Rss Feed

ద పోస్ట్ మాన్

- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
కావడానికి అవి అంత ప్రాముఖ్యం లేని సంగతులే గాని వాటి ఫలితంగా మారియో హిమేనెజ్ జీవితం కొత్త పుంతలు తొక్కింది. అదృష్టం కొద్దీ ఆ పరిస్థితులవల్లనే జూన్ 1969లోమారియో కొత్త ఉద్యోగంలో కుదురుకోవలసి వచ్చింది.
మారియోకు చేపలుపట్టడం అంటే మాచెడ్డ చిరాకు. నిజం చెప్పాలంటే తెల్లవారకముందే పక్కమీదినుంచి లేవడమంటే మరీ చిరాకు. అవును గదా, తెలతెలవారేటప్పుడు నిద్ర ఎంత మజాగా ఉంటుంది! అప్పుడేగదా శాన్ ఆంటోనియో మూవీ థియేటర్ లో తెరమీద కనబడి కళ్లు జిగేలుమనిపించే అమ్మాయిలతో ఎన్నెన్నో సాహసకార్యాలు చేస్తున్నట్టు కలలు కనొచ్చు. అలా మాగన్ను నిద్రలో కనేకలల వల్లనే అప్పుడప్పుడు నిజంగానూ అప్పుడప్పుడు ఉత్తుత్తిగానూ జలుబు చేసిందని చెపుతూ వచ్చాడు. తండ్రి పడవకోసం వలలు తయారుచేసే పని నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. దక్షిణాది ద్వీపాల నుంచి వచ్చే లావుపాటి బొంతలమధ్య ముడుచుకుని పడుకుని నిండుగా కలలు కనేవాడు. తన సోమరి స్వప్నగీతాలకు మరింతగా మెరుగు దిద్దుకుంటూ ఉండేవాడు.
అటువంటి సమయంలో ఈ సంగతి జరిగింది. తండ్రి హోస్ హిమేనెజ్ అప్పుడే సముద్రంమీద చేపల వేటకు వెళ్లి వచ్చి, కుప్పగా తడిసిపోయి, బాగా అలసిపోయి ఆకలితో ఇల్లు చేరాడు. ఆ సమయానికి ఇంట్లో ఉన్న మారియో అపరాధభావనతో అన్నట్టుగా తండ్రికి మధ్యాహ్న భోజనం తయారుచేశాడు. అప్పుడే కాల్చిన రొట్టెలు పెట్టాడు. టమాటాలు, ఉల్లిపాయలు ముక్కలు తరిగాడు. కాసింత పుదీనా, కాసింత కొత్తిమీర చల్లాడు.
తనకోసం మాత్రం ఒక తలనొప్పి మాత్ర పట్టుకుని కూచున్నాడు.
తన చేతి అన్నం తింటున్న ఆ పెద్దమనిషి వెటకారం నిండిన ముఖంతో “అలా పనీపాటా లేకుండా ఉండే బదులు ఏదన్నా ఉద్యోగం వెతుక్కోవచ్చుగా” అనేసరికి, ఆ మాట మారియో ఎముకల మూలుగుల్లోనుంచి లోలోపలికి జారింది. ఆ గొడవలో తలనొప్పి మాత్ర ఎంత నాటకీయంగా గొంతులోకి జారిందో తెలియలేదు.
“వెళ్లి పని వెతుక్కో” అని ఆ తండ్రినోటినుంచి వెలువడినది పదునైన మాట. సూటి మాట. ఆ మాటకుముందు ఆయన కొడుకువేపు పది నిమిషాలో ఐదు నిమిషాలో ఒక తృణీకార దృక్కు విసిరాడు.
“సరే” అన్నాడు మారియో, చొక్కా చేతితో ముక్కు తుడుచుకుంటూ.
ఇక రెండో పరిణామంలో ప్రధాన పాత్రధారి మారియో పెంపుడు ఆస్తి లెగానో సైకిల్. ఆ వాహనం మారియోను ఆ పల్లెకారుల తీరపు సంకుచిత దిగంతంనుంచి శాన్ ఆంటోనియో రేవుపట్నపు వైశాల్యంలోకి తీసుకుపోతూ ఉంటుంది. ఆ రేవు పెద్ద పట్టణమేమీకాదు గాని పుట్టిపెరిగిన ఆ చిన్న పల్లెకారుల గూడెంతో పోలిస్తే మారియో కళ్లకు ఆ పట్నం బాబిలోనియన్ లాగ కనిపిస్తుంది.
అబ్బ, ఆ పట్నం ఎంత మజాగా ఉంటుందో. ఎక్కడపడితే అక్కడ ఉన్న సినిమా పోస్టర్లలో కవ్వించేలా బుంగమూతి స్త్రీలు. పొడవాటి చుట్టలకొసలు నములుతూ పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ ఉండే మొరటు మగవాళ్లు. ఆ బొమ్మలు చూస్తుంటేనే మారియోకు మైకం ఎక్కిపోయేది. ఇక ఆ మైకం దిగాలంటే ఒకటే మందు. రెండుగంటలపాటు చీకటి గుయ్యారపు సినిమాహాల్లో కూచోవలసిందే. ఆ సినిమా అయిపోయాక నిరాశగా ఈడుస్తూ సైకిలు తొక్కుతూ వెనక్కి వచ్చేవాడు. సరిగ్గా ఆ సమయానికే కొన్నిసార్లు చిత్తడి వాన కురిసేది. ఆ వానలో తడవడంతో మారియోకు ఎక్కడలేని జలుబూ, తలనొప్పీ పట్టుకునేవి.
ఒకవైపు మారియో కోరికలకేమో అంతులేదు. ఆ కోరికలన్నిటినీ తీర్చడానికి తండ్రి ఔదార్యం ఎప్పటికీ సరిపోయేదీకాదు. అందుకని మారియో చాల తరచుగా పాతపత్రికల దుకాణం ముందర నిలబడి ఆ పత్రికల్లో తన అభిమానతారల బొమ్మల వేపు ఆబగా చూస్తూ ఆ పత్రికలను మరింతగా నలిపేస్తూ ఉండేవాడు.
అలాంటి ఒక రోజున మారియోకు ఎదురుగా పోస్టాఫీసు కిటికీలో ఒక ప్రకటన కనబడింది.
చిన్నపిల్లల లెక్కల నోటుబుక్కులోంచి ఒక కాగితాన్ని అశ్రద్ధగా చింపి ఆ ప్రకటన రాసినట్టు ఉంది. అసలే లెక్కలంటే మారియోకు భయం గాని ఆ ప్రకటన చూడగానే మాత్రం కాళ్లు నేలమీద నిలవలేదు.
మారియో తన జీవితంలో ఎన్నడూ టై కట్టుకోలేదు. కాని ఇప్పుడు మాత్రం టై కట్టుకుంటున్నట్టే చొక్కా గొంతు దగ్గర సరిచేసుకున్నాడు. బీటిల్స్ ను అనుకరిస్తూ పెంచుకున్న తన జుట్టును జాగ్రత్తగా సరిచేసుకున్నాడు.
పోస్టాఫీసుకు వెళ్లి అక్కడ కూచుని ఉన్న పెద్దమనిషితో, బర్ట్ లాంకాస్టర్ లాగ చిరునవ్వు నవ్వుతూ “పని ఉందని మీరు రాసిన ప్రకటన చూసి వచ్చాను” అన్నాడు.
“నీ దగ్గర సైకిలుందా?” అడిగాడా పెద్దమనిషి ఇంకే సంగతీ పట్టించుకోనట్టుగా.
“ఉంది” అన్నమాట పెదాలన్నాయో, హృదయం ఎగిరొచ్చి అందో, రెండూ ఒక్కసారే అన్నాయో తెలియలేదు.
“మంచిది” అన్నాడాయన. కళ్లజోడు తీసి తుడుచుకుంటూ “మాకు ఇస్లా నెగ్రా కోసం ఒక పోస్ట్ మాన్ కావాలి” అని జోడించాడు.
“వారెవ్వా. భలే. నేనుండేది సరిగ్గా అక్కడే. అక్కడ తీరం మీదనే మా ఇల్లు.”

“సరే, మంచిది. కాని అబ్బాయ్, ఒక చిన్న ఇబ్బంది ఉంది, నువ్వక్కడ ఒకేఒక్కరికి మాత్రమే పోస్ట్ తీసుకుపోవాలి.”
“ఒక్కరికేనా?”
“అవును. అక్కడ మిగిలినవాళ్లందరూ పొట్టకోసినా అక్షరం ముక్క రానివాళ్లు. వాళ్లు పన్నుల కాగితాలే చదవలేరు.”
“మరి పోస్టు వచ్చేది ఎవరికి?”
“పాబ్లో నెరూడా.”
మారియో హిమేనెజ్ గుండె గొంతులోకొచ్చింది. అవాక్కయి నోటినిండా నిండిన ఉమ్మిని ఒక్కగుక్కలో మింగేశాడు. “ఇదింకా బాగుందే, భలే, వారెవ్వా” అన్నాడు.
“భలేగా అనిపిస్తోందేం? ఆయనకు ప్రతిరోజూ మణుగులకొద్దీ పోస్టు వస్తుంది. ఆ సంచీ నీ భుజానికి తగిలించుకుని ఆ సైకిలు మీద పోతుంటే మజా తెలుస్తుందిలే. నీ భుజాలమీద ఏనుగును మోస్తూ పోయినట్టే. నీకన్న ముందు ఈ పని చేసిన మనిషి వీపు ఒంటెలాగయిపోయి గూని వచ్చింది తెలుసా?”
“కాని నా వయసు పదిహేడేళ్లేనండి.”
“మంచి ఆరోగ్యమేనా?”
“నాకా? ఆరోగ్యం సంగతా? గుర్రంతో సవాల్. ఎప్పుడూ జిర్రున చీది ఎరగను.”
పోస్టాఫీసు పెద్దమనిషి ముక్కుదూలంమీదినుంచి కళ్లజోడు కిందికి జార్చి, పైనుంచి అదోరకంగా మారియో వైపు తేరిపార చూశాడు.
“మరి మేమిచ్చే జీతం గుడ్డిగవ్వకు సరిపోదు. వేరేచోట్ల పోస్టు తీసుకుపోయేవాళ్లకు ఆసాములు ఇచ్చే బక్షీసు అంతకూడ ఉండదు మాజీతం. ఈ ఒక్క ఆసామి పోస్టు తీసుకుపోతే నీకు వారానికి ఒక్క సినిమా చూడడానికి సరిపోయే డబ్బులు గిడతాయేమో.”
“అయినా సరే, నాకీ పని కావాలి.”
“సరే, సరే, నాపేరు కోస్మె.”
“కోస్మె?”
“నువ్వు నన్ను కోస్మె గారూ అనాలి తెలిసిందా?”
“సరేనండి కోస్మె గారూ!”
“నేను నీ పై అధికారిని.”
“సరే సార్.”
కోస్మె తన నీలంరంగు బాల్ పాయింట్ పెన్ బయటికి తీశాడు. ఆ ముల్కి చివరన వెచ్చ చేస్తున్నట్టు ఒకసారి ఊదాడు. తలఎత్తి చూడకుండానే “పేరు” అని అడిగాడు.
“మారియో హిమేనెజ్” అని గంభీరంగా జవాబిచ్చాడు మారియో.
ఆ ముఖ్యమైన సమాచారాన్ని అందజేయగానే పని అయిపోయినట్టుగా కిటికీ దగ్గరికి నడిచి ఆ ప్రకటన కాగితాన్ని చించి వెనుకజేబులో కుక్కుకున్నాడు.
శాంత మహాసముద్రం తన అనంత సహనంతో సాధించలేకపోయిన మార్పులను ఆ చిన్న, ముద్దొచ్చే శాన్ ఆంటోనియో పోస్టాఫీసు తీసుకొచ్చింది. మారియో హిమేనెజ్ ప్రతిరోజూ పొద్దుపొడవకుండానే లేవడం మొదలుపెట్టాడు. లేచీలేవగానే హుషారుగా ఈలలు వేయడం కూడ మొదలుపెట్టాడు. ఇదివరకు లేచీలేవడంతోనే బాధించే ముక్కు దిబ్బడ ఇప్పుడు లేదు. తన ఉద్యోగబాధ్యతలను చాల కచ్చితంగా నెరవేర్చడం మొదలుపెట్టాడు. మారియో తనపనులను ఎంతబాగా చేస్తూ పోయాడంటే పోస్ట్ మాస్టర్ కోస్మె కు కూడ చాల నమ్మకం కలిగింది. పోస్టాఫీసు తాళం చెవిని కూడ మారియోకు ఇచ్చేశాడు. పాపం ముసలాయన ఎన్నాళ్లుగానో ఒక కల కంటున్నాడు. పక్కమీది నుంచి లేవకుండా మళ్లీ నిద్ర వచ్చేదాకా నిద్ర పోతూనే ఉండాలని, అలా ఎంతసేపూ నిద్రపోతూనే ఉండాలని, అలా నిద్రలోనే పగలూ రాత్రీ గడిపేసి మర్నాటి ఉదయం మేలుకునే సరికి పనిచేయడానికి బోలెడంత శక్తీ, ఆసక్తీ వచ్చేంత నిద్రపోవాలని. మారియోకు రోజూ ఉండేంత ఉత్సాహం తనకు కూడ ఉంటే ఎంతబాగుండునని కోస్మె అనుకునేవాడు. కోస్మె అంత ఉత్సాహంగా ఎప్పుడూ పనిచేయలేదు. చిలీలో ఉద్యోగులందరికీ జరిగినట్టుగానే మారియోకు కూడ ఆలస్యంగా నెలన్నర తర్వాత మొదటినెల జీతం చెక్కు చేతికందింది. ఆ డబ్బులు చేతిలో పడగానే మహాఘనత వహించిన పోస్ట్ మాన్ మారియో హిమేనెజ్ గారు ఈ క్రిందివిధమైన కొనుగోళ్లు చేశారు: తండ్రికోసం స్పెషల్ వింటేజ్ కజినో మాకుల్ ద్రాక్ష సారా సీసా ఒకటి. నటాలీ ఉడ్ నటించిన వెస్ట్ సైడ్ స్టోరీ సినిమా టికెట్ ఒకటి, తనకోసం. జర్మనీలో తయారయిన స్టీలు దువ్వెన ఒకటి. శాన్ ఆంటోనియో బజారులో దువ్వెనల వ్యాపారి “జర్మనీ యుద్ధంలో ఓడిపోయిందిగాని శాంతిలో గెలిచింది. అక్కడ ఆయుధ తయారీదారులు ఇప్పుడు ఉక్కుతో దువ్వెనలు తయారు చేస్తున్నారు” అని అరుస్తుంటే ఆ దువ్వెన మీద ఆసక్తి కలిగింది. ఇక ఈ సామానులన్నీ కొనడం అయిపోయాక ఒక పుస్తకం కొన్నాడు. అది తాను ఉత్తరాలు తీసుకువెళ్లే ఏకైక ఆసామి రాసిన కవిత్వ పుస్తకం. పాబ్లో నెరూడా రాసిన ఎలిమెంటల్ ఓడ్స్.
