-
అలుపెరగని సినీ స్రష్ట అలన్ స్మితీ.
కధ-స్క్రీన్ప్లే-మాటలు-పాటలు-సంగీతం-ఎడిటింగ్-శ్రాద్ధం-పిండాకూడు-దర్శకత్వం అంటూ అన్ని విభాగాల్లోనూ పొడిచేసినట్లు తెగబారెడు టైటిల్ కార్డ్ వేయించుకునే దర్శకరత్నాలు తెలుగు సినీపరిశ్రమలో కొన్నున్నాయి. మీడియా కూడా వీళ్లకి వీరతాళ్లేసి తరించిపోతుంటుంది. అయితే వీళ్లు నిజంగా ఇవన్నీ చేస్తారో లేదో అనుమానమే. పెరుమాళ్లు విప్పే లోగుట్టు ప్రకారం, చాలా సందర్భాల్లో వీళ్లు నిత్య సహాయ దర్శకుల తోడుతోనో, భూతాలనబడే భావి రచయితలు, గేయకర్తలు, సంగీతకారులు తదితరుల చేవతోనో పబ్బం గడిపేస్తుంటారు. అయితే వీళ్లకి పూర్తి భిన్నమైనవాడు హాలీవుడ్లో ఒకడున్నాడు. అతడే - అలుపెరగని సినీ స్రష్ట అలన్ స్మితీ.
అలన్ స్మితీ 1967లో అమెరికాలో జన్మించిన ఓ ఆణిముత్యం, ‘చైల్డ్ ప్రాడిజీ’ అనే మాటకి అసలుసిసలు అర్ధం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఏడాది కూడా నిండకుండానే ఓ హాలీవుడ్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిపారేశాడు. దాని పేరు ‘డెత్ ఆఫ్ ఎ గన్ ఫైటర్’. అలన్ స్మితీ ప్రతిభ దర్శకత్వానికే పరిమితం కాలేదు. నలభయ్యేళ్లొచ్చేసరికి హాలీవుడ్ సినీరంగంలో అతను స్పృశించని విభాగం లేదు. సుమారు డెబ్భై సినిమాలు/టివి ఎపిసోడ్లకి దర్శకత్వం, పన్నెండు సినిమాలకి రచన, మూడిటికి ఎడిటింగ్ బాధ్యతలు, రెండిటికి నిర్మాణం, మరో రెండిటికి సినిమాటోగ్రఫీ చెయ్యటమే కాక ఆరు సినిమాల్లో నటించి కూడా ఉన్నాడు. కళాదర్శకత్వం, మేకప్ చేసిన చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి.
ఇన్ని రంగాల్లో ప్రవేశం ఉన్నా, విచిత్రంగా అలన్ స్మితీ పేరు ఎక్కువమందికి తెలియదు. అతని మొదటి సినిమా బాగానే నడిచింది కానీ తర్వాతవి అంతగా ఆడలేదు. అతని పేరు వెలుగులోకి రాకపోవటానికి ఇదీ ఓ కారణం కావచ్చు. అయితే, విజయాలే వ్యక్తి ప్రతిభకి కొలమానాలైన సినీరంగంలో అపజయాలెన్నున్నా అలన్ స్మితీకి వెల్లువలా అవకాశాలొచ్చిపడటం గమనార్హం. ఇదే రిడ్లీ స్కాట్, జార్జ్ లూకాస్, టిమ్ బర్టన్ వంటి వారు చేసుంటే కుప్పలు తెప్పలుగా ఆస్కార్లు కొల్లగొట్టుండేవారు. ఓ హాలీవుడ్ దర్శకుడు తన కెరీర్లో ముప్పై సినిమాలు రూపొందిస్తే గొప్ప. ఆ రకంగా చూస్తే రాశి పరంగానన్నా అలన్ స్మితీకి జీవితకాల పురస్కారం పేరుతో ఓ ఆస్కార్ ఇచ్చెయ్యొచ్చు. కానీ అవార్డు సంగతి అవతలుంచితే అతనికి ఒక్క సారన్నా ఏ విభాగంలోనూ నామినేషన్ కూడా రాలేదు. ఎలా వస్తుంది? నామినేషన్ ఇవ్వటానికి ఇతను ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో ఎవరికన్నా తెలిస్తే కదా. అలన్ స్మితీని చూసిన వాళ్లు ఎవరూ లేరు!
