డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మతాల్లో
నమ్మకం ఉండడం పూర్తిగా వ్యక్తిగతమైన విషయమని అనుకుంటాం. దేవుణ్ణి నమ్మమని
ఎవరూ మనని నిర్బంధపెట్టరు కనక అది స్వచ్ఛందంగా ఆమోదించిన విషయంలాగా
అనిపిస్తుంది. ఇది ఏ మాత్రమూ నిజంకాదు. ప్రత్యక్షంగా కాకపోయినా చుట్టూ
ఉన్న సమాజమూ, సంస్కృతీ దేవుడున్నాడనే విషయాన్ని నిత్యమూ మనకు
గుర్తుచేస్తూనే ఉండే అవకాశముంది. ఒకప్పుడు సమష్టి ప్రయోజనాలకు పనికొచ్చిన
మతవిశ్వాసాలు తరవాతి దశల్లో మనుషులను ఏకాకులను చేశాయి. ఇదొక
సామాజికపరిణామం.
మతవిశ్వాసాలు ఎంతో ప్రాచీనమైనవి. వాటిని ఈ రోజుల్లో ప్రశ్నించేవాళ్ళే
తక్కువ. వాటిని నమ్మడం ఎంతో సహజమని ఎక్కువమంది అనుకుంటారు. అవి వేల
ఏళ్ళుగా కొనసాగుతున్నాయనేది ఒక బలమైన కారణంగా వారికి కనిపిస్తుంది.
అతీతశక్తుల గురించిన నమ్మకం ఆదిమమానవుల్లో సహజంగా తలెత్తడం ఒక ఎత్తయితే, ఆ
భ్రమలూ, తప్పుడు నమ్మకాలూ ఇన్నాళ్ళుగా కొనసాగడానికి దోహదపడిన సామాజిక,
ఆర్థిక, రాజకీయకారణాలన్నీ మరొక ఎత్తు. వీటన్నిటి గురించీ స్థూలంగానైనా
తెలుసుకోకపోతే మతాలవల్ల నేటికీ కలుగుతున్న అయోమయమూ, అనర్థాలూ, హింసా,
రక్తపాతమూ మొదలైనవాటికి కారణాలు అర్థంకావు.
మతాల చరిత్రయొక్క అధ్యయనం పంతొమ్మిదో శతాబ్దంనుంచీ మొదలయింది. దానివల్ల
చారిత్రక వివరాలెన్నో బైటపడుతూవచ్చాయి. ప్రపంచంలో అనేకచోట్ల క్రీస్తుకు
సుమారు 3 వేల ఏళ్ళ క్రితం లిపుల వాడకం మొదలయింది. అప్పటినుంచీ
మతవిశ్వాసాలు ఏదో ఒక రూపంలో నమోదు అవుతూవచ్చాయి. మానవసమాజాలు రూపొందిన
దశలో తెగలుగా జీవించిన ప్రజలు ఎందరో దేవతలను ఆరాధించేవారు. గణాచారులు
నడిపిన తంతుల్లో రకరకాల జంతువులూ, చెట్లూ చేమలూ, ప్రకృతిశక్తులూ అన్నిటికీ
పూజలు జరిగేవి. సమాజం విస్తృతమై సమాజజీవితాలు జటిలం అవుతున్నకొద్దీ దేవుడు
ఒక్కడేనన్న భావన బలపడసాగింది. కారణాలేమిటో ఇప్పుడు ఖచ్చితంగా తెలియదు కాని
మొత్తంమీద ఏకేశ్వరోపాసనకు భూమిక ఏర్పడింది. తెగలుగా జనపదాల్లో జీవించిన
ప్రజలు చిన్న, పెద్ద సామ్రాజ్యాల పాలనకు లోనయారు. వ్యవసాయం పెద్దఎత్తున
వ్యవస్థీకృతం అవడం వల్ల ప్రజల వ్యక్తిగత జీవితంకూడా అపూర్వమైన మార్పులకు
గురి కాసాగింది.
తెగలు చిన్న రాజ్యాలుగానూ, చిన్న రాజ్యాలు పెద్ద సామ్రాజ్యాలుగానూ
ఏకీకృతం అవుతున్న దశలో పాతకాలపు ఆచారాలకు కొత్త స్వరూపాలు ఏర్పడ్డాయి.
