Rss Feed

భాష ముఖ్యోద్దేశం

భాష ముఖ్యోద్దేశం మన భావం అవతలివారికి చక్కగా తెలియడం. ఈ విషయాన్ని పట్టించుకోకుండా పూర్వ పండితులు, కవులు కొందరు ఎవరికీ అర్థంకాని పాషాణ పాకంలో గ్రంథాలు రాసి ప్రజలపైకి విసిరేశారు. గ్రంథం ఎంత అర్థం కాకుండా ఉంటే అంత గొప్ప అన్న అభిప్రాయమూ ఒకప్పుడు ప్రబలిపోయింది. ఆ దశలో ఏ కవిత్వమైనా, కావ్యమైనా తేలికభాషలో నలుగురికీ అర్థమయ్యేట్లు ఉండాలనీ అలా ఉంటేనే వాటికి సార్థకత చేకూరుతుందనే వాదన పుట్టుకొచ్చింది. వాదాలు ముదిరి గ్రాంథిక, వ్యవహార భాషా పండితుల మధ్య సిగపట్లదాకా వెళ్ళింది వ్యవహారం. ''గ్రాంథిక గ్రామ్య సంఘర్షణమ్మున జేసి మరిచిపోయితిని వాఞ్మయపు సొగసు, వ్యర్థవాద ప్రతివాదమ్ములనొనర్చి వదలి వైచితిని భావ ప్రశస్తి...'' అంటూ ఆ సందర్భంలోనే ఓ కవి చింతించాడు. భాషల విషయమై ఇటువంటి వాదోపవాదాలు ఎన్నెన్నో. ''జీవలోకమందు జీవించు భాషలు జనుల తలపుదెలుపు సాధనములు'' అన్నారో కవి. భాష మన ఆలోచనలు తెలపటానికే కాదు, వాటిని దాచుకోవటానికీ ఉపయోగపడుతుంది- అన్నాడు తన మాటలతో బమ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేయగల చతురుడొకడు. ''నాతో మాట్లాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌'' అంటాడు గిరీశం. ఆయనతో రోజుల తరబడి మాట్లాడిన వెంకటేశం ఎంత విద్యను ఒంటపట్టించుకొన్నాడో కాని - పరీక్షలు మాత్రం ఆనవాయితీగా ఫెయిలవుతూనే వచ్చాడు. ఒకప్పుడు లాటిన్‌, సంస్కృతం వంటివి రాజభాషలుగా చలామణీ అయ్యాయి. సంస్కృతంలో నుంచే అన్ని భాషలూ పుట్టాయని భారతీయులు నమ్మితే, లాటినే సర్వభాషలకు పుట్టినిల్లని పాశ్చాత్య దేశాలవారు భావిస్తారు. ప్రస్తుతానికి ఈ రెంటినీ మృతభాషలుగా కొందరు పరిగణిస్తున్నారు. ''ఎల్లభాషలకు జనని సంస్కృతమె'' అని నమ్మే సంస్కృత భాషాభిమానులు ఆ విషయాన్ని ఒప్పుకోరు. సంస్కృతం మృతభాషకాదు అమృతభాష అని వారు వాదిస్తారు. ప్రపంచంలో భాషా పరిజ్ఞానం బహుముఖాలుగా విస్తరించి ఉంది. మారుమూల ప్రాంతాల్లో కొద్దిమంది మాత్రమే మాట్లాడే భాషలు ఎన్నో ఉన్నాయి. కథా సాహిత్యానికి ఒరవడి అని చెప్పదగ్గ 'బృహత్కథ' అనే గ్రంథాన్ని గుణాఢ్యుడు అనే కవి పండితుడు పైశాచీ భాషలో రాశాడు. సంస్కృతం, ప్రాకృతం, దేశీ భాషలన్నీ తెలిసిన మహా విద్వాంసుడాయన. అయినా తన గ్రంథ రచనకు పైశాచీ భాషనే ఎన్నుకున్నాడు. ఆ భాషలో తన రక్తంతో భూర్జపత్రాలపై ఆ ఉద్గ్రంధాన్ని రచించాడు. బృహత్కథ మొదట్లో పండితాదరణను పొందకపోయినా తరవాత ఎన్నో భాషల్లోకి అనువాదమై ఇప్పటికీ సాహిత్యాభిమానుల ఆదరణకు పాత్రమవుతోంది. పైశాచిక భాష ప్రస్తుతం ఉందో లేదో ఎవరికన్నా తెలుసో తెలియదో కాని, బృహత్కథ మాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది. తెలిసి