Rss Feed

ప్రశ్నించే పద్ధతికి మన సంస్కృతిలో పెద్దగా స్థానం లేదు

మన వైజ్ఞానిక వ్యవస్థల్లో వెలితి ఎక్కడుంది అన్న విషయాన్ని చర్చిస్తున్నాం. మొదటి మాటగా ’Saga of Indian Science’ అన్న పుస్తకం నుండి కొన్ని అంశాలు పేర్కొన్నాను. అసలు లోపం మన సంస్కృతిలోనే ఉందని నా నమ్మకం. ఆ విషయాన్ని పాయింట్లుగా విపులీకరిస్తూ వరుసగా కొన్ని పోస్ట్ లు రాసుకొద్దామని ప్రయత్నం.

1. ప్రశ్నించే పద్ధతికి మన సంస్కృతిలో పెద్దగా స్థానం లేదు

మనది ప్రాచీన సంస్కృతి అని మనం ఎంతో గర్విస్తాం. కాని ఎన్నో సార్లు చాంతాడంత గతం ఒక భారంలా కూడా పరిణమిస్తుంది. మన సంస్కృతిలో జీవితం విస్తృతంగా వ్యవస్థీకరించబడుతుంది. పుట్టినదగ్గర్నుండి, పుడకల దాకా ఎప్పుడు ఏం చెయ్యాలో అన్నీ ఎప్పటికప్పుడు ఎవరో నిర్ణయించేస్తూ ఉంటారు. ఏం చదవాలి, ఏం ఉద్యోగం చెయ్యాలి, ఎప్పుడు ఎవర్ని పెళ్ళాడాలి, ఎప్పుడు ఎంతమంది, ఎలాంటి (ఆడా? మగా?) పిల్లల్ని కనాలి, వాళ్లని ఎలా పెంచాలి?.... ఇక్కడ జీవితం మన ప్రమేయం లేకుండానే మంత్రం వేసినట్టు దానికదే జరిగిపోతుంటుంది! ఏం చెయ్యాలో తెలీక సందేహంలో పడితే స్వామీజీలు ఉంటారు, జ్యోతిష్యులు ఉంటారు, న్యూమరాలజిస్టులు ఉంటారు (“రాష్ట్రం పేరు కొద్దిగా మార్చితే సమస్యలు వాటికవే సర్దుకుంటాయి”), బామ్మలు ఉంటారు (“దిష్టి తీసేయండి, తగ్గిపోతుంది”) ... ప్రతీ ప్రశ్నకి సమాధానం/సలహా చెప్పడానికి ఎవరో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రతీ దానికి ఏదో మార్గం ఉంటుంది.

ఇలా ఎందుకు చెయ్యాలి, ఈ పద్ధతి సరైనదా కాదా, అర్థవంతమా కాదా అన్న ప్రశ్న ఎవరికీ పట్టనట్టు ఉంటుంది. “పెద్దలు చెప్పారు, చెయ్యాలి:” ఈ గడ్డ మీద ఈ మాట విని విని విసిగిపోని వాడు ఉండడు. తాత చెప్పినట్టు, తండ్రి వింటాడు, తండ్రి చెప్పినట్టు కొడుకు వింటాడు... ప్రతీ తరం ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేకుండానే పుట్టి చచ్చిపోతూ ఉంటుంది. ఎవరికీ వాళ్ళంతకు వాళ్లు ఆలోచించాల్సిన అవసరం రాదు. ప్రశ్నించాల్సిన సందర్భమూ రాదు.

మన సంస్కృతిలో ఎటు చూసినా సమాధానలే కనిపిస్తాయి. ప్రశ్నలు ఎంత వెతికినా కనిపించవు. ప్రశ్నని పుట్టినవెంటనే ఎలా మట్టుపెట్టాలో మన సంస్కృతి ఉగ్గుపాలతో నేర్పుతుంది.