టర్కీలో క్రీస్తుకు 9 వేల ఏళ్ళ క్రితమే మొదలైన ప్రాచీన దేవతారాధన
గ్రీస్‌లో పెంపొందిన మతభావనలకు రూపాన్నిచ్చింది. అదే పద్ధతిలో గ్రీక్
దేవతలు రోమన్ నాగరికతకు భూమికను సిద్ధం చేశారు. ప్రాచీన గాథలూ, పురాణాలకు
కొత్త రూపాలు ఏర్పడ్డాయి. తెగల్లో విడివిడిగా రూపొందిన మతభావనలన్నీ
క్రమంగా ఏకం అవుతూ వచ్చాయి. తెగలమధ్య జరిగిన కొట్లాటల్లో జయం పొందినవారి
దేవతలందరిదీ కొత్త సంస్కృతిలో పైచెయ్యి అయింది.
మతాలు బలపడిన తీరు కేవలం మనుషుల భావనలమీద అధారపడి, వారి ఇచ్ఛానుసారం
జరగలేదు. సమాజాల్లో ఎటువంటి శక్తులు బలం సంపాదించుకోగలిగాయో వారు నమ్మిన
మతాలే బలవత్తరం అవుతూవచ్చాయి. యేసుక్రీస్తును న్యాయవిచారణ జరిపి మరణదండనకు
గురిచేసిన రోమన్ ప్రభుత్వం మొదట్లో క్రైస్తవమతాన్ని తీవ్రంగా
అణగదొక్కింది. తరవాతికాలంలో రోమన్ చక్రవర్తులు అదే మతాన్ని అవలంబించాలని
నిశ్చయించుకున్నాక క్రైస్తవమతం బలపడడమే కాక, దానికి అడ్డొచ్చినవారందరినీ
రోమన్ ప్రభుత్వం మట్టుబెట్టసాగింది. మతాలకు స్వతహాగా బలమేమీ ఉండదు.
పాలకవ్యవస్థ తలుచుకున్నప్పుడల్లా మతాల ప్రాబల్యం తగ్గడం, పెరగడం చరిత్రలో
కనబడుతుంది.
చిన్న తెగలుగా వేటా, ఆహారసేకరణ ఆధారంగా జీవించిన దశతో పోలిస్తే
వ్యవసాయం మొదలయాక జనాభా పెరగసాగింది. జనవాసాలు ఏర్పడి వాటిమధ్య
సహకారసంబంధాలు పెరిగాయి. వస్తువుల మార్పిడి, వాణిజ్యం మొదలైన కొత్త
ప్రక్రియలు ఆరంభమయాయి. శ్రమవిభజన ద్వారా అనేక చేతిపనులూ, వృత్తులూ
చేపట్టడం వీలయింది. వ్యక్తులమధ్య కేవలం ఒకే తెగకూ, కుటుంబానికీ చెందిన
సమష్టి భావనకు ప్రాధాన్యత తగ్గసాగింది. దగ్గర సంబంధీకులు కాకపోయినా
ఎక్కువమంది వ్యక్తులు సమీపాన నివసించడం తప్పనిసరి అయింది. ఇటువంటి
అపరిచితులమధ్య పొరపొచ్చాలూ, కొట్లాటలూ తలెత్తకుండా సహజీవనం కొనసాగేందుకు
అందరినీ ఏకం చెయ్యగలిగిన మతవిశ్వాసాలకు అవసరం ఏర్పడింది. పురాతనపద్ధతిలో ఏ
తెగకాతెగలో జరిగినట్టుగా పక్షుల, జంతువుల చిహ్నాలను ఆరాధించడం
సాధ్యంకాలేదు గనకనే దేవతల సంఖ్యకూడా తగ్గుతూవచ్చింది. అందరికీ వర్తించి,
అందరూ పాటించగలిగే మతవిశ్వాసాలకు రూపలక్షణాలు ఏర్పడ్డాయి. సంబంధీకులు
కానటువంటి వ్యక్తులు పరస్పరం కలహించుకోకుండా శాంతియుత సహజీవనం
కొనసాగించేందుకు అందరినీ కలిపే మతాలు రూపొందాయి. దీని ఫలితంగా
వ్యక్తులందరూ ఎవరికి వారేననే భావనకూడా పెరిగింది. ఒకనాడు గణజీవితంలో
ప్రవర్తిల్లిన ఐకమత్యం బలహీనపడి, ప్రతివ్యక్తీ ఏకాకి అనీ, ప్రతి ఒక్కడూ
దేవుణ్ణే నమ్ముకుని జీవించాలనే దృక్పథం ఏర్పడి, ఈనాటికీ కొనసాగుతోంది.
అప్పట్లో ఇదొక విప్లవాత్మకమైన మార్పు. దీనికి అధ్యాత్మిక, అతీత కారణాలేమీ
లేవు. ఇదంతా ఆర్థిక, సామాజిక పరిణామాల ఫలితమే.
