Rss Feed

పిలుపు

'గెలుపూ ఓటమికి మధ్య పోటీ పెడితే ఓటమే ముందు గెలుస్తుంది' అని చైనా సూక్తి. ప్రతి విజయానికీ వెనక ఓ ఓటమి ఉంటుంది. బావి తవ్వేవాడి చేతికి తొలుత మట్టే అంటుకుంటుంది. శరీరం తప్ప మరే ఆధారం లేని జీవజాలానికి పోరాడటం, ఎలాగైనా బతకాలనే ఆరాటం మినహా గెలుపూ ఓటములూ పట్టవు. కష్టపడి కట్టుకున్న గూడు చెదిరిందని సాలీడు ఏనాడైనా ఆత్మాహుతి చేసుకుందా? ఎండలు మండిపోతుంటే మళ్ళీ చినుకులు పడి చెరువులు నిండేదాకా కప్పలు బండల మధ్య రోజులు గడుపుతాయికానీ, గుండెలు పగిలి చావవు. శీతోష్ణాలూ, రాత్రింబవళ్ళు, చీకటి వెలుగులూ మాదిరే గెలుపూ ఓటములు! రాయిని రాతితో కొట్టి ఎవరూ నేర్పకుండానే నిప్పును పుట్టించినప్పటినుంచీ, చంద్రమండలం మీది నీటి జాడలు పట్టుకున్న దాకా అసలు ఓటమంటే తెలియకుండానే నెట్టుకొచ్చాడా మనిషి? అమ్మ కడుపులో పడిన క్షణంనుంచే మనిషికి పరీక్షలు మొదలవుతాయి. ఒలింపిక్సు పరుగుపందెంలో మొదట వచ్చిన విజేత కూడా బుడిబుడి అడుగుల వయసులో ఎన్నోసార్లు తడబడి పడిపోయే ఉంటాడు. 'పరుగాపక పయనించవె తలపుల నావ/ కెరటాలకు తలవంచితె దొరకదు తోవ...' అని ఓ సినీకవి అన్నదీ- కష్టాల వారధి దాటినవాళ్లకే అవరోధాల దీవిలోని 'ఆనంద నిధి' సొంతమవుతుందని చాటడానికే. 'మనిషి ఎన్ని శాస్త్రాలు చదివి పుణ్యకార్యాలు ఆచరించినా ప్రాణం ముందు అవన్నీ తృణప్రాయమే'నన్నది మహర్షి యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించిన జీవనసూత్రం. ప్రాణం అంత తీపి కనకనే అమృతం కోసం దాయాది వైరాన్ని సైతం పక్కనపెట్టి క్షీరసాగరమథనానికి పూనుకున్నారు దేవదానవులు. సాక్షాత్‌ మృత్యుస్వరూపుడైన యమధర్మరాజే దండంతో ప్రాణాలు హరించటానికి వచ్చినా శివలింగాన్ని పట్టుకుని వదలలేదు మార్కండేయుడు! పెద్దలు 'జాతస్య మరణం ధ్రువమ్‌' అన్నారని చేతి గీతలను చేజేతులా చెరిపేసుకోవాలనుకోవడం పిరికితనమే అవుతుంది. మన ప్రమేయంతో మనం పుట్టామా... మన ప్రమేయంతోనే పోవటానికి? తల్లి తొమ్మిదినెలలు మోసి జన్మనిస్తే తండ్రి పందొమ్మిదేళ్లు కంట్లో పెట్టుకుని పెంచిన శరీరం ఇది. మన ఆటపాటలకు, ముద్దు ముచ్చట్లకు, సుఖసంతోషాలకు వాళ్ల జీవితాలను చాదితే చేవదేరిన దేహం ఇది. 'ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు భూతాలు. వాక్‌ పాణి పాద పాయూపస్థలనే అయిదు కర్మేంద్రియాలు, త్వక్‌చక్షు శ్రోత జిహ్వాఘ్రాణాలనే అయిదు జ్ఞానేంద్రియాలు... మనోబుద్ధి చిత్తాహంకారాలనే అంతఃకరణ చతుష్టయంతో కలిసి పందొమ్మిదిమంది దేవతల ఆవాసం మనిషి శరీరం' అని ప్రశ్నోపనిషత్తు పేర్కొంది. అది శాస్త్రోక్తమైనదా, కాదా అనే వాదనను పక్కనపెట్టినా నేటి సామాజిక జీవనరంగంలో ఏ వ్యక్తి జీవితమూ ఉలిపికట్టె మాదిరి ఒంటరిగా సాగేటందుకు వీలులేనిది. 'పుటక'నీది, చావునీది, బతుకంతా దేశానిది' అంటూ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌కు ప్రజాకవి కాళోజీ నివాళులర్పించారు. మన బతుకంతా దేశానిది అనిపించుకునేంతగా కాకపోయినా అది- కనీసం మన కన్నవారిది, మనం కన్నవారిది, మనల్ని నమ్ముకుని బతుకుతున్నవారిది అని అయినా ఒప్పుకొనితీరాలి! తిండికి బిడ్డ ఒక్కపూట పాలుమాలితే- పాలు కుడిపిన తల్లి రొమ్ము ఎలా తల్లడిల్లిపోతుందో తెలుసా! ఆకాశంలో అకాల చుక్క పొద్దువుతాడని కాదుగా కన్న తండ్రి కండల్ని చాది బిడ్డను చెట్టంతవాణ్ని చేసిందీ! 'నాతి చరామి' అని ఇచ్చిన హామీని నమ్మి ఓ బిడ్డకు తల్లిగా మారిన పిచ్చితల్లి 'అమ్మా! నాన్నేడే!' అని ఆ బిడ్డ అడిగితే బదులేమి చెబుతుంది? పంట పొలాలు ఎండిపోయాయనో, ప్రేమించిన పిల్లకి వేరే అబ్బాయితో పెళ్ళి అయిపోయిందనో, ఉద్యోగం వూడి బతుకూ పరువూ బజార్న పడ్డాయనో, స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి షేర్లు 'బేర్‌' మన్నాయనో, అభిమాన కథానాయకుడి సినిమా మొదటి ఆటకు టిక్కెట్లు దొరకలేదనో, మార్కులు నూటికి నూరు రాలేదనో, ఇష్టమైన ప్రజానాయకుడు హఠాత్తుగా పోయాడనో, క్రికెట్‌ ట్వంటీ20లో మనవాళ్ళు ఓడిపోయారనో, నిరాహారదీక్షలకు కూర్చున్న ప్రజాప్రతినిధులు నిమ్మరసం తాగారనో, తాగలేదనో ప్రాణాలు నిష్కారణంగా తీసుకునే ధోరణులు సమాజంలో క్రమక్రమంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నిరుడు 1.22లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14,224 మంది బలవన్మరణం పాలయ్యారు. స్వహననమే సమస్యలకు పరిష్కారం కాదు. విసుగుకీ ఓటమికీ ఉసురు తీసుకోవటం విరుగుడు కానేకాదు. జీవన సమరాంగణంలో యోధులుగా మారి ప్రతి అడుగునూ ఓ దీక్షా శిబిరంలా మార్చుకోవాలి. ఒడుపుగా మలుపు తీసుకోవడం మరిచిపోనంతకాలం మన ప్రయాణాన్ని ఏ వంకర టింకర మలుపూ ఆపలేదని తెలుసుకోవాలి. 'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది...' అనే పాట అర్థం ఒంటపట్టించుకొంటే మంచిది.
(ఈనాడు, సంపాదకీయం, ౨౭:౧౨:౨౦౦౯)

భాష ముఖ్యోద్దేశం

భాష ముఖ్యోద్దేశం మన భావం అవతలివారికి చక్కగా తెలియడం. ఈ విషయాన్ని పట్టించుకోకుండా పూర్వ పండితులు, కవులు కొందరు ఎవరికీ అర్థంకాని పాషాణ పాకంలో గ్రంథాలు రాసి ప్రజలపైకి విసిరేశారు. గ్రంథం ఎంత అర్థం కాకుండా ఉంటే అంత గొప్ప అన్న అభిప్రాయమూ ఒకప్పుడు ప్రబలిపోయింది. ఆ దశలో ఏ కవిత్వమైనా, కావ్యమైనా తేలికభాషలో నలుగురికీ అర్థమయ్యేట్లు ఉండాలనీ అలా ఉంటేనే వాటికి సార్థకత చేకూరుతుందనే వాదన పుట్టుకొచ్చింది. వాదాలు ముదిరి గ్రాంథిక, వ్యవహార భాషా పండితుల మధ్య సిగపట్లదాకా వెళ్ళింది వ్యవహారం. ''గ్రాంథిక గ్రామ్య సంఘర్షణమ్మున జేసి మరిచిపోయితిని వాఞ్మయపు సొగసు, వ్యర్థవాద ప్రతివాదమ్ములనొనర్చి వదలి వైచితిని భావ ప్రశస్తి...'' అంటూ ఆ సందర్భంలోనే ఓ కవి చింతించాడు. భాషల విషయమై ఇటువంటి వాదోపవాదాలు ఎన్నెన్నో. ''జీవలోకమందు జీవించు భాషలు జనుల తలపుదెలుపు సాధనములు'' అన్నారో కవి. భాష మన ఆలోచనలు తెలపటానికే కాదు, వాటిని దాచుకోవటానికీ ఉపయోగపడుతుంది- అన్నాడు తన మాటలతో బమ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేయగల చతురుడొకడు. ''నాతో మాట్లాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌'' అంటాడు గిరీశం. ఆయనతో రోజుల తరబడి మాట్లాడిన వెంకటేశం ఎంత విద్యను ఒంటపట్టించుకొన్నాడో కాని - పరీక్షలు మాత్రం ఆనవాయితీగా ఫెయిలవుతూనే వచ్చాడు. ఒకప్పుడు లాటిన్‌, సంస్కృతం వంటివి రాజభాషలుగా చలామణీ అయ్యాయి. సంస్కృతంలో నుంచే అన్ని భాషలూ పుట్టాయని భారతీయులు నమ్మితే, లాటినే సర్వభాషలకు పుట్టినిల్లని పాశ్చాత్య దేశాలవారు భావిస్తారు. ప్రస్తుతానికి ఈ రెంటినీ మృతభాషలుగా కొందరు పరిగణిస్తున్నారు. ''ఎల్లభాషలకు జనని సంస్కృతమె'' అని నమ్మే సంస్కృత భాషాభిమానులు ఆ విషయాన్ని ఒప్పుకోరు. సంస్కృతం మృతభాషకాదు అమృతభాష అని వారు వాదిస్తారు. ప్రపంచంలో భాషా పరిజ్ఞానం బహుముఖాలుగా విస్తరించి ఉంది. మారుమూల ప్రాంతాల్లో కొద్దిమంది మాత్రమే మాట్లాడే భాషలు ఎన్నో ఉన్నాయి. కథా సాహిత్యానికి ఒరవడి అని చెప్పదగ్గ 'బృహత్కథ' అనే గ్రంథాన్ని గుణాఢ్యుడు అనే కవి పండితుడు పైశాచీ భాషలో రాశాడు. సంస్కృతం, ప్రాకృతం, దేశీ భాషలన్నీ తెలిసిన మహా విద్వాంసుడాయన. అయినా తన గ్రంథ రచనకు పైశాచీ భాషనే ఎన్నుకున్నాడు. ఆ భాషలో తన రక్తంతో భూర్జపత్రాలపై ఆ ఉద్గ్రంధాన్ని రచించాడు. బృహత్కథ మొదట్లో పండితాదరణను పొందకపోయినా తరవాత ఎన్నో భాషల్లోకి అనువాదమై ఇప్పటికీ సాహిత్యాభిమానుల ఆదరణకు పాత్రమవుతోంది. పైశాచిక భాష ప్రస్తుతం ఉందో లేదో ఎవరికన్నా తెలుసో తెలియదో కాని, బృహత్కథ మాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది. తెలిసి