మరి ప్రశ్నలేకుండా, ప్రశ్నించే అలవాటు లేకుండా విజ్ఞానం అసంభవం. అసలు శాస్త్రవేత్తలు ఆరాధించే దేవత ’ప్రకృతి’ కాదు, ’విశ్వం’ కాదు, ’సత్యం’ కూడా కాదు. ఆ దేవత పేరు ’ప్రశ్న.’ ఆ ప్రశ్నని వెన్నంటడంలోని ఆనందం సమాధానం తెలిశాక ఉండదు. సమాధానం కనిపించగానే కార్పొరేట్ నేతలు పేటెంట్ల కోసం ఎగబడతారు; శాస్త్రవేత్త మరో ప్రశ్నని వెన్నంటుతూ ముందుకి సాగిపోతాడు.

“ఒక కాంతి తరంగం మీద స్వారీ చేస్తే అది కదులుతున్నట్టు కనిపిస్తుందా, లేక నిశ్చలంగా కనిపిస్తుందా?” అనే విచిత్రమైన ప్రశ్న ఐన్స్టయిన్ ని అంతటి వాణ్ణి చేసింది. “కేంద్రకం చుట్టూ గిర్రున తిరిగే ఎలక్ట్రాన్ కేంద్రకంలో ఎందుకు పడిపోదు?” అని బోర్ వేసిన ప్రశ్న ఆధునిక పరమాణు శాస్త్రంలో ఓ మైలు రాయి అయ్యింది. కొన్ని ప్రశ్నల వల్ల స్థూల ప్రయోజనాలు కూడా ఉండవు. కార్ల్ సాగన్ తన జీవితమంతా ’ఇతర ప్రపంచాలలో ప్రజ్ఞ గల జీవులు ఉన్నారా?” అన్న ప్రశ్న యొక్క శోధనకే అంకితం చేశాడు. దాని వల్ల స్థూలమైన ప్రయోజనాలు పెద్దగా ఒరగక పోయినా ఆయన రచనలు ఎంతో మంది శాస్త్రవేత్తలకే స్ఫూర్తినిచ్చాయి.


మనం ప్రశ్నించడానికి ఎందుకు ఇష్టపడం? ఎందుకంటే ప్రశ్నించడం అంటే తెలీదని ఒప్పుకోవడం, అజ్ఞానాన్ని ప్రకటించుకోవడం. మరి అజ్ఞానం భయపెడుతుంది, కలవరపెడుతుంది. అజ్ఞానం అంటే శూన్యం, న్యూనత. ఆ శూన్యాన్ని భరించలేక అందుబాటులో ఉన్న ఏదో చెత్తని తెచ్చి నింపుకుంటాం. ప్రశ్నించడం అంటే అవిధేయత, అగౌరవం, అస్థిరత, విప్లవం. పిల్లలు తల్లిదండ్రులని ప్రశ్నిస్తే అవిధేయత. శిష్యుడు గురువుని ప్రశ్నిస్తే అగౌరవం. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అస్థిరత, విప్లవం.

ప్రశ్నించే అలవాటు లేని సమాజంలో విజ్ఞానం వేళ్లూనదు. సైన్సు తెలియడం అంటే బోలెడు సమాధానాలు తెలియడం కాదు, ప్రశ్నించడం ఎలాగో తెలియడం. “ఇలా ఎందుకు ఉంది?” “ఇలా ఎందుకు చెయ్యాలి?” “మరోలా చేస్తే ఏమవుతుంది?” ప్రపంచంలో ప్రతీ అంగుళాన్నీ తూట్లు పొడిచేలా ప్రశ్నించాలి. రాత్రనక, పగలనక... నిద్రాహారాలు మాని ప్రశ్నించాలి. అదీ ప్రశ్నించడం అంటే!

ప్రశ్నించే కౌశలం విజ్ఞాన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మొదటి ప్రవేశార్హత.