-
Very touching with a strong message. I wish we could educate our citizens a little more on this.
Posted by
సుమన్.గద్దె
on 24, జనవరి 2010, ఆదివారం
Labels:
వీడియో / ఆడియో
/
Comments: (0)
నవలాశిల్పం కొన్ని పరిశీలనలు
Posted by
సుమన్.గద్దె
Labels:
'ప్రపంచ సాహిత్యం'
/
Comments: (1)
-వడ్డెర చండీదాస్
నాటకానికీ కథకీ వున్నంత వయసులేదు, నవలకి. అవి పెద్దవి. యిది పసిది.
ఐనా-రజస్వలయిన కుర్రది అర్జంటుగా హర్రీగా యెదిగి, కట్నం యిచ్చుకోలేని తన
తండ్రిని భయపెట్టినట్లు దయ్యప్పిల్లలా తయారై కూచుంది నవల.యింతకీ నవల అంటే యేవిటి ? అడక్యూడని ప్రశ్న. నవల అంటే నవలే.
మరేదో విషయం గురించి చెబుతూ, ‘నాకు తెలుసు. యేవిఁటో చెప్పమంటే నాకు తెలియదు’ – అని కొన్ని శతాబ్దాల క్రితం వో జిజ్ఞాసువన్నాడు. మాయామర్మం కింద కొట్టిపారేయదలిస్తే నేనో చిన్న ప్రశ్న అడుగుతాను-తీపి అంటే యేమిటి ? తీపి అంటే తియ్యగా వుండేది. తియ్యగాఅంటే ? చక్కెరలాగా వుండేది. చక్కెర యెలా వుంటుంది? తియ్యగా. తియ్యగా అంటే యెలా వుంటుంది? చక్కెరలాగా. చక్కెర యెలా వుంటుంది. తియ్యగా. తియ్యగా అంటె యెలా వుంటుంది? మూడురోజులు ‘కుస్తీ’ పట్టినా ఫలితం వుండదు. తీపి తినిపించండి. యిట్టే తెలిసిపోతుంది. తదనుభవం రవ్వంత కూడా లేని వ్యక్తికి, యే మౌలిక ప్రాతిపదికను గానీ నిర్వచనంలోకి యిమిడ్చి అందించటం సాధ్యపడదు.
నవలాశిల్పం గురించి నాకు తెలుసు. యేవిఁటో చెప్పమని అడిగితే మాత్రం నాకు తెలియదంటాను. అనుభవం లోంచి గ్రహించేందుకు వుపకరించే వివరణలు చెప్పటం వరకే. ఫలానా ఫలానా పుస్తకాలు (నవలలు) చదవండి నవలంటే యేవిఁటో మీకే అవగతవుతుందని చెప్పాల్సొస్తుంది. యీ దృష్ట్యా, నవలాశిల్పం గురించి కొంత ముచ్చటించుకోవొచ్చు.
నవల-నాటకం, కథ-అని అంటాం కాబట్టి నవల, నాటకం కాదు, కథకాదు. మరేవిఁటి?
నాటకంలో, యేదో యితివృత్తాన్నాధారం చేసుకుని కథేదో వుంటుంది – కథలో నాటకీయత దాదాపు లేనట్లే. నాటకంలో పాత్రల చేష్టలూ మాటలూ వుంటాయి. పానకంలో పుడకలా, రచయిత కాలికీ వేలికీ అడ్డు పడేందుకు అవకాశం లేదు. నాటకం చేష్టా ప్రదానం. వేదికమీద ఆడేందుకు తద్వారా ప్రేక్షకుల్లో (శ్రోతలుగూడా) నేరుగా ప్రత్యనుభూతిని కలిగిస్తుంది. కథ, ప్రధానంగా కథన రూపంలో (narrative) వుంటుంది. అంచేత, కథ చెప్పటంలో నేర్పు లేకపోతే విసుగ్గా (boring) తయారవుతుంది.