అలాగే సమాజంలోని కట్టుబాట్లూ, పరిపాలకవ్యవస్థా, చట్టాలూ, నిబంధనలూ
అన్నీ వ్యక్తిగత పద్ధతులకు అతీతంగా రూపొందే అవసరం ఏర్పడింది. కారణాలు
ఏవైనప్పటికీ మునుపటికన్నా అతి దగ్గరగా జీవించసాగిన ప్రజలందరూ ఎవరికివారుగా
ఏకాకులైపోయారు. అటువంటి పరిస్థితిలో దేవుళ్ళని నమ్ముకోవడంతప్ప వారికి గతి
లేకుండాపోయింది. తెగలుగా, ముఠాలుగా జీవించినప్పుడు వారందరికీ ఉండిన పరస్పర
సహకారం, ఐక్యతా క్రమంగా తగ్గిపోయాయి. వారంతా మతాధికారుల, పాలకవర్గాల
చెప్పుచేతల్లో మెలగవలసిన అవసరం ఏర్పడింది.
సమాజాలు విస్తరించి, సామ్రాజ్యాలుగా రూపొందుతున్నకొద్దీ పాలకుల బలం
పెరగసాగింది. రాజు స్వయానా దేవుడికి ప్రతినిధి అనీ, అందరూ అతనికి తలఒగ్గి
జీవించడం దైవశాసనమేననీ మతాధికారులు ప్రజలను నమ్మించసాగారు. ఈనాటి
పత్రికలూ, వార్తామాధ్యమాలూ డబ్బుకోసమూ, ప్రాపకం కోసమూ పనికిమాలిన
రాజకీయనేతలనూ, చెత్తరకం సినిమాతారలనూ ఆకాశానికెత్తి అతిశయోక్తులు వల్లించే
పద్ధతిలోనే అప్పటి పూజారివర్గాలూ, కవిపుంగవులూ పాలకులను కీర్తిస్తూ
ఉండేవి. చంద్రవంశమనీ, సూర్యవంశమనీ పేర్లు పెట్టి, ఒక్కొక్క చక్రవర్తీ ఏ
దేవత అంశాన జన్మించాడో చెపుతూ ప్రజలను నమ్మించడం అప్పటి వ్యవస్థల్లో
మామూలే. ఇది మనదేశంలోనే కాక, ప్రపంచంలో తొలి నాగరికలన్నిటిలోనూ
కనిపిస్తుంది.
ఈ పాలకవ్యవస్థలో చట్టాలను అమలుచెయ్యడం, పన్నులూ, శిస్తులూ వసూలు
చెయ్యడం, సామాన్యులకు కొంత శాంతిభద్రతలను ఏర్పాటుచెయ్యడం మొదలైనవి ఉండేవి.
దొంగలూ, దోపిడీదార్లూ, శత్రుదేశాలూ దాడులు చేసి కొల్లగొట్టకుండా ఉండేందుకు
ఆత్మస్థైర్యాన్నిచ్చే విధంగా ఈ పాలకుల గురించిన ప్రశంసలు కొంతవరకూ
ఉపయోగపడేవి. అతీతశక్తులూ, వరాల గురించి ఏం చెప్పినప్పటికీ అవన్నీ
నిత్యజీవితంలోని అవసరాలకనే నిర్దేశించబడిన అతిశయోక్తులు. వీటి గురించిన
సరైన అవగాహన మనకు లేకపోతే ప్రతిదానికీ విపరీతమైన వ్యాఖ్యానాలు చెప్పి
సమర్థించే అర్థంలేని ప్రయాసే మనకు మిగులుతుంది.
సమాజం ఆర్థికంగా, ఆహారోత్పత్తి తదితర మౌలికవ్యవస్థల్లో పరిణామాలకు
లోనవుతున్నప్పు డల్లా గతితార్కిక భౌతికవాదం చెప్పినట్టుగా పాతవ్యవస్థల
స్థానంలో కొత్తవి పుట్టుకురావడం, అవి కొత్తరకం స్పర్ధలకు దారితియ్యడం
వగైరాలన్నీ జరుగుతాయి. ప్రజలు తెగలుగా జీవించిన పరిస్థితి మారి గణజీవితం,
జనపదాలూ, రాజ్యాలూ, సామ్రాజ్యాలూ, వైయక్తిక ధోరణులు పెరగడం మొదలైనవన్నీ
అనివార్యంగా తలెత్తినటువంటి సంఘటనలే. గుహావాసులుగా దుర్భరజీవితాలు గడిపిన
తొలిమానవులను మతభావనలు ఏకం చేసి ఉండవచ్చుగాని, చరిత్ర మొదలైనప్పటినుంచీ
మతాలు ప్రజలను వేరుచెయ్యడానికే ఎక్కువగా ఉపయోగపడ్డాయనిపిస్తుంది.
-
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి