Rss Feed

వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్



ముగ్గురు ఆప్ఘన్ మహిళల జీవితాల నేపధ్యంలో 30 సంవత్సరాల ఆప్ఘనిస్తాన్ చరిత్రను పరామర్శిస్తూ మీనా నాన్జి వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్ అనే అద్భుతమైన డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు. దీన్ని తెలుగులో "ఇసుక తిన్నెలమీంచి చూసినప్పుడు" అని పిలిస్తే అర్థవంతంగా ఉంటుంది.

ఆప్ఘనిస్తాన్ గురించి ఎవరు ఆలోచించినా అక్కడి మహిళల దుస్థితే మొదటగా మనసులోకి వస్తూంటుంది. ఆప్ఘన్ మహిళల ప్రస్తుత పరిస్థితి ఏమిటి... వాళ్ల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి... కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి పరిస్థితి నిజంగా మెరుగుపడిందా... వాళ్లకు నిజమైన హక్కులు ప్రస్తుతం ఉన్నాయా.. లేదా ఇప్పటికీ వారు భయం, అణచివేత నేపధ్యంలోనే బతుకుతున్నారా.. ఇలా అనేక ప్రశ్నలు పొడుచుకుని వస్తుంటాయి.
ఇసుక తిన్నెల మీదనుంచి...
30 సంవత్సరాల క్రమంలో యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఆప్ఘనిస్తాన్ ఆకాశంలో సగభాగం దుర్భరస్థితిని, మనోధైర్యాన్ని సజీవంగా చిత్రించిన ఈ లఘుచిత్రం "వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్" పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో లెక్కలేనన్ని అవార్డులు దక్కించుకుంది.


"ఇసుక తిన్నెల మీదనుంచి చూసినప్పుడు" అనే అర్థం గల ఈ సినిమా ముగ్గురు ఆప్ఘన్ మహిళల కళ్లలోంచి ఈ సమస్యలను పట్టి పరిశీలిస్తుంది. వారు ఓ డాక్టర్, ఓ టీచర్, ఓ హక్కుల కార్యకర్త. అంతర్జాతీయ శక్తులు పురికొల్పిన యుద్ధాల ద్వారా ఆప్ఘనిస్తాన్‌లో మూడు వేరువేరు ప్రభుత్వాల హయాంలో తమ జీవితాలు ఎంత హింసాత్మకంగా మారిందీ ఈ ముగ్గురు మహిళలూ కళ్లకు కట్టినట్లుగా చూపిస్తారు.

ఈ హింసా కొనసాగింపులో వారి జీవితాలు కదిలిపోయినప్పటికీ, తమ ఇళ్లు, తమ దేశం సైతం ధ్వంసం అయిపోయినప్పటికీ, ఈ ముగ్గురు మహిళలూ మొక్కవోని ధైర్యసాహసాలతో, చెరగని విశ్వాసంతో తమ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి తమ పనిలో కొనసాగుతున్న వైనాన్ని ఈ డాక్యుమెంటరీ చిత్రం అత్యద్భుతంగా చిత్రించింది.

వాయవ్య పాకిస్తాన్‌లోని శరణార్థి శిబిరాలలో, తర్వాత యుద్ధంతో ఛిన్నాభిన్నమైన కాబూల్ నగరంలో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితుల వివరణతో ప్రారంభమయ్యే ఈ చిత్రం గత 30 సంవత్సరాలుగా అంటే రాజు జహీర్ షా పాలన నుంచి మొదలై ప్రస్తుత హమీద్ కర్జాయ్ ప్రభుత్వం వరకు ఆప్ఘన్ మహిళల భయానకమైన, ఆలోచనలను రేకెత్తించే దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

కొనసాగుతున్న పోరాటంలో ఈ మహిళలు తమ శక్తినంతటినీ కూడదీసుకుని ఎలా నిలబడుతున్నారో ఈ చిత్రం అతి స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పటికీ విభజించబడిన, పైశాచిక స్థితికి వెళ్లిన ఆప్ఘన్ జాతీయ చిత్రణను ఈ చిత్రం చూపరులను హత్తుకునేలా చూపించింది.

మొత్తం ప్రపంచం ఇప్పుడు మరో సంక్షోభం మీద దృష్టి పెడుతున్న నేపధ్యంలో, ఈ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ ఆప్ఘనిస్తాన్‌పై కెమెరాను సారించి ఆప్ఘన్‌లో జీవన సంఘర్షణలో మునిగి తేలుతున్న మహిళల విలువైన స్వరాలను ప్రపంచానికి గుర్తు చేస్తోంది.

30 సంవత్సరాల క్రమంలో యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఓ జాతిలో సగభాగం దుర్భరస్థితిని, మనోధైర్యాన్ని సజీవంగా చిత్రించిన ఈ లఘుచిత్రం "వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్" పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో లెక్కలేనన్ని అవార్డులు దక్కించుకుంది.

చిత్ర దర్శకురాలు మీనా నాన్జి వివరాలు
ఈ చిత్ర దర్శకురాలు మీనా నాన్జి గత పదేళ్లుగా ఫిల్మ్ వీడియోలో పనిచేస్తున్నారు. తన ప్రయోగాత్మక చిత్ర నిర్మాణానికి గాను ఆమె అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ మీడియా ఫెలోషిప్, ది లాస్ ఏంజెల్స్ కల్చరల్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్, పాల్ రాబ్సన్ ఫండ్ గ్రాంట్, ఇండిపెండెంట్ ఫిల్మ్ వీడియో ప్రొడక్షన్ గ్రాంట్, వంటి పలు సంస్థలు ఈమె సృజనాత్మక ప్రతిభకు అవార్డులతో సత్కరించాయి.

ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో పలు అవార్డులను సాధించాయి. అలాగే అమెరికా, యూరోపియన్ టెలివిజన్లలో పిబిఎస్ స్టేషన్లద్వారా విస్తృత ప్రదర్శనకు నోచుకున్నాయి.


http://www.youtube.com/watch?v=2a9JUh6LtBg