నాటకీయతనూ కథా కథనాన్నీ సంలీనం చేసి, సంభాషణులు తొడిగి, కథ చెబితే నవల అవుతుంది. అంచేత, చిన్నదైతే (సైజు) కథ, పెద్దదైతే నవల-అని నేను భావించను. నవల నవలే చిన్నదీ పెద్దదీ అంటూ వుండదు. పేజీల దృష్ట్యా దప్ప (సైజు) యిది నవలా శిల్పానికి మూలకందం.
వంద పేజీలకి పైగా సాగినంత మాత్రాన కథ, నవల అవదు. అరవై పేజీలకి మించనంత మాత్రాన నవల కథ అవదు.
నాటకం, కథ, నవల-వీటిని తులనాత్మకంగా పరిశీలిస్తే కొన్ని మౌలిక సామ్యాలూ విభేదాలూ కనిపిస్తాయి. వీటికీ వ్యాసానికీ (essay) చుక్కెదురు. వీటిలో వ్యాసపు ధోరణిని చొప్పించితే పరమఛండాలంగా తయారవుతాయి. నిజానికి మంచి నవలలుగా, కథలుగా నాటకాలుగా రూపించి నిలవ తగ్గ కొన్ని రచనలు, కేవలం కర్ట్ లెక్చర్స్ చొప్పించటం వల్ల భ్రష్టవఁయ్యాయి. యిందుక్కారణం, ఆయా శిల్పాల తత్వం బాగా తెలియకపోవటమూ కావచ్చు, మరేదైనా ‘బలహీనతా’ కావొచ్చు.
విసృత వర్గీకరణ దృష్ట్యా నవలా శిల్పంలోని రీతులను పరిశీలిస్తే.
ముఖ్యపాత్ర తనకి తానుగా కథ నడపటం-దృక్కోణం యెంత విసృతవైఁనదయినా, అది వైయక్తికమే అవుతుంది. యీ ధోరణిలో రాసిన నవలలో, ముఖ్యపాత్రకి తెలియటానికి వీలులేని సంఘటనలో విషయాలో దిగబడే పొరపాటు అప్పుడప్పుడూ జరిగితే జరగడానికి అవకాశం వుంటుంది. యీ పద్ధతి, నవలకంటే కథకి బాగా నప్పుతుంది.
కథాకథనం రచయిత నడపటం-యిది నవలా ప్రక్రియకి బాగా నప్పుతుంది. యిందులోనే మధ్యలోనే అక్కడక్కడా రచయిత మౌనవ్రతం ప్రారంభించి, పాత్రలచేత తమ గురించి తాము కొన్ని పిట్టకథల్లాటివి చెప్పుకునేలాగా చెయ్యటం, యింకో పద్ధతి. ఆ తరువాత-రచయిత తానే పూర్తిగా కథాకథనం సాగించటంలో రెండు రకాలున్నాయి. వకాల్తా పుచ్చుగుని, పుచ్చుకోకుండానూ. వకాల్తా పుచ్చుగుని చెప్పటం బాగా పాతపద్ధతి. పాత్రల ప్రవర్తనను మెచ్చుకుంటూనో నిరశిస్తూనో నైతికంగానో మరోరకంగానో తీర్పు చెబుతూ సంతోషించటమో విచారపడటమో కోపగించుకోవటమో లాంటి పనులు చేస్తూ కథాకథనం సాగిస్తారు. అవన్నీ చెయ్యాల్సింది మేమూ, మధ్య వీడెవడు (యిదవత్తె) అని విసుక్కుంటారు పాఠకులు. ఐతే, ముఖ్య పాత్ర తానుగా కథాకథనం సాగించే పక్షంలో అటువంటివన్నీ బాగానే వుండొచ్చు. నవలలోని పాత్రల గురించి అదే నవలలో వైయక్తికంగా ఫీల్ అవటానికి గానీ యేరకంగానైనా తీర్పు చెప్పటానికి గానీ, ఆ రచయితకి హక్కులేదు పొమ్మన్నారు, యిటీవలి దశాబ్దాలలో కొందరు ప్రముఖ ప్రపంచ సాహితీ వేత్తలు. యీ ధోరణిలో సాగినవాటిని యీ నాటి ‘ఆధునిక నవల’ (Modern Novel) గా చెప్పేందుకు యెంతమాత్రం వీలులేదు. వకాల్తా పుచ్చుకోకుండా చెప్పటం ఆధునిక నవలా శిల్ప లక్షణాలలో వొకటి. పాత్రలను రూపొందించి వాళ్ళని నేరుగా పాఠకులకు అప్పగించటం, ఆ పైన పాఠకులతో పాటు రచయిత తానూ వొక పాఠకుడిగా వాళ్ళ మీద తీర్పు చెప్పొచ్చు. తన అభిప్రాయాలనూ అభిరుచులనూ అనుసరించి ఫీలవనూవొచ్చు.
చేతనా స్రవంతి (Stream of Consciousness) మరొక పద్ధతి. యిది మరీ యిటీవలి కాలంలో వచ్చింది ప్రముఖంగా. యీ శతాబ్దంలో వొచ్చిన కొన్ని తాత్విక మానసిక సిద్ధాంతాల ప్రభావం వల్ల యీ పద్ధతి రూపొందినట్లు భావించవచ్చు. యిందులో పాత్రల మనోస్రవంతిని కళ్ళెంలేని గుఱ్ఱంలా పరిగెత్తనిస్తారు. చేతనలో చేతనా విచేతనా అంశాలూ, గతవూఁ వర్తమానవూఁ భవిష్యత్తూ బాహ్య అంతర అవధులూ అన్నీ కలగా పులగంగా అలుముకు పోతాయి. పోయి ఝరీ ప్రవాహంలా ముంచెత్తుతుంది. యిందులో రచయిత తానుగా చేసే పని చాలా తక్కువ. తీసుకున్న ఆ కొద్ది వర్తమాన సమయంలో బహిరంగంగా జరిగేవాటి మధ్య లింకుల్లో, ఆ ఝరీ ప్రవాహంలో యిమడజాలని వాటిని, రచయిత తానుగా తగిలిస్తాడు అనేకానేక కారణాల వల్ల పాత్రల మానసం విస్ఫులింగంలా సంచలితవైఁ మరొక వ్యక్తి రచయిత వివరణలోకి నప్పేలాగా యిమడని స్థితిలో యీ పద్ధతి బాగా వుపకరిస్తుంది. రచన మొత్తం యీ రీతిలో సాగితే, యెక్కువ మంది పాఠకులకు కొంత అయోమయం, అవగాహన, రవంత విసుగు కలిగే ప్రమాదం వుంటుంది. పాఠకపరిణతి వొక స్థాయికి వొస్తే తప్ప, యీ రీతికి అంతగా ఆదరణ వుండదు. నాకు తెలిసినంతలో – తెలుగులో చేతనా స్రవంతి నవల వొకే వొకటి వొచ్చింది, యిప్పటికి శ్రీ ‘నవీన్’ రాసిన ‘అంపశయ్య’.
కథాకథన ప్రధానమైన రీతి. పాత్రలు అన్నదీ అనుకున్నదీ అనుకోనిదీ, చేసిందీ చెయ్యాలనుకున్నదీ చెయ్యాలనుకోనిదీ, అమాంబాపతూ సోది చెప్పినట్లుగా చెప్పుకుపోతారు. యిది నవలా శిల్పానికి దూరమవుతుంది. ముఖ్యంగా, నాటకీయత లోపిస్తుంది.
సంభాషణ ప్రధానమైన రీతి. నాటకంలో సంభాషణలతో పాటు, నటనకి సంబంధించి బ్రాకెట్లో యిచ్చే దానికి బ్రాకెట్లు తీసేసి సంభాషణల దండ గుచ్చుతారు. నాణెంకి వొకవైపే చూపెట్టినట్లు, పాత్రల ఆంతర్యం పాఠకులకు అంతగా చిక్కదు. పూర్తిగా బిహేవియరిస్టు సైకాలజీ సిద్ధాంతానికి కట్టి పడేసుకుంటే తప్ప, యీ రీతి అభిలషణీయమవదు. పైగా కథనం లోపిస్తుంది.
సమగ్రరీతి నాటకీయతనూ కథాకథనాన్నీ సంలీనం (synthesise) చేసి పాత్రల స్వభావాన్ని విశదపరచే, కథా గమనానికి వుపకరించే, వాళ్ళ జీవితాల్లోని ముఖ్యమైన మలుపుల్ని తెలియజేసే లేదూ అటువంటి మలుపులకి దారి తీసే, సంభాషణలను జోడించి కథ నడుపుకు పోవటం. పాత్రలు తాము అనుకున్నది అంతాకాదు గానీ, వాళ్ళ అంతర్యపుటాంతర్యాన్ని వివరించే మానసిక సంఘటనల స్రవంతిని వాళ్ళకై వాళ్ళే వెలిబుచ్చుకోవటం పాత్రల మానసిక పరిస్థితినీ మూడ్‌నీ అనుసరించి బాహ్య ప్రకృతిని చిత్రించాల్సినపుడు వాళ్ళ ద్వారానే వర్ణించటం. అవసరమనిపించిన చోట్ల తాను ”రచయిత”గా చిత్రించటం. నైతికంగానో చట్టరీత్యానో మరోరకంగానో మరో మరో రకంగానో యెక్కడికక్కడ పాత్రల పీకల మీద ‘జడ్జీ’ఐ కూచోకుండా, అదంతా పాఠకులకి వొదిలెయ్యటము. అంతగా అనిపిస్తే నవల ముగించేసి, దాని మీద ‘జడ్జివ్యాసం’ రాసుకోవచ్చు. సూచన మాత్రంగా అందించే (suggestivity) ధోరణిని అవలంబించటం, వీటంటినీ మించి కూర్పులో ‘బిగి’.
యీనాటి ‘ఆధునిక నవల’ యీ సమగ్రరీతిలో సాగినట్లు చెప్పుకోవచ్చు. అన్నీ, కనీసం కొన్ని లక్షణాలైనా వున్నప్పటికీ, నవలాశిల్పం దృష్ట్యా చెప్పుకో తగిన రచనలా చాలా తక్కువ. అన్నీ వున్నా అవకతవకగా అస్తవ్యస్తంగా బిగిలేకండా కూర్పటంతో శిల్పం దెబ్బతింటోంది.
పత్రికలలో నవలలు సీరియల్స్‌గా రావటం మొదలయ్యాక రీడర్‌షిప్ పెరిగినమాట వాస్తవమే గానీ, పాఠకుల స్థాయి చెప్పుకోతగినంతగా పెరగలేదు. యీ సీరియళ్ళు, పత్రికాధిపతులకూ రచయితలకూ వ్యాపార ప్రకియగా మారుతున్నదేమోనని నా అనుమానం. వొకే కథావస్తు యితివృత్తాన్ని తిరగాబోర్లావేస్తూ, సంఘటనలు, స్థితిగతులు, పేర్లు సంభాషణలు తదితరాలను అటు ఇటూ చేస్తూ డజనో డజన్నరో కవలనవలలు వొకే రచయిత రాయటవూఁ కనిపిస్తోంది. తీసుకున్న యే అంశాన్ని గాని లోలోతులకు తరచని నేలబారు తనం (surfacial crawling) యెక్కువగా వున్నట్లనిపిస్తోంది. సంభాషణ, కథమెలిక, సంఘటన, వారవారం మలుపు, అపోహలు, అపార్థాలు, సెంటిమెంటు, రహస్య సంఘటనలు వంటి వాటిని అవుచిత్యాన్ని మించి వాడుకుంటూ యింకా యెదగాల్సిన పాఠకుల్ని యింకాకిందికి దిగలాగే ధోరణి యెక్కువగా కనిపిస్తోంది. యీ తాపత్రయంలో పడటం వల్ల నవలాశిల్పం అధోగతికి జారిపోతోంది. కొందరు పాత్రలు, కాసిన్ని సంభాషణలు, సంఘటనలు వుండి యే రెండొందల పేజీల దాకానో, లాక్కుపోతే నవల అవుతుందనే అభిప్రాయం అస్పష్టంగా యిటీవలి కాలంలో స్థిరపడిపోతున్నదేమోనని నా అనుమానం. తాళ ప్రమాణంలో టన్నుల తూకంలో దయ్యప్పిల్లలా తయారవుతున్న యీరకం సరుకు చూస్తుంటే తెలుగు నవలా సాహిత్యం చివరకేం కాబోతున్నట్లని దిగులు పుట్టుకొస్తుంది.