చెప్పగలిగినవాళ్లుంటే అందులోని కథలు పిల్లలకు ఆకర్షకంగానే ఉంటాయి. పైశాచివంటి అంతరించిపోయిన అంతరించిపోతున్న భాషలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరికొన్ని భాషలు ఇతర భాషా ప్రభావంతో తమ అసలు స్వరూపాన్నే కోల్పోతున్నాయి. ''గంగతల నుండి కావేరి కాళ్ళదాక వెలిగిన'' తెలుగు ఠీవి ప్రస్తుతం ఇంగ్లిష్‌ ప్రభావంలో పడి ఏవిధంగా మసకబారిపోతున్నదీ వేరే చెప్పనక్కరలేదు. ప్రపంచం మొత్తంమీద ఏడు వేలకు పైగా భాషలున్నట్లు ఒక అంచనా. వాటిలో సగానికిపైగా భాషలకు లిపి లేదు. లిపి ఉన్నా లేకపోయినా ప్రస్తుతం వాడుకలో ఉన్న భాషల్లో సగానికిపైగా అంతరించిపోయే దశలో ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రతి రెండు వారాలకు ఒక భాష అంతరించిపోతోందంటున్నారు. ముఖ్యంగా ఉత్తర ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని మధ్యప్రాంతం, తూర్పు సైబీరియా, ఓక్లహామా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే కొన్ని భాషలు వేగంగా అంతరించిపోతున్నాయి. ఈ శతాబ్దం చివరినాటికి సగానికిపైగా భాషలు అంతర్థానమై పోగలవని అంటున్నారు. అదృశ్యమై పోవటానికి సిద్ధంగా ఉన్న భాషల గురించి అధ్యయనం చేయటానికి డేవిడ్‌ హారిసన్‌ అనే భాషా శాస్త్రవేత్త పూనుకొన్నాడు. ఈయన మరికొందరు శాస్త్రజ్ఞులతో కలిసి అంతరించిపోయే ప్రమాదమున్న భాషల వివరాలను సేకరిస్తున్నాడు. అందుకోసం హారిసన్‌ బృందం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తోంది. అంత్య దశలో ఉన్న భాషలు తెలిసినవారిని కలిసి ఆయా భాషలలో వారిని మాట్లాడించి హారిసన్‌ బృందం రికార్డు చేస్తోంది. దీనివల్ల ఆ భాషలు పూర్తిగా మరుగునపడకుండా కొంతవరకన్నా కాపాడవచ్చునని శాస్త్రజ్ఞుల భావన. అమెజాన్‌ తీర ప్రాంతంలోని ఆండీస్‌ పర్వత సానువుల్లో నివసించే ప్రజలు మాట్లాడే భాషలపై స్పానిష్‌, పోర్చుగీస్‌ భాషల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాల ప్రజలు తమ భాషలకు బదులుగా స్పానిష్‌, పోర్చుగీస్‌ భాషలనే ఉపయోగిస్తుండటంతో వారి అసలు భాషలు అంతరించిపోతున్నాయి. ఇంగ్లిష్‌ భాషా ప్రభావంవల్ల కొన్ని భాషల అసలు స్వరూపమే మారిపోతోంది. ఉదాహరణకు తెలుగుపై ఆంగ్ల ప్రభావం ఎంతగానో ఉంది. రెండు మూడు ఇంగ్లిష్‌ ముక్కలు లేకుండా తెలుగులో మాట్లాడటం కుదరటంలేదు. ఒకవేళ అలా మాట్లాడినా అవతలివారికి అర్థంకాని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎవరి భాషలపట్లవారు శ్రద్ధ వహించి అవి మరుగునపడిపోకుండా కాపాడుకోవాలి. పరాయిభాషల ప్రభావంవల్ల తమ మాతృభాష అసలు స్వరూపమే మారిపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరమూ ఎంతైనా ఉంది!
(Eenadu, 30:09:2007)