Rss Feed

కె.వి.రెడ్డి

కె.వి.రెడ్డి గా సుప్రసిద్ధుడైన కదిరి వెంకట రెడ్డి (K.V.Reddy, Kadiri Venkata Reddy) తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించుకొన్న కె.వి.రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1912 వ సంవత్సరం జూలై 1 న జన్మించాడు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు సత్య హరిశ్చంద్ర చిత్రంలో రేలంగి, జగదేకవీరుని కథ చిత్రంలో రాజనాల, మాయాబజార్ చిత్రంలో ఎస్వీ.రంగారావు పాత్రలు. అంతేకాక కె.వి.రెడ్డి సినిమాలలో గిల్పం, తసమదీయులు, పరవేశ దవారం, డింభక లాంటి కొత్త పదాలు వినిపించడం కద్దు. ఈయన సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుంది. విషయ సూచిక * 1 సినీ ప్రస్థానం o 1.1 భక్త పోతన o 1.2 పాతాళ భైరవి o 1.3 పెద్ద మనుషులు o 1.4 దొంగ రాముడు o 1.5 మాయా బజార్ o 1.6 జగదేకవీరుని కథ o 1.7 శ్రీకృష్ణార్జున యుద్దం o 1.8 సత్య హరిశ్చంద్ర o 1.9 శ్రీకృష్ణ సత్య * 2 దర్శకత్వ శైలి * 3 విశేషాలు * 4 పని చేసిన సినిమాలు * 5 వనరులు సినీ ప్రస్థానం సినిమాల గురించీ, సినిమా నిర్మాణం గురించీ తెలుసుకుని, పుస్తకాలు చదివి సినిమాలమీద అభిమానం పెంచుకున్న కె.వి.రెడ్డి, స్నేహితుడైన మూలా నారాయణస్వామి సలహా మీద గృహలక్ష్మి (1938 సినిమా)కి కేషియరుగా పని చేశాడు. తరువాత వాహినీ సంస్థ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన వందేమాతరం (1939) సినిమాకు ప్రొడక్షన్ మేనేజరుగా పని చేశాడు. ఇదే సినిమాకు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకుడిగా ఉన్నాడు. తరువాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి సినిమాలైన సుమంగళి (1940), దేవత (1941), స్వర్గసీమ అన్నింటికీ ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశాడు. వాహినీ సినిమాలలో ఈయన ప్రొడక్షన్‌ మేనేజరు, కాషియరూ ఐనా, ఆలోచనంతా సినిమా దర్శకత్వం, నిర్మాణం మీదనే ఉండేది. భక్త పోతన కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భక్త పోతన (1942). భక్తపోతన పెద్ద హిట్‌ కావడంతో యోగివేమన (1947) తీశాడు, కె.వి.రెడ్డి. ఆర్థికంగా లాభించకపోయినా ప్రపంచ సినిమాల స్థాయిలో 'యోగివేమన' కూడా ఒక క్లాసిక్‌ అన్న ఖ్యాతి లభించింది. ఈ రెండు సినిమాలలో కూడా చిత్తూరు నాగయ్య కథానాయకుడు. తరువాతి సినిమా గుణసుందరి కథ (1949). ఇందులో విషాద పాత్రలకు పేరు పొందిన శ్రీరంజని గుణసుందరీ దేవిగా నటించింది. ఈ సినిమాకు కె.