కవి హుషారుగా ఉన్న, వీలయిన సమయం చూసి ఉత్తరాలతో పాటు ఈ పుస్తకం కూడ ఆయన చేతిలో పెట్టాలనీ, దానిమీద ఆయనతో సంతకం పెట్టించుకోవాలనీ మారియో నిర్ణయించుకున్నాడు. శాన్ ఆంటోనియోలో ఎప్పుడో ఒకప్పుడు తాను ఒక అద్భుతమైన అమ్మాయిని కలవకపోననీ, ఆ అమ్మాయి ముందర ఆ నెరూడా పుస్తకాన్నీ, అందులో నెరూడా తనకోసం చేసిన సంతకాన్నీ చూపెట్టి గొప్పలు పోవచ్చనీ మారియో కలలు కనడం మొదలుపెట్టాడు. ఒకవేళ అటువంటి మంచి అమ్మాయి శాన్ ఆంటోనియోలో దొరకకపోతే శాంటియాగోలో అయినా దొరకవచ్చు గదా. ఎట్లాగూ తన రెండోనెల జీతం రాగానే శాంటియాగో వెళతాడుగదా.
తన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి మారియో చాల సార్లు ప్రయత్నించాడు. ఎన్నోసార్లు ఆ పుస్తకాన్ని కవి చేతుల్లో పెట్టబోయాడు. కాని నెరూడా ఎప్పుడూ తన ఉత్తరాలు తీసుకునేటప్పుడు చూపెట్టే ముభావం, ముక్తసరి పలుకులు మారియోను భయపెట్టేవి. తన ఉత్తరాలు తెచ్చి ఇచ్చినందుకు బక్షీష్ కూడ నెరూడా ఎంత తొందరగా ఇచ్చేసేవాడంటే ‘ఇక నీ పని అయిపోయింది వెళ్లిపో’ అన్నట్టుండేది. ఆ బక్షీష్ ఎక్కువే ముట్టేదనుకోండి. అయినా, నెరూడా ముఖం మీద ఎప్పుడూ తనలోపలికి తాను చూసుకుంటున్న ఒక అంతర్ముఖుడి హావభావాలే కనబడేవి. ఆయన ఏదో ఒక కొత్త అద్భుత కవిత మొదలుపెట్టడానికి ఉద్యుక్తుడై, ఉద్విగ్నంగా ఉన్నప్పుడు తాను ఉత్తరాలు పట్టుకొచ్చి తలుపు కొడితే ఆ తన్మయత్వంలోంచి ఆయనను బయటికి లాగినట్టవుతుందేమోనని మారియో చాలసార్లు ఇబ్బంది పడ్డాడు. ఆ భావం మారియోను వదలలేదు. ప్రతిసారీ నెరూడా తలుపు తెరిచి వెంటనే తన ఉత్తరాల కట్ట తీసుకుని, మారియో చేతిలో కొన్ని సెంట్లు పెట్టేవాడు. చిరునవ్వుతో ‘గుడ్ బై’ అనేవాడు. ఆ పలకరింపు, చిరునవ్వు కూడ క్షణకాలంలో అయిపోయేవి. ఆ క్షణం నుంచి సాయంత్రందాకా మారియో మాత్రం ఎలిమెంటల్ ఓడ్స్ పుస్తకాన్ని తన చేతుల్లో పట్టుకుని తిరుగుతూనే ఉండేవాడు. ఏదో ఒకరోజు కవి సంతకం అడిగే ధైర్యం తనకు రాకపోతుందా అని ఎదురుచూస్తుండేవాడు.
మారియో ఆ పుస్తకాన్ని ఎంత ఎక్కువగా పట్టుకున్నాడంటే, అది ఒడిలో పెట్టుకుని చౌరస్తాలో దీపస్తంభంకింద కూచుని వచ్చేపోయే అమ్మాయిలు తనను ఒక మేధావి అని భావించాలని ఎంతగా ఎదురుచూశాడంటే, చిట్టచివరికి ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివేశాడు. ఎవరికోసం ఆ పుస్తకం పట్టుకుని కూచునేవాడో ఆ అమ్మాయిలు అసలు మారియోనుగాని, ఆ పుస్తకాన్ని గాని ఎప్పుడూ చూడలేదనుకోండి, అది వేరే సంగతి.
ఇక పుస్తకం చదివేశాక, ఒక్కసారయినా కవి దృష్టిని ఆకర్షించవలసిందే అనుకున్నాడు మారియో. ఒక చలికాలపు ఉదయాన ఎండపొడలో ఉత్తరాల కట్ట మీద ఆ పుస్తకం పెట్టి కవి ముందు పెట్టాడు. ఎన్నోసార్లు దుకాణాల కిటికీల మీద రాసిన దాన్ని చూసిన అనుభవంతో, “గురువుగారూ, మీ సంతకం ఇదిగో సరిగ్గా ఇక్కడ” అని అడిగాడు.
మారియో అడిగినది కవికి చాల మామూలు విషయం. ఎన్నోసార్లు చేసిన పని అది. అలా సంతకం పెట్టేసి మామూలు చిరునవ్వుతో ‘గుడ్ బై’ అనేశాడాయన. పుస్తకం చేతిలో పట్టుకుని ఆ సంతకాన్ని నిశితంగా పరిశీలించాడు మారియో. “అభినందనలతో, పాబ్లో నెరూడా” అని రాసి ఉన్న ఆ వాక్యం వల్ల తన అనామకత్వం యథాతథంగానే ఉండిపోయింది. ఇక కవితో సంబంధం పెంచుకోవాలనీ, ఏదో ఒకరోజున తనకు ఆయన ఒక పుస్తకం ఇచ్చేలా, అందులో ఆకుపచ్చని సిరాతో తన పేరు పూర్తిగా మారియో హిమేనెజ్ అని రాసేలా చూసుకోవాలనీ గట్టిగా అనుకున్నాడు. నిజం చెప్పాలంటే, “సన్నిహిత మిత్రుడు మారియో హిమేనెజ్ కు అభినందనలతో పాబ్లో నెరూడా” అని ఆయన రాస్తే ఎంత బాగుంటుంది అని కలలు కనడం మొదలుపెట్టాడు.
ఈ కలలను కోస్మెకు చెప్పాడు కూడ. కాని పోస్టల్ ఉద్యోగులు తమ ఆసాములను అలా ఇబ్బంది పెట్టడాన్ని నిషేధిస్తూ చిలీ లో ఉత్తర్వులు ఉన్నాయనీ, అయినా ఒక పుస్తకాన్నే రెండు సార్లు ఇవ్వడం కుదరదనీ కోస్మె చెప్పాడు. కవి ఎంత కమ్యూనిస్టయినా ఆయన వెంటపడి ఆయన ఇదివరకు రాసిన వాక్యం చెరిపేసి, ఆ స్థానంలో మరొక వాక్యం రాయమని అడగడం మంచిది కాదని కోస్మె చెప్పినదాని సారాంశం.
కోస్మె సలహా సరయినదే అని మారియో కూడ అనుకున్నాడు. అందువల్ల రెండో నెల జీతం వచ్చాక చాల సహజమైన కొనుగోలులాగ మరొక పుస్తకం కొన్నాడు. ఈ సారి అది న్యూ ఎలిమెంటల్ ఓడ్స్. ఎంతోకాలంగా కలలు కంటున్న శాంటియాగో ప్రయాణానికి కాకుండా ఈ పుస్తకానికి ఖర్చుపెట్టవలసి వచ్చినందుకు కాస్త బాధపడ్డాడు. అంతేకాదు, “వచ్చేనెల నీ కోసం థర్డ్ బుక్ ఆఫ్ ఓడ్స్ కూడ తెప్పించిపెడతాను” అని ఆ దుకాణదారు అనేసరికి ఆ బాధ మరింత పెరిగింది.
అయితే ఈ పుస్తకాలేవీ కవి సంతకానికి నోచుకోలేదు. మరొక చలికాలపు ఎండపొడ పడే పొద్దుటిపూట మారియో తనకోసం పుస్తకం మీద సంతకం పెట్టించుకోవాలనే సంగతే మరిచిపోయాడు, కవిత్వాన్ని మాత్రం మరిచిపోలేదు.
***
మారియో హిమేనెజ్ జాలరుల మధ్య పెరిగాడు గాని వలల గురించీ, ఎరల గురించీ తెలియదు. కవిని పట్టుకునే వల ఆ రోజు ఉదయపు ఉత్తరాల కట్టలో ఉంటుందని ఊహించలేకపోయాడు. ఆరోజు మారియో ఉత్తరాలకట్ట కవి చేతుల్లో పెట్టగానే, ఆయన అక్కడే మారియో ముందరే ఆగలేనట్టుగా ఆ కట్టలోంచి ఒక ఉత్తరం తీసి చించి చదవడం మొదలెట్టాడు. ఆయనకు మామూలుగా ఉండే గాంభీర్యం, ముక్తసరితనం ఏమయిపోయాయో తెలియదు. ఇలా ప్రవర్తించడం మారియోను ఆశ్చర్యపరిచింది. కవితో సంభాషించాలనీ, అసలు స్నేహం చేయాలనీ ఎప్పటినుంచో కంటున్న కలల మంటలు మళ్లీ ఒకసారి నాలుకలు తెరిచాయి.
“మిగిలిన ఉత్తరాల కన్న ముందు ఆ ఉత్తరం ఎందుకు విప్పారు?”

“అది స్వీడన్ నుంచి వచ్చింది గనుక.”
“స్వీడన్ ఆడవాళ్లు బాగుంటారని విన్నాను గాని స్వీడన్ నుంచి ఉత్తరం వస్తే అంత గొప్పేముంది?”

ఎప్పుడూ కదలకుండా ఉండే పాబ్లో నెరూడా కనురెప్పలు ఆమాటతో ఒక్కసారి మూసుకుని తెరుచుకున్నాయి.

“సాహిత్యానికి నోబెల్ బహుమతి గురించి బిడ్డా అది!”
“మీకిస్తున్నారా వాళ్లు?”
“వాళ్లు గనుక నాకిస్తే వద్దనను.”
“ఎంతొస్తుంది?”
అప్పటికి ఆ ఉత్తరంలో ప్రధాన భాగానికి చేరిన నెరూడా చాల మామూలుగా “లక్షా యాభై వేల రెండువందల యాభై డాలర్లు” అన్నాడు.

“మరొక యాభై సెంట్లు” అని కలుపుదామనుకుని, అతి కష్టం మీద ఆ మాట ఆపి, చాల గంభీరంగా “భలే” అన్నాడు మారియో.
“భలేనా, ఎందుకు?”
“నిజంగానే వాళ్లు మీకది ఇస్తున్నారా?”
“ఏమో. కాని ఈ సంవత్సరం నాకంటే ఎక్కువ అవకాశాలున్నవాళ్లున్నారు.”
“ఎట్లా?”
“వాళ్లు ఇంకా మంచి పుస్తకాలు రాశారు.”

“మిగిలిన ఉత్తరాల సంగతి ఏమిటి?”
“అవి తరువాత చూస్తానులే.”
“సరే.”
ఇక ఆ సంభాషణ ముగింపుకు వస్తోందని మారియోకు అనుమానం కలిగింది. ఆ విచారంతో కవికి సహజమైన పరధ్యానంలోకి ఆ పోస్ట్ మన్ కూడ జారిపోయాడు. ఆ పరధ్యానం ఎంత గాఢంగా ఉండిందంటే ఇక స్వయంగా కవే “ఏమిటి ఆలోచిస్తున్నావు?” అని అడిగాడు.
“ఏంలేదు, ఏంలేదు. ఆ వేరే ఉత్తరాల్లో ఏమి ఉండి ఉంటుందా అని. అవి బహుశా మీకొచ్చే ప్రేమలేఖలేమో.”
ఆ లావుపాటి కవి ఒక దగ్గు దగ్గాడు. “ఓయ్, జాగర్త, నేను పెళ్లయినవాడిని. నీ మాటలు మా ఆవిడ వింటేనా?”
“అయ్యయ్యో, క్షమించండి.”
నెరూడా తన జేబులోకి చెయ్యిపోనిచ్చి, మామూలుకన్న చాల ఎక్కువ కాగితం ఒకటి బయటికి లాగాడు. ఆ బక్షీష్ కన్న ఎక్కువగా కవిని వదిలిపోవలసి వస్తున్న విచారం ధ్వనిస్తుండగా మారియో కృతజ్ఞతలు చెప్పాడు. ఆ విచారం ఎందువల్ల కలిగినప్పటికీ, అది దాదాపు కాలూ చేయీ పడిపోయినంత పనిచేసింది. వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళుతున్న కవి ఆ కుర్రాడి స్థితిచూసి ఆశ్చర్యపోయాడు.
“ఏమయింది?”
“సార్!”
“ఏమిటలా స్తంభంలాగ నిలబడిపోయావు!”
మారియో తల తిప్పి కవి కళ్లలోకి చూశాడు.
“మేకు కొట్టినట్టుగా.”
“కాదు కాదు, కదలలేని పక్షి లాగ.”
“పింగాణీ పిల్లి కన్న నిశ్శబ్దంగా.”
నెరూడా గేటు గొళ్లెం తీసి పట్టుకుని, గడ్డం రుద్దుకుంటూ, “మారియో హిమేనెజ్, నేను ఎలిమెంటల్ ఓడ్స్ కన్న మంచి పుస్తకాలు రాశాను. ఇప్పుడు నువ్వు ఆ పాత పుస్తకం నుంచి ఉపమానాలు, అలంకారాలు నాకు వినిపించడం బాగులేదు.”
“సార్?”
“అలంకారాలు అన్నాను, ఏం?”
“అంటే ఏమిటి?”
కవి ప్రేమగా ఆ కుర్రవాడి భుజం మీద చెయ్యి వేశాడు.
“అంత కచ్చితంగా చెప్పలేననుకో, కాని అలంకారం అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెప్పడం.”
“ఒక ఉదాహరణ చెప్పండి.”
నెరూడా తన చేతిగడియారం వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచాడు.
“సరే, ఆకాశం ఏడుస్తోంది అన్నామనుకో, ఏమిటన్నమాట?”
“ఓ, వానపడుతోంది అని అర్థం.”
“అంటే అది అలంకారం అన్నమాట.”
“మరి, మరి, అది అంత సులభమైన విషయమైతే అంత గొట్టుపేరు ఎందుకుంది దానికి?”
“ఎందుకంటే, ఆయా వస్తువులకు మనం పెట్టుకున్న పేర్లకూ ఆ వస్తువుల సాదాతనానికో, సంక్లిష్టతకో ఏమీ సంబంధంలేదు. నీ లెక్క ప్రకారమైతే మన చుట్టూ రోజూ ఎగిరే అతిమామూలు రెక్కలపురుగుకు సీతాకోకచిలుక లాంటి పేరు ఉండగూడదు. మరి ఏనుగుకు సీతాకోకచిలుకకన్న మామూలు చిన్న పేరే ఉందిగదా. అదేమో చాల పెద్దది, ఎగరనూలేదు కదా” అని ముగించాడు. ఒక్క ఉదుటున చెప్పేసరికి కవి గసపోశాడు. ఇక మిగిలిన శక్తితో, వెళ్ళిపోవచ్చునన్నట్టు మారియో వైపు చూశాడు.
మారియోకు నెరూడా ఏమి చెప్పదలచుకున్నాడో అర్థమయింది. “వారెవ్వా, నాకూ కవి కావాలని ఉంది” అన్నాడు.
“తెలుసా, చిలీలో ప్రతివాడూ కవే! కవి కానిదెవడులే? అయినా పోస్ట్ మన్ ఉద్యోగమంటే కవిత్వం వస్తుందన్నమాటే. ఒక్కటే తేడా, నీకు నడక ఎక్కువగా ఉంటుంది. అంత తొందరగా లావెక్కవు. చిలీలో మా కవులందరికీ బాన పొట్టలున్నాయి.”

మళ్లీ నెరూడా గొళ్లెం చేతుల్లో పట్టుకుని లోపలికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. మారియో మాత్రం ఎక్కడో కనబడకుండా ఎగురుతున్న పక్షిని చూస్తూ, “నేనే గనుక కవినయితే, నా ఇష్టం వచ్చినదంతా చెప్పగలిగేవాణ్ని” అన్నాడు.