చెప్పగలిగినవాళ్లుంటే అందులోని కథలు పిల్లలకు ఆకర్షకంగానే ఉంటాయి. పైశాచివంటి అంతరించిపోయిన అంతరించిపోతున్న భాషలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరికొన్ని భాషలు ఇతర భాషా ప్రభావంతో తమ అసలు స్వరూపాన్నే కోల్పోతున్నాయి. ''గంగతల నుండి కావేరి కాళ్ళదాక వెలిగిన'' తెలుగు ఠీవి ప్రస్తుతం ఇంగ్లిష్‌ ప్రభావంలో పడి ఏవిధంగా మసకబారిపోతున్నదీ వేరే చెప్పనక్కరలేదు. ప్రపంచం మొత్తంమీద ఏడు వేలకు పైగా భాషలున్నట్లు ఒక అంచనా. వాటిలో సగానికిపైగా భాషలకు లిపి లేదు. లిపి ఉన్నా లేకపోయినా ప్రస్తుతం వాడుకలో ఉన్న భాషల్లో సగానికిపైగా అంతరించిపోయే దశలో ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రతి రెండు వారాలకు ఒక భాష అంతరించిపోతోందంటున్నారు. ముఖ్యంగా ఉత్తర ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని మధ్యప్రాంతం, తూర్పు సైబీరియా, ఓక్లహామా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే కొన్ని భాషలు వేగంగా అంతరించిపోతున్నాయి. ఈ శతాబ్దం చివరినాటికి సగానికిపైగా భాషలు అంతర్థానమై పోగలవని అంటున్నారు. అదృశ్యమై పోవటానికి సిద్ధంగా ఉన్న భాషల గురించి అధ్యయనం చేయటానికి డేవిడ్‌ హారిసన్‌ అనే భాషా శాస్త్రవేత్త పూనుకొన్నాడు. ఈయన మరికొందరు శాస్త్రజ్ఞులతో కలిసి అంతరించిపోయే ప్రమాదమున్న భాషల వివరాలను సేకరిస్తున్నాడు. అందుకోసం హారిసన్‌ బృందం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తోంది. అంత్య దశలో ఉన్న భాషలు తెలిసినవారిని కలిసి ఆయా భాషలలో వారిని మాట్లాడించి హారిసన్‌ బృందం రికార్డు చేస్తోంది. దీనివల్ల ఆ భాషలు పూర్తిగా మరుగునపడకుండా కొంతవరకన్నా కాపాడవచ్చునని శాస్త్రజ్ఞుల భావన. అమెజాన్‌ తీర ప్రాంతంలోని ఆండీస్‌ పర్వత సానువుల్లో నివసించే ప్రజలు మాట్లాడే భాషలపై స్పానిష్‌, పోర్చుగీస్‌ భాషల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాల ప్రజలు తమ భాషలకు బదులుగా స్పానిష్‌, పోర్చుగీస్‌ భాషలనే ఉపయోగిస్తుండటంతో వారి అసలు భాషలు అంతరించిపోతున్నాయి. ఇంగ్లిష్‌ భాషా ప్రభావంవల్ల కొన్ని భాషల అసలు స్వరూపమే మారిపోతోంది. ఉదాహరణకు తెలుగుపై ఆంగ్ల ప్రభావం ఎంతగానో ఉంది. రెండు మూడు ఇంగ్లిష్‌ ముక్కలు లేకుండా తెలుగులో మాట్లాడటం కుదరటంలేదు. ఒకవేళ అలా మాట్లాడినా అవతలివారికి అర్థంకాని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎవరి భాషలపట్లవారు శ్రద్ధ వహించి అవి మరుగునపడిపోకుండా కాపాడుకోవాలి. పరాయిభాషల ప్రభావంవల్ల తమ మాతృభాష అసలు స్వరూపమే మారిపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరమూ ఎంతైనా ఉంది!
(Eenadu, 30:09:2007)