వి.రెడ్డి మరియు కమలాకర కామేశ్వరరావు కలసి చిత్రానువాదం అందించగా, పింగళి నాగేంద్రరావు సంభాషణలు రాసాడు. పాతాళ భైరవి కె.వి.రెడ్డి మరియు విజయా సంస్థల పేర్లను ఆంధ్రదేశంలో ప్రతి ఒక ఇంట్లో మారుమోగేలా చేసిన పాతాళ భైరవి సినిమా 1951 సంవత్సరంలో విడుదలైంది. జానపదాల్లో పాతాళభైరవి అనేక విషయాల్లో మార్గదర్శకమైంది. ఈ సినిమా కథకు చందమామ పత్రికలో వచ్చిన ఒక కథ మూలం. నేపాలీ మాంత్రికుణ్ణి సంహరించి తన సాహసంతో ఉజ్జయినీ రాకుమార్తెను పొందే వీరుడిగా ఎన్.టి.రామారావు సరిగ్గా సరిపోయాడు. నేపాళీ మాంత్రికుడుగా అద్భుతంగా నటించిన ఎస్వీ రంగారావుకీ ఈ సినిమా ద్వారా మంచిపేరు వచ్చింది. ముఖ్యంగా సాహసం శాయరా డింభకా, రాకుమారి లభించునురా అన్న వాక్యం ప్రాచుర్యం పొందింది. నేపాళీ మాత్రికునితో పాటు ఉండే డింగిరి పాత్రలో పద్మనాభం నటించాడు. ఉజ్జయినీ మహారాజుగా సి.ఎస్.ఆర్.ఆంజనేయులు నటించగా, అమాయక రాకుమారుని పాత్రలో రేలంగి నవ్విస్తాడు. ఈ సినిమాలోని ఒక పాటలో ప్రముఖ నటి సావిత్రి కనిపించడం విశేషం. ఈ చిత్రంలాగే ఇందులోని పాటలు కూడా అద్భుత విజయం సాధించాయి. ముఖ్యంగా కలవరమాయే మదిలో, ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడూ పాటలు ఆంధ్ర్రదేశమంతా మారుమోగాయి. పెద్ద మనుషులు పాతాళభైరవి లాంటి జానపదం తీసిన తరువాత 1954లో సాంఘిక చిత్రమైన పెద్ద మనుషులు చిత్రం విడుదలైంది. సాంఘికాల్లో పెద్ద మనుషులు చిత్రాన్ని కీర్తిస్తూ న భూతో న భవిష్యతి అన్నారు అప్పటి విమర్శకులు. పదవుల ఘరానా ముసుగులో అవతవకలకు పాల్పడే పెద్దలను విమర్శిస్తూ తీశారు ఈ సినిమా. పెద్దలు చేసే పనులలో లొసుగులను బయటపెట్టే తిక్క శంకరయ్య పాత్ర రేలంగి సినీ జీవితంలో మరపురాని పాత్రలలో ఒక్కటి. ప్రముఖ సినీ రచయిత డి.వి.నరసరాజుకు ఇదే తొలి సినిమా. కొసరాజు రాసిన శివ శివ మూర్తివి గణనాథా, నీవు శివుని కుమారుడవు గణనాథా పాట ఇప్పటికీ వినబడుతూంటుంది. [మార్చు] దొంగ రాముడు దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావులు సినీ నిర్మాణ కంపెనీ ఆరంభించినా, కె.వి.రెడ్డి చేతనే తొలి చిత్రం తీయించాలని అనుకోవడంతో, ఆయన కోసం రెండేళ్లు పైచిలుకు కాలం నిరీక్షంచవలసి వచ్చింది. ఆ చిత్రం అన్నపూర్ణావారి దొంగరాముడు (1955). ఈవాళ ఆ చిత్రం పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని విద్యార్ధులకు బోధనాపాఠం. ఒక దొంగ తన తప్పులు తెలుసుకొని తనను తాను సంస్కరించుకొనే పాత్రలో ఏయన్నార్ చక్కగా నటించాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మరియు ఆర్.