యోగబాధ్యతలను చాల కచ్చితంగా నెరవేర్చడం మొదలుపెట్టాడు. మారియో తనపనులను ఎంతబాగా చేస్తూ పోయాడంటే పోస్ట్ మాస్టర్ కోస్మె కు కూడ చాల నమ్మకం కలిగింది. పోస్టాఫీసు తాళం చెవిని కూడ మారియోకు ఇచ్చేశాడు. పాపం ముసలాయన ఎన్నాళ్లుగానో ఒక కల కంటున్నాడు. పక్కమీది నుంచి లేవకుండా మళ్లీ నిద్ర వచ్చేదాకా నిద్ర పోతూనే ఉండాలని, అలా ఎంతసేపూ నిద్రపోతూనే ఉండాలని, అలా నిద్రలోనే పగలూ రాత్రీ గడిపేసి మర్నాటి ఉదయం మేలుకునే సరికి పనిచేయడానికి బోలెడంత శక్తీ, ఆసక్తీ వచ్చేంత నిద్రపోవాలని. మారియోకు రోజూ ఉండేంత ఉత్సాహం తనకు కూడ ఉంటే ఎంతబాగుండునని కోస్మె అనుకునేవాడు. కోస్మె అంత ఉత్సాహంగా ఎప్పుడూ పనిచేయలేదు. చిలీలో ఉద్యోగులందరికీ జరిగినట్టుగానే మారియోకు కూడ ఆలస్యంగా నెలన్నర తర్వాత మొదటినెల జీతం చెక్కు చేతికందింది. ఆ డబ్బులు చేతిలో పడగానే మహాఘనత వహించిన పోస్ట్ మాన్ మారియో హిమేనెజ్ గారు ఈ క్రిందివిధమైన కొనుగోళ్లు చేశారు: తండ్రికోసం స్పెషల్ వింటేజ్ కజినో మాకుల్ ద్రాక్ష సారా సీసా ఒకటి. నటాలీ ఉడ్ నటించిన వెస్ట్ సైడ్ స్టోరీ సినిమా టికెట్ ఒకటి, తనకోసం. జర్మనీలో తయారయిన స్టీలు దువ్వెన ఒకటి. శాన్ ఆంటోనియో బజారులో దువ్వెనల వ్యాపారి “జర్మనీ యుద్ధంలో ఓడిపోయిందిగాని శాంతిలో గెలిచింది. అక్కడ ఆయుధ తయారీదారులు ఇప్పుడు ఉక్కుతో దువ్వెనలు తయారు చేస్తున్నారు” అని అరుస్తుంటే ఆ దువ్వెన మీద ఆసక్తి కలిగింది. ఇక ఈ సామానులన్నీ కొనడం అయిపోయాక ఒక పుస్తకం కొన్నాడు. అది తాను ఉత్తరాలు తీసుకువెళ్లే ఏకైక ఆసామి రాసిన కవిత్వ పుస్తకం. పాబ్లో నెరూడా రాసిన ఎలిమెంటల్ ఓడ్స్.
కవి హుషారుగా ఉన్న, వీలయిన సమయం చూసి ఉత్తరాలతో పాటు ఈ పుస్తకం కూడ ఆయన చేతిలో పెట్టాలనీ, దానిమీద ఆయనతో సంతకం పెట్టించుకోవాలనీ మారియో నిర్ణయించుకున్నాడు. శాన్ ఆంటోనియోలో ఎప్పుడో ఒకప్పుడు తాను ఒక అద్భుతమైన అమ్మాయిని కలవకపోననీ, ఆ అమ్మాయి ముందర ఆ నెరూడా పుస్తకాన్నీ, అందులో నెరూడా తనకోసం చేసిన సంతకాన్నీ చూపెట్టి గొప్పలు పోవచ్చనీ మారియో కలలు కనడం మొదలుపెట్టాడు. ఒకవేళ అటువంటి మంచి అమ్మాయి శాన్ ఆంటోనియోలో దొరకకపోతే శాంటియాగోలో అయినా దొరకవచ్చు గదా. ఎట్లాగూ తన రెండోనెల జీతం రాగానే శాంటియాగో వెళతాడుగదా.
తన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి మారియో చాల సార్లు ప్రయత్నించాడు. ఎన్నోసార్లు ఆ పుస్తకాన్ని కవి చేతుల్లో పెట్టబోయాడు. కాని నెరూడా ఎప్పుడూ తన ఉత్తరాలు తీసుకునేటప్పుడు చూపెట్టే ముభావం, ముక్తసరి పలుకులు మారియోను భయపెట్టేవి. తన ఉత్తరాలు తెచ్చి ఇచ్చినందుకు బక్షీష్ కూడ నెరూడా ఎంత తొందరగా ఇచ్చేసేవాడంటే ‘ఇక నీ పని అయిపోయింది వెళ్లిపో’ అన్నట్టుండేది. ఆ బక్షీష్ ఎక్కువే ముట్టేదనుకోండి. అయినా, నెరూడా ముఖం మీద ఎప్పుడూ తనలోపలికి తాను చూసుకుంటున్న ఒక అంతర్ముఖుడి హావభావాలే కనబడేవి. ఆయన ఏదో ఒక కొత్త అద్భుత కవిత మొదలుపెట్టడానికి ఉద్యుక్తుడై, ఉద్విగ్నంగా ఉన్నప్పుడు తాను ఉత్తరాలు పట్టుకొచ్చి తలుపు కొడితే ఆ తన్మయత్వంలోంచి ఆయనను బయటికి లాగినట్టవుతుందేమోనని మారియో చాలసార్లు ఇబ్బంది పడ్డాడు. ఆ భావం మారియోను వదలలేదు. ప్రతిసారీ నెరూడా తలుపు తెరిచి వెంటనే తన ఉత్తరాల కట్ట తీసుకుని, మారియో చేతిలో కొన్ని సెంట్లు పెట్టేవాడు. చిరునవ్వుతో ‘గుడ్ బై’ అనేవాడు. ఆ పలకరింపు, చిరునవ్వు కూడ క్షణకాలంలో అయిపోయేవి. ఆ క్షణం నుంచి సాయంత్రందాకా మారియో మాత్రం ఎలిమెంటల్ ఓడ్స్ పుస్తకాన్ని తన చేతుల్లో పట్టుకుని తిరుగుతూనే ఉండేవాడు. ఏదో ఒకరోజు కవి సంతకం అడిగే ధైర్యం తనకు రాకపోతుందా అని ఎదురుచూస్తుండేవాడు.
మారియో ఆ పుస్తకాన్ని ఎంత ఎక్కువగా పట్టుకున్నాడంటే, అది ఒడిలో పెట్టుకుని చౌరస్తాలో దీపస్తంభంకింద కూచుని వచ్చేపోయే అమ్మాయిలు తనను ఒక మేధావి అని భావించాలని ఎంతగా ఎదురుచూశాడంటే, చిట్టచివరికి ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివేశాడు. ఎవరికోసం ఆ పుస్తకం పట్టుకుని కూచునేవాడో ఆ అమ్మాయిలు అసలు మారియోనుగాని, ఆ పుస్తకాన్ని గాని ఎప్పుడూ చూడలేదనుకోండి, అది వేరే సంగతి.
ఇక పుస్తకం చదివేశాక, ఒక్కసారయినా కవి దృష్టిని ఆకర్షించవలసిందే అనుకున్నాడు మారియో. ఒక చలికాలపు ఉదయాన ఎండపొడలో ఉత్తరాల కట్ట మీద ఆ పుస్తకం పెట్టి కవి ముందు పెట్టాడు. ఎన్నోసార్లు దుకాణాల కిటికీల మీద రాసిన దాన్ని చూసిన అనుభవంతో, “గురువుగారూ, మీ సంతకం ఇదిగో సరిగ్గా ఇక్కడ” అని అడిగాడు.
మారియో అడిగినది కవికి చాల మామూలు విషయం. ఎన్నోసార్లు చేసిన పని అది. అలా సంతకం పెట్టేసి మామూలు చిరునవ్వుతో ‘గుడ్ బై’ అనేశాడాయన. పుస్తకం చేతిలో పట్టుకుని ఆ సంతకాన్ని నిశితంగా పరిశీలించాడు మారియో. “అభినందనలతో, పాబ్లో నెరూడా” అని రాసి ఉన్న ఆ వాక్యం వల్ల తన అనామకత్వం యథాతథంగానే ఉండిపోయింది. ఇక కవితో సంబంధం పెంచుకోవాలనీ, ఏదో ఒకరోజున తనకు ఆయన ఒక పుస్తకం ఇచ్చేలా, అందులో ఆకుపచ్చని సిరాతో తన పేరు పూర్తిగా మారియో హిమేనెజ్ అని రాసేలా చూసుకోవాలనీ గట్టిగా అనుకున్నాడు. నిజం చెప్పాలంటే, “సన్నిహిత మిత్రుడు మారియో హిమేనెజ్ కు అభినందనలతో పాబ్లో నెరూడా” అని ఆయన రాస్తే ఎంత బాగుంటుంది అని కలలు కనడం మొదలుపెట్టాడు.
ఈ కలలను కోస్మెకు చెప్పాడు కూడ. కాని పోస్టల్ ఉద్యోగులు తమ ఆసాములను అలా ఇబ్బంది పెట్టడాన్ని నిషేధిస్తూ చిలీ లో ఉత్తర్వులు ఉన్నాయనీ, అయినా ఒక పుస్తకాన్నే రెండు సార్లు ఇవ్వడం కుదరదనీ కోస్మె చెప్పాడు. కవి ఎంత కమ్యూనిస్టయినా ఆయన వెంటపడి ఆయన ఇదివరకు రాసిన వాక్యం చెరిపేసి, ఆ స్థానంలో మరొక వాక్యం రాయమని అడగడం మంచిది కాదని కోస్మె చెప్పినదాని సారాంశం.
కోస్మె సలహా సరయినదే అని మారియో కూడ అనుకున్నాడు. అందువల్ల రెండో నెల జీతం వచ్చాక చాల సహజమైన కొనుగోలులాగ మరొక పుస్తకం కొన్నాడు. ఈ సారి అది న్యూ ఎలిమెంటల్ ఓడ్స్. ఎంతోకాలంగా కలలు కంటున్న శాంటియాగో ప్రయాణానికి కాకుండా ఈ పుస్తకానికి ఖర్చుపెట్టవలసి వచ్చినందుకు కాస్త బాధపడ్డాడు. అంతేకాదు, “వచ్చేనెల నీ కోసం థర్డ్ బుక్ ఆఫ్ ఓడ్స్ కూడ తెప్పించిపెడతాను” అని ఆ దుకాణదారు అనేసరికి ఆ బాధ మరింత పెరిగింది.
అయితే ఈ పుస్తకాలేవీ కవి సంతకానికి నోచుకోలేదు. మరొక చలికాలపు ఎండపొడ పడే పొద్దుటిపూట మారియో తనకోసం పుస్తకం మీద సంతకం పెట్టించుకోవాలనే సంగతే మరిచిపోయాడు, కవిత్వాన్ని మాత్రం మరిచిపోలేదు.
***
మారియో హిమేనెజ్ జాలరుల మధ్య పెరిగాడు గాని వలల గురించీ, ఎరల గురించీ తెలియదు. కవిని పట్టుకునే వల ఆ రోజు ఉదయపు ఉత్తరాల కట్టలో ఉంటుందని ఊహించలేకపోయాడు. ఆరోజు మారియో ఉత్తరాలకట్ట కవి చేతుల్లో పెట్టగానే, ఆయన అక్కడే మారియో ముందరే ఆగలేనట్టుగా ఆ కట్టలోంచి ఒక ఉత్తరం తీసి చించి చదవడం మొదలెట్టాడు. ఆయనకు మామూలుగా ఉండే గాంభీర్యం, ముక్తసరితనం ఏమయిపోయాయో తెలియదు. ఇలా ప్రవర్తించడం మారియోను ఆశ్చర్యపరిచింది. కవితో సంభాషించాలనీ, అసలు స్నేహం చేయాలనీ ఎప్పటినుంచో కంటున్న కలల మంటలు మళ్లీ ఒకసారి నాలుకలు తెరిచాయి.
“మిగిలిన ఉత్తరాల కన్న ముందు ఆ ఉత్తరం ఎందుకు విప్పారు?”

“అది స్వీడన్ నుంచి వచ్చింది గనుక.”
“స్వీడన్ ఆడవాళ్లు బాగుంటారని విన్నాను గాని స్వీడన్ నుంచి ఉత్తరం వస్తే అంత గొప్పేముంది?”

ఎప్పుడూ కదలకుండా ఉండే పాబ్లో నెరూడా కనురెప్పలు ఆమాటతో ఒక్కసారి మూసుకుని తెరుచుకున్నాయి.

“సాహిత్యానికి నోబెల్ బహుమతి గురించి బిడ్డా అది!”
“మీకిస్తున్నారా వాళ్లు?”
“వాళ్లు గనుక నాకిస్తే వద్దనను.”
“ఎంతొస్తుంది?”
అప్పటికి ఆ ఉత్తరంలో ప్రధాన భాగానికి చేరిన నెరూడా చాల మామూలుగా “లక్షా యాభై వేల రెండువందల యాభై డాలర్లు” అన్నాడు.

“మరొక యాభై సెంట్లు” అని కలుపుదామనుకుని, అతి కష్టం మీద ఆ మాట ఆపి, చాల గంభీరంగా “భలే” అన్నాడు మారియో.
“భలేనా, ఎందుకు?”
“నిజంగానే వాళ్లు మీకది ఇస్తున్నారా?”
“ఏమో. కాని ఈ సంవత్సరం నాకంటే ఎక్కువ అవకాశాలున్నవాళ్లున్నారు.”
“ఎట్లా?”
“వాళ్లు ఇంకా మంచి పుస్తకాలు రాశారు.”

“మిగిలిన ఉత్తరాల సంగతి ఏమిటి?”
“అవి తరువాత చూస్తానులే.”
“సరే.”
ఇక ఆ సంభాషణ ముగింపుకు వస్తోందని మారియోకు అనుమానం కలిగింది. ఆ విచారంతో కవికి సహజమైన పరధ్యానంలోకి ఆ పోస్ట్ మన్ కూడ జారిపోయాడు. ఆ పరధ్యానం ఎంత గాఢంగా ఉండిందంటే ఇక స్వయంగా కవే “ఏమిటి ఆలోచిస్తున్నావు?” అని అడిగాడు.
“ఏంలేదు, ఏంలేదు. ఆ వేరే ఉత్తరాల్లో ఏమి ఉండి ఉంటుందా అని. అవి బహుశా మీకొచ్చే ప్రేమలేఖలేమో.”
ఆ లావుపాటి కవి ఒక దగ్గు దగ్గాడు. “ఓయ్, జాగర్త, నేను పెళ్లయినవాడిని. నీ మాటలు మా ఆవిడ వింటేనా?”
“అయ్యయ్యో, క్షమించండి.”
నెరూడా తన జేబులోకి చెయ్యిపోనిచ్చి, మామూలుకన్న చాల ఎక్కువ కాగితం ఒకటి బయటికి లాగాడు. ఆ బక్షీష్ కన్న ఎక్కువగా కవిని వదిలిపోవలసి వస్తున్న విచారం ధ్వనిస్తుండగా మారియో కృతజ్ఞతలు చెప్పాడు. ఆ విచారం ఎందువల్ల కలిగినప్పటికీ, అది దాదాపు కాలూ చేయీ పడిపోయినంత పనిచేసింది. వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళుతున్న కవి ఆ కుర్రాడి స్థితిచూసి ఆశ్చర్యపోయాడు.
“ఏమయింది?”
“సార్!”
“ఏమిటలా స్తంభంలాగ నిలబడిపోయావు!”
మారియో తల తిప్పి కవి కళ్లలోకి చూశాడు.
“మేకు కొట్టినట్టుగా.”
“కాదు కాదు, కదలలేని పక్షి లాగ.”
“పింగాణీ పిల్లి కన్న నిశ్శబ్దంగా.”
నెరూడా గేటు గొళ్లెం తీసి పట్టుకుని, గడ్డం రుద్దుకుంటూ, “మారియో హిమేనెజ్, నేను ఎలిమెంటల్ ఓడ్స్ కన్న మంచి పుస్తకాలు రాశాను. ఇప్పుడు నువ్వు ఆ పాత పుస్తకం నుంచి ఉపమానాలు, అలంకారాలు నాకు వినిపించడం బాగులేదు.”
“సార్?”
“అలంకారాలు అన్నాను, ఏం?”
“అంటే ఏమిటి?”
కవి ప్రేమగా ఆ కుర్రవాడి భుజం మీద చెయ్యి వేశాడు.
“అంత కచ్చితంగా చెప్పలేననుకో, కాని అలంకారం అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెప్పడం.”
“ఒక ఉదాహరణ చెప్పండి.”
నెరూడా తన చేతిగడియారం వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచాడు.
“సరే, ఆకాశం ఏడుస్తోంది అన్నామనుకో, ఏమిటన్నమాట?”
“ఓ, వానపడుతోంది అని అర్థం.”
“అంటే అది అలంకారం అన్నమాట.”
“మరి, మరి, అది అంత సులభమైన విషయమైతే అంత గొట్టుపేరు ఎందుకుంది దానికి?”
“ఎందుకంటే, ఆయా వస్తువులకు మనం పెట్టుకున్న పేర్లకూ ఆ వస్తువుల సాదాతనానికో, సంక్లిష్టతకో ఏమీ సంబంధంలేదు. నీ లెక్క ప్రకారమైతే మన చుట్టూ రోజూ ఎగిరే అతిమామూలు రెక్కలపురుగుకు సీతాకోకచిలుక లాంటి పేరు ఉండగూడదు. మరి ఏనుగుకు సీతాకోకచిలుకకన్న మామూలు చిన్న పేరే ఉందిగదా. అదేమో చాల పెద్దది, ఎగరనూలేదు కదా” అని ముగించాడు. ఒక్క ఉదుటున చెప్పేసరికి కవి గసపోశాడు. ఇక మిగిలిన శక్తితో, వెళ్ళిపోవచ్చునన్నట్టు మారియో వైపు చూశాడు.
మారియోకు నెరూడా ఏమి చెప్పదలచుకున్నాడో అర్థమయింది. “వారెవ్వా, నాకూ కవి కావాలని ఉంది” అన్నాడు.
“తెలుసా, చిలీలో ప్రతివాడూ కవే! కవి కానిదెవడులే? అయినా పోస్ట్ మన్ ఉద్యోగమంటే కవిత్వం వస్తుందన్నమాటే. ఒక్కటే తేడా, నీకు నడక ఎక్కువగా ఉంటుంది. అంత తొందరగా లావెక్కవు. చిలీలో మా కవులందరికీ బాన పొట్టలున్నాయి.”

మళ్లీ నెరూడా గొళ్లెం చేతుల్లో పట్టుకుని లోపలికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. మారియో మాత్రం ఎక్కడో కనబడకుండా ఎగురుతున్న పక్షిని చూస్తూ, “నేనే గనుక కవినయితే, నా ఇష్టం వచ్చినదంతా చెప్పగలిగేవాణ్ని” అన్నాడు.
“ఏమిటది? నీకు ఇష్టమైనదేమిటి?”
“అబ్బ, అదేగదా అసలు సమస్య! నేను కవిని కాను గనుక అదీ చెప్పలేను.”
కవి కనుబొమలు ముడిపడ్డాయి.
“మారియో…”
“చెప్పండి సార్?”
“నేనిక నీకు వీడ్కోలు చెప్పేసి తలుపు మూసెయ్యబోతున్నాను.”
“సరే సార్.”
“మళ్లీ రేపు కలుద్దాం.”
“సరే సార్. రేపు కలుద్దాం.”
నెరూడా మిగిలిన ఉత్తరాలవైపు చూశాడు. తర్వాత గేటులోంచి అవతలికి తొంగిచూశాడు. పోస్ట్ మన్ ఇంకా అక్కడే చేతులు కట్టుకుని నిలబడి మేఘాల వైపు దీక్షగా చూస్తున్నాడు. కవి మళ్లీ అటు నడిచి మారియో భుజం తట్టాడు.
“నువ్వింకా ఇక్కడే నిలబడి ఉన్నావేమోనని అనుమానం వచ్చి చూశాను.”
“ఏదో ఆలోచనలో పడ్డాను సార్.”
నెరూడా పోస్ట్ మన్ మోచేతిని గట్టిగా పట్టుకుని దాదాపు నడిపిస్తూ వీథిలోని దీపస్తంభందాకా తీసుకొచ్చాడు. మారియో సైకిల్ అక్కడే ఉంది.
“అక్కడ అట్లా నిలబడితే ఆలోచనలు వస్తాయనుకుంటున్నావా ఏం? నువ్వు నిజంగా కవివి కాదలచుకుంటే నడుస్తున్నప్పుడు కూడ ఆలోచించగలగాలి. నడిచేటప్పుడు ఇంకే పనీ చేయలేవా? ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, సముద్రతీరందాకా వెళ్లి, తీరం వెంట నడుస్తూ అలల కదలికల్ని చూస్తూ, అలంకారాలు కనిపెడతావు.”
“ఒక ఉదాహరణ చెప్పండి.”
“ఈ కవిత విను: ‘ఇదిగో ఈ ద్వీపం మీద, ఈ సముద్రం, ఎంత పెద్ద సముద్రం. క్షణక్షణానికీ ముంచుకువచ్చే సముద్రం. ఔనంటున్న సముద్రం. కాదంటున్న సముద్రం. ఔనని మళ్లీ కాదంటున్న సముద్రం. ఔనౌనంటున్న సముద్రం. నీలంలో, నురుగులో, దూకుడులో ఔనంటున్న సముద్రం. మళ్లీ కాదంటున్న సముద్రం, కానే కాదంటున్న సముద్రం. ఒక్కక్షణం కూడ ఆగని సముద్రం. నా పేరు కడలి అని హోరెత్తుతోంది. పదేపదే ఘోషిస్తోంది. తీరమీది బండరాళ్లను గుద్దుకుని మరీ ఆ మాట చెపుతోంది. ఆ బండరాయి మాత్రం ఎంతకూ నమ్మదు. అప్పుడిక సముద్రం తన ఏడు ఆకుపచ్చని సముద్రాల, ఏడు ఆకుపచ్చని పులుల, ఏడు ఆకుపచ్చని నాలుకలు తెరిచి, రాతిని కావలించుకుంటుంది, ముద్దాడుతుంది. తడిపేస్తుంది. బండరాతిగుండెలమీద గుద్దుతుంది. తనపేరు పదేపదే వినిపిస్తుంది….”
గొప్ప సంతృప్తి కలిగినట్టుగా కవి ఆగిపోయాడు. “ఏమంటావు?” అని అడిగాడు.
“అది భయం గొలుపుతోంది.”
“భయం గొలుపుతోందా? చూడబోతే నువ్వు కర్కశ విమర్శకుడిలాగున్నావే!”
“లేదు సార్. కవిత భయం గొలపడం కాదు. మీరది చదువుతుంటే నాకు భయం కలిగిందంటున్నాను.”
“నా పిచ్చి మారియో. నువ్వు ఏమనుకుంటున్నావో అది కచ్చితంగా చెప్పడం ఎట్లాగో నేర్చుకోవాలి. సరే, ఈ ఉదయం మొత్తాన్నీ నీతోనే గడిపేంత వ్యవధి లేదు నాకు…”
“మీకెలా చెప్పను? మీరా కవిత చదువుతుంటే ఆ మాటలు అలల్లా ఇటూ అటూ కదిలిపోయాయి.”
“అంటే, సముద్రం లాగనేనన్నమాట.”
“అవును, అచ్చంగా సముద్రపుటలల్లాగే.”
“దాన్ని అంతర్లయ అంటారు.”
“నాకెందుకు భయం వేసిందంటే ఆ తూగుకు కళ్లు తిరిగినట్టయ్యాయి.”
“ఓహ్, తల తిరిగిందా?”
“అవును. నా వరకు నాకు మీ మాటలమీద ఊగులాడుతున్న పడవనేమో అనిపించింది.”
కవి మెల్లగా కనుబొమ్మలెత్తి చూశాడు.
“నా మాటల మీద ఊగులాడుతున్న పడవలాగనా?”
“అ..అ..వును.”
“మారియో, ఇప్పుడు నువ్వేంచేశావో నీకు తెలుసా?”
“ఉహు, ఏం చేశాను?”
“ఒక అలంకారాన్ని కనిపెట్టావు.”
“కాని అది పెద్ద లెక్కలోకి రాదు. ఎందుకంటే అది అనుకోకుండా వచ్చింది. అంతే.”
“బిడ్డా, అన్ని పదచిత్రాలూ అనుకోకుండానే వస్తాయి.”
మారియో గుండె ఎంత వేగంగా గబగబా కొట్టుకుందంటే, గుండెలమీద చెయ్యిపెట్టుకుని ఎగసిపడుతున్న గుండెని ఆపుకోవలసి వచ్చింది. అప్పటికప్పుడు తన ఛాతీ పగిలిపోయి గుండె బయటపడుతుందేమో అనిపించింది. అతి కష్టం మీద తనను తాను అదుపులోకి తెచ్చుకున్నాడు. అనుకోకుండానే తన చూపుడువేలు చాచి కవి ముఖంమీద ఊపుతూ, “అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కటీ, అంటే, నా అర్థం, గాలి లాగ, సముద్రం లాగ, చెట్ల లాగ, కొండల లాగ, మంటలాగ, జంతువుల లాగ, ఇళ్ల లాగ, ఎడారుల లాగ, వాన లాగ…”
“నువ్వా జాబితా చదవనక్కరలేదు, వగైరా అనవచ్చు.”
“…సరే, వగైరా వగైరాలలాగ…ప్రపంచంలోని ప్రతి ఒక్కటీ మరొకదానికి పోలికేనంటారా, ఉపమానమేనంటారా?”
నెరూడా నోరు అలా తెరుచుకునే ఉండిపోయింది. బొద్దయిన ఆ గడ్డం ఆ ముఖం నుంచి కిందికి జారి పడిపోతుందేమోననిపించింది.
“నేనేమయినా అడగగూడని పిచ్చి ప్రశ్న అడిగానా?”
“లేదు, మిత్రమా లేదు.”
“మరి మీ ముఖం మీద అటువంటి విచిత్రమైన భావం కదలాడిందేం?”
“లేదు లేదు, నేను ఆలోచనలో పడ్డానంతే.”
కవి తన కళ్లముందర చెయ్యి ఊపి అక్కడ కనబడకుండా పేరుకుపోయిన మసకను తుడిచినట్టు తుడిచేశాడు. జారిపోతున్న తన పంట్లాంను పైకి లాక్కున్నాడు. ఆ కుర్రవాడి గుండెలమీద తర్జని గుచ్చి, “బిడ్డా, మారియో, మనం ఒక ఒప్పందానికి వద్దాం. నేనిక మా వంటింట్లోకి వెళతాను. తల పగిలిపోతోంది, ఏదన్నా తినాలి. ఆ తర్వాత నువ్వడిగిన ప్రశ్న గురించి ఆలోచన మొదలుపెడతాను. రేపు రా, నీకు సమాధానం చెపుతాను.”
“సార్, నిజంగానేనా?”
“ఔను నిజంగానే, ఇప్పటికిక సెలవు. రేపు కలుద్దాం.”
నెరూడా తన ఇంట్లోకి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు. గేటు మూసేసి, మళ్లీ దానికి ఆనుకుని నిలబడ్డాడు. జాగ్రత్తగా తన చేతులు కట్టుకున్నాడు.
“ఏం, మీరు లోపలికి వెళ్లడం లేదా?” అని అడిగాడు మారియో.
“ఉహు. ఈసారి నువ్వు వెళ్లిపోయేదాకా అలాగే వేచి ఉందామనుకుంటున్నాను.”
పోస్ట్ మన్ తన సైకిల్ తీసుకున్నాడు. గొప్ప సంతోషంతో సైకిల్ గంట గణగణమనిపించాడు. కవినీ, ఆ కవి చుట్టూఉన్న పరిసరాలనన్నిటినీ ముంచెత్తే విశాలమైన చిరునవ్వు నవ్వాడు. “సరే, కలుద్దాం సార్” అని ఒక పెద్ద అరుపు అరిచాడు.
“సరే కలుద్దాం బిడ్డా.”
* * *
కవి చెప్పిన మాటలను పోస్ట్ మాన్ మారియో హిమేనెజ్ అక్షరాలా ఉన్నది ఉన్నట్టుగా నమ్మాడు. సముద్రతీరంమీద తన పల్లెకు నడిచివెళ్తూ సముద్రం ఆటుపోట్లను అతి జాగ్రత్తగా గమనించాడు. అక్కడ అనంతకోటి కెరటాలు కనబడినప్పటికీ, అత్యద్భుతమైన పట్టపగటివేళ, విలాసవంతమైన ఆ ఇసుకలో, చల్లని తాజా గాలి వీస్తుండగా కూడ మారియో ఒక్క అలంకారాన్నీ తయారు చేయలేకపోయాడు. ఆ సముద్రం అతి గంభీరంగా సాగించిన ఘోషకు నిశ్శబ్దమే ప్రతిధ్వని అయింది. మారియో లోలోపల మౌనం, విచారం ఎంత కఠినంగా గడ్డ కట్టాయంటే చివరికి అక్కడి నల్లరాతి బండలు కూడ గుంపులు గుంపులుగా ఉన్నాయని మారియోకు అనిపించింది.
ఆ ప్రకృతి నైరాశ్యంతో విసిగిపోయి, తన విచారాన్ని పోగొట్టుకోవడానికి మందు కొట్టడం ఒక్కటే పరిష్కారం అనుకున్నాడు. ఊళ్లోని పానశాలకు వెళ్లి కాస్త ద్రాక్ష సారాయం లాగిస్తే గాని ఈ విచారం వదిలేట్టు కనబడలేదు. ఒక వేళ అక్కడ అదృష్టం కలిసివచ్చెనా, ఎవడో ఒక కోన్ కిస్కాగాడు టాకాటాకా ఆటకు తన సవాలును అందుకోకపోడు. ఆ ఊళ్లో ఫుట్ బాల్ స్టేడియం లేదు. దాంతో ఆ ఊరి యువకులకు తమ క్రీడాస్ఫూర్తి నిలుపుకోవడానికి మిగిలిన ఏకైక మార్గం చిన్నబల్ల మీద ఆడే ఈ చిన్నపాటి ఫుట్ బాలే.
పానశాలకు కాస్త దూరంలో ఉండగానే పాతపాటల ధ్వనీ లోహగోళాల గణగణలూ కీచుశబ్దాలూ వినబడ్డాయి. ఆ పాట రాజధాని నగరంలో పదేళ్లకిందనే పాతబడిపోయినా ఆ ఊళ్లో మాత్రం ఇంకా అందరినోళ్లలో నానుతూనే ఉంది. తన విచారాన్ని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా పోగొట్టుకోవాలనే ఆత్రంలో మారియో పానశాలలోకి గబగబా చొరబడ్డాడు. కవి చెప్పిన సలహాను ద్రాక్షసారాయం మీద ప్రయోగించాలనుకున్నాడు. కాని ఆ పని చేయబోయేలోపుగానే మారియోను మరొక మత్తు ముంచెత్తింది. తన జీవితంలో ఎటువంటి సారాయమూ ఇంతవరకూ అటువంటి మత్తును కలిగించలేదు.
అక్కడ టాకాటాకా బల్లమీద చిలుం పట్టిన నీలంరంగు మీటలు నొక్కుతూ కూచున్నది ఒక అందమైన యువతి. మారియో ఇంతవరకూ చూసిన నటీమణులందరికన్న, నాట్యగత్తెలందరికన్న, శిరోజాలంకరణకారులందరికన్న, యాత్రికులందరికన్న, పాటల రికార్డులమ్మే దుకాణదారులందరికన్న అందమైనదా యువతి. అమ్మాయిలకోసం మారియో ఎంత తపన పడతాడో అంతే భయస్తుడు కూడ. ఆ పిరికితనం వల్ల మారియో ఎన్నోసార్లు తనను తాను పిచ్చి కోపంతో తిట్టుకున్నాడు. ఆరోజు మాత్రం నిద్రలో నడుస్తున్నవాడిలాగా టాకాటాకా బల్ల దగ్గరికి నడిచాడు. ఎరుపు బంతుల గోల్ వెనుక నిలబడి తన ఉద్రేకాన్ని అణచుకోవడానికి చాల ప్రయత్నించాడు. విప్పారిన తన కళ్లను బంతుల మీదనే నిలపడానికి చాల ప్రయత్నించాడు. కాని అదంతా ఎందుకూ పనికిరాలేదు. ఆ అమ్మాయి అక్కడ గోల్స్ నమోదుచేసే లోహపు పలక మీద ఒక గోల్ నమోదు చేసేటప్పుడు మారియో నేరుగా ఆమె కళ్లలోకి చూశాడు. ఆమెను లొంగదీసుకునే చిరునవ్వునొకదాన్ని తనకు వీలయినంత వశీకరణ విద్యతో ఆమె మీద గుమ్మరించాడు. దానికి ప్రతిగా అమె అవతలి పక్షం వైపు నిలబడమని అడిగింది. అప్పుడుగాని మారియోకు అది ఒక ఆట అని, అందులో ఆమెకు ఒక ప్రత్యర్థి ఉంటాడని, అవతలివైపు ఆడతాడని తెలిసిరాలేదు. మారియో జీవితంలో తన గుండె చప్పుడు తనకే వినిపించిన అతి తక్కువ సందర్భాలలో అది ఒకటి. నరాల్లో నెత్తురు ఎంత వేగంగా ప్రవహించిందంటే, ఆ రక్తప్రవాహాన్ని అదుపులోకి తేవడానికి తన గుండె మీద అరచెయ్యిపెట్టి ఒత్తుకున్నాడు. ఆ అమ్మాయి ఒక పక్కన ఉన్న తెల్ల బంతిని కొట్టేసి దాన్ని అవతలివాళ్ల గోల్ లోకి జరుపుతున్నట్టు కనబడింది. మారియో అతి మెళకువగా ఆడి ఆమె ముందర తన నైపుణ్యం ప్రదర్శించాలనుకున్నాడుగాని, ఆ అమ్మాయి ఆ బంతిని ఎత్తి తన పళ్ల మధ్య ఇరికించుకుంది. ఆ బంతి అక్కడ మెరిసిపోయింది. నోట్లో బంతితో ఆమె తన ఛాతీ విరిచింది. అక్కడ ఆమెకు తగిన కొలతల కంటె కనీసం రెండు అంగుళాలు చిన్న జాకెట్ ఉంది. అది ఆమె బలిష్టమైన రొమ్ములను ఎంతమాత్రం దాచలేకపోతోంది. రొమ్ము విరిచి ‘కావాలంటే నా నోటినుంచి ఆ బంతి తీసుకో’ అన్నట్టు చూసిందామె. ఆ హావభావాలతో మారియోకు అవమానమూ కలిగింది, మైమరపూ కలిగింది. వణుకుతున్న కుడిచెయ్యి ఎత్తి ఆ బంతి లాగబోయాడు. సరిగ్గా ఆ వేళ్లు బంతిని ముట్టుకోబోయే సమయానికి ఆ అమ్మాయి చివాలున పక్కకు ఒంగింది. మారియో చేతికి ఏమీ అందలేదు. ఆ అమ్మాయి ముఖం మీద ఒక వెటకారపు నవ్వు. మారియో అక్కడే నిలబడి ఉన్నాడు. ఎవరికో అభివాదం తెలుపుతున్నట్టుగా చెయ్యెత్తి, వేళ్లు తెరిచి నిలబడి ఉన్నాడు. ఆ చేతిలో ఒక గ్లాసూ లేదు, షాంపేనూ లేదు. ఆ అభివాదం కూడ సఫలంకాని ప్రేమకు అభివాదం లాగ ఉంది. వినబడుతున్న పాటకంటె ఎక్కువ రెచ్చగొట్టేలా శరీరాన్నీ కాళ్లనూ ఊపుతూ ఆమె పానశాల లోపలికి పరుగెత్తింది. తన ముఖం ఎర్రబడిందనీ, చెమటతో తడిసిపోయిందనీ గుర్తించడానికి మారియోకు అద్దం అవసరమే లేకపోయింది. మరొక అమ్మాయి ఆ స్థానంలోకి వచ్చి బంతి విసురుగా కొట్టి మారియోను తన మైమరపులోంచి మేల్కొలిపింది. పోస్ట్ మన్ నిర్లిప్తంగా తన కొత్త ప్రత్యర్థి ముఖంలోకి చూశాడు. ఉపమానాలనూ అలంకారాలనూ కనిపెట్టడంలో తనకు ఎంతమాత్రమూ శక్తిలేదని కొద్ది గంటలకిందనే పసిఫిక్ మహాసముద్రం ముందర చేసిన ప్రకటనను మరిచిపోయి, ఈ మామూలు పల్లెటూరి పిల్లతో ఆడడం తన సొంత చెల్లెలితో కలిసి నాట్యం చేయడం కన్న తక్కువ ఉత్సాహభరితంగా ఉంటుందనీ, ఫుట్ బాల్ ఆడకుండా గడిచిన ఆదివారం మధ్యాహ్నం కన్న ఎక్కువ విసుగ్గా ఉంటుందనీ, నత్తల పరుగుపందెంతో సమానమైన ఉత్తేజాన్ని కలిగిస్తుందనీ చెప్పుకున్నాడు.
వెళిపోతున్నానని ఒక తల ఆడింపు అయినా లేకుండానే, తన ప్రేయసి అడుగుజాడలను పట్టుకుని పానశాలలోకి నడిచాడు. అక్కడ ఒక కుర్చీలో కూలబడ్డాడు. ఆ పానశాలను ఒక నాటకశాలలాగ భావించాడు. ఆ అమ్మాయి అక్కడ పెద్దపెద్ద మధు పాత్రలలోకి గాలి ఊదుతూ, ఒక పెద్ద లిలీ పూల గుడ్డతో ఆ పాత్రలమీద మరకలూ మచ్చలూ పోయేట్టు
లిలీ పూల గుడ్డతో ఆ పాత్రలమీద మరకలూ మచ్చలూ పోయేట్టు తుడుస్తుండగా సుదీర్ఘంగా చూస్తూ ఉండిపోయాడు.
టెలిగ్రాఫ్ ఆపరేటర్ కోస్మెకు రెండు సూత్రాలు చాల ఇష్టమైనవి.
వాటిలో ఒకటి సోషలిజం. దాని గురించి ఆయన తన దగ్గర పనిచేసేవారి బుర్రలు తింటుండేవాడు. వాళ్లందరూ అప్పటికే ఆ సిద్ధాంతానికి సానుభూతిపరులో, కార్యకర్తలో అయినా సరే.
రెండో సంగతేమో పోస్టాఫీసులోపల పోస్టాఫీసు టోపీ పెట్టుకోవడం. పోస్టాఫీసు ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆ టోపీ పెట్టుకు తీరాలని ఆయన సిద్ధాంతం. మారియో వెంట్రుకలు ఉంగరాలు తిరిగి, చెదిరిపోయి గాలిలో అటూ ఇటూ ఎగురుతూ వాటి శ్రామికవర్గ స్ఫూర్తిలో బీటిల్స్ ను తలదన్నేలా ఉన్నా కూడ కోస్మె క్షమించాడు. సైకిల్ చెయిన్ లో పడి మారియో నీలంరంగు జీన్స్ పాంటుకు ఆయిల్ మరకలు అయినా కూడ కోస్మె క్షమించాడు. మారియో రోజూ వేసుకొచ్చే జాకెట్ రంగు మాసి వెలిసిపోయినా ‘సరేలే’ అనుకున్నాడు. మారియో ఎప్పుడూ ముక్కులో చిటికెనవేలు దూర్చి గెలుక్కుంటున్నా సరే పోనీలే అనుకున్నాడు. కాని మారియో నెత్తిమీద టోపీ లేకుండా చూస్తే మాత్రం కోస్మె రక్తం మరిగిపోయేది.
ఆ రోజు కూడ ఆ బక్కపలుచని పోస్ట్ మాన్ లోపలికి వచ్చి ఒక బలహీనపు గుడ్ మార్నింగ్ చెప్పి ఉత్తరాలు వేరుచేసుకునే బల్ల దగ్గరికి వెళ్లబోతుండగా కోస్మె అతణ్ని మధ్యలోనే ఆపేశాడు. చూపుడువేలు నిటారుగా చేసి మారియో మెడమీద గుచ్చాడు. అలాగే తోసుకుంటూ టోపీల కొయ్య దగ్గరికి నడిపించుకుపోయాడు. అక్కడ ఒక టోపీ తీసి దాన్ని మారియో తల మీద పెట్టి చెవుల కింది దాకా లాగాడు. అప్పుడు గానీ మారియోకు పూర్తిగా సక్రమంగా అభివాదం చెప్పే అవకాశం ఇవ్వలేదు.
“గుడ్ మార్నింగ్ బాస్.”
“గుడ్ మార్నింగ్” అంటూ కోస్మె చిరచిరలాడాడు.
“కవిగారికి ఏమన్నా ఉత్తరాలు ఉన్నాయా?”
“ఓ, బోలెడు. ఒక టెలిగ్రాం కూడ ఉంది.”
“టెలిగ్రామా!”
మారియో గబాలున ఆ టెలిగ్రాం లాక్కున్నాడు. దాన్ని వెలుగులో పెట్టి దాంట్లో ఉన్న విషయాలు చదవడానికి ప్రయత్నించాడు. ఒక్క గంతులో బయటికి దూకి సైకిల్ ఎక్కేశాడు.
“మిగిలిన ఉత్తరాలు తీసుకోవడం మరిచిపోయావు” అని గుమ్మంలోంచి కోస్మె అరుస్తుండగానే మారియో సైకిల్ ముందుకు కదిలిపోయింది.
“మళ్లీ వచ్చి తీసుకెళ్తా” అంటూ వెళ్తూ వెళ్తూనే ఒక్క అరుపు అరిచాడు.
“నువ్వొక పనికిమాలినవాడివి. మళ్లీ ఉత్తరాలకోసం ఇంకోసారి వెళతావా?” అని కోస్మె కూడ అరిచాడు.
“నేనేమీ పనికిమాలినవాడిని కాదు బాస్. అలా అయితే కవిని రెండుసార్లు చూడగలుగుతానుగా” అన్నాడు మారియో.
నెరూడా వాళ్ల ఇంటి గేటు దగ్గర, మామూలు మర్యాద ప్రకారం ఎవరయినా ఎంతసేపు కొట్టడానికి అవకాశం ఉందో అంతకంటే చాల ఎక్కువసేపు గంట మోగించాడు మారియో. అలా మూడు నిమిషాలపాటు ఆగకుండా గంట వాయించినా కవి బయటికి రాలేదు. ఇక మారియో తన సైకిలును అక్కడ ఒక దీపస్తంభానికి ఆనించి నిలబెట్టి, ఒక్కుమ్మడిగా శక్తి తెచ్చుకుని సముద్రతీరం మీద రాళ్ల దగ్గరికి పరుగెత్తాడు. అక్కడ నెరూడా కనబడ్డాడు. చేతులూ కాళ్లూ ఇసుకలో కప్పుకుని కూచున్నాడు నెరూడా.
“వారెవ్వా, ఏమదృష్టం” అంటూ రాళ్ల మీంచి దూకుతూ, “టెలిగ్రాం” అని అరిచాడు మారియో.
“ఇవాళ పొద్దున్నే లేచినట్టున్నావు బిడ్డా” అన్నాడు కవి.
మారియో కవి పక్కనచేరి నిండా పది క్షణాలపాటు గసపోసి ఊపిరి తీసుకుని “ఏం ఫర్వాలేదు, నాకు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది, అది చాలు” అన్నాడు.
“అదేదో చాల ముఖ్యమైన విషయంలాగుంది. నువ్వు గుర్రం లాగ గసపోస్తూవచ్చావు.”
మారియో నుదుటిమీద పేరుకున్న చెమటను తన చేతితో తుడిచేసుకున్నాడు. టెలిగ్రామ్ మీది తడిని తన కాళ్లకు తుడుచుకున్నాడు. టెలిగ్రాం ను కవి చేతుల్లో పెట్టాడు.
“పాబ్లో గారూ” అని గంభీరంగా మొదలుపెట్టి “నేను ప్రేమలో పడ్డాను” అన్నాడు.
కవి తన చేతిలోని టెలిగ్రాం విసనకర్రేమో అన్నట్టుగా గడ్డం ముందర విసురుకున్నాడు.
“అయ్యో, అయ్యో. అదేమంత పెద్ద విషయం కాదు. దానికి మందు ఉంది” అన్నాడు.
“మందేమిటి? పాబ్లో గారూ, ఒకవేళ ఇది జబ్బు అయి, దీనికి మందు ఉండేట్టయితే, నాకు ఆ జబ్బు రావాలనే కోరుకుంటున్నా. నేను ప్రేమలో పడ్డాను. నేను తలమునకలుగా ప్రేమలో ఉన్నాను.”
జవాబుగా కవి అన్న రెండుమాటలూ కవి నోటినుంచి రాలిపడ్డ రెండు పెద్ద బండరాళ్లలాగ మారియోను తాకాయి.
“ఎవరి మీద పడ్డావు?”
“పాబ్లో గారూ!”
“బిడ్డా ఎవరితో పడ్డావు” అని అడుగుతున్నా.
“ఆమె పేరు బీట్రిజ్.”
“ఓహ్, డాంటే.”
“ఏమిటండీ?”
“ఒకానొక కాలంలో డాంటే అని ఒక కవి ఉండేవాడు. ఆయన బీట్రిజ్ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. బహుశా బీట్రిజ్ అనే పేరుగల అమ్మాయిలు అంతులేని ప్రేమను ప్రేరేపించేట్టున్నారు.”
పోస్ట్ మాన్ తన జేబులోంచి పెన్ను తీసి ఎడమ అరచేతి మీద రాసుకోవడం మొదలుపెట్టాడు.
“ఏం చేస్తున్నావు?”
“మీరు చెప్పిన ఆ కవి పేరు రాసుకుంటున్నా – డాంటే?”
“డాంటే అలిఘియెరి.”
“హలిఘియెరి నా?” “కాదు బిడ్డా, అది అ తో మొదలవుతుంది.”
“అ అంటే అడవి లాగనా?”
“అవును, అ అడవి లాగ, ఇ ఇల్లు లాగ.”
“పాబ్లో గారూ?”
కవి తన ఆకుపచ్చని పెన్ను బయటికి తీశాడు. ఆ కుర్రవాడి చెయ్యి బండమీద పెట్టించాడు. ఆ మహాకవి పేరు పెద్ద అక్షరాలలో రాశాడు. ఆ పని అయ్యాక తన టెలిగ్రాం విప్పబోతుండగా, మారియో ఇప్పుడు గొప్ప అదృష్టం పట్టిన ఆ అరచేతితో తన నుదుటిమీద చరుచుకుని ఒక నిట్టూర్పు విడిచాడు.
“పాబ్లో గారూ, నేను ప్రేమలో పడ్డాను.”
“నువ్వామాట నాకిదివరకే చెప్పావు. కాని ఈ విషయంలో నేనేం చేయగలను?”
“మీరు నాకు సాయం చేయాలి.”
“ఈ వయసులోనా?”
“ఆమెతో ఎట్లామాట్లాడాలో నాకు తెలియడంలేదు గనుక మీరే నాకు సాయపడాలి. ఆమె నా కళ్లముందర ఉందంటే నాకు మాటలే రావు, మూగవాణ్నయిపోతాను. ఒక్క అక్షరం పెదవి దాటితే ఒట్టు.”
“ఏమిటీ? నువ్వింతవరకూ ఆమెతో మాట్లాడనే లేదా?”
“ఉహు, అసలేమీ మాట్లాడలేదు. నిన్న మీరు చెప్పినట్టుగా నేను చాలసేపు సముద్రతీరం వెంట నడిచాను. చాలసేపు సముద్రాన్ని చూశాను. కాని నాకు ఒక్క అలంకారం కూడ తట్టలేదు. ఆతర్వాత సారాకొట్టుకు వెళ్లాను. ఒక ద్రాక్షాసవం సీసా కొనుక్కున్నాను. ఆ సీసా నేను ఆమె దగ్గరే కొనుక్కున్నాను.”
“బీట్రిజ్ దగ్గరా?”
“అవును, బీట్రిజ్ దగ్గరే. నేనక్కడే నిలబడి ఆమెను బాగా చూశాను. అంతే. నేనిక ఆమెతో ప్రేమలో పడిపోయాను.”
“అంత తొందరగానా?”
“ఉహు, అంత తొందరగా ఏమీ కాదు. దాదాపు పది నిమిషాలు ఆమెను తేరిపార జూశాను.”
“ఓహో అలాగా, ఆ తర్వాత ఆమె ఏం చేసింది?”
“ఏం చూస్తున్నావు అట్లా? నామొఖంలో ఏమన్నా కోతులాడుతున్నాయా ఏంటి” అందామె.
“మరి నువ్వేమన్నావు?”
“ఏమనాలో నాకేమీ తోచలేదు.”
“ఏమీ అనలేదా? ఒక్కమాట కూడా?”
“అహ అలా కాదు, అంత ఘోరం కాదు లెండి. నేను ఐదు మాటలు పలికాను తెలుసా?”
“ఏమిటవి?”
“మీ…..పేరు…..ఏమిటి?”
“మరి ఆమె ఏమని జవాబిచ్చింది?”
“బీట్రిజ్ గోన్జాలెజ్ అందామె.”
“అవునూ నువ్వామెను మీ పేరు ఏమిటి అని అడిగావు, మూడే పదాలు కదా, ఐదు పదాలు అన్నావే? మిగిలిన రెండు పదాలు ఎమిటి?”
“బీట్రిజ్ గోన్జాలెజ్.”
“బీట్రిజ్ గోన్జాలెజ్?”
“ఆమె బీట్రిజ్ గోన్జాలెజ్ అని చెప్పిందిగా, నేను ఆ రెండు పదాలూ మళ్లీ అన్నానన్నమాట.”
“బిడ్డా, విను. నువ్వేమో నాకు ఒక అత్యవసరమైన టెలిగ్రాం తెచ్చావు. ఇంకా మనం బీట్రిజ్ గోన్జాలెజ్ గురించే మాట్లాడుతూ ఉంటే, నా చేతుల్లో ఈ సందేశం మురిగిపోతుంది.”
“సరే, సరే, దాన్ని తెరిచి చూడండి.”
“ఎవరికి వచ్చిన జాబులయినా వాళ్ల వ్యక్తిగతమైనవని పోస్ట్ మాన్ గా నీకు తెలిసే ఉండాలే.”
“మరి నేను మీ ఉత్తరాలెప్పుడూ విప్పి చూడలేదు గదా.”
“నువ్వు అలా విప్పావని నేననడం లేదు. నేననేదల్లా ఎవరికయినా వాళ్ల ఉత్తరాలు ప్రశాంతంగా, ఏకాంతంగా చదువుకునే అవకాశం, హక్కు ఉండాలని మాత్రమే. ఆ పని చేసేటప్పుడు సాక్షులూ గూఢచారులూ ఉండగూడదని మాత్రమే.”
“నాకు అర్థమైంది పాబ్లోగారూ.”
“సంతోషం.”
ఒకవైపు ఉద్వేగంతో మరొకవైపు చెమటతో తడిసిముద్దవుతూ నిరాశనిండిన గొంతుతో “సరే, కవిగారూ మళ్లీ వస్తాను” అన్నాడు.
“సరే మారియో, మళ్లీ కలుద్దాం.”
ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఔదార్యపు ముక్తాయింపు ఇద్దామనుకున్న కవి మామూలుకన్న పెద్ద నోటు ఒకటి తీసి మారియో చేతుల్లో పెట్టాడు. కాని మారియో ఆ నోటువేపు మరింత ఎక్కువ ఆందోళనగా చూసి, దాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేస్తూ, “ఒకవేళ మీకు అది అంత ఇబ్బంది కాకపోతే, నాకు ఆ డబ్బులు ఇచ్చే బదులు నాకోసం ఆ అమ్మాయి మీద ఒక చిన్న కవిత రాసి ఇస్తే ఎక్కువ సంతోషిస్తాను” అన్నాడు.
నెరూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా పరుగులు పెట్టలేదు. కాని ఇప్పుడు హఠాత్తుగా తనను తాను ఈ ప్రకృతినుంచి విముక్తి చేసుకుని ఈ సముద్ర తీరం వదిలి వలస పక్షిలాగ ఎంత వేగంగా వీలయితే అంత వేగంగా పరుగెత్తిపోగలిగితే ఎంత బాగుండు అని గాఢంగా అనుకున్నాడు. వయసునూ, ఆరోగ్య స్థితినీ దృష్టిలో పెట్టుకుంటే అలా ఎగరలేనని తెలుసుకున్న నిరాశలో గాలిలోకి చేతులు ఎగరేశాడు. “కాని నాకసలు ఆమె తెలియను గూడ తెలియదుగా. ఒక కవి ఎవరినుంచయినా ప్రేరణ పొందాలంటే కనీసం వారిగురించి తెలిసి ఉండాలిగదా. ఏమీలేని శూన్యం నుంచి నేనెలా సృష్టించగలను” అన్నాడు.
“చూడండి. ఒక సాదాసీదా కవిత కోసం మీరు ఇంత గందరగోళం చేస్తున్నారంటే మీకసలు నోబెల్ బహుమతి రానేరాదు” అన్నాడు పోస్ట్ మాన్.
నెరూడాకు ఊపిరి ఆగినట్టయి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.
“మారియో, దయచేసి ఒక్కసారి నన్ను గిల్లవా, ఈ పగటికల నుంచి నన్ను మేల్కొల్పవా?”
“సరే, పాబ్లో గారూ, నేనామెకు ఏం చెప్పను? ఈ మహాపట్టణంలో నాకు సహాయం చేయగలిగినది మీరొక్కరే. మిగిలిన వాళ్లంతా ఏమి మాట్లాడాలో ఏమీ తెలియని పల్లెకారులు.”
“కాని ఆ పల్లెకారులు కూడ ఎప్పుడో ఒకప్పుడు తమకు నచ్చిన అమ్మాయిలతో ప్రేమలో పడేఉంటారు. ఏదో అనే ఉంటారు గదా.”
“ఆ, ఏమిట్లెండి, ఏవో చేపల కతలు చెప్పి ఉంటారు!”
“మరి ఆ అమ్మాయిలు వాళ్ల వెంటపడ్డారుగదా, చివరికి పెళ్లి కూడ చేసుకున్నారు గదా. అవునూ మీ నాన్న ఏం చేస్తాడు?”
“ఆయన కూడ చేపలు పడతాడు.”
“అదిగో, తెలిసిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఆయన మీ అమ్మతో ఏదో మాట్లాడే ఉంటాడుగదా, ఆమెను పెళ్లికి ఒప్పించి ఉంటాడుగదా.”
“పాబ్లో గారూ, అదేమంత మంచి పోలిక కాదు. ఎందుకంటే బీట్రిజ్ మా అమ్మకన్న ఎంతో అందంగా ఉంటుంది.”
“మారియో, నా బిడ్డా, ఇంక ఈ టెలిగ్రాంలో ఏముందో తెలుసుకోవాలనే కోరిక నన్ను ఆగనివ్వడం లేదు. దయచేసి నాకు ఆ అవకాశం ఇస్తావా?”
“ఓహ్, సంతోషంగా చదువుకోండి.”
“కృతజ్ఞతలు.”
నెరూడా ఆ టెలిగ్రాం కవర్ చించాలనుకున్నాడు. కాని ఆ తొందరలో మొత్తం టెలిగ్రామే చిరిగిపోయింది. ఉత్సుకతతో కాలి బొటనవేళ్ల మీద నిలబడి, కవి భుజాలమీంచి తొంగిచూసి టెలిగ్రాంలో ఏముందో చూడాలని మారియో ప్రయత్నించాడు.
“ఆ టెలిగ్రాం స్వీడన్ నుంచేనా?”
“కాదు.”
“ఈ సంవత్సరం నోబెల్ బహుమతి మీకే ఇస్తారంటారా?”
“నాకిప్పుడా చింత ఏమీ లేదు. నేనేదో పందానికి పోతున్న గుర్రాన్నయినట్టు, ప్రతిసంవత్సరం పోటీలో నా పేరు ఉండడం చూసి నాకు విసుగేస్తోంది.”
“మరి, ఈ టెలిగ్రాం ఎవరి నుంచి?”
“పార్టీ కేంద్ర కమిటీ నుంచి.”
కవి కాసింత విషాదంతో ఒక క్షణం ఆగాడు.
“బిడ్డా, కొంపదీసి ఇవాళ శుక్రవారం పదమూడో తారీఖు కాదు గదా?”
“ఏం, ఏమన్నా విషాదవార్తనా?”
“భయంకరం! వాళ్లు మనదేశానికి అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నన్ను నిర్ణయించారు!”
“కాని పాబ్లోగారూ అది భలే బాగుంటుంది గదా.”
“వాళ్లు నన్ను ఎంపిక చేయడం బానే ఉందనుకో, కాని పొరపాటున గెలిస్తే?”
“తప్పకుండా గెలుస్తారు. మీరు గెలవకపోతే మరెవరు గెలుస్తారు? మీరు ప్రతిఒక్కరికీ తెలుసు. మా నాన్న దగ్గర ఒకే ఒక్క పుస్తకం ఉంది, అది మీదే.”
“దానర్థం ఏమిటన్నమాట?”
“దానర్థం ఏమిటన్నమాట అంటే ఏమిటి? మా నాన్నకు చదువూ రాతా రాకపోయినా ఆయన తన దగ్గర మీ పుస్తకం పెట్టుకుంటున్నాడంటే మనం గెలుస్తామన్నమాటే!”
“మనం గెలుస్తామా?”
“తప్పకుండా. ఎటుపోయి ఎటువచ్చినా సరే నేనయితే మీకే వోటు వేస్తాను.”
“నువ్వు అంతగా మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు.”
ముక్కలుగా చిరిగిపోయిన టెలిగ్రాం అవశేషాలను నెరూడా మలిచి జేబులో పెట్టేసుకున్నాడు. పోస్ట్ మాన్ అక్కడ అలా నిలబడి కళ్లనిండా ఎటువంటి విచారం నిండిన వదనంతో కవి వైపు చూశాడంటే కవికి తన చిన్నప్పుడు తన స్వగ్రామంలో మంచుతెరల్లో నిలబడిన కుక్కపిల్ల గుర్తొచ్చింది.
నెరూడా చిరునవ్వు కూడ నవ్వకుండా, “సరే, ఇప్పుడు మనం బయల్దేరి సారాకొట్టు దగ్గరికి వెళ్లి నీ సుప్రసిద్ధ ప్రేయసి బీట్రిజ్ గోన్జాలెజ్ ను కలుసుకుందాం” అన్నాడు.
“పాబ్లో గారూ, నాతో హాస్యాలాడుతున్నారా?”
“లేదు, నేను చాల గంభీరంగానే చెపుతున్నాను. మనం మొదట సారాకొట్టు దగ్గరికి వెళ్దాం. ఒక చుక్క ద్రాక్షాసవం రుచిచూద్దాం. ఆ తర్వాత నీ మనసు కొల్లగొట్టిన అమ్మాయిని చూద్దాం.”
“అమ్మయ్యో, మనను కలిసి చూసిందంటే ఆమె గుండె ఆగిపోతుంది. పాబ్లో నెరూడా, మారియో హిమేనెజ్ కలిసి వాళ్ల సారాకొట్లో ద్రాక్షాసవం సేవించడమా, ఆమె గుటుక్కుమంటుంది!”
“అలా జరిగితే ఘోరమే అనుకో. అప్పుడిక నువ్వు ఆమె కోసం ప్రేమకవిత్వం కాక, సంస్మరణ గీతం రాయాల్సి వస్తుంది” అంటూ కవి బలంగా, ఉత్సాహంగా ముందుకు అడుగేశాడు. కాని మారియో వెనక కాళ్లీడుస్తూ రావడం చూసి, వెనక్కి తిరిగి, “ ఏమయింది, మారియో నీకు” అని అడిగాడు.
పోస్ట్ మాన్ పరుగెత్తి ఆయన పక్కన నిలబడి ఆయన కళ్లలోకి సూటిగా చూశాడు. “పాబ్లో గారూ, నేను బీట్రిజ్ గోన్జాలెజ్ ను గనుక పెళ్లి చేసుకునేట్టయితే, మీరు పెళ్లి పెద్దగా ఉంటారా?”
నెరూడా తన నున్నటి గడ్డాన్ని గీరుకున్నాడు. ఆ ప్రశ్నను కాసేపు తూచి చూస్తున్నట్టు నటించాడు. ఆ తర్వాత తన వేలిని నుదుటిమీద పెట్టి సాలోచనగా ఉండిపోయాడు.
“సారాకొట్లో కాస్త మందు కడుపులో పడ్డాకగానీ మనం ఈ రెండు సమస్యలమీద అంతిమనిర్ణయానికి రాలేం” అన్నాడు.
“రెండు సమస్యలేమిటి?”
“ఒకటి అధ్యక్ష ఎన్నిక సమస్య, రెండోది బీట్రిజ్ గోన్జాలెజ్ సమస్య.”
దూరం నుంచి పాబ్లో నెరూడా రావడాని సారాకొట్టులో ఉన్న ఒకేఒక్క పల్లెకారుడు చూశాడు. నెరూడా వెంట ఒక తోలు సంచీ వేసుకున్న కుర్రాడెవడో కూడ ఉన్నాడు. అది చూడగానే ఆ పల్లెకారుడు కొత్త పూటకూళ్లమ్మ చెవిన ఆ మాట వేశాడు. చూడు, చూడు ఎవరో మంచి ఖాతాదార్లు, కనీసం వారిలో సగం మంది మంచి ఖాతాదార్లు, వస్తున్నారు అని.
“అదిగో, రానే వచ్చారు.”
ఆగంతకులు లోపలికొచ్చి కూచున్నారు. సరిగ్గా ఎదురుగా సారాసీసాల బల్ల వెనుక కూచున్న పదిహేడేళ్ల అమ్మాయి వాళ్లు కూచున్న చోటికి కనబడుతోంది. ఆమె వెంట్రుకలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి. గాలికి చెదిదిపోతున్న ఆమె జుత్తు గోధుమ రంగులో ఉంది. బెల్లపురంగులో ఉన్న ఆమె కళ్లు విషాదాన్ని కనబరుస్తున్నాయి గాని చాల ఆత్మవిశ్వాసం కూడ వాటిలో ఉట్టిపడుతోంది. కనుగుడ్లు మంచి రేగుపళ్లలా ఉన్నాయి. ఆమె మెడవంపు నేరుగా కిందికి దిగి రొమ్ములమధ్య చిక్కుకుపోయింది. ఆమె వేసుకున్న తెల్ల జాకెట్టు ఆమెకు అవసరమైనదానికన్న రెండు మోతాదులు తక్కువ ఉందేమో రొమ్ములు పెద్దగా పొడుచుకొచ్చినట్టున్నాయి. ఇక చనుమొనలయితే పైన ఆచ్ఛాదన ఉన్నా లేనట్టే నిక్కబొడుచుకుని ఉన్నాయి. ఆమె నడుమా, అదయితే తెల్లవారు జాముదాకా చివరిచుక్క ద్రాక్ష సారాయం కూడ పీలుస్తూ వదలకుండా నాట్యం చేయడానికి తగినట్టుగా ఉంది.
ఆ బల్ల వెనుక నుంచి లేచి బయటికి వచ్చి ఆ కొట్లో అమె నడుస్తుంటే ఈ కొత్త ఖాతాదార్లు ఆమె దేహసౌందర్యాన్ని తనివితీరా చూశారు. అప్పటిదాకా కనబడిన ఆ నడుము కింద అది రెండు పెద్ద పిరుదులుగా విస్తరించడం కనబడింది. ఆమె వేసుకున్న పొట్టిలంగా వల్ల అవి మరింత పెద్దగా ఎగురుతున్నట్టు కనబడుతున్నాయి. చూపులు ఇంకా కిందికి దిగితే ఆమె పిక్కలు రాగిరంగులో ఉన్నాయి. అక్కడినుంచి ఆ చూపులు బొద్దుగా, పల్లెటూరివాళ్ల పాదాల లాగ, చెప్పులులేని పాదాలలోకి దిగాయి.
అలా ఆ దేహంలోని ఒక్కొక్క అవయవం మీదా మళ్లీ మళ్లీ వివరంగా ప్రయాణించిన తర్వాత చివరికి ఆ చూపులు మళ్లీ ఆ బెల్లపు రంగు కళ్లమీద ఆగిపోయాయి. ఇప్పుడు ఆ కళ్లలో విషాదం స్థానాన్ని ఒకింత కొంటెతనం ఆక్రమించింది. కొత్త ఖాతాదార్లను గుర్తించగానే ఆమె కళ్లలో భావం మారిపోయింది.
“ఓహ్, ఎవరొచ్చారో చూడండి, టాకా టాకా ఆటలో మొనగాడు!” అంటూ బీట్రిజ్ గోన్జాలెజ్ బల్లమీద జిడ్డోడుతున్న గుడ్డను తన చిటికెన వేలితో వత్తింది. “ఏం కావాలండీ మీకు?” అని అడిగింది.
మారియో కళ్లు ఆమె కళ్ల మీదనే నిలిచిపోయాయి. తాను అనుభవిస్తున్న ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అవసరమైన కనీస సమాచారాన్ని అందించమని మెదడును ఒప్పించడానికి అరనిమిషం పాటు చాల కష్టపడ్డాడు. అతనికి అప్పుడు కావలసిన సమాచారమల్లా నేనెవరు, నేనెక్కడున్నాను, ఊపిరిపీల్చడమంటే ఏమిటి, మాట్లాడడమంటే ఏమిటి అనే ప్రశ్నలకు జవాబులే.
ఆ అమ్మాయి తన ప్రశ్నను మరొకసారి వేసినా, తన పల్చని వేళ్లన్నీ కలిపి ముద్ద చేసి ఆ బల్ల మీద ఒక్క గుద్దు గుద్దినా మారియో గడ్డకట్టిన మౌనం కరగలేదు. ఇక చేసేది లేక బీట్రిజ్ గోన్జాలెజ్ తోడున్న పెద్దమనిషి వైపు తిరిగి కుతూహలంగా చూసింది. సంగీత ధ్వని లాగ గలగలలాడుతూ నాలుక మెరిపిస్తూ ఒక ప్రశ్న అడిగింది. అది అటువంటి ఏ సందర్భంలోనైనా వచ్చే మామూలు ప్రశ్నేననుకున్నాడు నెరూడా.
“మరి మీకో?”
“ఆయనకేది తెస్తే అదే” అన్నాడు కవి.
రెండు రోజుల తర్వాత ఆ ఊరు అల్లకల్లోలమయిపోయింది. ఆ కవి బొమ్మతో పోస్టర్లు అతికించిన వాహనం ఒకటి దడదడలాడుతూ ఆ ఊళ్లోకొచ్చింది. “అధ్యక్షుడిగా నెరూడాను ఎన్నుకొండి” అనే నినాదాలతో ఆ పోస్టర్లు నిండిపోయాయి. ఆ ప్రశాంత కుటీరం నుంచి ఆయనను ఆ వాహనం నగరానికి తీసుకుపోయింది.
అప్పుడు తన మనోభావాలగురించి తన దినచర్య పుస్తకంలో కవి ఇలా రాసుకున్నాడు: “నామీద రాజకీయ జీవితం ఒక పిడుగులాగ విరుచుకుపడింది. అది నన్ను నా పని నుంచి దూరం చేసింది. మహా జనసమూహమే నా మహోపాధ్యాయురాలు. కవికి సహజంగా ఉండే పిరికితనంతోనో, ఒక సిగ్గరికి ఉండే ముందు జాగ్రత్తతోనో నేను ఆ జనసమూహాన్ని చేరుతుండేవాణ్ని. కాని ఆ సమూహంలో ఒకానొక వ్యక్తిగా మారినతర్వాత నాలో ఏదో గొప్ప పరివర్తన జరిగినట్టుండేది. నేను ఒక అత్యద్భుత జనబాహుళ్యంలో భాగమయినట్టుండేది. నన్ను నేను ఒక మహామానవవృక్షానికి తొడిగిన మారాకులా భావించుకునే వాడిని.”
ఆ మహావృక్షం మీద మరొక ఆకు – బహుశా వడిలిపోయిన ఆకు – లాంటి మారియో హిమేనెజ్ కవికి వీడ్కోలు పలకడానికి వచ్చాడు. కవి ఆయనను చాల సాంప్రదాయకంగా కౌగిలించుకున్నాడు. తోలు బైండింగ్ తో అందంగా ఉన్న తన సమగ్ర రచనల సంపుటాలు రెండింటిని ఇచ్చాడు. వాటిమీద “నా ప్రియాతిప్రియమైన స్నేహితుడు, కామ్రేడ్ మారియో హిమేనెజ్ కు, పాబ్లో నెరూడా” అని రాసి ఇచ్చాడు. ఎప్పుడూ కోరుకున్నదానికన్న ఎక్కువగా అందిన ఈ సత్కారం చూసి మారియో పొంగి పోవలసిందే. కాని ఇదంతా మారియోను సుదూరంగా కూడ సంతోషపెట్టలేదు.
ఆ మట్టిరోడ్డు మీద నెరూడా వాహనం కదిలివెళ్లిపోతుంటే, అదృశ్యమవుతుంటే మారియో చూస్తూ ఉండిపోయాడు. తానప్పటికే మరణించినట్టు, ఆ వాహనం వెనుక లేస్తున్న దుమ్ము తనను ఖననం చేస్తున్నట్టు మారియోకు అనిపించింది.
కవి పట్ల ఉన్న అపారమైన విధేయతవల్ల మాత్రమే కవి ఇచ్చిన మూడువేలపేజీల కవిత్వంలో చివరి అక్షరం చదివేదాకా ఆత్మహత్య చేసుకోగూడదని శపథం తీసుకున్నాడు మారియో. గంట స్తంభం దగ్గర కూచుని మొదటి యాభై పేజీలు చదవడంలో చాల కఠినంగా తన శపథాన్ని నెరవేర్చాడు. కాని నెరూడాకు లెక్కలేనన్ని ఉపమానాలు, అలంకారాలు సృష్టించడానికి ప్రేరణనిచ్చిన ఆ సముద్రమే మారియో దృష్టిని కూడ చెదరగొట్టింది. అది ఒక మంత్రం లాగ ‘బీట్రిజ్ గోన్జాలెజ్, బీట్రిజ్ గోన్జాలెజ్’ అని హోరుహోరున అతని చెవుల్లో మారుమోగింది.
ఆ తర్వాత కొన్ని రోజులపాటు మారియో సారాకొట్టు దగ్గర తచ్చట్లాడడం మొదలుపెట్టాడు. రెండు కవితా సంపుటాలనూ తన సైకిల్ వెనుక కట్టుకున్నాడు. మహాకవి ప్రవాహసదృశ కవిత్వంలోంచి తనకు నచ్చిన ముక్కలను ఎత్తి రాసుకునేందుకు సాన్ ఆంటోనియోలో తాను కొనుక్కున్న నోట్ బుక్ గట్టిగా పట్టుకున్నాడు. చేతిలో పెన్సిల్ పట్టుకుని సముద్రం వైపు తదేకంగా చూస్తూ తీరం మీద తిరుగాడుతున్న మారియోను పల్లెకారులు చూశారు గాని ఆ నోటు బుక్కులో ఏమి రాస్తున్నాడో వారెరగరు. మారియో దానిలో నింపినవల్లా అజాగ్రత్తగా గీసిన వృత్తాలూ త్రిభుజాలూ మాత్రమే. మనసులోని అర్థంలేని ఆలోచనల్లాంటి అర్థం లేని ఆకారాలు. పాబ్లో నెరూడా ఆ ఊరినుంచి వెళ్లిపోవడంతో, ఆయనకు పోస్ట్ మాన్ గా పనిచేసిన మారియో హిమేనెజ్ కవి కావడానికి, ఆయన స్థానం కాజేయడానికి ప్రయత్నిస్తున్నాడనే పుకారు ఆఊళ్లో వ్యాపించడానికి ఎక్కువగంటలు పట్టలేదు. తన దురదృష్టపు వివరాలను మళ్లీ మళ్లీ నెమరు వేసుకోవడంలో సంపూర్ణంగా నిమగ్నమై ఉన్న మారియోకు తన చుట్టూ ఏమి జరుగుతున్నదో పట్టనేలేదు.
ఒకరోజు మధ్యాహ్నం పల్లెకారులు చేపలు అమ్ముకునే తీరంలో కూచుని మారియో ఎక్స్ ట్రావగరియో అనే నెరూడా కవితా సంకలనంలో చివరి పేజీలు చదువుకుంటున్నాడు. హఠాత్తుగా “చిలీకి ఉత్తమ అధ్యక్ష అభ్యర్థి హోర్గె అలెస్సాండ్రిని ఎన్నుకోండి, మార్క్సిజం వ్యాప్తిని అడ్డుకోండి” అని నినాదాలు వినిపించాయి. హోర్గె అలెస్సాండ్రి రోడ్రిగ్స్ ప్రభుత్వ పాలన తెలిసిన మనిషి అనే నినాదం కూడ వినిపించింది. ఒక వాహనం వచ్చి అక్కడ ఆగిపోయింది. తెల్ల దుస్తులు వేసుకున్న ఇద్దరు మనుషులు ఆ వాహనంలోంచి కిందికి దిగారు. బ్రహ్మాండంగా చిరునవ్వులు నవ్వుతూ పల్లెకారులవైపు నడిచారు. నిజానికి అంత విశాలమైన నవ్వులు ఈ ప్రాంతంలో అంతగా కనబడవు. ఎందుకంటే చాలమందికి అంతగా ప్రదర్శించడానికి పళ్లే ఉండవు. ఆ ఇద్దరిలో ఒకరు లబ్బె. ఆ ప్రాంతానికి మితవాదవర్గపు రాజకీయ నాయకుడు. గ్రామానికి విద్యుచ్ఛక్తి తెస్తాననే వాగ్దానంతో గత ఎన్నికలలో గెలిచాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చినదెలాగంటే ఆ ఊళ్లో రెండు మట్టిరోడ్ల కూడలిలో ఒక వీథిదీపం ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే. ఆ కూడలిలో ఉండే రవాణా అంతా చేపలు తీసుకుపోవడానికి వచ్చే ట్రక్కు ఒకటీ, మారియో నడిపే లెగ్నానో సైకిలు ఒకటీ, కొన్ని గాడిదలూ, కుక్కలూ, చెల్లాచెదురుగా తిరిగే కోళ్లూ మాత్రమే. వాటికోసమే ఆ వీథిదీపం.
“ఓహ్, ఇదిగో మనం ఇక్కడ అలెస్సాండ్రికి అనుకూలంగా పనిచేయాలి” అంటూ పల్లెకారులకు కరపత్రాలు పంచాడు లబ్బె.
ఎన్నో సంవత్సరాలుగా వామపక్ష రాజకీయాలను నమ్ముతున్నందువల్లా, నిరక్షరాస్యతవల్లా వచ్చే సహృదయంతో పల్లెకారులందరూ మౌనంగా ఆ కరపత్రాలు తీసుకున్నారు. తమ మాజీ అధ్యక్షుడి బొమ్మ వేపు చూశారు. ఆయన ఎప్పుడూ నిరాడంబరత్వం గురించి బోధిస్తూ ఉండేవాడు, ఆచరిస్తూ ఉండేవాడు. ఈ బొమ్మలోని ఆయన ముఖ కవళికలు కూడ సరిగ్గా ఆ బోధనలకూ ఆచరణకూ అద్దం పడుతున్నట్టు ఉన్నాయి. పల్లెకారులు ఆ కరపత్రాలు తీసుకుని తమ చొక్కాల జేబుల్లో కుక్కుకున్నారు. మారియో మాత్రం తన కరపత్రం వెనక్కి ఇచ్చేశాడు.
“నేను నెరూడాకు వోటు వేయబోతున్నాను” అన్నాడు.
మారియో వైపు చూసి ఒక విశాలమైన చిరునవ్వు నవ్వాడు లబ్బె. ఆ తర్వాత ఆ చిరునవ్వును మొత్తం పల్లెకారులవైపు తిప్పాడు. ఆ ఆకర్షకమైన చిరునవ్వు చూస్తే ప్రతి ఒక్కరూ పడిపోతారు. సరిగ్గా ఈ సమ్మోహకమైన చిరునవ్వు, ముఖకవళికలు చూసే అధ్యక్ష అభ్యర్థి అలెస్సాండ్రి ఈ లబ్బెను పల్లెకారులమధ్య ప్రచారానికి ఎంచుకున్నాడు. నిజానికి పల్లెకారులు తమ గాలాలతో సరిగ్గా చేపలను పట్టుకోగలవాళ్లే గాని ఎవరి గాలాలకూ చిక్కేవారు కాదు.
“నెరూడా” అని లబ్బె మళ్లీ అన్నాడు. తన ముత్యాల వంటి పళ్ల మధ్యనుంచి ఆ కవి పేరులోని ఒక్కొక్క అక్షరాన్నీ వత్తి పలుకుతూ. “నెరూడా చాలా గొప్ప కవి. బహుశా ప్రపంచంలోని కవులందరిలోకీ గొప్పవాడు. కాని నిజం చెప్పాలంటే, అయ్యలారా, ఆయనను చిలీ అధ్యక్షుడిగా నేను ఊహించలేకపోతున్నాను.”
మారియో వైపు కరపత్రం మళ్లీ చాపుతూ, “ఊరికే ఇది ఒకసారి చదివి చూడు, కుర్రాడా. బహుశా నీ మనసు మారిపోతుందేమో” అన్నాడు.
పోస్ట్ మాన్ ఆ కరపత్రం తీసుకుని మలిచి తన జేబులో పెట్టేసుకున్నాడు.
ఆ నాయకుడు అక్కడ ఒక బుట్టలో చేపలు చూడడానికి వంగాడు.
“డజను చేపలు ఎంత?”
“దొరా, మీకయితే అగ్గువకే, డజను నూటయాభై.”
“ఒక వందా యాభయ్యా? అంత డబ్బుపోసి కొనాలంటే ప్రతి చేపలోనూ ఒక ముత్యం ఉండాలే.”
పల్లెకారులందరూ గొల్లుమన్నారు. లబ్బె కూడ వాళ్లతో గొంతు కలిపాడు. చాలమంది ధనవంతులైన చిలియన్ల లాగనే ఆయనకు కూడ తనచుట్టూ వాతావరణాన్ని తేలికపరచడమూ, అందరూ హాయిగా నవ్వుకునేట్టు చేయడమూ అలవాటు. ఇక ఆయన నిటారుగా నిలబడి మారియోనుంచి కాస్త దూరం వెళ్లి, ఒక అలవాటయిన నవ్వు నవ్వి, ప్రతి ఒక్కరికీ వినబడేంత పెద్ద గొంతుతో అన్నాడు: “నీకు కవిత్వం మీద ఆసక్తి కలుగుతోందని విన్నాను. అసలు నువ్వు పాబ్లో నెరూడాతోనే కవిత్వం రాయడంలో పోటీపడుతున్నావట.”
సిగ్గుతో మారియో బుగ్గల్లోకి రక్తం తన్నుకొచ్చింది. ముఖం ఎర్రబడింది. పల్లెకారుల నవ్వులు గోలగోలగా పెల్లుబికాయి. మారియోకు ఉక్కిరిబిక్కిరి అయింది. గొంతుకేదో అడ్డుపడినట్టయింది. సిగ్గుపడ్డాడు. గందరగోళపడ్డాడు. కదలలేనట్టు అవాక్కయిపోయాడు. అష్టావక్రమైపోయాడు. గులాబీరంగుకు తిరిగాడు. ఎరుపు రంగు కమ్ముకుంది. కాంతివంతమైన ఎరుపు ఆక్రమించింది. ముదురు ఎరుపు, బచ్చలిపండ్ల రంగూ పరచుకున్నాయి. చెమట పోసింది. ఓడిపోయినట్టనిపించింది. వలలో చిక్కినట్టనిపించింది. తెలివితెచ్చుకుని కొన్ని పదాలు కూడబలుక్కుని ఒక వాక్యం లాంటిది తయారు చేయాలని ప్రయత్నిస్తే, అది “నాకు చచ్చిపోవాలనిపిస్తోంది” అయింది.
నాయకుడు మాత్రం ఒక రాజకుమారుడు ఆజ్ఞాపించినట్టుగా తన సహాయకుణ్ని పిలిచి తన తోలు సంచీ లోంచి ఏదో తీసుకురమ్మన్నాడు. ఒక క్షణం తర్వాత చూస్తే, నీలంరంగు తోలుతో బైండ్ చేసిన ఒక పుస్తకం, దానిమీద బంగారు అక్షరాలు కనబడ్డాయి. అవి ఆ సముద్రతీర సూర్యకాంతిలో మిలమిల మెరిశాయి. ఆ పుస్తకంతో పోలిస్తే నెరూడా స్వయంగా ఇచ్చిన సంపుటాలు వెలాతెలా పోయాయి.
“ఇదిగో, కుర్రాడా, ఇది నీకు నా కానుక” అని మారియోకు ఆ పుస్తకం ఇస్తున్నప్పుడు లబ్బె కళ్లలో చాలా గాఢమైన అనురాగం కనబడింది.
మారియో ముఖంలోంచి ఆ గులాబిరంగు సిగ్గు క్రమక్రమంగా, మెల్లగా కరిగిపోయింది. తన మీది నుంచి ఒక పెద్ద కెరటం తోసుకుపోయినట్టు, ఆ తర్వాత ఒక గాలి తెమ్మెర వీచి తుడిచేసినట్టు అయింది. జీవితం మళ్లీ జీవనసాధ్యమైంది. లోతుగా ఊపిరి పీల్చాడు. లబ్బె కన్న ఎక్కువ శ్రామికమైన, అంతే సమ్మోహకమైన చిరునవ్వు వెలిగించాడు. ఆ నీలం పుస్తకం మీద బంగారు అక్షరాలను తన వేళ్లతో స్పృశిస్తూ “కృతజ్ఞతలు, లబ్బె గారూ” అన్నాడు.
మారియోకు అందిన కొత్త పుస్తకంలో పుటలు ఎంత సుతి మెత్తగా ఉన్నాయో. ఎట్లా తెల్లగా మెరిసిపోతున్నాయో. మారియోకు తన కవితల లాంటి కవితలతో ఆ కాగితాలను చెడగొట్టడానికి మనసొప్పలేదు. అప్పటివరకూ రాస్తున్న పొడుపుకథల లాంటి కవితలతో తన నోటు పుస్తకాలన్నీ నిండిపోయినతర్వాత, మాంచి ఖరీదయిన ఫ్లారెస్ ద ప్రవియా సబ్బుతో చేతులు శుభ్రంగా తోముకుని అప్పుడు మాత్రమే ఈ కొత్త పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవాలనీ, ఆ తెల్లని కాగితాల మీద తాను రాసిన వాటిలోంచి అత్యుత్తమమైన అలంకారాలకు ఆకుపచ్చని సిరాతో సాఫు ప్రతి రాస్తాడు. సరిగ్గా నెరూడా లాగనే.