“ఏమిటది? నీకు ఇష్టమైనదేమిటి?”
“అబ్బ, అదేగదా అసలు సమస్య! నేను కవిని కాను గనుక అదీ చెప్పలేను.”
కవి కనుబొమలు ముడిపడ్డాయి.
“మారియో…”
“చెప్పండి సార్?”
“నేనిక నీకు వీడ్కోలు చెప్పేసి తలుపు మూసెయ్యబోతున్నాను.”
“సరే సార్.”
“మళ్లీ రేపు కలుద్దాం.”
“సరే సార్. రేపు కలుద్దాం.”
నెరూడా మిగిలిన ఉత్తరాలవైపు చూశాడు. తర్వాత గేటులోంచి అవతలికి తొంగిచూశాడు. పోస్ట్ మన్ ఇంకా అక్కడే చేతులు కట్టుకుని నిలబడి మేఘాల వైపు దీక్షగా చూస్తున్నాడు. కవి మళ్లీ అటు నడిచి మారియో భుజం తట్టాడు.
“నువ్వింకా ఇక్కడే నిలబడి ఉన్నావేమోనని అనుమానం వచ్చి చూశాను.”
“ఏదో ఆలోచనలో పడ్డాను సార్.”
నెరూడా పోస్ట్ మన్ మోచేతిని గట్టిగా పట్టుకుని దాదాపు నడిపిస్తూ వీథిలోని దీపస్తంభందాకా తీసుకొచ్చాడు. మారియో సైకిల్ అక్కడే ఉంది.
“అక్కడ అట్లా నిలబడితే ఆలోచనలు వస్తాయనుకుంటున్నావా ఏం? నువ్వు నిజంగా కవివి కాదలచుకుంటే నడుస్తున్నప్పుడు కూడ ఆలోచించగలగాలి. నడిచేటప్పుడు ఇంకే పనీ చేయలేవా? ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, సముద్రతీరందాకా వెళ్లి, తీరం వెంట నడుస్తూ అలల కదలికల్ని చూస్తూ, అలంకారాలు కనిపెడతావు.”
“ఒక ఉదాహరణ చెప్పండి.”
“ఈ కవిత విను: ‘ఇదిగో ఈ ద్వీపం మీద, ఈ సముద్రం, ఎంత పెద్ద సముద్రం. క్షణక్షణానికీ ముంచుకువచ్చే సముద్రం. ఔనంటున్న సముద్రం. కాదంటున్న సముద్రం. ఔనని మళ్లీ కాదంటున్న సముద్రం. ఔనౌనంటున్న సముద్రం. నీలంలో, నురుగులో, దూకుడులో ఔనంటున్న సముద్రం. మళ్లీ కాదంటున్న సముద్రం, కానే కాదంటున్న సముద్రం. ఒక్కక్షణం కూడ ఆగని సముద్రం. నా పేరు కడలి అని హోరెత్తుతోంది. పదేపదే ఘోషిస్తోంది. తీరమీది బండరాళ్లను గుద్దుకుని మరీ ఆ మాట చెపుతోంది. ఆ బండరాయి మాత్రం ఎంతకూ నమ్మదు. అప్పుడిక సముద్రం తన ఏడు ఆకుపచ్చని సముద్రాల, ఏడు ఆకుపచ్చని పులుల, ఏడు ఆకుపచ్చని నాలుకలు తెరిచి, రాతిని కావలించుకుంటుంది, ముద్దాడుతుంది. తడిపేస్తుంది. బండరాతిగుండెలమీద గుద్దుతుంది. తనపేరు పదేపదే వినిపిస్తుంది….”
గొప్ప సంతృప్తి కలిగినట్టుగా కవి ఆగిపోయాడు. “ఏమంటావు?” అని అడిగాడు.
“అది భయం గొలుపుతోంది.”
“భయం గొలుపుతోందా? చూడబోతే నువ్వు కర్కశ విమర్శకుడిలాగున్నావే!”
“లేదు సార్. కవిత భయం గొలపడం కాదు. మీరది చదువుతుంటే నాకు భయం కలిగిందంటున్నాను.”
“నా పిచ్చి మారియో. నువ్వు ఏమనుకుంటున్నావో అది కచ్చితంగా చెప్పడం ఎట్లాగో నేర్చుకోవాలి. సరే, ఈ ఉదయం మొత్తాన్నీ నీతోనే గడిపేంత వ్యవధి లేదు నాకు…”
“మీకెలా చెప్పను? మీరా కవిత చదువుతుంటే ఆ మాటలు అలల్లా ఇటూ అటూ కదిలిపోయాయి.”
“అంటే, సముద్రం లాగనేనన్నమాట.”
“అవును, అచ్చంగా సముద్రపుటలల్లాగే.”
“దాన్ని అంతర్లయ అంటారు.”
“నాకెందుకు భయం వేసిందంటే ఆ తూగుకు కళ్లు తిరిగినట్టయ్యాయి.”
“ఓహ్, తల తిరిగిందా?”
“అవును. నా వరకు నాకు మీ మాటలమీద ఊగులాడుతున్న పడవనేమో అనిపించింది.”
కవి మెల్లగా కనుబొమ్మలెత్తి చూశాడు.
“నా మాటల మీద ఊగులాడుతున్న పడవలాగనా?”
“అ..అ..వును.”
“మారియో, ఇప్పుడు నువ్వేంచేశావో నీకు తెలుసా?”
“ఉహు, ఏం చేశాను?”
“ఒక అలంకారాన్ని కనిపెట్టావు.”
“కాని అది పెద్ద లెక్కలోకి రాదు. ఎందుకంటే అది అనుకోకుండా వచ్చింది. అంతే.”
“బిడ్డా, అన్ని పదచిత్రాలూ అనుకోకుండానే వస్తాయి.”
మారియో గుండె ఎంత వేగంగా గబగబా కొట్టుకుందంటే, గుండెలమీద చెయ్యిపెట్టుకుని ఎగసిపడుతున్న గుండెని ఆపుకోవలసి వచ్చింది. అప్పటికప్పుడు తన ఛాతీ పగిలిపోయి గుండె బయటపడుతుందేమో అనిపించింది. అతి కష్టం మీద తనను తాను అదుపులోకి తెచ్చుకున్నాడు. అనుకోకుండానే తన చూపుడువేలు చాచి కవి ముఖంమీద ఊపుతూ, “అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కటీ, అంటే, నా అర్థం, గాలి లాగ, సముద్రం లాగ, చెట్ల లాగ, కొండల లాగ, మంటలాగ, జంతువుల లాగ, ఇళ్ల లాగ, ఎడారుల లాగ, వాన లాగ…”
“నువ్వా జాబితా చదవనక్కరలేదు, వగైరా అనవచ్చు.”
“…సరే, వగైరా వగైరాలలాగ…ప్రపంచంలోని ప్రతి ఒక్కటీ మరొకదానికి పోలికేనంటారా, ఉపమానమేనంటారా?”
నెరూడా నోరు అలా తెరుచుకునే ఉండిపోయింది. బొద్దయిన ఆ గడ్డం ఆ ముఖం నుంచి కిందికి జారి పడిపోతుందేమోననిపించింది.
“నేనేమయినా అడగగూడని పిచ్చి ప్రశ్న అడిగానా?”
“లేదు, మిత్రమా లేదు.”
“మరి మీ ముఖం మీద అటువంటి విచిత్రమైన భావం కదలాడిందేం?”
“లేదు లేదు, నేను ఆలోచనలో పడ్డానంతే.”
కవి తన కళ్లముందర చెయ్యి ఊపి అక్కడ కనబడకుండా పేరుకుపోయిన మసకను తుడిచినట్టు తుడిచేశాడు. జారిపోతున్న తన పంట్లాంను పైకి లాక్కున్నాడు. ఆ కుర్రవాడి గుండెలమీద తర్జని గుచ్చి, “బిడ్డా, మారియో, మనం ఒక ఒప్పందానికి వద్దాం. నేనిక మా వంటింట్లోకి వెళతాను. తల పగిలిపోతోంది, ఏదన్నా తినాలి. ఆ తర్వాత నువ్వడిగిన ప్రశ్న గురించి ఆలోచన మొదలుపెడతాను. రేపు రా, నీకు సమాధానం చెపుతాను.”
“సార్, నిజంగానేనా?”
“ఔను నిజంగానే, ఇప్పటికిక సెలవు. రేపు కలుద్దాం.”
నెరూడా తన ఇంట్లోకి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు. గేటు మూసేసి, మళ్లీ దానికి ఆనుకుని నిలబడ్డాడు. జాగ్రత్తగా తన చేతులు కట్టుకున్నాడు.
“ఏం, మీరు లోపలికి వెళ్లడం లేదా?” అని అడిగాడు మారియో.
“ఉహు. ఈసారి నువ్వు వెళ్లిపోయేదాకా అలాగే వేచి ఉందామనుకుంటున్నాను.”
పోస్ట్ మన్ తన సైకిల్ తీసుకున్నాడు. గొప్ప సంతోషంతో సైకిల్ గంట గణగణమనిపించాడు. కవినీ, ఆ కవి చుట్టూఉన్న పరిసరాలనన్నిటినీ ముంచెత్తే విశాలమైన చిరునవ్వు నవ్వాడు. “సరే, కలుద్దాం సార్” అని ఒక పెద్ద అరుపు అరిచాడు.
“సరే కలుద్దాం బిడ్డా.”
* * *
కవి చెప్పిన మాటలను పోస్ట్ మాన్ మారియో హిమేనెజ్ అక్షరాలా ఉన్నది ఉన్నట్టుగా నమ్మాడు. సముద్రతీరంమీద తన పల్లెకు నడిచివెళ్తూ సముద్రం ఆటుపోట్లను అతి జాగ్రత్తగా గమనించాడు. అక్కడ అనంతకోటి కెరటాలు కనబడినప్పటికీ, అత్యద్భుతమైన పట్టపగటివేళ, విలాసవంతమైన ఆ ఇసుకలో, చల్లని తాజా గాలి వీస్తుండగా కూడ మారియో ఒక్క అలంకారాన్నీ తయారు చేయలేకపోయాడు. ఆ సముద్రం అతి గంభీరంగా సాగించిన ఘోషకు నిశ్శబ్దమే ప్రతిధ్వని అయింది. మారియో లోలోపల మౌనం, విచారం ఎంత కఠినంగా గడ్డ కట్టాయంటే చివరికి అక్కడి నల్లరాతి బండలు కూడ గుంపులు గుంపులుగా ఉన్నాయని మారియోకు అనిపించింది.
ఆ ప్రకృతి నైరాశ్యంతో విసిగిపోయి, తన విచారాన్ని పోగొట్టుకోవడానికి మందు కొట్టడం ఒక్కటే పరిష్కారం అనుకున్నాడు. ఊళ్లోని పానశాలకు వెళ్లి కాస్త ద్రాక్ష సారాయం లాగిస్తే గాని ఈ విచారం వదిలేట్టు కనబడలేదు. ఒక వేళ అక్కడ అదృష్టం కలిసివచ్చెనా, ఎవడో ఒక కోన్ కిస్కాగాడు టాకాటాకా ఆటకు తన సవాలును అందుకోకపోడు. ఆ ఊళ్లో ఫుట్ బాల్ స్టేడియం లేదు. దాంతో ఆ ఊరి యువకులకు తమ క్రీడాస్ఫూర్తి నిలుపుకోవడానికి మిగిలిన ఏకైక మార్గం చిన్నబల్ల మీద ఆడే ఈ చిన్నపాటి ఫుట్ బాలే.
పానశాలకు కాస్త దూరంలో ఉండగానే పాతపాటల ధ్వనీ లోహగోళాల గణగణలూ కీచుశబ్దాలూ వినబడ్డాయి. ఆ పాట రాజధాని నగరంలో పదేళ్లకిందనే పాతబడిపోయినా ఆ ఊళ్లో మాత్రం ఇంకా అందరినోళ్లలో నానుతూనే ఉంది. తన విచారాన్ని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా పోగొట్టుకోవాలనే ఆత్రంలో మారియో పానశాలలోకి గబగబా చొరబడ్డాడు. కవి చెప్పిన సలహాను ద్రాక్షసారాయం మీద ప్రయోగించాలనుకున్నాడు. కాని ఆ పని చేయబోయేలోపుగానే మారియోను మరొక మత్తు ముంచెత్తింది. తన జీవితంలో ఎటువంటి సారాయమూ ఇంతవరకూ అటువంటి మత్తును కలిగించలేదు.
అక్కడ టాకాటాకా బల్లమీద చిలుం పట్టిన నీలంరంగు మీటలు నొక్కుతూ కూచున్నది ఒక అందమైన యువతి. మారియో ఇంతవరకూ చూసిన నటీమణులందరికన్న, నాట్యగత్తెలందరికన్న, శిరోజాలంకరణకారులందరికన్న, యాత్రికులందరికన్న, పాటల రికార్డులమ్మే దుకాణదారులందరికన్న అందమైనదా యువతి. అమ్మాయిలకోసం మారియో ఎంత తపన పడతాడో అంతే భయస్తుడు కూడ. ఆ పిరికితనం వల్ల మారియో ఎన్నోసార్లు తనను తాను పిచ్చి కోపంతో తిట్టుకున్నాడు. ఆరోజు మాత్రం నిద్రలో నడుస్తున్నవాడిలాగా టాకాటాకా బల్ల దగ్గరికి నడిచాడు. ఎరుపు బంతుల గోల్ వెనుక నిలబడి తన ఉద్రేకాన్ని అణచుకోవడానికి చాల ప్రయత్నించాడు. విప్పారిన తన కళ్లను బంతుల మీదనే నిలపడానికి చాల ప్రయత్నించాడు. కాని అదంతా ఎందుకూ పనికిరాలేదు. ఆ అమ్మాయి అక్కడ గోల్స్ నమోదుచేసే లోహపు పలక మీద ఒక గోల్ నమోదు చేసేటప్పుడు మారియో నేరుగా ఆమె కళ్లలోకి చూశాడు. ఆమెను లొంగదీసుకునే చిరునవ్వునొకదాన్ని తనకు వీలయినంత వశీకరణ విద్యతో ఆమె మీద గుమ్మరించాడు. దానికి ప్రతిగా అమె అవతలి పక్షం వైపు నిలబడమని అడిగింది. అప్పుడుగాని మారియోకు అది ఒక ఆట అని, అందులో ఆమెకు ఒక ప్రత్యర్థి ఉంటాడని, అవతలివైపు ఆడతాడని తెలిసిరాలేదు. మారియో జీవితంలో తన గుండె చప్పుడు తనకే వినిపించిన అతి తక్కువ సందర్భాలలో అది ఒకటి. నరాల్లో నెత్తురు ఎంత వేగంగా ప్రవహించిందంటే, ఆ రక్తప్రవాహాన్ని అదుపులోకి తేవడానికి తన గుండె మీద అరచెయ్యిపెట్టి ఒత్తుకున్నాడు. ఆ అమ్మాయి ఒక పక్కన ఉన్న తెల్ల బంతిని కొట్టేసి దాన్ని అవతలివాళ్ల గోల్ లోకి జరుపుతున్నట్టు కనబడింది. మారియో అతి మెళకువగా ఆడి ఆమె ముందర తన నైపుణ్యం ప్రదర్శించాలనుకున్నాడుగాని, ఆ అమ్మాయి ఆ బంతిని ఎత్తి తన పళ్ల మధ్య ఇరికించుకుంది. ఆ బంతి అక్కడ మెరిసిపోయింది. నోట్లో బంతితో ఆమె తన ఛాతీ విరిచింది. అక్కడ ఆమెకు తగిన కొలతల కంటె కనీసం రెండు అంగుళాలు చిన్న జాకెట్ ఉంది. అది ఆమె బలిష్టమైన రొమ్ములను ఎంతమాత్రం దాచలేకపోతోంది. రొమ్ము విరిచి ‘కావాలంటే నా నోటినుంచి ఆ బంతి తీసుకో’ అన్నట్టు చూసిందామె. ఆ హావభావాలతో మారియోకు అవమానమూ కలిగింది, మైమరపూ కలిగింది. వణుకుతున్న కుడిచెయ్యి ఎత్తి ఆ బంతి లాగబోయాడు. సరిగ్గా ఆ వేళ్లు బంతిని ముట్టుకోబోయే సమయానికి ఆ అమ్మాయి చివాలున పక్కకు ఒంగింది. మారియో చేతికి ఏమీ అందలేదు. ఆ అమ్మాయి ముఖం మీద ఒక వెటకారపు నవ్వు. మారియో అక్కడే నిలబడి ఉన్నాడు. ఎవరికో అభివాదం తెలుపుతున్నట్టుగా చెయ్యెత్తి, వేళ్లు తెరిచి నిలబడి ఉన్నాడు. ఆ చేతిలో ఒక గ్లాసూ లేదు, షాంపేనూ లేదు. ఆ అభివాదం కూడ సఫలంకాని ప్రేమకు అభివాదం లాగ ఉంది. వినబడుతున్న పాటకంటె ఎక్కువ రెచ్చగొట్టేలా శరీరాన్నీ కాళ్లనూ ఊపుతూ ఆమె పానశాల లోపలికి పరుగెత్తింది. తన ముఖం ఎర్రబడిందనీ, చెమటతో తడిసిపోయిందనీ గుర్తించడానికి మారియోకు అద్దం అవసరమే లేకపోయింది. మరొక అమ్మాయి ఆ స్థానంలోకి వచ్చి బంతి విసురుగా కొట్టి మారియోను తన మైమరపులోంచి మేల్కొలిపింది. పోస్ట్ మన్ నిర్లిప్తంగా తన కొత్త ప్రత్యర్థి ముఖంలోకి చూశాడు. ఉపమానాలనూ అలంకారాలనూ కనిపెట్టడంలో తనకు ఎంతమాత్రమూ శక్తిలేదని కొద్ది గంటలకిందనే పసిఫిక్ మహాసముద్రం ముందర చేసిన ప్రకటనను మరిచిపోయి, ఈ మామూలు పల్లెటూరి పిల్లతో ఆడడం తన సొంత చెల్లెలితో కలిసి నాట్యం చేయడం కన్న తక్కువ ఉత్సాహభరితంగా ఉంటుందనీ, ఫుట్ బాల్ ఆడకుండా గడిచిన ఆదివారం మధ్యాహ్నం కన్న ఎక్కువ విసుగ్గా ఉంటుందనీ, నత్తల పరుగుపందెంతో సమానమైన ఉత్తేజాన్ని కలిగిస్తుందనీ చెప్పుకున్నాడు.
వెళిపోతున్నానని ఒక తల ఆడింపు అయినా లేకుండానే, తన ప్రేయసి అడుగుజాడలను పట్టుకుని పానశాలలోకి నడిచాడు. అక్కడ ఒక కుర్చీలో కూలబడ్డాడు. ఆ పానశాలను ఒక నాటకశాలలాగ భావించాడు. ఆ అమ్మాయి అక్కడ పెద్దపెద్ద మధు పాత్రలలోకి గాలి ఊదుతూ, ఒక పెద్ద లిలీ పూల గుడ్డతో ఆ పాత్రలమీద మరకలూ మచ్చలూ పోయేట్టు
లిలీ పూల గుడ్డతో ఆ పాత్రలమీద మరకలూ మచ్చలూ పోయేట్టు తుడుస్తుండగా సుదీర్ఘంగా చూస్తూ ఉండిపోయాడు.
టెలిగ్రాఫ్ ఆపరేటర్ కోస్మెకు రెండు సూత్రాలు చాల ఇష్టమైనవి.
వాటిలో ఒకటి సోషలిజం. దాని గురించి ఆయన తన దగ్గర పనిచేసేవారి బుర్రలు తింటుండేవాడు. వాళ్లందరూ అప్పటికే ఆ సిద్ధాంతానికి సానుభూతిపరులో, కార్యకర్తలో అయినా సరే.
రెండో సంగతేమో పోస్టాఫీసులోపల పోస్టాఫీసు టోపీ పెట్టుకోవడం. పోస్టాఫీసు ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆ టోపీ పెట్టుకు తీరాలని ఆయన సిద్ధాంతం. మారియో వెంట్రుకలు ఉంగరాలు తిరిగి, చెదిరిపోయి గాలిలో అటూ ఇటూ ఎగురుతూ వాటి శ్రామికవర్గ స్ఫూర్తిలో బీటిల్స్ ను తలదన్నేలా ఉన్నా కూడ కోస్మె క్షమించాడు. సైకిల్ చెయిన్ లో పడి మారియో నీలంరంగు జీన్స్ పాంటుకు ఆయిల్ మరకలు అయినా కూడ కోస్మె క్షమించాడు. మారియో రోజూ వేసుకొచ్చే జాకెట్ రంగు మాసి వెలిసిపోయినా ‘సరేలే’ అనుకున్నాడు. మారియో ఎప్పుడూ ముక్కులో చిటికెనవేలు దూర్చి గెలుక్కుంటున్నా సరే పోనీలే అనుకున్నాడు. కాని మారియో నెత్తిమీద టోపీ లేకుండా చూస్తే మాత్రం కోస్మె రక్తం మరిగిపోయేది.
ఆ రోజు కూడ ఆ బక్కపలుచని పోస్ట్ మాన్ లోపలికి వచ్చి ఒక బలహీనపు గుడ్ మార్నింగ్ చెప్పి ఉత్తరాలు వేరుచేసుకునే బల్ల దగ్గరికి వెళ్లబోతుండగా కోస్మె అతణ్ని మధ్యలోనే ఆపేశాడు. చూపుడువేలు నిటారుగా చేసి మారియో మెడమీద గుచ్చాడు. అలాగే తోసుకుంటూ టోపీల కొయ్య దగ్గరికి నడిపించుకుపోయాడు. అక్కడ ఒక టోపీ తీసి దాన్ని మారియో తల మీద పెట్టి చెవుల కింది దాకా లాగాడు. అప్పుడు గానీ మారియోకు పూర్తిగా సక్రమంగా అభివాదం చెప్పే అవకాశం ఇవ్వలేదు.
“గుడ్ మార్నింగ్ బాస్.”
“గుడ్ మార్నింగ్” అంటూ కోస్మె చిరచిరలాడాడు.
“కవిగారికి ఏమన్నా ఉత్తరాలు ఉన్నాయా?”
“ఓ, బోలెడు. ఒక టెలిగ్రాం కూడ ఉంది.”
“టెలిగ్రామా!”
మారియో గబాలున ఆ టెలిగ్రాం లాక్కున్నాడు. దాన్ని వెలుగులో పెట్టి దాంట్లో ఉన్న విషయాలు చదవడానికి ప్రయత్నించాడు. ఒక్క గంతులో బయటికి దూకి సైకిల్ ఎక్కేశాడు.
“మిగిలిన ఉత్తరాలు తీసుకోవడం మరిచిపోయావు” అని గుమ్మంలోంచి కోస్మె అరుస్తుండగానే మారియో సైకిల్ ముందుకు కదిలిపోయింది.
“మళ్లీ వచ్చి తీసుకెళ్తా” అంటూ వెళ్తూ వెళ్తూనే ఒక్క అరుపు అరిచాడు.
“నువ్వొక పనికిమాలినవాడివి. మళ్లీ ఉత్తరాలకోసం ఇంకోసారి వెళతావా?” అని కోస్మె కూడ అరిచాడు.
“నేనేమీ పనికిమాలినవాడిని కాదు బాస్. అలా అయితే కవిని రెండుసార్లు చూడగలుగుతానుగా” అన్నాడు మారియో.
నెరూడా వాళ్ల ఇంటి గేటు దగ్గర, మామూలు మర్యాద ప్రకారం ఎవరయినా ఎంతసేపు కొట్టడానికి అవకాశం ఉందో అంతకంటే చాల ఎక్కువసేపు గంట మోగించాడు మారియో. అలా మూడు నిమిషాలపాటు ఆగకుండా గంట వాయించినా కవి బయటికి రాలేదు. ఇక మారియో తన సైకిలును అక్కడ ఒక దీపస్తంభానికి ఆనించి నిలబెట్టి, ఒక్కుమ్మడిగా శక్తి తెచ్చుకుని సముద్రతీరం మీద రాళ్ల దగ్గరికి పరుగెత్తాడు. అక్కడ నెరూడా కనబడ్డాడు. చేతులూ కాళ్లూ ఇసుకలో కప్పుకుని కూచున్నాడు నెరూడా.
“వారెవ్వా, ఏమదృష్టం” అంటూ రాళ్ల మీంచి దూకుతూ, “టెలిగ్రాం” అని అరిచాడు మారియో.
“ఇవాళ పొద్దున్నే లేచినట్టున్నావు బిడ్డా” అన్నాడు కవి.
మారియో కవి పక్కనచేరి నిండా పది క్షణాలపాటు గసపోసి ఊపిరి తీసుకుని “ఏం ఫర్వాలేదు, నాకు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది, అది చాలు” అన్నాడు.
“అదేదో చాల ముఖ్యమైన విషయంలాగుంది. నువ్వు గుర్రం లాగ గసపోస్తూవచ్చావు.”
మారియో నుదుటిమీద పేరుకున్న చెమటను తన చేతితో తుడిచేసుకున్నాడు. టెలిగ్రామ్ మీది తడిని తన కాళ్లకు తుడుచుకున్నాడు. టెలిగ్రాం ను కవి చేతుల్లో పెట్టాడు.
“పాబ్లో గారూ” అని గంభీరంగా మొదలుపెట్టి “నేను ప్రేమలో పడ్డాను” అన్నాడు.
కవి తన చేతిలోని టెలిగ్రాం విసనకర్రేమో అన్నట్టుగా గడ్డం ముందర విసురుకున్నాడు.
“అయ్యో, అయ్యో. అదేమంత పెద్ద విషయం కాదు. దానికి మందు ఉంది” అన్నాడు.
“మందేమిటి? పాబ్లో గారూ, ఒకవేళ ఇది జబ్బు అయి, దీనికి మందు ఉండేట్టయితే, నాకు ఆ జబ్బు రావాలనే కోరుకుంటున్నా. నేను ప్రేమలో పడ్డాను. నేను తలమునకలుగా ప్రేమలో ఉన్నాను.”
జవాబుగా కవి అన్న రెండుమాటలూ కవి నోటినుంచి రాలిపడ్డ రెండు పెద్ద బండరాళ్లలాగ మారియోను తాకాయి.
“ఎవరి మీద పడ్డావు?”
“పాబ్లో గారూ!”
“బిడ్డా ఎవరితో పడ్డావు” అని అడుగుతున్నా.
“ఆమె పేరు బీట్రిజ్.”
“ఓహ్, డాంటే.”
“ఏమిటండీ?”
“ఒకానొక కాలంలో డాంటే అని ఒక కవి ఉండేవాడు. ఆయన బీట్రిజ్ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. బహుశా బీట్రిజ్ అనే పేరుగల అమ్మాయిలు అంతులేని ప్రేమను ప్రేరేపించేట్టున్నారు.”
పోస్ట్ మాన్ తన జేబులోంచి పెన్ను తీసి ఎడమ అరచేతి మీద రాసుకోవడం మొదలుపెట్టాడు.
“ఏం చేస్తున్నావు?”
“మీరు చెప్పిన ఆ కవి పేరు రాసుకుంటున్నా – డాంటే?”
“డాంటే అలిఘియెరి.”
“హలిఘియెరి నా?” “కాదు బిడ్డా, అది అ తో మొదలవుతుంది.”
“అ అంటే అడవి లాగనా?”
“అవును, అ అడవి లాగ, ఇ ఇల్లు లాగ.”
“పాబ్లో గారూ?”
కవి తన ఆకుపచ్చని పెన్ను బయటికి తీశాడు. ఆ కుర్రవాడి చెయ్యి బండమీద పెట్టించాడు. ఆ మహాకవి పేరు పెద్ద అక్షరాలలో రాశాడు. ఆ పని అయ్యాక తన టెలిగ్రాం విప్పబోతుండగా, మారియో ఇప్పుడు గొప్ప అదృష్టం పట్టిన ఆ అరచేతితో తన నుదుటిమీద చరుచుకుని ఒక నిట్టూర్పు విడిచాడు.
“పాబ్లో గారూ, నేను ప్రేమలో పడ్డాను.”
“నువ్వామాట నాకిదివరకే చెప్పావు. కాని ఈ విషయంలో నేనేం చేయగలను?”
“మీరు నాకు సాయం చేయాలి.”
“ఈ వయసులోనా?”
“ఆమెతో ఎట్లామాట్లాడాలో నాకు తెలియడంలేదు గనుక మీరే నాకు సాయపడాలి. ఆమె నా కళ్లముందర ఉందంటే నాకు మాటలే రావు, మూగవాణ్నయిపోతాను. ఒక్క అక్షరం పెదవి దాటితే ఒట్టు.”
“ఏమిటీ? నువ్వింతవరకూ ఆమెతో మాట్లాడనే లేదా?”
“ఉహు, అసలేమీ మాట్లాడలేదు. నిన్న మీరు చెప్పినట్టుగా నేను చాలసేపు సముద్రతీరం వెంట నడిచాను. చాలసేపు సముద్రాన్ని చూశాను. కాని నాకు ఒక్క అలంకారం కూడ తట్టలేదు. ఆతర్వాత సారాకొట్టుకు వెళ్లాను. ఒక ద్రాక్షాసవం సీసా కొనుక్కున్నాను. ఆ సీసా నేను ఆమె దగ్గరే కొనుక్కున్నాను.”
“బీట్రిజ్ దగ్గరా?”
“అవును, బీట్రిజ్ దగ్గరే. నేనక్కడే నిలబడి ఆమెను బాగా చూశాను. అంతే. నేనిక ఆమెతో ప్రేమలో పడిపోయాను.”
“అంత తొందరగానా?”
“ఉహు, అంత తొందరగా ఏమీ కాదు. దాదాపు పది నిమిషాలు ఆమెను తేరిపార జూశాను.”
“ఓహో అలాగా, ఆ తర్వాత ఆమె ఏం చేసింది?”
“ఏం చూస్తున్నావు అట్లా? నామొఖంలో ఏమన్నా కోతులాడుతున్నాయా ఏంటి” అందామె.
“మరి నువ్వేమన్నావు?”
“ఏమనాలో నాకేమీ తోచలేదు.”
“ఏమీ అనలేదా? ఒక్కమాట కూడా?”
“అహ అలా కాదు, అంత ఘోరం కాదు లెండి. నేను ఐదు మాటలు పలికాను తెలుసా?”
“ఏమిటవి?”
“మీ…..పేరు…..ఏమిటి?”
“మరి ఆమె ఏమని జవాబిచ్చింది?”
“బీట్రిజ్ గోన్జాలెజ్ అందామె.”
“అవునూ నువ్వామెను మీ పేరు ఏమిటి అని అడిగావు, మూడే పదాలు కదా, ఐదు పదాలు అన్నావే? మిగిలిన రెండు పదాలు ఎమిటి?”
“బీట్రిజ్ గోన్జాలెజ్.”
“బీట్రిజ్ గోన్జాలెజ్?”
“ఆమె బీట్రిజ్ గోన్జాలెజ్ అని చెప్పిందిగా, నేను ఆ రెండు పదాలూ మళ్లీ అన్నానన్నమాట.”
“బిడ్డా, విను. నువ్వేమో నాకు ఒక అత్యవసరమైన టెలిగ్రాం తెచ్చావు. ఇంకా మనం బీట్రిజ్ గోన్జాలెజ్ గురించే మాట్లాడుతూ ఉంటే, నా చేతుల్లో ఈ సందేశం మురిగిపోతుంది.”
“సరే, సరే, దాన్ని తెరిచి చూడండి.”
“ఎవరికి వచ్చిన జాబులయినా వాళ్ల వ్యక్తిగతమైనవని పోస్ట్ మాన్ గా నీకు తెలిసే ఉండాలే.”
“మరి నేను మీ ఉత్తరాలెప్పుడూ విప్పి చూడలేదు గదా.”
“నువ్వు అలా విప్పావని నేననడం లేదు. నేననేదల్లా ఎవరికయినా వాళ్ల ఉత్తరాలు ప్రశాంతంగా, ఏకాంతంగా చదువుకునే అవకాశం, హక్కు ఉండాలని మాత్రమే. ఆ పని చేసేటప్పుడు సాక్షులూ గూఢచారులూ ఉండగూడదని మాత్రమే.”
“నాకు అర్థమైంది పాబ్లోగారూ.”
“సంతోషం.”
ఒకవైపు ఉద్వేగంతో మరొకవైపు చెమటతో తడిసిముద్దవుతూ నిరాశనిండిన గొంతుతో “సరే, కవిగారూ మళ్లీ వస్తాను” అన్నాడు.
“సరే మారియో, మళ్లీ కలుద్దాం.”
ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఔదార్యపు ముక్తాయింపు ఇద్దామనుకున్న కవి మామూలుకన్న పెద్ద నోటు ఒకటి తీసి మారియో చేతుల్లో పెట్టాడు. కాని మారియో ఆ నోటువేపు మరింత ఎక్కువ ఆందోళనగా చూసి, దాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేస్తూ, “ఒకవేళ మీకు అది అంత ఇబ్బంది కాకపోతే, నాకు ఆ డబ్బులు ఇచ్చే బదులు నాకోసం ఆ అమ్మాయి మీద ఒక చిన్న కవిత రాసి ఇస్తే ఎక్కువ సంతోషిస్తాను” అన్నాడు.
నెరూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా పరుగులు పెట్టలేదు. కాని ఇప్పుడు హఠాత్తుగా తనను తాను ఈ ప్రకృతినుంచి విముక్తి చేసుకుని ఈ సముద్ర తీరం వదిలి వలస పక్షిలాగ ఎంత వేగంగా వీలయితే అంత వేగంగా పరుగెత్తిపోగలిగితే ఎంత బాగుండు అని గాఢంగా అనుకున్నాడు. వయసునూ, ఆరోగ్య స్థితినీ దృష్టిలో పెట్టుకుంటే అలా ఎగరలేనని తెలుసుకున్న నిరాశలో గాలిలోకి చేతులు ఎగరేశాడు. “కాని నాకసలు ఆమె తెలియను గూడ తెలియదుగా. ఒక కవి ఎవరినుంచయినా ప్రేరణ పొందాలంటే కనీసం వారిగురించి తెలిసి ఉండాలిగదా. ఏమీలేని శూన్యం నుంచి నేనెలా సృష్టించగలను” అన్నాడు.
“చూడండి. ఒక సాదాసీదా కవిత కోసం మీరు ఇంత గందరగోళం చేస్తున్నారంటే మీకసలు నోబెల్ బహుమతి రానేరాదు” అన్నాడు పోస్ట్ మాన్.
నెరూడాకు ఊపిరి ఆగినట్టయి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.
“మారియో, దయచేసి ఒక్కసారి నన్ను గిల్లవా, ఈ పగటికల నుంచి నన్ను మేల్కొల్పవా?”
“సరే, పాబ్లో గారూ, నేనామెకు ఏం చెప్పను? ఈ మహాపట్టణంలో నాకు సహాయం చేయగలిగినది మీరొక్కరే. మిగిలిన వాళ్లంతా ఏమి మాట్లాడాలో ఏమీ తెలియని పల్లెకారులు.”
“కాని ఆ పల్లెకారులు కూడ ఎప్పుడో ఒకప్పుడు తమకు నచ్చిన అమ్మాయిలతో ప్రేమలో పడేఉంటారు. ఏదో అనే ఉంటారు గదా.”
“ఆ, ఏమిట్లెండి, ఏవో చేపల కతలు చెప్పి ఉంటారు!”
“మరి ఆ అమ్మాయిలు వాళ్ల వెంటపడ్డారుగదా, చివరికి పెళ్లి కూడ చేసుకున్నారు గదా. అవునూ మీ నాన్న ఏం చేస్తాడు?”
“ఆయన కూడ చేపలు పడతాడు.”
“అదిగో, తెలిసిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఆయన మీ అమ్మతో ఏదో మాట్లాడే ఉంటాడుగదా, ఆమెను పెళ్లికి ఒప్పించి ఉంటాడుగదా.”
“పాబ్లో గారూ, అదేమంత మంచి పోలిక కాదు. ఎందుకంటే బీట్రిజ్ మా అమ్మకన్న ఎంతో అందంగా ఉంటుంది.”
“మారియో, నా బిడ్డా, ఇంక ఈ టెలిగ్రాంలో ఏముందో తెలుసుకోవాలనే కోరిక నన్ను ఆగనివ్వడం లేదు. దయచేసి నాకు ఆ అవకాశం ఇస్తావా?”
“ఓహ్, సంతోషంగా చదువుకోండి.”
“కృతజ్ఞతలు.”
నెరూడా ఆ టెలిగ్రాం కవర్ చించాలనుకున్నాడు. కాని ఆ తొందరలో మొత్తం టెలిగ్రామే చిరిగిపోయింది. ఉత్సుకతతో కాలి బొటనవేళ్ల మీద నిలబడి, కవి భుజాలమీంచి తొంగిచూసి టెలిగ్రాంలో ఏముందో చూడాలని మారియో ప్రయత్నించాడు.
“ఆ టెలిగ్రాం స్వీడన్ నుంచేనా?”
“కాదు.”
“ఈ సంవత్సరం నోబెల్ బహుమతి మీకే ఇస్తారంటారా?”
“నాకిప్పుడా చింత ఏమీ లేదు. నేనేదో పందానికి పోతున్న గుర్రాన్నయినట్టు, ప్రతిసంవత్సరం పోటీలో నా పేరు ఉండడం చూసి నాకు విసుగేస్తోంది.”
“మరి, ఈ టెలిగ్రాం ఎవరి నుంచి?”
“పార్టీ కేంద్ర కమిటీ నుంచి.”
కవి కాసింత విషాదంతో ఒక క్షణం ఆగాడు.
“బిడ్డా, కొంపదీసి ఇవాళ శుక్రవారం పదమూడో తారీఖు కాదు గదా?”
“ఏం, ఏమన్నా విషాదవార్తనా?”
“భయంకరం! వాళ్లు మనదేశానికి అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నన్ను నిర్ణయించారు!”
“కాని పాబ్లోగారూ అది భలే బాగుంటుంది గదా.”
“వాళ్లు నన్ను ఎంపిక చేయడం బానే ఉందనుకో, కాని పొరపాటున గెలిస్తే?”
“తప్పకుండా గెలుస్తారు. మీరు గెలవకపోతే మరెవరు గెలుస్తారు? మీరు ప్రతిఒక్కరికీ తెలుసు. మా నాన్న దగ్గర ఒకే ఒక్క పుస్తకం ఉంది, అది మీదే.”
“దానర్థం ఏమిటన్నమాట?”
“దానర్థం ఏమిటన్నమాట అంటే ఏమిటి? మా నాన్నకు చదువూ రాతా రాకపోయినా ఆయన తన దగ్గర మీ పుస్తకం పెట్టుకుంటున్నాడంటే మనం గెలుస్తామన్నమాటే!”
“మనం గెలుస్తామా?”
“తప్పకుండా. ఎటుపోయి ఎటువచ్చినా సరే నేనయితే మీకే వోటు వేస్తాను.”
“నువ్వు అంతగా మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు.”
ముక్కలుగా చిరిగిపోయిన టెలిగ్రాం అవశేషాలను నెరూడా మలిచి జేబులో పెట్టేసుకున్నాడు. పోస్ట్ మాన్ అక్కడ అలా నిలబడి కళ్లనిండా ఎటువంటి విచారం నిండిన వదనంతో కవి వైపు చూశాడంటే కవికి తన చిన్నప్పుడు తన స్వగ్రామంలో మంచుతెరల్లో నిలబడిన కుక్కపిల్ల గుర్తొచ్చింది.
నెరూడా చిరునవ్వు కూడ నవ్వకుండా, “సరే, ఇప్పుడు మనం బయల్దేరి సారాకొట్టు దగ్గరికి వెళ్లి నీ సుప్రసిద్ధ ప్రేయసి బీట్రిజ్ గోన్జాలెజ్ ను కలుసుకుందాం” అన్నాడు.
“పాబ్లో గారూ, నాతో హాస్యాలాడుతున్నారా?”
“లేదు, నేను చాల గంభీరంగానే చెపుతున్నాను. మనం మొదట సారాకొట్టు దగ్గరికి వెళ్దాం. ఒక చుక్క ద్రాక్షాసవం రుచిచూద్దాం. ఆ తర్వాత నీ మనసు కొల్లగొట్టిన అమ్మాయిని చూద్దాం.”
“అమ్మయ్యో, మనను కలిసి చూసిందంటే ఆమె గుండె ఆగిపోతుంది. పాబ్లో నెరూడా, మారియో హిమేనెజ్ కలిసి వాళ్ల సారాకొట్లో ద్రాక్షాసవం సేవించడమా, ఆమె గుటుక్కుమంటుంది!”
“అలా జరిగితే ఘోరమే అనుకో. అప్పుడిక నువ్వు ఆమె కోసం ప్రేమకవిత్వం కాక, సంస్మరణ గీతం రాయాల్సి వస్తుంది” అంటూ కవి బలంగా, ఉత్సాహంగా ముందుకు అడుగేశాడు. కాని మారియో వెనక కాళ్లీడుస్తూ రావడం చూసి, వెనక్కి తిరిగి, “ ఏమయింది, మారియో నీకు” అని అడిగాడు.
పోస్ట్ మాన్ పరుగెత్తి ఆయన పక్కన నిలబడి ఆయన కళ్లలోకి సూటిగా చూశాడు. “పాబ్లో గారూ, నేను బీట్రిజ్ గోన్జాలెజ్ ను గనుక పెళ్లి చేసుకునేట్టయితే, మీరు పెళ్లి పెద్దగా ఉంటారా?”
నెరూడా తన నున్నటి గడ్డాన్ని గీరుకున్నాడు. ఆ ప్రశ్నను కాసేపు తూచి చూస్తున్నట్టు నటించాడు. ఆ తర్వాత తన వేలిని నుదుటిమీద పెట్టి సాలోచనగా ఉండిపోయాడు.
“సారాకొట్లో కాస్త మందు కడుపులో పడ్డాకగానీ మనం ఈ రెండు సమస్యలమీద అంతిమనిర్ణయానికి రాలేం” అన్నాడు.
“రెండు సమస్యలేమిటి?”
“ఒకటి అధ్యక్ష ఎన్నిక సమస్య, రెండోది బీట్రిజ్ గోన్జాలెజ్ సమస్య.”
దూరం నుంచి పాబ్లో నెరూడా రావడాని సారాకొట్టులో ఉన్న ఒకేఒక్క పల్లెకారుడు చూశాడు. నెరూడా వెంట ఒక తోలు సంచీ వేసుకున్న కుర్రాడెవడో కూడ ఉన్నాడు. అది చూడగానే ఆ పల్లెకారుడు కొత్త పూటకూళ్లమ్మ చెవిన ఆ మాట వేశాడు. చూడు, చూడు ఎవరో మంచి ఖాతాదార్లు, కనీసం వారిలో సగం మంది మంచి ఖాతాదార్లు, వస్తున్నారు అని.
“అదిగో, రానే వచ్చారు.”
ఆగంతకులు లోపలికొచ్చి కూచున్నారు. సరిగ్గా ఎదురుగా సారాసీసాల బల్ల వెనుక కూచున్న పదిహేడేళ్ల అమ్మాయి వాళ్లు కూచున్న చోటికి కనబడుతోంది. ఆమె వెంట్రుకలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి. గాలికి చెదిదిపోతున్న ఆమె జుత్తు గోధుమ రంగులో ఉంది. బెల్లపురంగులో ఉన్న ఆమె కళ్లు విషాదాన్ని కనబరుస్తున్నాయి గాని చాల ఆత్మవిశ్వాసం కూడ వాటిలో ఉట్టిపడుతోంది. కనుగుడ్లు మంచి రేగుపళ్లలా ఉన్నాయి. ఆమె మెడవంపు నేరుగా కిందికి దిగి రొమ్ములమధ్య చిక్కుకుపోయింది. ఆమె వేసుకున్న తెల్ల జాకెట్టు ఆమెకు అవసరమైనదానికన్న రెండు మోతాదులు తక్కువ ఉందేమో రొమ్ములు పెద్దగా పొడుచుకొచ్చినట్టున్నాయి. ఇక చనుమొనలయితే పైన ఆచ్ఛాదన ఉన్నా లేనట్టే నిక్కబొడుచుకుని ఉన్నాయి. ఆమె నడుమా, అదయితే తెల్లవారు జాముదాకా చివరిచుక్క ద్రాక్ష సారాయం కూడ పీలుస్తూ వదలకుండా నాట్యం చేయడానికి తగినట్టుగా ఉంది.
ఆ బల్ల వెనుక నుంచి లేచి బయటికి వచ్చి ఆ కొట్లో అమె నడుస్తుంటే ఈ కొత్త ఖాతాదార్లు ఆమె దేహసౌందర్యాన్ని తనివితీరా చూశారు. అప్పటిదాకా కనబడిన ఆ నడుము కింద అది రెండు పెద్ద పిరుదులుగా విస్తరించడం కనబడింది. ఆమె వేసుకున్న పొట్టిలంగా వల్ల అవి మరింత పెద్దగా ఎగురుతున్నట్టు కనబడుతున్నాయి. చూపులు ఇంకా కిందికి దిగితే ఆమె పిక్కలు రాగిరంగులో ఉన్నాయి. అక్కడినుంచి ఆ చూపులు బొద్దుగా, పల్లెటూరివాళ్ల పాదాల లాగ, చెప్పులులేని పాదాలలోకి దిగాయి.
అలా ఆ దేహంలోని ఒక్కొక్క అవయవం మీదా మళ్లీ మళ్లీ వివరంగా ప్రయాణించిన తర్వాత చివరికి ఆ చూపులు మళ్లీ ఆ బెల్లపు రంగు కళ్లమీద ఆగిపోయాయి. ఇప్పుడు ఆ కళ్లలో విషాదం స్థానాన్ని ఒకింత కొంటెతనం ఆక్రమించింది. కొత్త ఖాతాదార్లను గుర్తించగానే ఆమె కళ్లలో భావం మారిపోయింది.
“ఓహ్, ఎవరొచ్చారో చూడండి, టాకా టాకా ఆటలో మొనగాడు!” అంటూ బీట్రిజ్ గోన్జాలెజ్ బల్లమీద జిడ్డోడుతున్న గుడ్డను తన చిటికెన వేలితో వత్తింది. “ఏం కావాలండీ మీకు?” అని అడిగింది.
మారియో కళ్లు ఆమె కళ్ల మీదనే నిలిచిపోయాయి. తాను అనుభవిస్తున్న ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అవసరమైన కనీస సమాచారాన్ని అందించమని మెదడును ఒప్పించడానికి అరనిమిషం పాటు చాల కష్టపడ్డాడు. అతనికి అప్పుడు కావలసిన సమాచారమల్లా నేనెవరు, నేనెక్కడున్నాను, ఊపిరిపీల్చడమంటే ఏమిటి, మాట్లాడడమంటే ఏమిటి అనే ప్రశ్నలకు జవాబులే.
ఆ అమ్మాయి తన ప్రశ్నను మరొకసారి వేసినా, తన పల్చని వేళ్లన్నీ కలిపి ముద్ద చేసి ఆ బల్ల మీద ఒక్క గుద్దు గుద్దినా మారియో గడ్డకట్టిన మౌనం కరగలేదు. ఇక చేసేది లేక బీట్రిజ్ గోన్జాలెజ్ తోడున్న పెద్దమనిషి వైపు తిరిగి కుతూహలంగా చూసింది. సంగీత ధ్వని లాగ గలగలలాడుతూ నాలుక మెరిపిస్తూ ఒక ప్రశ్న అడిగింది. అది అటువంటి ఏ సందర్భంలోనైనా వచ్చే మామూలు ప్రశ్నేననుకున్నాడు నెరూడా.
“మరి మీకో?”
“ఆయనకేది తెస్తే అదే” అన్నాడు కవి.
రెండు రోజుల తర్వాత ఆ ఊరు అల్లకల్లోలమయిపోయింది. ఆ కవి బొమ్మతో పోస్టర్లు అతికించిన వాహనం ఒకటి దడదడలాడుతూ ఆ ఊళ్లోకొచ్చింది. “అధ్యక్షుడిగా నెరూడాను ఎన్నుకొండి” అనే నినాదాలతో ఆ పోస్టర్లు నిండిపోయాయి. ఆ ప్రశాంత కుటీరం నుంచి ఆయనను ఆ వాహనం నగరానికి తీసుకుపోయింది.
అప్పుడు తన మనోభావాలగురించి తన దినచర్య పుస్తకంలో కవి ఇలా రాసుకున్నాడు: “నామీద రాజకీయ జీవితం ఒక పిడుగులాగ విరుచుకుపడింది. అది నన్ను నా పని నుంచి దూరం చేసింది. మహా జనసమూహమే నా మహోపాధ్యాయురాలు. కవికి సహజంగా ఉండే పిరికితనంతోనో, ఒక సిగ్గరికి ఉండే ముందు జాగ్రత్తతోనో నేను ఆ జనసమూహాన్ని చేరుతుండేవాణ్ని. కాని ఆ సమూహంలో ఒకానొక వ్యక్తిగా మారినతర్వాత నాలో ఏదో గొప్ప పరివర్తన జరిగినట్టుండేది. నేను ఒక అత్యద్భుత జనబాహుళ్యంలో భాగమయినట్టుండేది. నన్ను నేను ఒక మహామానవవృక్షానికి తొడిగిన మారాకులా భావించుకునే వాడిని.”
ఆ మహావృక్షం మీద మరొక ఆకు – బహుశా వడిలిపోయిన ఆకు – లాంటి మారియో హిమేనెజ్ కవికి వీడ్కోలు పలకడానికి వచ్చాడు. కవి ఆయనను చాల సాంప్రదాయకంగా కౌగిలించుకున్నాడు. తోలు బైండింగ్ తో అందంగా ఉన్న తన సమగ్ర రచనల సంపుటాలు రెండింటిని ఇచ్చాడు. వాటిమీద “నా ప్రియాతిప్రియమైన స్నేహితుడు, కామ్రేడ్ మారియో హిమేనెజ్ కు, పాబ్లో నెరూడా” అని రాసి ఇచ్చాడు. ఎప్పుడూ కోరుకున్నదానికన్న ఎక్కువగా అందిన ఈ సత్కారం చూసి మారియో పొంగి పోవలసిందే. కాని ఇదంతా మారియోను సుదూరంగా కూడ సంతోషపెట్టలేదు.
ఆ మట్టిరోడ్డు మీద నెరూడా వాహనం కదిలివెళ్లిపోతుంటే, అదృశ్యమవుతుంటే మారియో చూస్తూ ఉండిపోయాడు. తానప్పటికే మరణించినట్టు, ఆ వాహనం వెనుక లేస్తున్న దుమ్ము తనను ఖననం చేస్తున్నట్టు మారియోకు అనిపించింది.
కవి పట్ల ఉన్న అపారమైన విధేయతవల్ల మాత్రమే కవి ఇచ్చిన మూడువేలపేజీల కవిత్వంలో చివరి అక్షరం చదివేదాకా ఆత్మహత్య చేసుకోగూడదని శపథం తీసుకున్నాడు మారియో. గంట స్తంభం దగ్గర కూచుని మొదటి యాభై పేజీలు చదవడంలో చాల కఠినంగా తన శపథాన్ని నెరవేర్చాడు. కాని నెరూడాకు లెక్కలేనన్ని ఉపమానాలు, అలంకారాలు సృష్టించడానికి ప్రేరణనిచ్చిన ఆ సముద్రమే మారియో దృష్టిని కూడ చెదరగొట్టింది. అది ఒక మంత్రం లాగ ‘బీట్రిజ్ గోన్జాలెజ్, బీట్రిజ్ గోన్జాలెజ్’ అని హోరుహోరున అతని చెవుల్లో మారుమోగింది.
ఆ తర్వాత కొన్ని రోజులపాటు మారియో సారాకొట్టు దగ్గర తచ్చట్లాడడం మొదలుపెట్టాడు. రెండు కవితా సంపుటాలనూ తన సైకిల్ వెనుక కట్టుకున్నాడు. మహాకవి ప్రవాహసదృశ కవిత్వంలోంచి తనకు నచ్చిన ముక్కలను ఎత్తి రాసుకునేందుకు సాన్ ఆంటోనియోలో తాను కొనుక్కున్న నోట్ బుక్ గట్టిగా పట్టుకున్నాడు. చేతిలో పెన్సిల్ పట్టుకుని సముద్రం వైపు తదేకంగా చూస్తూ తీరం మీద తిరుగాడుతున్న మారియోను పల్లెకారులు చూశారు గాని ఆ నోటు బుక్కులో ఏమి రాస్తున్నాడో వారెరగరు. మారియో దానిలో నింపినవల్లా అజాగ్రత్తగా గీసిన వృత్తాలూ త్రిభుజాలూ మాత్రమే. మనసులోని అర్థంలేని ఆలోచనల్లాంటి అర్థం లేని ఆకారాలు. పాబ్లో నెరూడా ఆ ఊరినుంచి వెళ్లిపోవడంతో, ఆయనకు పోస్ట్ మాన్ గా పనిచేసిన మారియో హిమేనెజ్ కవి కావడానికి, ఆయన స్థానం కాజేయడానికి ప్రయత్నిస్తున్నాడనే పుకారు ఆఊళ్లో వ్యాపించడానికి ఎక్కువగంటలు పట్టలేదు. తన దురదృష్టపు వివరాలను మళ్లీ మళ్లీ నెమరు వేసుకోవడంలో సంపూర్ణంగా నిమగ్నమై ఉన్న మారియోకు తన చుట్టూ ఏమి జరుగుతున్నదో పట్టనేలేదు.
ఒకరోజు మధ్యాహ్నం పల్లెకారులు చేపలు అమ్ముకునే తీరంలో కూచుని మారియో ఎక్స్ ట్రావగరియో అనే నెరూడా కవితా సంకలనంలో చివరి పేజీలు చదువుకుంటున్నాడు. హఠాత్తుగా “చిలీకి ఉత్తమ అధ్యక్ష అభ్యర్థి హోర్గె అలెస్సాండ్రిని ఎన్నుకోండి, మార్క్సిజం వ్యాప్తిని అడ్డుకోండి” అని నినాదాలు వినిపించాయి. హోర్గె అలెస్సాండ్రి రోడ్రిగ్స్ ప్రభుత్వ పాలన తెలిసిన మనిషి అనే నినాదం కూడ వినిపించింది. ఒక వాహనం వచ్చి అక్కడ ఆగిపోయింది. తెల్ల దుస్తులు వేసుకున్న ఇద్దరు మనుషులు ఆ వాహనంలోంచి కిందికి దిగారు. బ్రహ్మాండంగా చిరునవ్వులు నవ్వుతూ పల్లెకారులవైపు నడిచారు. నిజానికి అంత విశాలమైన నవ్వులు ఈ ప్రాంతంలో అంతగా కనబడవు. ఎందుకంటే చాలమందికి అంతగా ప్రదర్శించడానికి పళ్లే ఉండవు. ఆ ఇద్దరిలో ఒకరు లబ్బె. ఆ ప్రాంతానికి మితవాదవర్గపు రాజకీయ నాయకుడు. గ్రామానికి విద్యుచ్ఛక్తి తెస్తాననే వాగ్దానంతో గత ఎన్నికలలో గెలిచాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చినదెలాగంటే ఆ ఊళ్లో రెండు మట్టిరోడ్ల కూడలిలో ఒక వీథిదీపం ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే. ఆ కూడలిలో ఉండే రవాణా అంతా చేపలు తీసుకుపోవడానికి వచ్చే ట్రక్కు ఒకటీ, మారియో నడిపే లెగ్నానో సైకిలు ఒకటీ, కొన్ని గాడిదలూ, కుక్కలూ, చెల్లాచెదురుగా తిరిగే కోళ్లూ మాత్రమే. వాటికోసమే ఆ వీథిదీపం.
“ఓహ్, ఇదిగో మనం ఇక్కడ అలెస్సాండ్రికి అనుకూలంగా పనిచేయాలి” అంటూ పల్లెకారులకు కరపత్రాలు పంచాడు లబ్బె.
ఎన్నో సంవత్సరాలుగా వామపక్ష రాజకీయాలను నమ్ముతున్నందువల్లా, నిరక్షరాస్యతవల్లా వచ్చే సహృదయంతో పల్లెకారులందరూ మౌనంగా ఆ కరపత్రాలు తీసుకున్నారు. తమ మాజీ అధ్యక్షుడి బొమ్మ వేపు చూశారు. ఆయన ఎప్పుడూ నిరాడంబరత్వం గురించి బోధిస్తూ ఉండేవాడు, ఆచరిస్తూ ఉండేవాడు. ఈ బొమ్మలోని ఆయన ముఖ కవళికలు కూడ సరిగ్గా ఆ బోధనలకూ ఆచరణకూ అద్దం పడుతున్నట్టు ఉన్నాయి. పల్లెకారులు ఆ కరపత్రాలు తీసుకుని తమ చొక్కాల జేబుల్లో కుక్కుకున్నారు. మారియో మాత్రం తన కరపత్రం వెనక్కి ఇచ్చేశాడు.
“నేను నెరూడాకు వోటు వేయబోతున్నాను” అన్నాడు.
మారియో వైపు చూసి ఒక విశాలమైన చిరునవ్వు నవ్వాడు లబ్బె. ఆ తర్వాత ఆ చిరునవ్వును మొత్తం పల్లెకారులవైపు తిప్పాడు. ఆ ఆకర్షకమైన చిరునవ్వు చూస్తే ప్రతి ఒక్కరూ పడిపోతారు. సరిగ్గా ఈ సమ్మోహకమైన చిరునవ్వు, ముఖకవళికలు చూసే అధ్యక్ష అభ్యర్థి అలెస్సాండ్రి ఈ లబ్బెను పల్లెకారులమధ్య ప్రచారానికి ఎంచుకున్నాడు. నిజానికి పల్లెకారులు తమ గాలాలతో సరిగ్గా చేపలను పట్టుకోగలవాళ్లే గాని ఎవరి గాలాలకూ చిక్కేవారు కాదు.
“నెరూడా” అని లబ్బె మళ్లీ అన్నాడు. తన ముత్యాల వంటి పళ్ల మధ్యనుంచి ఆ కవి పేరులోని ఒక్కొక్క అక్షరాన్నీ వత్తి పలుకుతూ. “నెరూడా చాలా గొప్ప కవి. బహుశా ప్రపంచంలోని కవులందరిలోకీ గొప్పవాడు. కాని నిజం చెప్పాలంటే, అయ్యలారా, ఆయనను చిలీ అధ్యక్షుడిగా నేను ఊహించలేకపోతున్నాను.”
మారియో వైపు కరపత్రం మళ్లీ చాపుతూ, “ఊరికే ఇది ఒకసారి చదివి చూడు, కుర్రాడా. బహుశా నీ మనసు మారిపోతుందేమో” అన్నాడు.
పోస్ట్ మాన్ ఆ కరపత్రం తీసుకుని మలిచి తన జేబులో పెట్టేసుకున్నాడు.
ఆ నాయకుడు అక్కడ ఒక బుట్టలో చేపలు చూడడానికి వంగాడు.
“డజను చేపలు ఎంత?”
“దొరా, మీకయితే అగ్గువకే, డజను నూటయాభై.”
“ఒక వందా యాభయ్యా? అంత డబ్బుపోసి కొనాలంటే ప్రతి చేపలోనూ ఒక ముత్యం ఉండాలే.”
పల్లెకారులందరూ గొల్లుమన్నారు. లబ్బె కూడ వాళ్లతో గొంతు కలిపాడు. చాలమంది ధనవంతులైన చిలియన్ల లాగనే ఆయనకు కూడ తనచుట్టూ వాతావరణాన్ని తేలికపరచడమూ, అందరూ హాయిగా నవ్వుకునేట్టు చేయడమూ అలవాటు. ఇక ఆయన నిటారుగా నిలబడి మారియోనుంచి కాస్త దూరం వెళ్లి, ఒక అలవాటయిన నవ్వు నవ్వి, ప్రతి ఒక్కరికీ వినబడేంత పెద్ద గొంతుతో అన్నాడు: “నీకు కవిత్వం మీద ఆసక్తి కలుగుతోందని విన్నాను. అసలు నువ్వు పాబ్లో నెరూడాతోనే కవిత్వం రాయడంలో పోటీపడుతున్నావట.”
సిగ్గుతో మారియో బుగ్గల్లోకి రక్తం తన్నుకొచ్చింది. ముఖం ఎర్రబడింది. పల్లెకారుల నవ్వులు గోలగోలగా పెల్లుబికాయి. మారియోకు ఉక్కిరిబిక్కిరి అయింది. గొంతుకేదో అడ్డుపడినట్టయింది. సిగ్గుపడ్డాడు. గందరగోళపడ్డాడు. కదలలేనట్టు అవాక్కయిపోయాడు. అష్టావక్రమైపోయాడు. గులాబీరంగుకు తిరిగాడు. ఎరుపు రంగు కమ్ముకుంది. కాంతివంతమైన ఎరుపు ఆక్రమించింది. ముదురు ఎరుపు, బచ్చలిపండ్ల రంగూ పరచుకున్నాయి. చెమట పోసింది. ఓడిపోయినట్టనిపించింది. వలలో చిక్కినట్టనిపించింది. తెలివితెచ్చుకుని కొన్ని పదాలు కూడబలుక్కుని ఒక వాక్యం లాంటిది తయారు చేయాలని ప్రయత్నిస్తే, అది “నాకు చచ్చిపోవాలనిపిస్తోంది” అయింది.
నాయకుడు మాత్రం ఒక రాజకుమారుడు ఆజ్ఞాపించినట్టుగా తన సహాయకుణ్ని పిలిచి తన తోలు సంచీ లోంచి ఏదో తీసుకురమ్మన్నాడు. ఒక క్షణం తర్వాత చూస్తే, నీలంరంగు తోలుతో బైండ్ చేసిన ఒక పుస్తకం, దానిమీద బంగారు అక్షరాలు కనబడ్డాయి. అవి ఆ సముద్రతీర సూర్యకాంతిలో మిలమిల మెరిశాయి. ఆ పుస్తకంతో పోలిస్తే నెరూడా స్వయంగా ఇచ్చిన సంపుటాలు వెలాతెలా పోయాయి.
“ఇదిగో, కుర్రాడా, ఇది నీకు నా కానుక” అని మారియోకు ఆ పుస్తకం ఇస్తున్నప్పుడు లబ్బె కళ్లలో చాలా గాఢమైన అనురాగం కనబడింది.
మారియో ముఖంలోంచి ఆ గులాబిరంగు సిగ్గు క్రమక్రమంగా, మెల్లగా కరిగిపోయింది. తన మీది నుంచి ఒక పెద్ద కెరటం తోసుకుపోయినట్టు, ఆ తర్వాత ఒక గాలి తెమ్మెర వీచి తుడిచేసినట్టు అయింది. జీవితం మళ్లీ జీవనసాధ్యమైంది. లోతుగా ఊపిరి పీల్చాడు. లబ్బె కన్న ఎక్కువ శ్రామికమైన, అంతే సమ్మోహకమైన చిరునవ్వు వెలిగించాడు. ఆ నీలం పుస్తకం మీద బంగారు అక్షరాలను తన వేళ్లతో స్పృశిస్తూ “కృతజ్ఞతలు, లబ్బె గారూ” అన్నాడు.
మారియోకు అందిన కొత్త పుస్తకంలో పుటలు ఎంత సుతి మెత్తగా ఉన్నాయో. ఎట్లా తెల్లగా మెరిసిపోతున్నాయో. మారియోకు తన కవితల లాంటి కవితలతో ఆ కాగితాలను చెడగొట్టడానికి మనసొప్పలేదు. అప్పటివరకూ రాస్తున్న పొడుపుకథల లాంటి కవితలతో తన నోటు పుస్తకాలన్నీ నిండిపోయినతర్వాత, మాంచి ఖరీదయిన ఫ్లారెస్ ద ప్రవియా సబ్బుతో చేతులు శుభ్రంగా తోముకుని అప్పుడు మాత్రమే ఈ కొత్త పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవాలనీ, ఆ తెల్లని కాగితాల మీద తాను రాసిన వాటిలోంచి అత్యుత్తమమైన అలంకారాలకు ఆకుపచ్చని సిరాతో సాఫు ప్రతి రాస్తాడు. సరిగ్గా నెరూడా లాగనే.

ఆ తర్వాత గడిచిన వారాలలో కవిగా మారియోకు వచ్చిన పేరుకూ ఆయన రాసిన కవిత్వానికీ సంబంధం లేకుండా పోయింది. కవిత అసలు పలకనే లేదు కాని కవితతో ఆయన చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడనే వార్తలు విస్తారంగా వ్యాపించాయి. చివరికి ఆ మాట టెలిగ్రాఫ్ ఆపరేటర్ చెవినకూడా పడింది. దానితో శాన్ ఆంటోనియోలో జరిగిన ఒక సోషలిస్టు పార్టీ సాంస్కృతిక రాజకీయ కార్యక్రమంలో కవితలు చదవాలని మారియోను టెలిగ్రాఫ్ ఆపరేటర్ కోస్మె ఆదేశించాడు. అలా చదవడానికి మారియో ఒప్పుకున్నాడు గాని, తన కవితలు చదవననీ, నెరూడా రాసిన ఓడ్ టు ద విండ్ చదువుతాననీ అన్నాడు. దానితో మారియో కీర్తి ఇంకా పెరిగిపోయింది. వేరువేరు చోట్ల జరిగే అటువంటి సమావేశాల్లో కార్యకర్తలనూ, సానుభూతిపరులనూ ఉత్సహపరిచేందుకు మారియో నెరూడా గీతాలు చదవాలనే పిలుపులు పెరిగిపోయాయి. అక్కడికక్కడే కోస్మె ఒక ప్రకటన కూడ చేసేశాడు. ఆ ఓడరేవు పట్నంలోని మత్స్యకారులకోసం ఒక సమావేశం పెట్టాలనీ, వారి సాంస్కృతిక చైతన్యం కోసం మారియో కవిత్వం చదవాలనీ ప్రతిపాదించి, ఆ సమావేశం ఏర్పాటు చేసేశాడు.
కాని మారియోకు ప్రజాదరణ పెరిగినకొద్దీ విచారం పెరిగిపోయింది. తాను టపా తీసుకుపోతుండిన ఒకేఒక్క ఆసామి తనకు బీట్రిజ్ గోన్జాలెజ్ మీద ఉన్న ఆకాంక్షల విషయంలో ఏమీ సాయం చేయలేకపోయాడు. ఇంకోపక్క బీట్రిజేమో రోజురోజుకూ మరింత అందంగా, కన్నుల పండుగగా తయారవుతోంది. ఈ పిచ్చి పోస్ట్ మాన్ మీద తాను ఎటువంటి ప్రభావం వేస్తున్నదో ఆమెకేమీ పట్టినట్టులేదు.
బోలెడు నెరూడా కవితలను నోటికి చదవడం నేర్చుకున్నాక, మారియో ఆ అమ్మాయిని పడగొట్టే క్రమబద్ధమైన ప్రణాళిక ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. కాని సరిగ్గా ఆ సమయానికే చిలీలోని వ్యవస్థలలోకెల్లా అతి భయానకమైన వ్యవస్థను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ వ్యవస్థ పేరు అత్తగారు, లేదా ప్రేయసి తల్లి. ఒకరోజు ఉదయాన బీట్రిజ్ వాళ్ల ఇంటి దగ్గరలో మూలమీద ఒక దీపస్తంభం దగ్గర నిలబడ్డాడు మారియో. తాను ఎవరికోసమూ ప్రత్యేకంగా ఎదురుచూడడం లేదన్నట్టు నటిస్తూ ఓపిగ్గా నిలబడ్డాడు. బీట్రిజ్ వాళ్ల ఇంట్లో నుంచి ఒక స్త్రీ ఆకారం బయటికి అడుగుపెట్టగానే ఒక్క ఉదుటున బీట్రిజ్ పేరు ఉచ్చరిస్తూ ముందుకు పరుగెత్తాడు. కాని అక్కడిదాకా వెళ్లి చూస్తే ఎదురుగా ఉన్నది బీట్రిజ్ కాదు, వాళ్లమ్మ. ఆమె మారియో వైపు ఒక పురుగును చూసినట్టు చూసింది. “గుడ్ మార్నింగ్” అన్నది గాని ఆ గొంతు “నడువ్ బయటికి” అన్నట్టుగా స్పష్టంగా ధ్వనించింది.
మర్నాడు మారియో మరింత మర్యాదపూర్వకమైన పద్ధతి ఎంచుకున్నాడు. తన ప్రేయసి కచ్చితంగా ఉండదని తెలిసిన వేళకు సారాకొట్టు దగ్గరికి వెళ్ళాడు. తన టపా సంచిని అక్కడ గల్లాపెట్టె బల్లమీద పెట్టాడు. ఒక మంచి ద్రాక్షాసవం సీసా ఇమ్మని బీట్రిజ్ వాళ్లమ్మను అడిగాడు. ఆ సీసాను తన సంచిలో వేసుకుంటూ గొంతు సవరించుకుని అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టుగా అక్కడి పానశాలనంతా కలయజూశాడు. “భలే, మీ కొట్టు చాల బాగుందండీ” అన్నాడు.
బీట్రిజ్ తల్లి మర్యాదగానే జవాబిచ్చింది: “నీ అభిప్రాయం ఎవరూ అడగలేదు” అని.
మారియో తన తోలుసంచీవైపు దీర్ఘంగా చూశాడు. అక్కడే భూమిలో కుంగిపోగూడదా అన్న భావాన్ని అణచివేసుకుంటూ మళ్లీ గొంతు సవరించుకుని, “నెరూడాగారి టపా పేరుకుపోతోంది. ఏది ఎక్కడ జారిపోతుందో అని ఎప్పుడూ పట్టుకుని తిరుగుతున్నాను” అన్నాడు.
బీట్రిజ్ వాళ్లమ్మ తన రెండు చేతులూ గుండెలమీద పెట్టుకుని తన వంకర ముక్కు పైకెత్తి, “సరే, నాకెందుకు చెపుతున్నావ్? నాతో మాటలు కలపాలనా? సంభాషణ పొడిగించాలనా?” అని కసురుకుంది.
ఈ సౌహార్దభరితమైన సంభాషణతో ప్రోత్సాహం కలిగిన మారియో ఆ రోజు సాయంత్రం సముద్ర తీరం మీద బీట్రిజ్ వెనుక నడిచాడు. సరిగ్గా అప్పుడే సూర్యుడు నారింజరంగుకు తిరుగుతున్నాడు. అప్పుడప్పుడే ప్రేమలో పడ్డ యువతీ యువకులకు, అప్పుడప్పుడే కవిత్వం రాస్తున్న ఔత్సాహికులకూ పనికొచ్చేలా మారుతున్నాడు. అలా నడుస్తూ నడుస్తూ తీరంమీద బండరాళ్ల దగ్గరికి చేరారు. అక్కడ మారియో బీట్రిజ్ తో మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా మాట్లాడుతుంటే ఆయన గుండె గొంతులో కొట్లాడింది. మారియో మాటలు మొదట బరువుగా వెలువడ్డాయి. ఆ తర్వాత తాను ఒక తోలుబొమ్మ అయినట్టు, తన గొంతులోంచి నెరూడా మాటలు వినిపిస్తున్నట్టు మారియో అలా మాట్లాడుతూనే పోయాడు. మారియోకు ఎంత వాగ్ధార వచ్చిందంటే అలంకారాలు, పదచిత్రాలు, ప్రతీకలు ఆ స్వరంనుంచి మాంత్రికంగా విడుదలయ్యాయి. ఆ సంభాషణ, బహుశా కవిత్వపఠనం అనాలేమో, బాగా పొద్దుపోయేవరకూ సాగింది. ఇదంతా దూరాన తన ఇంటివసారాలో నిలబడి బీట్రిజ్ వాళ్లమ్మ గమనిస్తున్నదని వాళ్లు చూడనే లేదు.
అదయినాక బీట్రిజ్ నేరుగా తమ సారాకొట్టువైపు నడిచి వెళ్లిపోయింది. ఆమె ఎంత అన్యమనస్కంగా ఉండిందంటే అక్కడ ఒక బల్ల దగ్గర కూచుని సారా తాగుతున్న మత్స్యకారులదగ్గరికి వెళ్లి వారు సగం ఖాళీ చేసిన సీసా తీసుకుని వెళ్లిపోయింది. వాళ్లందరూ నోళ్లు తెరిచి చూస్తూ ఉండిపోయారు. ఆ సీసా అలా పట్టుకునే ఇంట్లోకి వెళ్లిపోయింది బీట్రిజ్. సారాకొట్టు మూసేసేవేళ అయిందని బీట్రిజ్ వాళ్లమ్మ హఠాత్తుగా ప్రకటించింది. మధ్యలో తాగడం ఆగిపోయినందుకూ, హఠాత్తుగా డబ్బులు చెల్లించవలసి వచ్చినందుకూ చికాకుపడుతున్న ఖాతాదార్లను క్షమించమని అడిగి, కొట్టు కట్టేసింది.
ఇంట్లోకి వెళ్లి చూస్తే కూతురు గదిలోనే ఉంది. ఆ శిశిరపు చలి గాలిని ఆమె రొమ్ములు ఆస్వాదిస్తున్నాయి. ఆమె చూపులు ఆకాశంలోని నిండు చందమామమీద నిలిచి ఉన్నాయి. మంచం మీదంతా వెన్నెల పరచుకుని ఉంది.
“ఏం చేస్తున్నావు?” అని అడిగింది తల్లి.
“ఏదో ఆలోచిస్తున్నా.”
చడీచప్పుడు లేకుండా నడిచి గదిలో పైన వేలాడుతున్న కాంతివంతమైన లైటు వేసింది తల్లి.
“ఆలోచిస్తున్నానంటే, ఆ పని చేస్తున్నప్పుడు నీ ముఖంలో ఏముందో నాకు కనబడాలి” అంది తల్లి. బీట్రిజ్ తల్లివైపు చూసింది. కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగు కళ్లలో పడకుండా నుదుటిమీద చేతులు అడ్డం పెట్టుకుంది.
“ఇంత చలిలో కిటికీ తలుపు ఎందుకు తెరిచి పెట్టావు?”
“అమ్మా, ఇది నాగది, నా ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదా?”
“అవునవును. ఇది నీగదే, కాని నీకేమన్నా అయితే వైద్యానికి డబ్బులు ఇవ్వవలసింది నేనే. సరే, ఆ సంగతులన్నీ పోనీ, వాడెవడు?”
“ఆయన పేరు మారియో.”
“ఏం చేస్తాడు?”
“ఆయన పోస్ట్ మాన్.”
“పోస్ట్ మానా?”
“ఏం, నువ్వు ఆయన సంచీ చూడలేదా?”
“ఓహ్, చూశానులే. ఆ సంచీని సారా సీసాలు మోసుకుపోవడానికి కూడ ఉపయోగిస్తాడు.”
“ఇప్పుడు ఆయనకు పని లేదులే.”
“ఉత్తరాలు అందజేసేది ఎవరికో?”
“పాబ్లో గారికి.”
“అంటే నెరూడాకా?”
“అవును, వాళ్లు స్నేహితులు.”
“అని నీకు వాడు చెప్పాడా?”
“వాళ్లిద్దరూ కలిసి ఉండడం నేను చూశాను. కొన్నాళ్లకింద వాళ్లిద్దరూ మన కొట్లో కూచుని మాట్లాడుకున్నారు కూడా.”
“ఏం మాట్లాడుకున్నారో?”
“రాజకీయాలు.”
“ఔనా, అమ్మో, అంటే వీడు కూడా కమ్యూనిస్టేనా?”
“అమ్మా, అలా మాట్లాడకు. నెరూడాగారు మన దేశానికి అధ్యక్షులు కాబోతున్నారు.”
“అమ్మడూ, నువ్వు కవిత్వాన్నీ, రాజకీయాల్నీ కలగలిపి గందరగోళపడితే వాడు నీకు కడుపుచేసి వదిలేస్తాడు. ఇంతకూ ఏమంటాడు?”
జవాబు చెప్పబోయే ముందు బీట్రిజ్ ఆ మాటను తన నాలిక చివరన కాసేపు నిలుపుకుంది. దాని రుచులన్నిటినీ గ్రహించదలచుకుంది.
“అలంకారాలు.”
తల్లికేమీ పాలుపోలేదు. మంచంపై మరకలుపడిన కంచు గుబ్బను గట్టిగా పట్టుకుని తనను తాను సంబాళించుకోవడానికి ప్రయత్నించింది.
“అమ్మా, ఏమయిందమ్మా, నీకేమవుతోంది?”
తల్లి స్పృహతప్పినట్టుగా మంచంపై పడిపోయింది. నీరసమైన గొంతుతో “నువ్వు అంత పెద్ద పదం పలకగా ఎప్పుడూ వినలేదు నేను. నీకు వాడు ఏ అలంకారాలు చెప్పాడు?”
“ఆయన ఏం చెప్పాడంటే…ఆయనన్నాడు గదా, నా చిరునవ్వు నా ముఖం మీద సీతాకోకచిలుకలా విప్పుకుంటుందట.”
“ఇంకా ఏమిటి?”
“సరే, ఆయన అది చెప్పినప్పుడు నేను నవ్వాను.”
“ఆ తర్వాత?”
“తర్వాత ఆయన నా నవ్వు మీద కూడ ఏదో అన్నారు. ఆయన అన్నారుగదా, నా నవ్వు నీటిమీద గబుక్కున పడిన గులాబీ పువ్వు లాగుందట. నా నవ్వు హఠాత్తుగా తోసుకువచ్చిన వెండికెరటం లాగుందట.”
తల్లికి పెదాలు ఎండిపోతున్నట్టనిపించింది. నాలికతో పెదాలు తడి చేసుకుంది.
“ఆ తర్వాత నువ్వు ఏం చేశావు?”
“నేను మౌనంగా ఉండిపోయాను.”
“వాడు ఏం చేశాడు?”
“ఇంకా ఏం చెప్పాడని అడుగుతున్నావా?”
“కాదు బిడ్డా, వాడింకా ఏం చేశాడు? నీ పోస్ట్ మాన్ కు మాట్లాడే నోరొక్కటే కాదు గదా, చేతులు కూడా ఉన్నాయిగదా, ఏంచేశాడు?”
“ఆయనసలు నన్ను చేత్తో ముట్టుకోనేలేదమ్మా. ఒక స్వచ్ఛమైన యువతి పక్కన నిలబడడమే తనకు సంతోషాన్నిస్తుందని అన్నాడు. తెల్లని సముద్ర తీరాన నిలబడినట్టుందని అన్నాడు.”
“నువ్వేంచేశావు?”
“నేనక్కడ ఆలోచిస్తూ నిలుచున్నాను.”
“మరి వాడు?”
“నేనలా మౌనంగా, నిశ్శబ్దంగా నిలబడి ఉంటే బాగుందన్నాడు. నేను లేనట్టే ఉందన్నాడు.”
“మరి నువ్వు?”
“నేనాయన వైపు చూస్తూ ఉన్నాను.”
“వాడు?”
“ఆయన కూడా నావైపు చూశాడు. ఇక ఆయన నాకళ్లలోకి చూడడం ఆపి నావెంటుకలను చాలసేపు చూశాడు. ఏమీ అనలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాడనుకుంటాను. ఆతర్వాత అన్నాడు గదా, నీ తలకట్టును పొగడడానికి నాకు సమయం లేదు. ఒక్కొక్క వెంట్రుకనూ వర్ణించి, కీర్తించవలసి ఉంది.”
బీట్రిజ్ వాళ్లమ్మ లేచి నిలబడింది. తన అరచేతులను అవి తలనరికే కత్తులా అన్నట్టుగా గుండెలమీద పెట్టుకుంది.
“బిడ్డా, ఇంక చెప్పకు. మనం కొంపలు ముంచుకుపోయే గడ్డుస్థితిలో ఉన్నాం. మొదట మాటలతో స్పృశించే మగ వాళ్లందరూ ఆ తర్వాత తమ చేతులతో ఇంకా ముందుకు పోతారు.”
“మాటలు ఎక్కడన్నా చెడ్డవవుతాయా అమ్మా?” అంది బీట్రిజ్ తలగడను గట్టిగా హత్తుకుంటూ.
“ఆ పిచ్చి ప్రేలాపనల కన్న ప్రమాదకరమైన మత్తు పదార్థం మరేదీ లేదీ లోకంలో. ఒక పల్లెటూరి పూటకూళ్లమ్మ తనను తాను వెనిస్ రాజకుమారినని భ్రమపడేట్టు చేస్తాయా మాటలు. ఇక సత్యం చెప్పవలసిన సమయం వచ్చే సరికి, బతుకు భయం నిన్ను చుట్టుముట్టినప్పుడు, ఈ మాటలు అసలు డబ్బు కాగితాలు కావని, ఉత్తి చిత్తుకాగితాలేనని నీకు తెలిసివస్తుంది. ఎవడో ఒక తాగుబోతు మన కొట్లో నిన్ను కావలించుకున్నా నాకు ఫర్వాలేదు గాని, నీ చిరునవ్వు సీతాకోకచిలుక కన్న ఎక్కువ ఎత్తు ఎగురుతుందని ఎవడన్నా అంటే మాత్రం భయం పుడుతుంది.”
బీట్రిజ్ ఒక్క ఎగురు ఎగిరింది. “ఎగరడం కాదమ్మా, సీతాకోక చిలుకలా విప్పుకోవడం.”
“ఎగరనీ, విప్పుకోనీ, నాకేమీ తేడా పడదులే. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ మాటలవెనుక అసలు ఏమీ లేదు. అవి గాలిలో కలిసిపోయే తారాజువ్వల్లాంటివి.”
“లేదమ్మా, మారియో నాతో అన్నమాటలు తారాజువ్వల్లా ఎగిసి గాలిలో కలిసిపోలేదు. అవి నాకు నోటికి వచ్చేశాయి. పనిచేస్తూ కూడా ఆ మాటలే తలచుకోవాలని అనిపిస్తోంది నాకు.”
“ఔనవును. నాకది కనిపిస్తూనే ఉంది. రేపు నువ్వు నీ బట్టలన్నీ సర్దుకో. కొన్నాళ్లపాటు శాంటియాగోలో పిన్ని వాళ్లింట్లో ఉండి వద్దువుగాని.”
“నాకిప్పుడు ఎక్కడికీ వెళ్ళాలని లేదమ్మా.”
“నీకేమనిపిస్తోందో నాకక్కరలేదు. చూడబోతే ఇదేదో ముదిరి పాకాన పడుతున్నట్టుంది.”
“అంత మునిగిపోయిందేమి జరిగిందమ్మా, ఎవడో ఒక కుర్రాడు నాతో కాసేపు మాట్లాడినదానికే ఇంతనా? అందరు ఆడపిల్లలకూ ఇది జరుగుతుంది.”
తల్లికి ఎంత కోపం వచ్చిందంటే, ఆ కోపాన్ని అణచుకోవడానికి ఆమె తన శాలువా అంచులో ఒక ముడి వేసింది.
“మొట్టమొదట, వాడు నీకు చెప్పినవన్నీ నేరుగా నెరూడా కవిత్వం నుంచి మక్కీకి మక్కీ దించినవేనని ఎవరయినా ఒక మైలు అవతలి నుంచి కూడ చెప్పవచ్చు.”
బీట్రిజ్ తన తల తిప్పి అదే క్షితిజమన్నట్టుగా గోడవేపు చూసింది.
“కాదమ్మా, ఆయన నావైపు చూస్తుంటే ఆ పదాలన్నీ పక్షులలాగ ఆయన నోట్లోంచి పరుగెత్తుకొచ్చాయి.”
“ఆయన నోట్లోంచి పక్షులలాగనా? ఓహ్, ఇంక నువ్వు బట్టలు సర్దుకోవలసిందే. రాత్రి బయల్దేరాల్సిందే. ఎవరో ఒకరు ఇదివరకే అన్నమాటను వాళ్లు అన్నారని చెప్పకుండా తామే అన్నట్టుగా చెప్పడాన్ని ఏమంటారో తెలుసునా? దొంగతనం! నీకు అవేంటీ…ఆ అలంకారాలు చెప్పినందుకు దొంగతనం నేరం కింద ఆ మారియోను జైల్లో పారెయ్యొచ్చు. నేను ఆ కవిని ఇప్పుడే కలిసి ఆయన పోస్ట్ మాన్ ఆయన కవిత్వాన్ని దొంగిలిస్తున్నాడని ఫిర్యాదు చేస్తాను.”
“ఆ సంగతిని పాబ్లో నెరూడా గారు పట్టించుకుంటారనుకున్నావా ఏం? ఆయన చిలీ దేశానికి అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిలబడబోతున్నారు. బహుశా ఆయనకు రేపోమాపో నోబెల్ బహుమతి వస్తుంది. నువ్వేమో ఆయనదగ్గరికి వెళ్లి కాసిని అలంకారాల మీద రాద్ధాంతం చేయబోతున్నావు.”
తల్లి తన బొటనవేలిని తన ముక్కుమీద, అచ్చు మల్లయోధులలాగ రుద్దుకుంది.
“కాసిని అలంకారాలా, ఏం? చూడు నీ వాలకం” అంటూ కూతురి చెవి మెలేసి ముందుకు లాగింది. కూతురి ముక్కు వచ్చి తల్లి ముక్కుకు తాకింది.
“అమ్మా!”
“నువ్వు ఒక లేత మొక్క లాగ పచ్చిగా ఉన్నావు. బిడ్దా, నీకు ఆ జ్వరం అంటుకున్నట్టే ఉంది. ఆ జ్వరానికి రెండే రెండు మందులు. బుద్ధొచ్చేలా చితగ్గొట్టడం లేదా ఎక్కడికైనా చిన్న ప్రయాణానికి పంపడం” అంటూ కూతురి చెవి వదిలేసింది. మంచం కిందినుంచి బర్రుమని ఒక పెట్టె లాగింది. దాన్ని పరుపు మీద పడేసి, “సర్దుకో” అంది.
“ఉహు. నేను సర్దుకోను. నేనిక్కడే ఉంటాను.”
“అమ్మడూ, నదుల్లో రాళ్లూ మాటలూ మాత్రమే కాదు బిడ్డలు కూడ పుట్టుకొస్తారు. ఊ, సర్దుకో.”
“ఎట్లా జాగ్రత్త పడాలో నాకు తెలుసు.”
“ఓహో, ఎట్లా జాగ్రత్త పడాలో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో ఒక చిన్న గాలి తెమ్మెర వీచిందంటే చాలు, ఎగిరిపోతావు. గుర్తుంచుకో, నువ్వు నెరూడాను చదవడానికి చాలా రోజులముందే నేనూ నెరూడాను చదివాను. మగవాళ్లు మరిగిపోయే సమయానికి వాళ్లలో కవిత్వం పొంగి వస్తుందని నాకు బాగా తెలుసు.”
“నెరూడా చాలా పెద్దమనిషి. ఆయన అధ్యక్షుడు కాబోతున్నారు.”
“పక్కమీదికి ఎక్కడం గురించి మాట్లాడేటప్పుడు అధ్యక్షుడయినా, పూజారి అయినా, కమ్యూనిస్టు కవి అయినా వీసమెత్తు తేడా లేదు, అది తెలుసుకో. ‘ముద్దాడి వెళ్లిపోయే నావికుల ప్రేమ లాంటి ప్రేమ నాది. తిరిగి వస్తామనే వాగ్దానాన్ని ఎన్నడూ వదలరు వాళ్లు’ అని రాసిందెవరో తెలుసా?”
“నెరూడా!”
“ఓహ్ తెలుసన్నమాట. అయినా నువ్వింకా ఏ ప్రమాదం లేదనుకుంటున్నావా?”
“ఒక చిన్న ముద్దు గురించి అంత రాద్ధాంతం చెయ్యను నేను.”
“ఒక ముద్దు గురించా, కాదు కాదు. కాని ముద్దు అనేది ఒక దావానలాన్ని రగిలించే నిప్పురవ్వ. నెరూడా కవితల్లో మరొకటి వింటావా? ‘ముద్దుల్లోనూ, పడకమీదా, రొట్టెల్లోనూ అన్ని చోట్లా విస్తరించే ప్రేమను ప్రేమిస్తాను నేను.’ బిడ్డా, ఆ మాటలకు అర్థం ఏమిటో తెలుసా? శషభిషలు లేకుండా చెప్పాలంటే పొద్దున లేచీలేవగానే ఫలహారంతో పాటే ఆ పని చేస్తాడన్నమాట.”
“అమ్మా, అలా కాదు!”
“చూడిక, నీ పోస్ట్ మాన్ నీకు నెరూడా రాసిన మరొక చిరస్మరణీయమైన కవిత చదివి వినిపిస్తాడు. సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఆ కవితను నా పుస్తకంలో రాసి పెట్టుకున్నాను. ‘నాకది వద్దు, నా ప్రియా, మనను కలిపి ఉంచేదేదీ వద్దు, మనను ఐక్యం చేసేదేదీ వద్దు’ అని.”
ఆ మాటకు నాకు అర్థం తెలియలేదమ్మా
తల్లి తన చేతులతో కడుపుముందర గర్భం లాగ ఒక ఊహాత్మక వృత్తాన్ని గీసింది. అది నాభి దగ్గర మొదలయి, పొత్తికడుపుమీద చాల పెద్దగా మారి, పిరుదులదగ్గర శరీరంలో కలిసిపోయింది. ఈ వృత్తాన్ని గీస్తూనే ఆమె ఆ కవితను మళ్లీ చదవడం మొదలుపెట్టింది. ఈసారి ఆమె ఒక్కొక్క పదాన్నీ వత్తి వత్తి పలుకుతూ జాగ్రత్తగా చదివింది. “నాకు – అది – వద్దు – నా – ప్రియా – మనను – కలిపి – ఉంచేది – ఏదీ – వద్దు – మనను –ఐక్యం – చేసేది – ఏదీ – వద్దు.”
గందరగోళంలో మునిగిపోయిన కూతురు తన తల్లి చేతుల కదలికలవెంట చూపులు తిప్పింది. పక్షిలాగ గొంతు పెట్టి, “ఏమంటున్నావమ్మా, ఉంగరమా?” అని అడిగింది.
బీట్రిజ్ తండ్రి చనిపోయిన తర్వాత, తన ఇంట్లో మరొక కుటుంబసభ్యులెవరయినా చనిపోయేవరకూ ఏడవగూడదని ఆ తల్లి ఒట్టు పెట్టుకుంది. కాని ఇప్పుడు కూతురి ప్రశ్న వినేసరికి ఆ తల్లి కళ్లనుండి ఒక నీటి చుక్క ఉబికివచ్చి కనుకొలకులనుంచి కిందికి జారింది.
“ఔను, బిడ్డా, ఉంగరమే. సరేనా, ఇక నీ ప్రయాణానికి సర్దుకోవడం మొదలుపెట్టు.”
కూతురు తలగడను కొరికిపారేసింది. తన నోరు కేవలం మగవాళ్లను ఆకర్షించడం మాత్రమే కాదు, బట్టలనైనా, మాంసాన్నయినా చీల్చగలదని చూపింది. ఆతర్వాత, “నీది పిచ్చి అమ్మా, ఒక మగవాడు నా చిరునవ్వుతో నా ముఖం మీద సీతాకోక చిలుకలు నాట్యం చేసినట్టుందని అంటాడు. దానికి నేను శాంటియాగో వెళ్లాలట” అని అరిచింది.
“పిచ్చిదానిలా ప్రవర్తించకు. ఇప్పుడేమో నీ చిరునవ్వు సీతాకోకచిలుకలా ఉంటుంది. రేపేమో నీ చనుమొనలు కువకువలాడుతున్న పావురాలలాగ ఉంటాయి. నీ స్తనాలు రసం నిండిన అడవిరేగుపళ్లలాగ ఉంటాయి. నీ నాలుక భగవంతుడిచ్చిన వేడివేడి తివాచీ లాగుంటుంది. నీ వీపు ఒక ఓడ తెరచాప లాగుంటుంది. నీ తొడలమధ్య రగులుతున్నది కొలిమిలాగుంటుంది. అక్కడ వాడి గర్వం నిడిన లోహస్తంభాన్ని పోతపోస్తారు. సరేనా, ఇక పడుకో.”