నాగేశ్వరరావుల మధ్య పోరాట సన్నివేశాలను అత్యంత సహజంగా, అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో సావిత్రి పూలమ్మే అమ్మాయిగా నటించగా జమున, అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించింది. సానుభూతి పరుడైన వైద్యునిగా కొంగర జగ్గయ్య నటించాడు. మాయా బజార్ ప్రధాన వ్యాసం: మాయా బజార్ ఒక్క మాయాబజార్‌ సినిమా చాలు చిత్రానువాదం (స్క్రీన్‌ ప్లే) నడపడంలో కె.వి.రెడ్డి వైదుష్యం ఎంతటిదో అర్థం కావడానికి. ఆ చిత్రం ఎన్ని సార్లు చూసినా.., ఫలానా నన్నివేశం అనవసరమనో లేక ఇంకేదో సన్నివేశం అవసరం ఉందనో అనిపించదు. సినిమా మూడు గంటలపాటు నడిచినా ముప్పావుగంటలో అయిపోయిందన్న భ్రమ కల్పించడానికీ, సర్వకాలాల్లోనూ సర్వప్రేక్షకుల్నీ అలరిస్తూ ఆహ్లాదపరచడానికీ, ఆ చిత్రానువాదమే కారణం. తెలుగు సినిమా చరిత్రలో విడుదలైన అద్భుత చిత్రాలలో ఈ సినిమా ప్రథమ స్థానం అలంకరించిందంటే అది ఆ దర్శకచక్రవర్తి ప్రజ్ఞ. ప్రజ్ఞతో చేసిన తపస్సు. పాతాళ భైరవి తరువాత కెవి.రెడ్డి విజయా సంస్థకు చేసిన రెండవ సినిమా ఇది. దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడితో వివాహం నిశ్చయమైన శశిరేఖను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుడితో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవులను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని కథాంశాలు. జగదేకవీరుని కథ 1958లో ఎ.ఎన్.ఆర్, జమున నటించిన పెళ్ళినాటి ప్రమాణాలు లాంటి సాంఘికం చేసిన తరువాత 1961లో జగదేకవీరుని కథ లాంటి అద్భుత జానపదాన్ని తీశాడు కె.వి.రెడ్డి. ఇందులో నలుగురి కథానాయికలలో ఒకరిగా బి.సరోజాదేవి నటించింది. ప్రతాప్ అనే రాకుమారుడు దేవకన్యలను పెళ్ళి చేసుకొనే కోరికతో బయలుదేరి, దేవతలనే మెప్పించి నాగ కన్య, అగ్ని పుత్రిక, వరుణుడి కుమార్తె, ఇంద్ర పుత్రికలను పెళ్ళాడటం ఈ చిత్రంలోని కథాంశం. ఇందులోని శివశంకరి పాట ఎంతో పేరుపొంది ఘంటసాల కీర్తిని శాశ్వతం చేసింది. శ్రీకృష్ణార్జున యుద్దం 1962 సంవత్సరంలో తెలుగు సినిమాకు రెండు కళ్ళయిన రామారావు - నాగేశ్వరరావు కలసి నటించిన శ్రీకృష్ణార్జున యుద్దం విడులైంది. మహాభారతంలోని పాత్రలను తీసికొని కల్పించిన కథతో ఈ చిత్రాన్ని తీసారు. గయుడు అనే గంధర్వుడు పుష్పక విమానంలో వెడుతుండగా తను నములుతున్న తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు. అది సంధ్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుని చేతులో పడుతుంది. దానితో ఆగ్రహించిన కృష్ణుడు గయుణ్ణి సంహరిస్తానని శపథం చేస్తాడు. దానితో భీతిల్లిన గయుడు నారదుని సలహామీద, అసలు విషయం చెప్పకుండా అర్జునుని శరణు పొందుతాడు. తరువాత విషయం తెలిసికూడా ఇచ్చిన అభయం నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు శ్రీకృష్ణుడితో పోరాడటం ఇందులోని కథాంశం. సత్య హరిశ్చంద్ర 1965 సంవత్సరంలో కె.వి.రెడ్డి, హరిశ్చంద్రుని పాత్రలో ఎన్.టీ.ఆర్ ను, చంద్రమతి పాత్రలో ఎస్.వరలక్ష్మిని తీసికొని సత్య హరిశ్చంద్ర చలన చిత్రాన్ని తీశాడు. విశ్వామిత్రునిగా ముక్కామల నటించగా, కాటికాపరి పాత్రలో రాజనాల నటించాడు. ] శ్రీకృష్ణ సత్య 1972 సంవత్సరంలో కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రం శ్రీకృష్ణ సత్య విడుదలైంది. కృష్ణుని పాత్రలో మళ్ళీ ఎన్.టీ.ఆర్ నటించగా, సత్యభామ పాత్రలో జమున నటించింది. దర్శకత్వ శైలి నిర్మాణ శాఖనీ, దర్శకత్వ శాఖనీ రెంటినీ ఆకళింపు చేసుకున్న వ్యక్తి కె.వి.రెడ్డి. ఏ చిత్రం తాను నిర్దేశకత్వం చేసినా, పథకం అంతా తనే సిద్ధం చేసేవాడు. వేసుకున్న బడ్జెట్‌లోనే సినిమా తియ్యడం సాద్యం చేసుకున్నట్టుగానే రాసుకున్న సినిమా నిడివిని దాటకుండా, సుసాధ్యం చేసుకోగలిగిన దర్శకుడు కె.వి.రెడ్డి. నిడివి విషయంలో ఎంతో దూరాలోచన ఉండేది కె.వి.రెడ్డికి. అలాగే కె.వి.కి దూరదృష్టి కూడా చాలా ఎక్కువ. ఏది తీసినా, ఏది తలపెట్టినా కథాగమనానికీ, దృశ్యనిర్మాణానికీ అతను వెచ్చించవలసిన కాలం వెచ్చించవలసిందే. అందులో రాజీ ఉండదు. 'గుణసుందరి కథ' లో ‘శ్రీరంజని హీరోయినా?’ అన్నారు కొందరు - మిత్రులూ, పరులూ. పాతాళభైరవిలో "రామారావు పక్కన మాలతి ఏం బావుంటుంది?" అన్నారు వాళ్లే. మాయాబజార్‌ లో అంత లావు సావిత్రి శశిరేఖా? ‘రేవతి ఛాయాదేవా?’ అన్నవాళ్లకి "అందుకే ఛాయాదేవి!" అని ఆయన సమాధానం ఇచ్చారు. అంతలావు తల్లి ఉన్నప్పుడు పక్కన కూతురిలో ఆ లావు కనిపించదని కె.వి. నమ్మకం. శ్రీరంజని అయినా, మాలతి అయినా కథాపరమైన పాత్రలకి ఏ సమస్యా రాదన్నది ఆయన విశ్వాసం. బక్కచిక్కిన 'పోతన' పాత్రకి భారీమనిషి నాగయ్యేమిటి? - అని అప్పుడే వచ్చింది విమర్శ. నాగయ్య తన నటనతో, తన పర్సనాలిటీని మరపింపజేస్తాడని - కె.వి. ధీమా. ఒక్క కథాగమనం, షూటింగ్‌ పథకాలూ అనే కాకుండా - అన్నీ నిశితంగా ఆలోచించే నిర్ణయించేవాడు కె.వి. చిన్న వేషాలు, పక్కవేషాలు, చెలికత్తెల వేషాల నిర్ణయంలో కూడా ఆ ఆలోచన ఉంటుంది. కె.వి. రెడ్డిని చూసినప్పుడు ‘ఈయనా? సినిమా డైరెక్టర్‌లా లేరే!’ అనుకునేవారు కొత్తవాళ్లు. ముతక ఖాదీపంచె, పొట్టిచేతుల చొక్కా, పర్సు, కాయితాలూ, పెన్నులతో ఎత్తయిన జేబు, భుజం మీద వేల్లాడుతూ కండువా -ఇదీ కె.వి. వేషధారణ. అందర్నీ ‘బ్రదర్‌!’ అని సంబోధిస్తూ ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేవాడు. షూటింగులో కె.వి.విధానమే వేరు. తానుగా చేసి చూపించడమో, నటించడమో చేసి చూపించేవాడు కాదు. చెప్పేవాడు కూడా కాదు. పాత్రధారుల్నే చెయ్యమనేవాడు. అది తనకి కావలసిన రీతిలో లేకపోతే, ఇంకోలాగా, ఇంకోవిధంగా చెయ్యమనీ, చెప్పమనీ - తను ఎన్నికచేసి ఖాయం చేసేవాడు. ఎక్కువ తక్కువలుంటే చెప్పేవాడు. కళాకారులకి స్వతంత్రం వుండేది - దర్శకుని నియంత్రణా ఉండేది. షాటులో ఆరుగురు నటులుంటే - మాట్లాడే వారొక్కరే అయినా, ఫైనల్‌ రిహార్సల్సు ఆరు చేయించేవారు. ఒకొక్క రిహార్సలులోనూ ప్రతి ఒక్కరి రియాక్షనూ చూసేవారు. ఎక్కువ తక్కువలుంటే - సరిదిద్దేవాడు. టేకు ముందు మేకప్‌లు, లైటింగ్‌, కెమెరా పొజిషనూ అన్నీ ఓసారి సరిచూసుకుని ‘టేక్‌!’ చేసేవాడు. ఐతే, ఆయన ఏనాడూ ‘ఒకే!’ అని గట్టిగా అనలేదు. ‘పాస్‌!’ అనడమే ఆయన అలవాటు. అతని చిత్రాల్లో మంచిపాత్రలు ధరించి పేరు తెచ్చుకున్న రేలంగి, కె.వి.రెడ్డి "పాస్‌ మార్కులు ఇచ్చేవారే గానీ, నూటికి నూరు ఇవ్వడం మేము ఎరగం" అని చెప్పాడు. కె.వి.రెడ్డి షూటింగుకి సందర్శకులకు అనుమతి ఉండేది కాదు. మరీ కావలసినాళ్లో, తప్పనిసరో అయితే ముగ్గురికో, నలుగురికో అనుమతి ఇచ్చేవాళ్లు - అదీ పది, పదిహేను నిమిషాల్లో వెళ్లిపోవాలి. పూర్తి నిశ్శబ్దం, క్రమశిక్షణ, ఏకాగ్రత కనిపించేవి అతని షూటింగుల్లో. చిత్రాలు దర్శకత్వం చెయ్యమని బయటి సంస్థల నుంచి ఎంత గిరాకీ వున్నా కె.వి.రెడ్డి అంగీకరించేవాడు కాదు. ఒక సినిమా అయిన తర్వాతే, ఇంకో సినిమా తియ్యాలనే తత్వం ఆయనది. "మిగతా డైరెక్టర్లు ఒకేసారి రెండుమూడు చిత్రాలు చేస్తున్నారుకదా!" అంటే - "ఐయామ్‌ సారీ! ఐ డోంట్‌ హావ్‌ టు బ్రెయిన్స్‌!" అన్నది కె.వి.సమాధానం. జయాపజయాలు అనేవి అందరికీ వుంటాయి. అన్నిచోట్లా వుంటాయి. కె.వి.కీ వున్నాయి "చిత్రాలు విజయం పొందినప్పుడు ఎలా స్పందిస్తామో, పరాజయం పొందినప్పుడూ స్పందిస్తాం. రెండిటినీ సమానంగానే యాక్సెప్ట్‌ చెయ్యాలి!" అనేవాడు కె.వి.రెడ్డి. విశేషాలు * చిత్ర నిడివి విషయంలో కె.వి.