ఆ తర్వాత గడిచిన వారాలలో కవిగా మారియోకు వచ్చిన పేరుకూ ఆయన రాసిన కవిత్వానికీ సంబంధం లేకుండా పోయింది. కవిత అసలు పలకనే లేదు కాని కవితతో ఆయన చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడనే వార్తలు విస్తారంగా వ్యాపించాయి. చివరికి ఆ మాట టెలిగ్రాఫ్ ఆపరేటర్ చెవినకూడా పడింది. దానితో శాన్ ఆంటోనియోలో జరిగిన ఒక సోషలిస్టు పార్టీ సాంస్కృతిక రాజకీయ కార్యక్రమంలో కవితలు చదవాలని మారియోను టెలిగ్రాఫ్ ఆపరేటర్ కోస్మె ఆదేశించాడు. అలా చదవడానికి మారియో ఒప్పుకున్నాడు గాని, తన కవితలు చదవననీ, నెరూడా రాసిన ఓడ్ టు ద విండ్ చదువుతాననీ అన్నాడు. దానితో మారియో కీర్తి ఇంకా పెరిగిపోయింది. వేరువేరు చోట్ల జరిగే అటువంటి సమావేశాల్లో కార్యకర్తలనూ, సానుభూతిపరులనూ ఉత్సహపరిచేందుకు మారియో నెరూడా గీతాలు చదవాలనే పిలుపులు పెరిగిపోయాయి. అక్కడికక్కడే కోస్మె ఒక ప్రకటన కూడ చేసేశాడు. ఆ ఓడరేవు పట్నంలోని మత్స్యకారులకోసం ఒక సమావేశం పెట్టాలనీ, వారి సాంస్కృతిక చైతన్యం కోసం మారియో కవిత్వం చదవాలనీ ప్రతిపాదించి, ఆ సమావేశం ఏర్పాటు చేసేశాడు.
కాని మారియోకు ప్రజాదరణ పెరిగినకొద్దీ విచారం పెరిగిపోయింది. తాను టపా తీసుకుపోతుండిన ఒకేఒక్క ఆసామి తనకు బీట్రిజ్ గోన్జాలెజ్ మీద ఉన్న ఆకాంక్షల విషయంలో ఏమీ సాయం చేయలేకపోయాడు. ఇంకోపక్క బీట్రిజేమో రోజురోజుకూ మరింత అందంగా, కన్నుల పండుగగా తయారవుతోంది. ఈ పిచ్చి పోస్ట్ మాన్ మీద తాను ఎటువంటి ప్రభావం వేస్తున్నదో ఆమెకేమీ పట్టినట్టులేదు.
బోలెడు నెరూడా కవితలను నోటికి చదవడం నేర్చుకున్నాక, మారియో ఆ అమ్మాయిని పడగొట్టే క్రమబద్ధమైన ప్రణాళిక ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. కాని సరిగ్గా ఆ సమయానికే చిలీలోని వ్యవస్థలలోకెల్లా అతి భయానకమైన వ్యవస్థను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ వ్యవస్థ పేరు అత్తగారు, లేదా ప్రేయసి తల్లి. ఒకరోజు ఉదయాన బీట్రిజ్ వాళ్ల ఇంటి దగ్గరలో మూలమీద ఒక దీపస్తంభం దగ్గర నిలబడ్డాడు మారియో. తాను ఎవరికోసమూ ప్రత్యేకంగా ఎదురుచూడడం లేదన్నట్టు నటిస్తూ ఓపిగ్గా నిలబడ్డాడు. బీట్రిజ్ వాళ్ల ఇంట్లో నుంచి ఒక స్త్రీ ఆకారం బయటికి అడుగుపెట్టగానే ఒక్క ఉదుటున బీట్రిజ్ పేరు ఉచ్చరిస్తూ ముందుకు పరుగెత్తాడు. కాని అక్కడిదాకా వెళ్లి చూస్తే ఎదురుగా ఉన్నది బీట్రిజ్ కాదు, వాళ్లమ్మ. ఆమె మారియో వైపు ఒక పురుగును చూసినట్టు చూసింది. “గుడ్ మార్నింగ్” అన్నది గాని ఆ గొంతు “నడువ్ బయటికి” అన్నట్టుగా స్పష్టంగా ధ్వనించింది.
మర్నాడు మారియో మరింత మర్యాదపూర్వకమైన పద్ధతి ఎంచుకున్నాడు. తన ప్రేయసి కచ్చితంగా ఉండదని తెలిసిన వేళకు సారాకొట్టు దగ్గరికి వెళ్ళాడు. తన టపా సంచిని అక్కడ గల్లాపెట్టె బల్లమీద పెట్టాడు. ఒక మంచి ద్రాక్షాసవం సీసా ఇమ్మని బీట్రిజ్ వాళ్లమ్మను అడిగాడు. ఆ సీసాను తన సంచిలో వేసుకుంటూ గొంతు సవరించుకుని అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టుగా అక్కడి పానశాలనంతా కలయజూశాడు. “భలే, మీ కొట్టు చాల బాగుందండీ” అన్నాడు.
బీట్రిజ్ తల్లి మర్యాదగానే జవాబిచ్చింది: “నీ అభిప్రాయం ఎవరూ అడగలేదు” అని.
మారియో తన తోలుసంచీవైపు దీర్ఘంగా చూశాడు. అక్కడే భూమిలో కుంగిపోగూడదా అన్న భావాన్ని అణచివేసుకుంటూ మళ్లీ గొంతు సవరించుకుని, “నెరూడాగారి టపా పేరుకుపోతోంది. ఏది ఎక్కడ జారిపోతుందో అని ఎప్పుడూ పట్టుకుని తిరుగుతున్నాను” అన్నాడు.
బీట్రిజ్ వాళ్లమ్మ తన రెండు చేతులూ గుండెలమీద పెట్టుకుని తన వంకర ముక్కు పైకెత్తి, “సరే, నాకెందుకు చెపుతున్నావ్? నాతో మాటలు కలపాలనా? సంభాషణ పొడిగించాలనా?” అని కసురుకుంది.
ఈ సౌహార్దభరితమైన సంభాషణతో ప్రోత్సాహం కలిగిన మారియో ఆ రోజు సాయంత్రం సముద్ర తీరం మీద బీట్రిజ్ వెనుక నడిచాడు. సరిగ్గా అప్పుడే సూర్యుడు నారింజరంగుకు తిరుగుతున్నాడు. అప్పుడప్పుడే ప్రేమలో పడ్డ యువతీ యువకులకు, అప్పుడప్పుడే కవిత్వం రాస్తున్న ఔత్సాహికులకూ పనికొచ్చేలా మారుతున్నాడు. అలా నడుస్తూ నడుస్తూ తీరంమీద బండరాళ్ల దగ్గరికి చేరారు. అక్కడ మారియో బీట్రిజ్ తో మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా మాట్లాడుతుంటే ఆయన గుండె గొంతులో కొట్లాడింది. మారియో మాటలు మొదట బరువుగా వెలువడ్డాయి. ఆ తర్వాత తాను ఒక తోలుబొమ్మ అయినట్టు, తన గొంతులోంచి నెరూడా మాటలు వినిపిస్తున్నట్టు మారియో అలా మాట్లాడుతూనే పోయాడు. మారియోకు ఎంత వాగ్ధార వచ్చిందంటే అలంకారాలు, పదచిత్రాలు, ప్రతీకలు ఆ స్వరంనుంచి మాంత్రికంగా విడుదలయ్యాయి. ఆ సంభాషణ, బహుశా కవిత్వపఠనం అనాలేమో, బాగా పొద్దుపోయేవరకూ సాగింది. ఇదంతా దూరాన తన ఇంటివసారాలో నిలబడి బీట్రిజ్ వాళ్లమ్మ గమనిస్తున్నదని వాళ్లు చూడనే లేదు.
అదయినాక బీట్రిజ్ నేరుగా తమ సారాకొట్టువైపు నడిచి వెళ్లిపోయింది. ఆమె ఎంత అన్యమనస్కంగా ఉండిందంటే అక్కడ ఒక బల్ల దగ్గర కూచుని సారా తాగుతున్న మత్స్యకారులదగ్గరికి వెళ్లి వారు సగం ఖాళీ చేసిన సీసా తీసుకుని వెళ్లిపోయింది. వాళ్లందరూ నోళ్లు తెరిచి చూస్తూ ఉండిపోయారు. ఆ సీసా అలా పట్టుకునే ఇంట్లోకి వెళ్లిపోయింది బీట్రిజ్. సారాకొట్టు మూసేసేవేళ అయిందని బీట్రిజ్ వాళ్లమ్మ హఠాత్తుగా ప్రకటించింది. మధ్యలో తాగడం ఆగిపోయినందుకూ, హఠాత్తుగా డబ్బులు చెల్లించవలసి వచ్చినందుకూ చికాకుపడుతున్న ఖాతాదార్లను క్షమించమని అడిగి, కొట్టు కట్టేసింది.
ఇంట్లోకి వెళ్లి చూస్తే కూతురు గదిలోనే ఉంది. ఆ శిశిరపు చలి గాలిని ఆమె రొమ్ములు ఆస్వాదిస్తున్నాయి. ఆమె చూపులు ఆకాశంలోని నిండు చందమామమీద నిలిచి ఉన్నాయి. మంచం మీదంతా వెన్నెల పరచుకుని ఉంది.
“ఏం చేస్తున్నావు?” అని అడిగింది తల్లి.
“ఏదో ఆలోచిస్తున్నా.”
చడీచప్పుడు లేకుండా నడిచి గదిలో పైన వేలాడుతున్న కాంతివంతమైన లైటు వేసింది తల్లి.
“ఆలోచిస్తున్నానంటే, ఆ పని చేస్తున్నప్పుడు నీ ముఖంలో ఏముందో నాకు కనబడాలి” అంది తల్లి. బీట్రిజ్ తల్లివైపు చూసింది. కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగు కళ్లలో పడకుండా నుదుటిమీద చేతులు అడ్డం పెట్టుకుంది.
“ఇంత చలిలో కిటికీ తలుపు ఎందుకు తెరిచి పెట్టావు?”
“అమ్మా, ఇది నాగది, నా ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదా?”
“అవునవును. ఇది నీగదే, కాని నీకేమన్నా అయితే వైద్యానికి డబ్బులు ఇవ్వవలసింది నేనే. సరే, ఆ సంగతులన్నీ పోనీ, వాడెవడు?”
“ఆయన పేరు మారియో.”
“ఏం చేస్తాడు?”
“ఆయన పోస్ట్ మాన్.”
“పోస్ట్ మానా?”
“ఏం, నువ్వు ఆయన సంచీ చూడలేదా?”
“ఓహ్, చూశానులే. ఆ సంచీని సారా సీసాలు మోసుకుపోవడానికి కూడ ఉపయోగిస్తాడు.”
“ఇప్పుడు ఆయనకు పని లేదులే.”
“ఉత్తరాలు అందజేసేది ఎవరికో?”
“పాబ్లో గారికి.”
“అంటే నెరూడాకా?”
“అవును, వాళ్లు స్నేహితులు.”
“అని నీకు వాడు చెప్పాడా?”
“వాళ్లిద్దరూ కలిసి ఉండడం నేను చూశాను. కొన్నాళ్లకింద వాళ్లిద్దరూ మన కొట్లో కూచుని మాట్లాడుకున్నారు కూడా.”
“ఏం మాట్లాడుకున్నారో?”
“రాజకీయాలు.”
“ఔనా, అమ్మో, అంటే వీడు కూడా కమ్యూనిస్టేనా?”
“అమ్మా, అలా మాట్లాడకు. నెరూడాగారు మన దేశానికి అధ్యక్షులు కాబోతున్నారు.”
“అమ్మడూ, నువ్వు కవిత్వాన్నీ, రాజకీయాల్నీ కలగలిపి గందరగోళపడితే వాడు నీకు కడుపుచేసి వదిలేస్తాడు. ఇంతకూ ఏమంటాడు?”
జవాబు చెప్పబోయే ముందు బీట్రిజ్ ఆ మాటను తన నాలిక చివరన కాసేపు నిలుపుకుంది. దాని రుచులన్నిటినీ గ్రహించదలచుకుంది.
“అలంకారాలు.”
తల్లికేమీ పాలుపోలేదు. మంచంపై మరకలుపడిన కంచు గుబ్బను గట్టిగా పట్టుకుని తనను తాను సంబాళించుకోవడానికి ప్రయత్నించింది.
“అమ్మా, ఏమయిందమ్మా, నీకేమవుతోంది?”
తల్లి స్పృహతప్పినట్టుగా మంచంపై పడిపోయింది. నీరసమైన గొంతుతో “నువ్వు అంత పెద్ద పదం పలకగా ఎప్పుడూ వినలేదు నేను. నీకు వాడు ఏ అలంకారాలు చెప్పాడు?”
“ఆయన ఏం చెప్పాడంటే…ఆయనన్నాడు గదా, నా చిరునవ్వు నా ముఖం మీద సీతాకోకచిలుకలా విప్పుకుంటుందట.”
“ఇంకా ఏమిటి?”
“సరే, ఆయన అది చెప్పినప్పుడు నేను నవ్వాను.”
“ఆ తర్వాత?”
“తర్వాత ఆయన నా నవ్వు మీద కూడ ఏదో అన్నారు. ఆయన అన్నారుగదా, నా నవ్వు నీటిమీద గబుక్కున పడిన గులాబీ పువ్వు లాగుందట. నా నవ్వు హఠాత్తుగా తోసుకువచ్చిన వెండికెరటం లాగుందట.”
తల్లికి పెదాలు ఎండిపోతున్నట్టనిపించింది. నాలికతో పెదాలు తడి చేసుకుంది.
“ఆ తర్వాత నువ్వు ఏం చేశావు?”
“నేను మౌనంగా ఉండిపోయాను.”
“వాడు ఏం చేశాడు?”
“ఇంకా ఏం చెప్పాడని అడుగుతున్నావా?”
“కాదు బిడ్డా, వాడింకా ఏం చేశాడు? నీ పోస్ట్ మాన్ కు మాట్లాడే నోరొక్కటే కాదు గదా, చేతులు కూడా ఉన్నాయిగదా, ఏంచేశాడు?”