యీ దృష్ట్యా, తెలుగులో, చెప్పుకోతగిన ”ఆధునిక నవలలు” యేపాటి వున్నదీ గ్రహిస్తే తెలుగు నవలా భవిష్యత్తుకు వుపకరిస్తుంది.
యిటీవల, విప్లవనవల అని వినిపిస్తోంది. నాకు తెలిసినంతలో ఈ పేరున నవల యేది గానీ రాలేదు. విప్లవనవల అంటే నవలాశిల్ప రీతిలో విప్లవమా? ఐతే అభిలషణీయమే. లేక, శిల్ప విధ్వంసనలో విప్లవమా? శిల్పాన్ని కాలదన్నిన రచన, నిలిచే అవకాశం వుండదు. వొక్కొక్క సందర్భంలో ప్రచార సాధనంగా కొంత ప్రయోజనం సాధించవచ్చు. శిల్పాన్ని మన్నిస్తూనే ప్రయోజనాన్ని సాధించే రీతిలో రాయనూవొచ్చు. నాలుక్కాలాలపాటు నిలిచేలా మలచనూవొచ్చు. ధూత్తేరీ, అదంతా మాకొద్దు పొమ్మంటే, యెవరు మాత్రం యేం చెప్పగలరు ! లేక, శిల్పం గురించి కాక నవలా వస్తువు గురించా ? వస్తువుకి సంబంధించి విప్లవమంటే పరిశీలించాల్సిన అంశమే. యెంచేతంటే వస్తువు నుంచి పూర్తిగా విడదీసినప్పుడు, శిల్పం ‘తూతూమంత్రం’ ఐపోతుంది.
నవలాశిల్పమూ – వస్తువూ.
కళ కళ కోసమే అని అన్నా, కళ ప్రయోజనం కోసమే అని అన్నా రాసింది ‘సాహిత్యం’ అవ్వాలంటే శిల్పమూ వస్తువూ అనివార్యావసరం.
వస్తు ప్రసక్తి రాగానే వాస్తవమూ అవాస్తవమూ అనే అంశం తలెత్తుతుంది. యింతకీ వాస్తవం (realism) అంటే యేవిఁటి ? యీ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలంటే, యీ ప్రస్తుతన ”రచన” పరిధిని మించిపోతుంది. అంచేత, దేనినైతే యింద్రియాల ద్వారా నిర్ధారించవొచ్చునో, అది అనే దగ్గర ఆగిపోయి ముచ్చటిస్తాను అంతర బహిర శారీరక మానసిక అంశాలను యింద్రియాల ద్వారా నిర్ధారించవొచ్చు. దహించి వేసే అవమానమూ వాస్తవమే, తీపుగా కోస్తున్న చర్మం క్రింది పొక్కు వాస్తవమే. సంవేదనా వాస్తవమే, నడుస్తున్ననేలా వాస్తవమే. తీసుకునే వస్తువు, అసంబద్ధమూ అసంగతమూ కాకుండా వుండాలంటే అది వాస్తవ పరిధిలోనిదై వుండాలి. అంతర బహిర జగత్తులు, వ్యక్తీ సంఘమూ, శరీరమూ మనసూ-వీటిని వొకదాని నుంచొకటి పూర్తిగా వేరుచేసినప్పుడు మిగిలేది శూన్యం. మనిషి యెదుర్కుంటున్న సమకాలీన సమస్యలన్నీ, వస్తువే వాస్తవమే. వొకదాన్లో నుంచి వొకదాన్ని గమనిస్తూ గ్రహిస్తూ – ఆ సమస్యలకి పరిష్కారం కనుక్కొనే ప్రయత్నాలన్నీ ప్రయోజనాలే. మానవత్వం దృష్ట్యా, సమస్య ఐకూచున్న ప్రతిదీ సాహిత్యవస్తువే.
శిల్పమూ వుంది. వస్తువూ వుంది. మరి పేచీ యొక్కడున్నట్లు !!
(సేకరణ : కడప జిల్లా రచయితల సంఘం సావనీర్ నుండి సానెట్)
Permalink