Rss Feed

‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ : శ్రీశ్రీ ‘భూమ్యాకాశాలు’

వరవరరావు
‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ : శ్రీశ్రీ ‘భూమ్యాకాశాలు’
‘తన రక్షణ కోసం ఒక తలారి తప్ప ఏ సాధనమూ లేదనుకునే వ్యవస్థ ఏ స్థితిలో ఉన్నదనుకోవాలి? తన క్రూరత్వాన్నే శాశ్వతమైన శాసనంగా ప్రకటించుకునే వ్యవస్థ. చాల మంది నేరస్తులను ఉరితీసి ఇంకా కొత్త నేరస్తులు పుట్టుక రావడానికి దోహదం చేసే ఈ తలారి వ్యవస్థను గొప్ప చేయడం కన్నా, ఈ నేర బీజాలను నాటుతున్న వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకునే అవసరం గురించి మనం తీవ్రంగా పూనుకోవాల్సి ఉంది.’
- కార్ల్‌ మార్క్స్‌, 1853
మరో డెబ్భై అయిదేళ్లు పోయాక ‘సుప్తాస్థిలు’ ధరాగర్భంలో నుంచి ఏవియో కనరాని, వినరాని రహస్యాలు చెప్తున్నాయని పించింది శ్రీశ్రీకి.
‘ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ ఈ తలారి వ్యవస్థ అని 1937 నాటికి స్పష్టంగా అర్థమయింది.
పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టులు, బతుకు కాలి, పనికిమాలి, శని దేవత రథచక్రపుటిరుసులలో పడి నలిగిన దీనులు, హీనులు, కూడులేని, గూడులేని పక్షులు, భిక్షులు, సఖుల వలన పరిచ్యుతులు, జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులు, జితాసువులు, చ్యుతాశయులు, హ్రుతాశ్రయులు, హతాశులు – ఒక్క మాటలో నోరు, ఊరు, పేరు లేని పీడితుల పక్షం కవి ఉండాలని నిర్ణయించుకున్నాడు.
శ్రీశ్రీ కవిగానే కాకుండా తాను ఇంకేమి కాగలిగితే ఇది సాధ్యమవుతుంది.
తాను కార్మికవర్గం అయితే సాధ్యమవుతుంది.
అందుకే శ్రీశ్రీ కవిత్వం నిండా కార్మికవర్గం పీడిత ప్రజలకు ఆశ్వాసం ఇచ్చే గీతాలది ఒక పాయ అయితే, పీడిత ప్రజలు, అలగాజనం, పతితులు, భ్రష్టులు – చోటు చేసుకునే కవితా పాయ మరొకటి. అంటే ఉత్పాదక రంగానికి, ఉత్పత్తిలో పాల్గొంటున్న శ్రామిక వర్గానికి సంబంధించిన కవిత్వం ఒక పాయ అయితే, అనుత్పాదక రంగానికి చెందిన ప్రజలు (వాళ్లు శ్రమజీవులు కూడా కాకపోవచ్చు, భిక్షువర్షీయసి, కాలువలో జారిపడిన ఉన్మత్తుడు, తాగుబోతు కూడ కావచ్చు) ఎవరైనా కావచ్చు కాని వాళ్లు స్వార్థ ప్రయోజనాలు ఉన్నవాళ్లు కాదు. ఆస్తిపరులు కాదు. ప్రైవేట్‌ ఆస్తిని విభజన రేఖగా గుర్తిస్తే – అది ఉన్నవాళ్లు, దానిని కాపాడుకోవడానికి అణచివేత, దోపిడీలను రాజ్యం ద్వారా, వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్నవాళ్లు ఒకవైపు – వీళ్లను స్థూలంగా పాలకవర్గాలు అనవచ్చు – ఈ అణచివేతకు, దోపిడీకి, విస్తృతికి, పరిచ్యుతికి గురయినవాళ్లు – మార్జినలైజ్‌ అవుతున్న వాళ్లు ఒక వైపు కనిపిస్తారు.
ముఖ్యంగా ‘మహాప్రస్థానం’ లోని గీతాలన్నింటినీ ఈ రెండు పాయల కవిత్వంగా వింగడించవచ్చు – అప్పుడు పైన మార్క్స్‌ చెప్పిన నేరనిర్ణయ దృష్టి నిజంగా తలకిందులుగా మారుతుంది. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, నీతి అవినీతి, హింసా హింసలు, మంచీ చెడు – ఏ ప్రమాణాలతో నిర్ణయించబడుతున్నాయి. ఎవరు నిర్ణయిస్తున్నారు. ఈ నిర్ణయించే అధికారం వారికెవరిచ్చారు. అసలు అధికారం ఎక్కడి నుంచి వస్తుంది. ఒకరు పాలకులు, మరొకరు పాలితులు ఎట్లా అయ్యారు. పాలకుల సంస్కృతి పాలితుల సంస్కృతి ఎట్లా అయింది? ఎందుకు అయింది, ఎందుకు కావాలి.
ఒకరు తలారి ఎట్లా అయ్యారు? మరొకరి తల తీసి వేసే అధికారం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తానికి వ్యవస్థయే తలారి పాత్ర ఎందుకు నిర్వహిస్తున్నది?
మార్క్స్‌నో, ఎంగెల్స్‌నో అడిగితే తడుముకోకుండా ఇది వర్గ సమాజం ఏర్పడిన నాడు ఏర్పడిన ప్రమాణమని, ఈ ప్రమాణాన్ని రద్దు చేయడానికి వర్గ సమాజం ఏర్పడిన నాటి నుంచీ పీడితులు పోరాడుతున్నారని చెప్తారు.
ప్రపంచంలో మార్పుకోరినవాళ్లు అనివార్యంగా ఉన్న వ్యవస్థ మీద తిరుగుబాటును ప్రోత్సహించారు. ఉన్న స్థితికి ఆందోళన చెందారు.
అలజడి మా జీవితం
ఆందోళన మా ఊపిరి
తిరుగుబాటు మా వేదాంతం
జీసస్‌ క్రైస్త్‌ ఒక గొర్రెపిల్లను చేరదీసాడు. పులి చంపిన లేడి నెత్తురును చూసి ఆందోళన చెందాడు. నలుగురూ రాళ్లు రువ్వే మాగ్దలినా పక్షం వహించాడు. మనలో పాపం చేయని వాడు ఎవరు – అని వ్యవస్థ నిర్ణయించిన, పితృస్వామ్యం ప్రకటించిన పాపం అనే ప్రమాణాన్ని ప్రశ్నించాడు. బుద్ధుడు, మార్క్స్‌ ప్రతి ప్రవక్తా అదే చేసాడు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రచయితలంతా అదే చేసారు.
రాజ్య వ్యవస్థ þ వసంత సేన (మృచ్ఛ కటికం), బ్రాహ్మణీయ వ్యవస్థ þ మధురవాణి (కన్యాశుల్కం), పెట్టుబడి þ మేడం బావరీ (ఫ్లాబర్ట్‌ నవల) ఎదురెదురు పెట్టి చూస్తే ప్రతి మహా రచయిత ఎవరి పక్షం వహించి ఎవరిని ప్రశ్నించారో గ్రహించవచ్చు.
అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు రాచరిక వ్యవస్థ కోసం శాపం, శాప విమోచన వంటి జిమ్మిక్కులు ఉపయోగించాడు కానీ భారతంలో శకుంతల మాత్రం ఇంద్రియ జ్ఞానం ప్రమాణంగా సత్యమనే ఆయుధంతో రాజరికాన్ని, పురుష స్వామ్యాన్ని ప్రశ్నించింది.
విక్టర్‌ హ్యూగో నవలలో దొంగ, ‘జాగుతేరహో’ సినిమాలో దొంగ, బౌద్ధ జాతక కథల్లో దొంగ – కళ్ల నుంచి మనకు నేర వ్యవస్థ కనిపిస్తుంది.
శ్రీశ్రీ కవిత్వమంతా ఈ నేర వ్యవస్థ పదఘట్టనలో నలుగుతున్న అసహాయులు, వాళ్లకు అండగా నిలిచే కార్మికవర్గం, పోరాట యోధులు కనిపిస్తారు.
ఒకరాత్రి బహుళ పంచమి జ్యోత్స్నను చూసి, ఆ రేయి రేగిన ఇసుక తుపానును చూసి, గాలిలో కనరాని గడుసు దయ్యాలకు దడుసుకొని, నోరెత్తి, హోరెత్తి నొగలు సాగరం ముందు అప్రతిభుడై, కరికళేబరం వలె కదలని కొండను గుండెల మీదనే మోస్తున్నట్లు భయపడి, చివరకు తన వలెనే ఆకాశపుటెడారిలో కాళ్లు తెగిన ఒంటరి ఒంటె లాగ జాబిల్లిని ఆరోపించుకొని బహుళ పంచమి జ్యోత్స్నను కూడ వెలిబూదిగా తప్ప చూడలేని భయస్తుడు (బహుళ పంచమి జ్యోత్స్న)
ఉదయం ఆరున్నరకు
గదిలో ఆరిపోయిన దురదృష్ట జీవి (ఆకాశ దీపం)
కూటికోసం, కూలి కోసం పట్టణంలో బతుకుదామని…. బయలుదేరి మూడు రోజులు ఒక్కతీరు నడుస్తున్నా దిక్కు తెలియక దారి తప్పిన బాటసారి
కళ్లు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్లో తల్లి
శ్రీశ్రీ కవితా వస్తువు.
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది.
పల్లెటూళ్లో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది
కవి ఒక అసహాయ భయానక స్థితి నుంచి పాఠకుల్లో ఒక కారుణ్యమానవ అనుబంధాన్ని సున్నితంగా తాకాలి. తల్లికేదో పాడు కలలో పేగు కదిలితే పాఠకుల పేగులు ఘార్లిల్లాలి.
మేల్కొన్న చైతన్యం నించి కర్తవ్య నిర్దేశం, నిర్ణయం ఆ తర్వాత. ఇంకాస్త ముందుకు వెళ్లి
దారి పక్క, చెట్టు కింద, ఆరిన కుంపటి విధాన
కూర్చున్న ముసల్దాని
ని, ఆమె స్థితిని కళ్లకు కట్టినట్లు పరిచయం చేసి
‘ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి’దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది
అంటాడు. ఆ వెర్రిగాలి శ్రీశ్రీ. అతడు కుక్క నుంచి, తొండ నుంచి సమాధానం ఆశించలేదు. కమ్మిన చిమ్మచీకట్లలో రేగిన దుమ్ములో ఎగిరివచ్చిన ఎంగిలాకు ‘ఇది నా పాపం కాద’న్నది. కానీ కడుపునిండా తిని త్రేన్చి ఎంగిలాకును చీకట్లలో విసిరేసిన వాళ్లదే ఈ పాపమని మనకు తెలుసు.
అలసిన కన్నుల, చెదరిన గుండెల, విసిగిన ప్రాణుల పరాజితులు, అలకలన్నీ అట్టకట్టిన, బొమికలన్నీ ప్రోవుపట్టిన, కాగితం వలె పలచబారిన ఉన్మాది, శ్రీశ్రీ కవిత్వంలోని ఒక పాయ.
ఎందుకంటే ఆయన
‘కవితా! ఓ కవితా!’
అని కవిత్వాన్ని ఆవాహన చేసుకున్న నాడే
నడిరేనిద్దురలో
అప్పుడే ప్రసవించిన శిశువు నెడదనిడుకొని
రుచిరస్వప్నాలను కాంచే జవరాలి
మనః ప్రపంచపుటావర్తాలూ
శిశువు చిత్ర నిద్రలో
ప్రాచీన స్మృతులూచే చప్పుడు-
శస్త్రకారుని మహేంద్రజాలంలో
చావు బ్రతుకుల సంధ్యాకాలంలో
కన్నులు మూసిన రోగార్తుని
రక్తనాళ సంస్పందన
    - తోపాటు
కాలువ నీళులలో జారిపడి
కదలగనైనా చాలని
త్రాగుబోతు వ్యక్యావ్యక్తాలాపన
ప్రేలాపన
కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్ధనిమీలిత నేత్రాల
భయంకర బాధల పాటల పల్లవి
కూడా విన్నాడు.
ఊరవతల నీరింకిన
చెరుపు పక్క, చెట్టునీడ
గోనెలతో, కొండలతో
ఎటు చూస్తే అటు చీకటి
అటు దుఃఖం, పటు నిరాశ
చెరసాలలు ఉరికొయ్యలు
కాలువలో ఆత్మహత్య -
దగాపడిన తమ్ముల బాధలు ఆయనకు తెలుసు. అవి ఆయనకు అవగాహన అవుతాయి. ఆ వ్యథావనిష్ఠుల, ఆ కథావశిష్ఠుల బాధా సర్పదష్టుల కథలు ఆయన కవితా వస్తువు. దగాపడిన తమ్ముల కోసమే కలం పట్టి జగన్నాథ రథచక్ర ప్రళయ ఘోషను భూమార్గం పట్టించి భూకంపం పుట్టించడానికి ఆయన కవిత్వం రాసాడు.
ధర్మాధర్మాలు, న్యాయన్యాయాలు, హింసాహింసలు మొదలైనవి ఎవరు నిర్ణయిస్తారు – వాటికేం ప్రమాణం అని ఆరంభంలో ప్రశ్నించుకున్నాం. దానికి ఆయనే స్వయంగా ‘వ్యత్యాసం’ అనే కవితలో స్పష్టమైన సమాధానం ఇచ్చాడు.
ఒక సరళ రేఖ ఉంది. అది ఆస్తి – అది భద్రత.
మంచికీ చెడ్డకూ నడుమ కంచుగోడలున్నాయి మీకు
నిశ్చల నిశ్చితాలు మీవి.
మీ కన్నుల చూపులు సరళ రేఖలో!
రేఖ చెదిరితే గొల్లుమని పోతారు.
రేఖ కవతలి వాళ్లంతా నేరగాళ్లు
రేఖను రక్షించడానికే
న్యాయస్థానాలు, రక్షక భటవర్గాలు
చెరసాలలు, ఉరికొయ్యలు.
ఈ రేఖను కాపాడడానికే
మార్క్స్‌ చెప్పిన తలారిని నియమించుకున్నది ఈ వ్యవస్థ.
ఈ దగాపడిన తమ్ముల తరఫున
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ
ఒక జాతిని వేరొక జాతీ
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు
అని ‘జయభేరి’ మోగించాడు శ్రీశ్రీ.
చీనాలో రిక్షావాలా, చెక్‌ దేశపు గనిపని మనిషి, ఐర్లాండున ఓడ కళాసీ, అణగారిన ఆర్తులందరూ,
హాటెన్‌టాన్‌, జూలూ, నీగ్రో, ఖండంతార నానా జాతులు చారిత్రక యధార్థ తత్వం చాటిస్తారొక గొంతుకతో నన్నాడు.
ప్రపంచానికి సమిధ నొక్కటి ఆహుతిచ్చిన వారు
విశ్వవృష్టికి ఆశ్రువుధార పోసినవారు
భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోసినవారు
మాత్రమే
ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించగలరని
విశ్వవీణకు తంతుృలై మూర్ఛనలు పోగలరని
భువన భవనపు బావుటాలై పైకి లేవగలరని
కార్మికలోకపు మాగ్నా కార్టా ప్రకటించాడు.
పొలాలనన్నీ హలాలదున్నీ
ఇలా తలంలో హేమం పిండి
జగానికంతా సౌఖ్యం నింపే
కర్షకవీరుల ఘర్మజలానికి
ధర్మజలానికి
ఖరీదు కట్టే షరాబులేడని ప్రకటించి
లోకపుటన్యాయాలూ! కాల్చే ఆకలి, కూల్చే వేదన
దారిద్య్రాలు, దౌర్జన్యాలు
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ
శ్రామికలోకపు సౌభాగ్యానికి నవ్య కవిత్వాన్ని అందించాడు.
శ్రీశ్రీ ‘పేరు లేని, మొహం లేని’ (నేమ్‌లెస్‌ అండ్‌ ఫేస్‌లెస్‌) అశేష పీడిత ప్రజల తరఫున, ఆయన మాటల్లో ‘పతితుల, భ్రష్టుల, బాధాసర్పదష్టుల’ కోసం ఏయే శక్తులను ఆవాహన చేసాడో. ‘మహాప్రస్థానం’ కాలం నుంచి ‘మరోప్రస్థానం’ వరకు ఎందరో చెప్తూనే ఉన్నారు. జయభేరి, మహాప్రస్థానం, ఆశాదూతలు, ప్రతిజ్ఞ, కవితా ఓ కవితా, దేశ చరిత్రలు, జగన్నాథుని రథ చక్రాలు వంటి ‘మహాప్రస్థానం’ కవితా సంకలం లోని గీతాలు, ‘ఖడ్గసృష్టి’, ‘యిప్లవం యాడుందిరా, ఝంఝ, తుదిపయనం, తొలి విజయం’ వంటి ‘మరోప్రస్థానం’లోని గీతాలు మొదలైనవెన్నో అందుకు ఉదహరించవచ్చు.
ఈ పోరాట శక్తులకు ప్రాతినిధ్య ప్రతీకగా ‘ఉరి తీయబడ్డ శిరస్సు’ను శ్రీశ్రీ ఎందుకు ఎంచుకున్నాడో అవి ఆయా కాలాల్లో ఎట్లా నిర్దిష్టమవుతూ వచ్చాయో వీటినొక ప్రత్యేక దేశకాలాల పాత్రల్లో చెప్పడానికుద్దేశించిందీ రచన.
బానిస వ్యవస్థ కాలం నుంచి కూడ వర్గపోరాటాల్లో ఆస్తి పర దోపిడీ వర్గాలు శ్రామిక, పీడిత వర్గాలను వివిధ రూపాల్లో చంపుతున్నాయి. అణచివేత, చిత్రహింసలు మాత్రమే కాకుండా ఆకలి, అనారోగ్యం, దారిద్య్రాలకు గురిచేసి చంపుతున్నాయి. కొరడా దెబ్బలు మొదలుకొని అధునాతన మారణాయుధాలతో చంపుతున్నాయి. సామూహికంగా కాల్పులు జరిపి, జెనోసైడ్‌లతో కూడా చంపుతున్నాయి. మార్కెట్ల పునఃపంపకాలలో యుద్ధాల్లో చంపుతున్నాయి. ఇవన్నీ చరిత్రలో నమోదవుతూనే ఉన్నాయి. పాలకవర్గ చరిత్రలో కాకున్నా పోరాట వర్గాల చరిత్రలో మౌఖికంగా, జానపదగాథల్లో, పాటల్లో, అన్నిటికీ మించి ఆయా పోరాట తరాలు వారసత్వంగా అందించుకునే జ్ఞాపకాల్లో నమోదవుతూనే ఉన్నాయి. కాని ఆశ్చర్యంగా, సింబాలిక్‌గా ఉరితీయబడిన పోరాట యోధులు చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయారు. బహుశా మావన శరీరంలో ఆలోచనకు, జ్ఞానానికి, వ్యక్తీకరణకు ప్రధానస్థానంలో ఉన్న శిరస్సును ఛేదించడం అనేది – ఆ మూడు మానవ ప్రక్రియలను నిరోధించే అతి అభివృద్ధి నిరోధక చర్యగా మానవ సమాజం భావించడం వల్ల కావచ్చు. తొట్టతొలి బానిసల తిరుగుబాటు యోధులందరినీ స్పార్టకస్‌తో సహా దీపస్తంభాలకు వేలాడదీసి వేలాదిగా ఉరితీసినప్పటి నుంచి కావచ్చు నమోదయిన పోరాట చరిత్రలో ఉరికంబాలకు సాహిత్యంలో ఒక కుఖ్యాతి లభించింది. జీసస్‌ క్రైస్తును శిలువ వేసారు. 1987లో వరంగల్‌ జిల్లా ముస్త్యాలపల్లి గ్రామస్తుడైన ఒక దళిత యువకుడు మేఘ్యాను మొహం చెక్కేసి, పోలీసు స్టేషన్‌లోనే చిత్రహింసలతో చంపి హనుమకొండ చౌరస్తాలో ట్రాన్స్‌ఫార్మర్‌కు వేళ్లాడదీసారు. ఈ మధ్యకాలమంతా ప్రపంచ చరిత్ర నిండా ఇటువంటి ఎన్ని గాథలో. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మంగల్‌పాండే, ఆ తర్వాత బ్రిటిష్‌ వారి మీద మొదటి బాంబు విసిరి ఉరికంబం ఎక్కిన ఖుదీరాంబోసు (అమ్మా, మళ్లీ నీ కడుపుననే పుడతాను, అప్పుడు నా గొంతు మీద ఉండే గాటుతో నన్ను గుర్తు పెట్టుకో అని చెప్పిందట ఆ ఉరి తీయబడ్డ శిరస్సు – తన దేశంతో), కానూ, సిద్ధూ, బిర్సాముండా, వీరనారాయణ సింగు, జోడెన్‌ఘాట్‌ యోధులు కొమురం భీంతో సహా పదకొండు మంది ప్రతి ఆదివాసీ పోరాట యోధుని గురించి ఇదే గాథ. అష్ఫాఖుల్లా ఖాన్‌, రాంప్రసాద్‌ బిస్మిల్‌ మొదలు భగత్‌సింగు, రాజగురు, సుఖదేవ్‌, కయ్యూరు కామ్రేడ్స్‌, కాశ్మీర్‌ విమోచనోద్యమంలో మఖ్బూల్‌భట్‌ – ఇది ఎడతెగని జాబితా.
బ్రిటిష్‌ వలస పాలన మొదలయిన దగ్గరి నుంచీ మన దేశంలో మాత్రమే కాకుండా, అమెరికాలోకి యూరపియన్లు ప్రవేశించిన దగ్గర్నించీ నమోదయిన దస్తావేజులన్నీ ఈ ఆదివాసీ పోరాట యోధులను గానీ, ఇతర పోరాట శక్తులనకు గానీ విచారించి ఉరితీసిన ఉదంతాలను రికార్డు చేసాయి. బహుశా ఉరిశిక్షకు లేదా మరణశిక్షకు ఇది మరొక క్రూర ప్రత్యేకత. అంటే చట్ట ప్రకారం విచారణ చేసి ఒక మనిషిని ఒక వ్యవస్థ చంపే అధికారం, ఈ అధికారం మనం రాజ్యాంగాలు, శాసనాలు, చట్టాలు ఇచ్చాయనుకుంటాం. కాని ఆస్తి – ప్రైవేట్‌ ఆస్తి ఇచ్చిందని అసమ సమాజాన్ని ఏమాత్రం విశ్లేషించినా అర్థమవుతుంది. సాహిత్యం స్పార్టకస్‌ కాలం నుంచి భూమయ్య కిష్టాగౌడ్‌ల కాలం దాకా ‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ వివరించడానికి చేసిన, చేస్తున్న ప్రయత్నమంతా ఈ ప్రైవేట్‌ ఆస్తి దోపిడీ న్యాయం గుట్టు విప్పి చెప్పడమే. ‘సుప్తాస్థికలు’ గీతం రాసిన తొలి నాళ్ల నుంచి ‘భూమ్యాకాశాలు’ గీతం రాసిన 1975 దాకా శ్రీశ్రీ దాదాపు ఒక ఏభై సంవత్సరాలు ఈ ప్రతీక ద్వారా, ఈ సంకేతం ద్వారా మార్క్స్‌ చెప్పిన తలారీ వ్యవస్థను – అది దళారీ వ్యవస్థగా మారిన కాలం దాకా మన కళ్ల ముందుంచి – ఆ ఉరి కంబం ఎక్కిన యోధుల నోట వెలువడిన పోరాట సత్యాలను తన కవిత్వంగా మలిచాడు.
బానిస వ్యవస్థను రద్దు చేయడానికి స్పార్టకస్‌ చేసింది తొలి పయనం అయితే (మనకు తెలిసిన చరిత్రలో) నక్సల్బరీ పంథాలో విప్లవకారులు చేస్తున్న (వర్తమాన చరిత్రలో) పయనం తుది పయనం. ఇందులో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైతే ఇది తొలి విజయం మాత్రమే అవుతుంది. ఎందుకంటే మనం – నూతన ప్రజాస్వామికం నుంచి, సామ్యవాదంలోకి, అంతిమంగా వర్గరహితమైన సమాజంలోకి పయనించవలసి ఉన్నది. శ్రీశ్రీ నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట యోధుల ‘తుది పయనం: తొలి విజయం’ గురించి అదే చెప్పాడు.
ఊగరా, ఊగరా, ఊగరా
ఉరికొయ్య అందుకొని ఊగరా
ఉరికొయ్య అంటుకొని ఊగరా
చావన్నది నీకు లేనే లేదురా
పేద ప్రజానీకానికి, పీడితులకు, తాడితులకు
చేదోడుగ, వాదోడుగ, సైదోడుగ మెలిగేవు
పువ్వులాంటి యవ్వనాన్ని నిగ్గబట్టి నిలిచావు
నిప్పులాంటి నిజాయితీ నెత్తికెత్తి నడిచావు
కార్యదీక్ష కదిలిస్తే కదనానికి దూకావు
అంటూ వంగపండు ప్రసాదరావు అజరామరమైన పాట ‘ఏం పిల్డో ఎల్దమొస్తవా – శ్రీకాకుళంలో సీమకొండకు’ రాయడానికి ప్రేరణ అయిన చరణాలు శ్రీశ్రీ రాసాడు
నెత్తురు కార్చిన కళ్లే నిప్పులు చెరుగుతాయి
వంకర టింకర రాళ్లే గుళ్లయి ఎగురుతాయి
శ్రీకాకుళం అడవుల్లో చీమలు పాముని చంపుతాయి
సింహాది శిఖరం మీద చిలుకలు పిల్లిని చెండుతాయి
అయితే ఈ పోరాటం మాంచాల, మల్లమ్మ, ఝాన్సీలక్ష్మి, సరోజినీ దేవి వంటి వాళ్ల పోరాటం వంటిది కాదు. (బాలచంద్రుడు, తాండ్రపాపారాయుడు, బహదూర్‌ షా, గాంధీల కన్న ఆయా కాలాల్లో ఆయా వర్గాల పోరాటాల ప్రయోజనాల కోసం మెరుగయిన ప్రతీకలే అయినప్పటికీ) మార్క్స్‌ చెప్పినట్లు వీళ్లంతా తమ తమ వర్గాల ‘విముక్తి’ కోసం యుద్ధాలు చేసినవాళ్లు. మొత్తం మానవ సమాజ విముక్తి కోసం పోరాడిన పంచాది నిర్మల చెప్పింది, చూపింది ‘మార్క్స్‌ చెప్పిన తీరం’.
చావులేని ఆ సత్యం జ్వలిస్తుంది అనునిత్యం!
అందుకే ఆస్తిపర వర్గాలు
మాంచాలను కొలుస్తారు, మల్లమ్మను తలుస్తారు
ఝాన్సీ లక్ష్మీబాయికి బాష్పధార విడుస్తారు
సరోజినీ దేవి ఫొటో పటం కట్టి పొగుడుతారు
పంచాది నిర్మలంటే భయం పుట్టి వణుకుతారు
అని మాత్రమే ఆగకుండా ఇందులోని సార్వజనీనమైన గతితార్కిక చారిత్రక సారాన్ని మనముందు ఉంచుతాడు.
తెల్లవాడు నిన్ను నాడు భగత్సింగు అన్నాడు
నల్లవాడు నువ్వు నేడు నక్సలైటువన్నాడు
ఎల్లవారు రేపు నిన్ను వేగు చుక్క అంటారు.
‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అని ముగిసిన ఈ గీతం శ్రీశ్రీ 1971లో రాసాడు. ఆయనెక్కడా ప్రస్తావించక పోయినా బహుశా శ్రీకాకుళ పోరాటంలో పాల్గొన్న నాగభూషణ్‌ పట్నాయక్‌కు ఉరిశిక్ష పడిన సందర్భంలో శ్రీశ్రీ ఈ పాటరాసి ఉంటాడు. ఆ తర్వాత కాలంలో ‘ఉరికంబం మీద నిలిచి ఉజ్వల గీతం పాడెద’ అని శివసాగర్‌ రాసిన అజరామరమైన గీతంతోపాటు ఒక వ్యక్తిగా కన్నా తలారీ వ్యవస్థ మీద బలాదూర్‌ ప్రతిఘటనా స్వరాలుగా ఈ రెండు గీతాలు సాహిత్య చరిత్రలో నిలిచి ఉంటాయి.
మరోప్రస్థానం – గీతాలన్నీ నిర్దిష్ట స్థలకాల పాత్రలకు చెందినవి. ఒక నిర్దిష్ట ప్రత్యేక అంశం నుంచి ఒక విశ్వజనీనమైన సత్యం వైపు మనను తీసుకపోయేవి. అటువంటి నిర్దిష్ట ఉద్దిష్ట వ్యక్తులు భూమయ్య కిష్టాగౌడ్‌లు – కాని శ్రీశ్రీ వాళ్లను మనకు ‘భూమ్యాకాశాలు’గా విస్తరించి చూపినపుడు అవును కదా అని తలలూపకుండా ఉండలేం.
భగత్‌సింగు, రాజగురు, సుఖదేవ్‌ల తర్వాత, కయ్యూరు (కేరళ) కామ్రేడ్స్‌ తర్వాత భారత రైతాంగ విముక్తి పోరాటంలో రాజకీయ కారణాల కొరకు ఉరిశిక్షకు గురైన రైతాంగ గెరిల్లా యోధులు భూమయ్య, కిష్టాగౌడ్‌లు. వారిని 1975 డిసెంబర్‌ 1న ఎమర్జెన్సీ చీకటి రోజులు ఇచ్చిన పిరికి ధైర్యంతో ఉరితీసింది ఇందిరా వెంగళరావు రాజ్యం.
1929-30లలో అంటే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన తొలి రోజుల్లో పుట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు కోసుగంటి భూమయ్య. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి తాలూకాకు చెందిన ముత్తనూరులో వీరమల్లయ్య, రాజవ్వ అనే జంగమ దంపతుల సంతానం.
1933లో ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ తాలూకా కసర్‌గామ గ్రామంలో గున్నల ఎల్లాగౌడ్‌, చిన్నక్కలకు పుట్టిన కిష్టాగౌడ్‌ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనడమే కాదు ఆనాడు తొడలో దిగిన పెలెట్లు ఉరిశిక్ష నాటికి కూడా ఆయన శరీరంలో పోరాట చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి. (తోటారాముని తొడకు కాటా తగిలిందని అడవి కన్నీరు పెట్టిందితని కోసమే).
కమ్యూనిస్టు పార్టీతోనే ప్రయాణం చేస్తూ నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు గోదావరి లోయకు విస్తరించినపుడు గోదావరికి అద్దరి, ఇద్దరి ఉన్న ఈ ఇద్దరూ నక్సలైటు ఉద్యమంలో చేరి ఒక హత్య కేసులో 1970 ఏప్రిల్‌లో అరెస్టయ్యారు. నెలల తరబడి పోలీసు స్టేషన్‌లలో చిత్రహింసలకు గురయి వరంగల్‌ జైల్లో ఉండగా 72లో వీరికి సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది.
తెలంగాణలో ఉరిశిక్షలు అమలయ్యే జైలు ముషీరాబాద్‌ (సికిందరాబాద్‌) కనుక వీరినక్కడికి మార్చారు. ఉరిశిక్షలు పడిన వారిని గంజ్‌ (కండెమ్డ్‌ సెల్స్‌) లో ఉంచుతారు. మొదట 72లో అరెస్టయిననపుడు కె.జి. సత్యమూర్తి, ఎమర్జెన్సీలో సుమంతో బెనర్జీ, ఇంగువ మల్లికార్జునశర్మ కూడా వీరితో చాలాకాలం ఉన్నారు. వీరి ఉరిశిక్ష అమలు చేయడానికి మొదట ప్రభుత్వ ఉత్తర్వులు 1974 డిసెంబర్‌ 25న వచ్చాయి. అంటే వాళ్లు పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి కూడా తోసిపుచ్చాడు గనుక – ఇంక ఉరితీయవచ్చునని. ఉరికంబం ఎక్కవలసిన వారికి ఈ ఉత్తర్వులు జైలు అధికారులు సరిగ్గా ఇరవై నాలుగు గంటల ముందు చెప్తారు. ఆ సమయానికి సికిందరాబాద్‌ కుట్ర కేసులో ముద్దాయిలుగా విరసం రచయితలు ఆరుగురు కూడా అదే జైల్లో ఉన్నారు. వారి ద్వారా ఆ వార్త బయటి ప్రపంచానికి, ఎపిసిఎల్‌సి కార్యదర్శి పత్తిపాటికి తెలిసి, వారి కృషి వల్ల ఆ రాత్రి వాళ్ల ఉరిశిక్ష తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తర్వాత పత్తిపాటితో పాటు కలిసివచ్చి శ్రీశ్రీ జైల్‌ గంజ్‌లో భూమయ్య, కిష్టాగౌడ్‌లను స్వయంగా కలిసి పలకరించాడు. అప్పటి నుంచీ వాళ్ల ఉరిశిక్ష రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షునిగా రాష్ట్రమంతటా సభలు, సమావేశాల్లో, ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. ఆ ఇద్దరూ ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన వాళ్లు కావడం వల్ల (వాళ్లు అమరులయ్యాక కరీంనగర్‌ జిల్లా కుక్కల గూడూరులో కామ్రేడ్‌ దేవేందర్‌ రెడ్డి నాయకత్వంలో ప్రజలు వాళ్ల స్మృతిలో, గోదావరి తీరంలో అమరులయిన ఇతర విప్లవకారుల స్మృతిలో ఎమర్జెన్సీ తర్వాత స్మారక స్థూపాన్ని నిర్మించుకుని వేలాది మందితో ప్రదర్శన, సభ నిర్వహించుకున్నారు) బెల్లంపల్లి, మందమర్రి, హుజూరాబాద్‌ మొదలైన అన్ని చోట్ల 74-75లలో జరిగిన భూమయ్య కిష్టాగౌడ్‌ ఉరిశిక్షల రద్దు సభలన్నింట్లోనూ శ్రీశ్రీ పాల్గొన్నాడు.
అటువంటి ఒక సభ యాదృచ్ఛికంగానే కావచ్చు 11 మే 1975న హుజూరాబాద్‌లో జరిగింది. ఆ సభలు నిర్వహించిన నల్లా ఆదిరెడ్డి, శనిగరం వెంకటేశ్వర్లు తర్వాత కాలంలో శ్యాం, సాహులుగా విప్లవోద్యమ చరిత్రలో రక్తాక్షరాలుగా నిలిచిపోయారు. ఆ సభకు వేలాదిమంది జనం హాజరయ్యారు. వేదిక మీద వక్తలు మాట్లాడుతుంటే ఆ సభ కరపత్రం చదివి వెనుకవైపు శ్రీశ్రీ రాసిన మాటలు ఆ తర్వాత కాలానికి ఉరిశిక్షల రద్దు ఉద్యమానికి ప్రేరణ అయినవి. జార్‌ చక్రవర్తి పరిపాలనలో రష్యాలో సుప్రసిద్ధ నవలా రచయిత డాస్టొవస్కీకి ఒక హత్య కేసులో ఉరిశిక్ష పడింది. అది అమలు చేయడానికి అప్పటి రష్యా ప్రభుత్వం చట్టం ప్రకారం అతణ్ని కాల్చి చంపే గోడ దగ్గరికి తీసుకపోయిన మారక బృందానికి ఆఖరి క్షణాన – మరణశిక్ష రద్దు చేస్తూ జార్‌ చక్రవర్తి తరఫున ఉత్తర్వులందాయి. జార్‌ చక్రవర్తికి అప్పుడే డాస్టొవస్కీ గొప్ప నవలా రచయిత అని తెలిసిందట. ఆ విషయం శ్రీశ్రీ తనదైన సులభ శైలిలో చెప్పి ఇందిరాగాంధీ భూమయ్య కిష్టాగౌడ్‌లనకు ఉరితీసి జార్‌ చక్రవర్తి కన్నా అన్యాయం అనిపించుకోరాదని ఆయన విజ్ఞప్తి చేసాడు.
ఇందిరా-వెంగళరావులు జార్‌చక్రవర్తే కాదు, నిజాం రాజు కన్నా అన్యాయం అనిపించుకున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉరిశిక్షలు పడిన పదకొండు మంది ఉరిశిక్షలు అమలు కాలేదు. ఖురాన్‌ మీద ఉన్న భయభక్తులతో పాపం తగులుతుందని మరణశిక్ష అమలు ఉత్తర్వులపై నిజాం రాజు సంతకం చేయకుండా ఉండిపోయాడు – పోలీసు చర్య (1948 సెప్టెంబర్‌) కాలం దాక కూడ.
1975 మే 10న భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరితీత కోసం రెండవ మారు ఉత్తర్వులు వచ్చాయి. అమరుడు మధుసూదన్‌ రాజ్‌ ద్వారా ఆ వార్త బయటి ప్రపంచానికి, కన్నబిరాన్‌కు, యువ న్యాయవాదులకు తెలిసి, వారి కృషి వల్ల రెండోమారు ఉరిశిక్ష ఆగిపోయి, ‘భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు కమిటీ’ ఏర్పడి ఉద్యమం రాష్ట్రాల, దేశాల ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తమయింది. ఫ్రాన్స్‌లో, ఇంగ్లండ్‌లో కూడ భారత రాయబార కార్యాలయాల ముందు ప్రదర్శనలు జరిగాయి. దేశంలో జయప్రకాశ్‌ నారాయణ్‌, వాజ్‌పేయి మొదలు కె.ఎ. అబ్బాస్‌, మృణాళ్‌సేన్‌ల వరకు ఉరిశిక్షల రద్దు కొరకు విజ్ఞప్తి చేసారు. జార్జి ఫెర్నాండెస్‌, చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్‌ గుప్తల కృషి సరే సరి. జీన్‌పాల్‌ సార్త్ర్‌, తారిక్‌ అలీ, నోమ్‌ చామ్‌స్కీ వంటి ప్రపంచ మేధావులు కూడా స్పందించారు.
12 మే 1975న హైదరాబాద్‌లో శ్రీశ్రీ ఒక విజ్ఞప్తి చేసాడు.
‘ఏదో చారిత్రకమైన పొరపాటు వల్ల ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌, ఇందిరాగాంధీలను ఉరి తియ్యడం జరిగితే ఎక్కడో అలాస్కాలో ఉన్న ఎస్కీమోలు పట్టించుకోక పోవచ్చును. అలాగే భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీస్తే అహ్మద్‌, ఇందిరాగాంధీలకు చీమకుట్టి నట్లయినా ఉండక పోవచ్చును. కాని ఒకప్పుడు సక్కో, వాంజెట్టీలను ఎలక్ట్రిక్‌ కుర్చీలపై ఎక్కించి అమెరికా ఆర్జించుకున్న అప్రతిష్టకు ఏమాత్రమూ తగ్గిపోదు ఇండియా ఈనాడు భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీస్తే! సాటి దేశాల చేత ఇండియా ఇప్పటికే ‘ఛీ ఛీ’ అనిపించుకుంటోంది. (సిక్కింను కబళించడం లాంటి చర్యలతో) ఎన్నో సభ్య రాజ్యాలు నిషేధించిన ఉరిశిక్షను రద్దు చెయ్యకపోవడంతో ఇండియా ఇప్పటికే పాతరాతి యుగంలోనే జీవిస్తున్నట్టు మరోమారు నిరూపించుకుంటుంది. కనీసం భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షలను రద్దు చేసే అవకాశం ఇండియా ప్రభుత్వానికి ఇప్పటికైనా లేకపోలేదని హెచ్చరిస్తున్నాను.’
అదే సమయంలో స్పెయిన్‌లో అయిదుగురు తిరుగుబాటుదార్లకు ఉరిశిక్ష పడింది. ఆ అయిదుగురు యువకుల ఉరిశిక్ష రద్దు చేయవలసిందిగా నియంత ఫ్రాంకోకు ‘భారత సామ్యవాద గణతంత్ర ప్రధాని’ ఇందిరాగాంధీ విజ్ఞప్తి చేసింది. కాని ఎమర్జెన్సీ విధించిన నియంతగా మారి ఆమెయే భూమయ్య, కిష్టాగౌడ్‌లను వెంగళరావు ద్వారా 1 డిసెంబర్‌, 1975న ఉరితీసింది.
బెల్లంపల్లిలో గజ్జెల గంగారామ్‌, పెద్ది శంకర్‌ వంటి రాడికల్స్‌ (ఆ తర్వాత కాలంలో అమరులయిన విప్లవకారులు) పూనికతో వేలాది మందితో జరిగిన సభలో శ్రీశ్రీ పాల్గొన్నాడు. మందమర్రిలో భోరున వర్షం కురుస్తుంటే వేలాదిమంది జనం ఇంటి చూరుల కింద నిలబడి, వానలో తడుస్తూ
బానిసకొక బానిసకొక బానిసవోయ్‌ బానిసా
అని జలగం వెంగళరావుపై ‘ఇందిరమ్మ బాజాభజంత్రీ’గా ‘జలగవునీ పేరంటే కడుపునొప్పి’ అని రాసిన ‘దూది పులి మీద పుట్ర’ గీతాన్ని శ్రీశ్రీ ఉత్తేజకరంగా వినిపించాడు. ఆ సభలో పాల్గొన్న పత్తిపాటి వెంకటేశ్వర్లు మర్నాడు భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు గురించి ముఖ్యమంత్రిని కలిసినపుడు
‘నక్సలైటు పోల్చినాడురా – నీ నెత్తిన
నాటుబాంబు పేల్చుతాడురా’
అని మీ మహాకవి మందమర్రిలో చెప్పినపుడు వంతపాడినావు కదా అని వ్యంగ్యంగా తన వర్గస్వభావాన్ని బయట పెట్టుకున్నాడు వెంగళరావు.
ముషీరాబాద్‌ (సికిందరాబాద్‌) జైల్లో మొదటిసారి చూసినపుడే శ్రీశ్రీ భూమయ్య, కిష్టాగౌడ్‌లను భూమ్యాకాశాలతో పోల్చాడు. డిసెంబర్‌ 1న ఉరితీసారని చదివినపుడు డైరీలో నోట్‌ చేసుకొని డిసెంబర్‌ 3న వాళ్లపై భూమ్యాకాశాలు – అని గీతం రాసాడు.
వాళ్లిద్దరినీ ఉరితీసారని
అరవ పత్రికలో చదివినపుడు
వాళ్లిద్దరినీ ఉరితీశారని
డైరీలో నోట్‌ చేసుకున్నాను
ఒద్దు కన్నీటి కవిత్వం రాయొద్దు
సమాజానికి కాలం పెట్టిన అప్పును
ప్రాణాలతో వారు తీర్చుకున్నారు
ఎల్లప్పుడూ వాళ్లలో రగిలే పగ
ఎన్నటికీ తీరనే తీరదు
వాళ్లలో ఆరని ఆశ
తీరే రోజు చేరువలోనే ఉంది
- – - – - – -
చీకటిని పిడికిళ్లతో పిండి
చెడుగుడును చీల్చి చెండాడారు
చెరిగిపోని వాళ్ల శిలాశాసనం మీద
నక్షత్రాలు సాక్షి సంతకం చేసాయి
- – - – - – -
మరణం లేని మహదాశయమే
మనకు వాళ్లిచ్చిన నిధి
రోజెన్‌బర్గ్‌ దంపతుల్లా వాళ్లు
మేధావులు కారు
సాక్కో వాంజెట్టీ ల్లాగ
మెతక మనుషులు కారు
వాళ్లిద్దరిలో ఒకడు భూమి
రెండోవాడు ఆకాశం.
కిష్టాగౌడ్‌వి వంకీల తుమ్మెద రెక్కల వంటి శిరోజాలు. వాటి నీడలు పడే నీలాకాశం వంటి కళ్లు. భూమయ్య పేరుతో భూమి ఉందిగానీ ఆయనది జంగమ వృత్తి. జంగమ దేవరలకిచ్చే రెండెకరాల ఇనాం భూమిని భూమయ్యకు ఉరిశిక్ష పడినాక ఆయన భార్య, కొడుకు నెత్తికొట్టి ఆ ఊరి భూస్వామి ఆక్రమించుకున్నాడు. కనుక అక్షరాలా ఈ వ్యవస్థ భూమ్యాకాశాలను ఉరితీసింది. దున్నేవారికి భూమి కావాలన్నందుకు, ఆకాశం వలె పంచభూతాలు ప్రజలందరివీ అన్నందుకు, పోరాటానికి భూమ్యాకాశాలే హద్దు అన్నందుకు ఈ తలారి వ్యవస్థ ఆ ఇద్దరినీ ఉరితీసింది.
ఆ ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన ఈ రహస్యాన్ని శ్రీశ్రీ మనకు ‘జాతి జనులు పాడుకునే మంత్రంగా, తన ఆకాశాలను లోకానికి చేరువగా, తన ఆదర్శాలను సోదరులంతా పంచుకొనే వెలుగుల రవ్వల జడిగా’ వినిపించాడు.
శ్రీశ్రీకి నూరేళ్లు నిండాయి. ఆయన కవిత్వం ఆగిపోయి కూడ 26 ఏళ్లు గడిచిపోయాయి. భూమయ్య కిష్టాగౌడ్‌లను ఉరితీసి కూడా 34 ఏళ్లు గడిచిపోయాయి. ఎమర్జెన్సీ చీకటి రోజులు ‘తొలిగిపోయి’ కూడా 32 ఏళ్లు అయింది. కనుక ఈ అన్నిటికీ ఇపుడేమిటి సంబద్ధత? సమకాలీనత? అని మనం ప్రశ్నించుకోవచ్చు. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన కాలపు ఆర్థిక మాంద్యం, ప్రజాస్వామ్యంపై ఫాసిస్టు దాడి – ఇవ్వాళ అమెరికా సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న సంక్షోభం, ప్రపంచం మీద చేస్తున్న అణుయుద్ధం ప్రపంచీకరణ రూపంలో మనను మార్కెట్‌ మాయలో పడవేసినవి. ఇవ్వాటికీ శ్రీశ్రీ మాటల్లోనే ‘కర్మాగారము, కళాయతనము, కార్యాలయముల కన్నా మిక్కుటముగా’ కారాగారాల్లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది మగ్గుతున్నారు.
నక్సలైటు ఉద్యమంలోను, జాతివిముక్తి ఉద్యమాల్లోను ఉరిశిక్షలు పడిన వాళ్లు కూడ దేశం జైళ్లలో మృత్యువుతో తలపడుతున్నారు. వారిలో పార్లమెంట్‌ మీద దాడి కేసులో ఉరిశిక్షను సుప్రీం కోర్టు కూడా ఖాయపరచి కేవలం రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం నిరీక్షిస్తున్న అఫ్జల్‌ గురు ఉన్నాడు. ఎమర్జెన్సీ దేశంలో గ్రీన్‌హంట్‌ పేరు మీద తన ప్రజల మీద తానే సైనిక దాడి చేసే బీభత్స రూపాన్ని సంతరించుకున్నది. అందుకే శ్రీశ్రీ కవిత్వం శిశిరం ముగింపుగా వచ్చే ఉగాదిగా ఇవ్వాటికీ ‘తొలి యౌవనాన్ని పునర్జీవిస్తున్నది’.