రెడ్డికి ఎంత దూరాలోచన అంటే - ఒక ఉదాహరణ : దృశ్యాల విభజన జరిగిన తర్వాత సంభాషణలు నిర్ధారించుకున్న తర్వాత ‘ఇంత నిడివి ఉండాలి’ అని నిర్ణయించుకున్న తర్వాత - సహాయకులచేత సీన్లు చదివించుకుని స్టాప్‌ వాచ్‌ పెట్టుకుని, టైముచూసుకుని, ‘పుటేజ్‌’ నోట్‌చేసుకోవడం - అతని అలవాటు. అలా ‘గుణసుందరి కథ’ (1949) లోని ఒకదృశ్యం విని - ‘ఎంతొచ్చింది?’ అని అడిగాడు. ‘రెండు నిమిషాలొచ్చింది’ అన్నాడు సహాయదర్శకుడు. 'కాదు, ఇంకో అరనిమిషం పెరుగుతుంది. ఎంచేతంటారా రాజుగారి వేషం వేస్తున్నది గోవిందరాజు సుబ్బారావు. మీరు చదివినట్టుగా ఆయన డైలాగులు చెప్పరు. ఇంకా తాపీగా చెబుతారు. అంచేత, ఆయన ఉన్న ప్రతి దృశ్యాన్నీ మనం వేసుకున్న టైముకి మరికొంత కలుపుకుంటూ రావాలి!' అని కె.వి. వివరించినట్టు - పింగళి నాగేంద్రరావు ఓసారి చెప్పాడు. * ‘జగదేకవీరుని కథ’ (1961) షూటింగ్‌ ఆరంభానికి నాలుగునెలల ముందే, కార్యక్రమాలు, షెడ్యూలు సిద్ధమైనాయి. ‘జలకాలాటలలో....’ పాట జనవరిలో పడింది. కాల్‌ షీట్‌ టైము ఉదయం ఏడుగంటలకి. జనవరి అంటే చలిరోజులు. నలుగురు అమ్మాయిలు ఆరున్నరకే రెడీ అయి, ఈతకొలనులోకి దిగాలి. నీళ్లు వెచ్చగా ఉంటే వాళ్లు హాయిగా దిగుతారు. లేకపోతే నసుగుతారు. పైగా చాలాసేపు నీళ్లలో ఉండాలి గనక - ‘ఆ పాట తీసే మూడుపూటలూ వేడి నీరు సరఫరా చెయ్యాలి’ అని నోట్‌ రాసి, ప్రొడక్షన్‌వారికి అందజేశాడు. షూటింగ్‌ వేళకి వెచ్చని నీళ్లు ‘పంపు’ కావడం, అనుకున్న షూటింగ్‌ రెండుపూటల్లోనే పూర్తికావడం జరిగాయి. పని చేసిన సినిమాలు దర్శకత్వం వహించినవి 1. భక్త పోతన (1942) 2. యోగి వేమన (1947) 3. గుణసుందరి కథ (1949) 4. పాతాళభైరవి (1951) 5. పెద్దమనుషులు (1954) 6. దొంగరాముడు (1955) 7. మాయాబజార్ (1957) 8. పెళ్ళినాటి ప్రమాణాలు (1958) 9. జగదేకవీరుని కథ (1961) 10. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) 11. సత్య హరిశ్చంద్ర (1965) 12. భాగ్యచక్రం (1968) 13. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (1968) 14. శ్రీకృష్ణసత్య (1971) చిత్రానువాదం అందించినవి 1. గుణసుందరి కథ (1949) 2. దొంగరాముడు (1955) కథ అందించినవి 1. దొంగరాముడు (1955) 2. మాయాబజార్ (1957) నిర్మాతగా వ్యవహరించినవి 1. పెళ్ళినాటి ప్రమాణాలు (1958) 2. జగదేకవీరుని కథ (1961) 3. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) 4. సత్య హరిశ్చంద్ర (1965) 5. భాగ్యచక్రం (1968) 6. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (1968)