వింతగా ఉందా? హాలీవుడ్లో అలన్ స్మితీ పేరుతో ఏ వ్యక్తీ లేడు . కానీ పైన నేను చెప్పిందంతా నిజమే. కావాలంటే బోల్డన్ని హాలీవుడ్ సినిమాల్లో రకరకాల విభాగాల్లో అతని పేరు కనిపిస్తుంది చూడండి - Alan Smithee అంటూ.
* * * *
‘దర్శకుడే సినిమాకి కెప్టెన్’ అనేది తెలుగు సినీజీవులు తరచూ వేసే అరిగిపోయిన రికార్డు. చాలావరకూ తెలుగు సినిమాల్లో దర్శకుడి నాయకత్వం అనేది నేతిబీరలో నెయ్యి. తొడలు కొట్టే మెగా హీరోబాబుల భారీ చిత్రాల విషయంలో ఇది మరింత పచ్చి నిజం. సినిమా నిర్మాణంలో హీరోగారి పరివారం తలో చెయ్యి వేసి దర్శకుడిని డమ్మీని చెయ్యటం ఇక్కడ సాధారణం. సినిమా ఆడితే అది హీరో మహిమ, పోతే మాత్రం దర్శకుడే బకరా. హాలీవుడ్లో దీనికి పూర్తి విరుద్ధం. అక్కడ సినిమాలకి దర్శకుడే నిజమైన సరంగు. సినిమా ఆడినా పోయినా అతనిదే పూర్తి బాధ్యత. కొబ్బరికాయ కొట్టిన క్షణం నుండీ గుమ్మడికాయ కొట్టేదాకా ప్రతిదీ దర్శకుడి కనుసన్నల్లో జరగాల్సిందే - ఎంత పెద్ద సంస్థ నిర్మిస్తున్నా, ఎందరు మెగాస్టార్లందులో ఉన్నా. అదో అలిఖిత సూత్రం.
అయితే కొండొకచో ఈ సూత్రానికి విరుద్ధంగా జరిగే అవకాశమూ ఉంది. అలాంటి సందర్భాల్లో, సదరు దర్శకుడు ఆ సినిమా నిర్మాణం తన అదుపులో లేదు కాబట్టి దాని జయాపజయాలకి తనది బాధ్యత కాదని డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాకి నివేదించుకోవచ్చు. అతని వాదనలో నిజం ఉందని డిజిఏ విశ్వసిస్తే ఆ సినిమాకి దర్శకుడిగా అతని పేరు బదులు అలన్ స్మితీ అనే కల్పిత నామాన్ని వాడమని నిర్మాతకి సూచిస్తుంది. ’the alias men’ అనే మాటలో అక్షరాలని తారుమారు చేస్తే పుట్టిందే ఈ Alan Smithee అనే పేరు. ఈ సంప్రదాయం డెత్ ఆఫ్ ఎ గన్ ఫైటర్ (1969) నుండి మొదలయింది. ఇప్పటి దాకా సుమారు డెబ్భై సినిమాలు/టివి ఎపిసోడ్లు అలన్ స్మితీ దర్శకత్వంలో విడుదలయ్యాయి. ఎక్కువగా దర్శకుడి విషయంలో వాడినప్పటికీ, కొన్ని సందర్భాల్లో నటులు, కూర్పరులు వంటి ఇతర విభాగాలవారికి కూడా ఈ పేరు వాడటం జరిగింది. ఒక సినిమాకి ఒకరికన్నా ఎక్కువ మంది దర్శకులు పనిచేసి, వారిలో ఎవరూ ఆ సినిమాకి పూర్తి బాధ్యత తీసుకోవటానికి ఇష్టపడనప్పుడు కూడా ఇదే పేరు వాడటం జరుగుతుంది.
తెలిసింది కదా. ఈ సారి ఏదైనా హాలీవుడ్ సినిమాకి సంబంధించి అలన్ స్మితీ పేరు కనిపిస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి కానీ చూడొద్దు. ఎంతైనా దర్శకుడే చేతులు దులుపుకున్న చిత్రరాజం కదా - అది చెత్తగా ఉండే అవకాశాలే ఎక్కువ.
కొసమెరుపు: అలన్ స్మితీకి అలెన్ స్మితీ, ఆడమ్ స్మితీ అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. 2000లో ఇతనికి థామస్ లీ అనే వారసుడొచ్చాడు. అదే ఏడాది అలన్ స్మితీ వృత్తి విరమణ చేశాడు.