“ఆయనసలు నన్ను చేత్తో ముట్టుకోనేలేదమ్మా. ఒక స్వచ్ఛమైన యువతి పక్కన నిలబడడమే తనకు సంతోషాన్నిస్తుందని అన్నాడు. తెల్లని సముద్ర తీరాన నిలబడినట్టుందని అన్నాడు.”
“నువ్వేంచేశావు?”
“నేనక్కడ ఆలోచిస్తూ నిలుచున్నాను.”
“మరి వాడు?”
“నేనలా మౌనంగా, నిశ్శబ్దంగా నిలబడి ఉంటే బాగుందన్నాడు. నేను లేనట్టే ఉందన్నాడు.”
“మరి నువ్వు?”
“నేనాయన వైపు చూస్తూ ఉన్నాను.”
“వాడు?”
“ఆయన కూడా నావైపు చూశాడు. ఇక ఆయన నాకళ్లలోకి చూడడం ఆపి నావెంటుకలను చాలసేపు చూశాడు. ఏమీ అనలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాడనుకుంటాను. ఆతర్వాత అన్నాడు గదా, నీ తలకట్టును పొగడడానికి నాకు సమయం లేదు. ఒక్కొక్క వెంట్రుకనూ వర్ణించి, కీర్తించవలసి ఉంది.”
బీట్రిజ్ వాళ్లమ్మ లేచి నిలబడింది. తన అరచేతులను అవి తలనరికే కత్తులా అన్నట్టుగా గుండెలమీద పెట్టుకుంది.
“బిడ్డా, ఇంక చెప్పకు. మనం కొంపలు ముంచుకుపోయే గడ్డుస్థితిలో ఉన్నాం. మొదట మాటలతో స్పృశించే మగ వాళ్లందరూ ఆ తర్వాత తమ చేతులతో ఇంకా ముందుకు పోతారు.”
“మాటలు ఎక్కడన్నా చెడ్డవవుతాయా అమ్మా?” అంది బీట్రిజ్ తలగడను గట్టిగా హత్తుకుంటూ.
“ఆ పిచ్చి ప్రేలాపనల కన్న ప్రమాదకరమైన మత్తు పదార్థం మరేదీ లేదీ లోకంలో. ఒక పల్లెటూరి పూటకూళ్లమ్మ తనను తాను వెనిస్ రాజకుమారినని భ్రమపడేట్టు చేస్తాయా మాటలు. ఇక సత్యం చెప్పవలసిన సమయం వచ్చే సరికి, బతుకు భయం నిన్ను చుట్టుముట్టినప్పుడు, ఈ మాటలు అసలు డబ్బు కాగితాలు కావని, ఉత్తి చిత్తుకాగితాలేనని నీకు తెలిసివస్తుంది. ఎవడో ఒక తాగుబోతు మన కొట్లో నిన్ను కావలించుకున్నా నాకు ఫర్వాలేదు గాని, నీ చిరునవ్వు సీతాకోకచిలుక కన్న ఎక్కువ ఎత్తు ఎగురుతుందని ఎవడన్నా అంటే మాత్రం భయం పుడుతుంది.”
బీట్రిజ్ ఒక్క ఎగురు ఎగిరింది. “ఎగరడం కాదమ్మా, సీతాకోక చిలుకలా విప్పుకోవడం.”
“ఎగరనీ, విప్పుకోనీ, నాకేమీ తేడా పడదులే. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ మాటలవెనుక అసలు ఏమీ లేదు. అవి గాలిలో కలిసిపోయే తారాజువ్వల్లాంటివి.”
“లేదమ్మా, మారియో నాతో అన్నమాటలు తారాజువ్వల్లా ఎగిసి గాలిలో కలిసిపోలేదు. అవి నాకు నోటికి వచ్చేశాయి. పనిచేస్తూ కూడా ఆ మాటలే తలచుకోవాలని అనిపిస్తోంది నాకు.”
“ఔనవును. నాకది కనిపిస్తూనే ఉంది. రేపు నువ్వు నీ బట్టలన్నీ సర్దుకో. కొన్నాళ్లపాటు శాంటియాగోలో పిన్ని వాళ్లింట్లో ఉండి వద్దువుగాని.”
“నాకిప్పుడు ఎక్కడికీ వెళ్ళాలని లేదమ్మా.”
“నీకేమనిపిస్తోందో నాకక్కరలేదు. చూడబోతే ఇదేదో ముదిరి పాకాన పడుతున్నట్టుంది.”
“అంత మునిగిపోయిందేమి జరిగిందమ్మా, ఎవడో ఒక కుర్రాడు నాతో కాసేపు మాట్లాడినదానికే ఇంతనా? అందరు ఆడపిల్లలకూ ఇది జరుగుతుంది.”
తల్లికి ఎంత కోపం వచ్చిందంటే, ఆ కోపాన్ని అణచుకోవడానికి ఆమె తన శాలువా అంచులో ఒక ముడి వేసింది.
“మొట్టమొదట, వాడు నీకు చెప్పినవన్నీ నేరుగా నెరూడా కవిత్వం నుంచి మక్కీకి మక్కీ దించినవేనని ఎవరయినా ఒక మైలు అవతలి నుంచి కూడ చెప్పవచ్చు.”
బీట్రిజ్ తన తల తిప్పి అదే క్షితిజమన్నట్టుగా గోడవేపు చూసింది.
“కాదమ్మా, ఆయన నావైపు చూస్తుంటే ఆ పదాలన్నీ పక్షులలాగ ఆయన నోట్లోంచి పరుగెత్తుకొచ్చాయి.”
“ఆయన నోట్లోంచి పక్షులలాగనా? ఓహ్, ఇంక నువ్వు బట్టలు సర్దుకోవలసిందే. రాత్రి బయల్దేరాల్సిందే. ఎవరో ఒకరు ఇదివరకే అన్నమాటను వాళ్లు అన్నారని చెప్పకుండా తామే అన్నట్టుగా చెప్పడాన్ని ఏమంటారో తెలుసునా? దొంగతనం! నీకు అవేంటీ…ఆ అలంకారాలు చెప్పినందుకు దొంగతనం నేరం కింద ఆ మారియోను జైల్లో పారెయ్యొచ్చు. నేను ఆ కవిని ఇప్పుడే కలిసి ఆయన పోస్ట్ మాన్ ఆయన కవిత్వాన్ని దొంగిలిస్తున్నాడని ఫిర్యాదు చేస్తాను.”
“ఆ సంగతిని పాబ్లో నెరూడా గారు పట్టించుకుంటారనుకున్నావా ఏం? ఆయన చిలీ దేశానికి అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిలబడబోతున్నారు. బహుశా ఆయనకు రేపోమాపో నోబెల్ బహుమతి వస్తుంది. నువ్వేమో ఆయనదగ్గరికి వెళ్లి కాసిని అలంకారాల మీద రాద్ధాంతం చేయబోతున్నావు.”
తల్లి తన బొటనవేలిని తన ముక్కుమీద, అచ్చు మల్లయోధులలాగ రుద్దుకుంది.
“కాసిని అలంకారాలా, ఏం? చూడు నీ వాలకం” అంటూ కూతురి చెవి మెలేసి ముందుకు లాగింది. కూతురి ముక్కు వచ్చి తల్లి ముక్కుకు తాకింది.
“అమ్మా!”
“నువ్వు ఒక లేత మొక్క లాగ పచ్చిగా ఉన్నావు. బిడ్దా, నీకు ఆ జ్వరం అంటుకున్నట్టే ఉంది. ఆ జ్వరానికి రెండే రెండు మందులు. బుద్ధొచ్చేలా చితగ్గొట్టడం లేదా ఎక్కడికైనా చిన్న ప్రయాణానికి పంపడం” అంటూ కూతురి చెవి వదిలేసింది. మంచం కిందినుంచి బర్రుమని ఒక పెట్టె లాగింది. దాన్ని పరుపు మీద పడేసి, “సర్దుకో” అంది.
“ఉహు. నేను సర్దుకోను. నేనిక్కడే ఉంటాను.”
“అమ్మడూ, నదుల్లో రాళ్లూ మాటలూ మాత్రమే కాదు బిడ్డలు కూడ పుట్టుకొస్తారు. ఊ, సర్దుకో.”
“ఎట్లా జాగ్రత్త పడాలో నాకు తెలుసు.”
“ఓహో, ఎట్లా జాగ్రత్త పడాలో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో ఒక చిన్న గాలి తెమ్మెర వీచిందంటే చాలు, ఎగిరిపోతావు. గుర్తుంచుకో, నువ్వు నెరూడాను చదవడానికి చాలా రోజులముందే నేనూ నెరూడాను చదివాను. మగవాళ్లు మరిగిపోయే సమయానికి వాళ్లలో కవిత్వం పొంగి వస్తుందని నాకు బాగా తెలుసు.”
“నెరూడా చాలా పెద్దమనిషి. ఆయన అధ్యక్షుడు కాబోతున్నారు.”
“పక్కమీదికి ఎక్కడం గురించి మాట్లాడేటప్పుడు అధ్యక్షుడయినా, పూజారి అయినా, కమ్యూనిస్టు కవి అయినా వీసమెత్తు తేడా లేదు, అది తెలుసుకో. ‘ముద్దాడి వెళ్లిపోయే నావికుల ప్రేమ లాంటి ప్రేమ నాది. తిరిగి వస్తామనే వాగ్దానాన్ని ఎన్నడూ వదలరు వాళ్లు’ అని రాసిందెవరో తెలుసా?”
“నెరూడా!”
“ఓహ్ తెలుసన్నమాట. అయినా నువ్వింకా ఏ ప్రమాదం లేదనుకుంటున్నావా?”
“ఒక చిన్న ముద్దు గురించి అంత రాద్ధాంతం చెయ్యను నేను.”
“ఒక ముద్దు గురించా, కాదు కాదు. కాని ముద్దు అనేది ఒక దావానలాన్ని రగిలించే నిప్పురవ్వ. నెరూడా కవితల్లో మరొకటి వింటావా? ‘ముద్దుల్లోనూ, పడకమీదా, రొట్టెల్లోనూ అన్ని చోట్లా విస్తరించే ప్రేమను ప్రేమిస్తాను నేను.’ బిడ్డా, ఆ మాటలకు అర్థం ఏమిటో తెలుసా? శషభిషలు లేకుండా చెప్పాలంటే పొద్దున లేచీలేవగానే ఫలహారంతో పాటే ఆ పని చేస్తాడన్నమాట.”
“అమ్మా, అలా కాదు!”
“చూడిక, నీ పోస్ట్ మాన్ నీకు నెరూడా రాసిన మరొక చిరస్మరణీయమైన కవిత చదివి వినిపిస్తాడు. సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఆ కవితను నా పుస్తకంలో రాసి పెట్టుకున్నాను. ‘నాకది వద్దు, నా ప్రియా, మనను కలిపి ఉంచేదేదీ వద్దు, మనను ఐక్యం చేసేదేదీ వద్దు’ అని.”
ఆ మాటకు నాకు అర్థం తెలియలేదమ్మా
తల్లి తన చేతులతో కడుపుముందర గర్భం లాగ ఒక ఊహాత్మక వృత్తాన్ని గీసింది. అది నాభి దగ్గర మొదలయి, పొత్తికడుపుమీద చాల పెద్దగా మారి, పిరుదులదగ్గర శరీరంలో కలిసిపోయింది. ఈ వృత్తాన్ని గీస్తూనే ఆమె ఆ కవితను మళ్లీ చదవడం మొదలుపెట్టింది. ఈసారి ఆమె ఒక్కొక్క పదాన్నీ వత్తి వత్తి పలుకుతూ జాగ్రత్తగా చదివింది. “నాకు – అది – వద్దు – నా – ప్రియా – మనను – కలిపి – ఉంచేది – ఏదీ – వద్దు – మనను –ఐక్యం – చేసేది – ఏదీ – వద్దు.”
గందరగోళంలో మునిగిపోయిన కూతురు తన తల్లి చేతుల కదలికలవెంట చూపులు తిప్పింది. పక్షిలాగ గొంతు పెట్టి, “ఏమంటున్నావమ్మా, ఉంగరమా?” అని అడిగింది.
బీట్రిజ్ తండ్రి చనిపోయిన తర్వాత, తన ఇంట్లో మరొక కుటుంబసభ్యులెవరయినా చనిపోయేవరకూ ఏడవగూడదని ఆ తల్లి ఒట్టు పెట్టుకుంది. కాని ఇప్పుడు కూతురి ప్రశ్న వినేసరికి ఆ తల్లి కళ్లనుండి ఒక నీటి చుక్క ఉబికివచ్చి కనుకొలకులనుంచి కిందికి జారింది.
“ఔను, బిడ్డా, ఉంగరమే. సరేనా, ఇక నీ ప్రయాణానికి సర్దుకోవడం మొదలుపెట్టు.”
కూతురు తలగడను కొరికిపారేసింది. తన నోరు కేవలం మగవాళ్లను ఆకర్షించడం మాత్రమే కాదు, బట్టలనైనా, మాంసాన్నయినా చీల్చగలదని చూపింది. ఆతర్వాత, “నీది పిచ్చి అమ్మా, ఒక మగవాడు నా చిరునవ్వుతో నా ముఖం మీద సీతాకోక చిలుకలు నాట్యం చేసినట్టుందని అంటాడు. దానికి నేను శాంటియాగో వెళ్లాలట” అని అరిచింది.
“పిచ్చిదానిలా ప్రవర్తించకు. ఇప్పుడేమో నీ చిరునవ్వు సీతాకోకచిలుకలా ఉంటుంది. రేపేమో నీ చనుమొనలు కువకువలాడుతున్న పావురాలలాగ ఉంటాయి. నీ స్తనాలు రసం నిండిన అడవిరేగుపళ్లలాగ ఉంటాయి. నీ నాలుక భగవంతుడిచ్చిన వేడివేడి తివాచీ లాగుంటుంది. నీ వీపు ఒక ఓడ తెరచాప లాగుంటుంది. నీ తొడలమధ్య రగులుతున్నది కొలిమిలాగుంటుంది. అక్కడ వాడి గర్వం నిడిన లోహస్తంభాన్ని పోతపోస్తారు. సరేనా, ఇక పడుకో.”