Rss Feed

మహాప్రస్థానం' మతలబులు

-

జూన్ పదిహేను మహాకవి శ్రీశ్రీ వర్ధంతి. శ్రీశ్రీ పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తువచ్చేది 'మహాప్రస్థానం'. అర్థ శతాబ్దం పైగా పూర్తి చేసుకున్న, తెలుగు కవిత్వ గతిని పూర్తిగా మార్చేసిన ఈ పుస్తకాన్ని గురించి నేను నోట్ చేసుకుని పెట్టుకొన్న కొన్ని పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయని ఈ క్రింద పొందుపరుస్తున్నాను:

* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గీతం మొట్టమొదట ముద్దుకౄష్ణ నడిపిన 'జ్వాలా పత్రికలో ప్రచురితమైంది ("మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి ముందుకు,పోదాం, పోదాం పైపైకి!" అని సాగుతుందీ గీతం)

* 'మహాప్రస్థానం' ప్రచురణకు శ్రీశ్రీకి ఆర్థిక సహాయం చేసింది, మచిలీపట్నం వాస్తవ్యుడైన ఆయన మిత్రుడు నళినీకుమార్ (అసలు పేరు ఉండవల్లి సూర్యనారాయణ). మదరాసులో ఉండగా శ్రీశ్రీకి అతడితో పరిచయమైంది.

* 'మహాప్రస్థానం' మొదటి ప్రచురణ 1950 జూన్ లో జరిగింది. ఇప్పటికిది మరో 23 ప్రచురణలు పొందింది (ఇది ఇటీవలే నేను కొన్న 'మహాప్రస్థానం' ప్రతిపైన ఉన్న వివరాల ఆధారంగా ఇచ్చిన సమాచారం. తప్పైతే సవరించండి)

* 'మహాప్రస్థానం' పుస్తకంలో మొత్తం 40 కవితలున్నాయి (కొంపెల్ల జనార్థనరావుకోసం రాసిన అంకిత గీతం కాకుండా)

* 'మహాప్రస్థానం'లోని గేయాలన్నీ 1933-1940 మధ్యకాలంలో రాసినవి ("నిజంగానే" "గర్జించు రష్యా" 1941లో, "నీడలు" 1947లో రాసినవి. అది (1930 దషకం) ఆకలి బాధలు, ఆర్థికమాంద్యం ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం. ఈ దషాబ్దాన్ని (1930-40) చరిత్రకారులు "హుంగ్ర్య్ ఠిర్తిఎస్" అని అభివర్ణించారు.

* శ్రీశ్రీ తను ఆ కాలంలో రాసిన గేయాలన్నిటినీ ఈ సంపుటిలో చేర్చలేదు. ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు ప్రధానేతివౄత్తంగా ఉండే గేయాల్నే చేర్చాడిందులో.

* శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని లండన్ లో స్థిరపడిన డాక్టర్ గూటాల కౄష్ణమూర్తి 'విదేశాంధ్ర ప్రచురణలా పేరుతో శ్రీశ్రీ సొంత దస్తూరిలో 1981లో విడుదల చేశారు. పుస్తకంతోపాటు శ్రీశ్రీతో స్వయంగా చదివించి రికార్డు చేసిన 'మహాప్రస్థానం' గీతాల క్యాసెట్టును కూడా విడుదల చేశారు. ఈ కౄషి వెనుక పురిపండా అప్పలస్వామి ప్రమేయం చాలా ఉంది.

* "మహాప్రస్థానం అన్న గీతం రాసేనాటికి నాకు మార్క్సిజం గురించి తెలియనే తెలియదు. నేను మార్క్సిజంను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానేగాని, రాజకీయాలద్వారా కాదు." అని శ్రీశ్రీ 1970 ఫిబ్రవరిలో "సౄజన" పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.

* 'మహాప్రస్థానానీకి చలంతో ముందుమాట (యోగ్యతాపత్రం) రాయించటానికి ప్రేరేపకుడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (జరుక్ శాస్త్రి)

* 'మహాప్రస్థానం' సంపుటిలోని 'ప్రతిజ్ఞా గేయానికి మూలం లండన్ అభ్యుదయ రచయితల మానిఫెస్టో. దాని కాపీ ఒకటి అబ్బూరి రామకౄష్ణారావుగారు ఇస్తే అది చదవగానే ఆ స్ఫూర్తితో శ్రీశ్రీ ఈ గేయం రాశారు.

* 'దేశచరిత్రలూ గేయానికి 'జ్వాలా పత్రికలో ముద్దుకౄష్ణ రాసిన ఒక సంపాదకీయం ప్రేరణ (ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం...)

* 'మహాప్రస్థానం' ముందుమాటకి చలం పెట్టిన పేరు 'మహాప్రస్థానానికి జోహార్లూ అని. దాన్ని శ్రీశ్రీ 'యోగ్యతాపత్రం' అని మార్చుకున్నాడు. చలం అనుమతితోనే మరొక మార్పు కూడా చేశాడు. చలం రాసిన ముందుమాటలో 'శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రాబ్సన్ సంగీతమూ ఒకటేరకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు...' అని ఉంటుంది. నిజానికి చలం పాల్ రాబ్సన్ పేరు స్థానంలో 'సైగళ్ అని రాశాడు. సైగల్ పేరు తీసేసి, ఆ స్థానంలో పాల్ రాబ్సన్ పేరును చేర్చాడు శ్రీశ్రీ. పాల్ రాబ్సన్ అమెరికాలోని గొప్ప నీగ్రో గాయకుడు, వామపక్ష అభిమాని.

* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' కవితా సంపుటిని హిందీలోకి డాక్టర్ సూర్యనారాయణ 'భానూ అనువదించారు. 1984లో ఇది ప్రచురింపబడింది.

* 'మహాప్రస్థానం'లోని 'చేదుపాటా కవితను జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి చదివి వింపించగా, చలం కన్నీళ్ళు పెట్టుకున్నాడట (ఔను నిజం, ఔను నిజం, ఔను నిజం, నీవన్నది, నీవన్నది, నీవన్నది నిజం, నిజం...)

* ఒక బహిరంగసభలో శ్రీశ్రీ చదివిన 'కవితా ఓ కవితా' అనే గేయాన్ని విష్వనాథ సత్యనారాయణ విని, పులకరించి, లేచి శ్రీశ్రీని కౌగిలించుకుని, ఆ గేయాన్ని నేనే ప్రచురిస్తానని వాగ్దానం చేశాడు. కాకపోతే ఆయన ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు (కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో...)

* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గేయాల్ని దేవులపల్లి, అడివి బాపిరాజు మొదలైన ప్రముఖులు బహిరంగసభల్లో ఆలాపించిన సందర్భాలు ఉన్నాయి.

* శ్రీశ్రీ తన సాహిత్య ప్రథమ గురువుగా చెప్పుకున్న అబ్బూరి రామకౄష్ణారావుగారు 1956లో తన మహాప్రస్థాన రచనావిధానాన్ని, అందులో ప్రతిపాదించిన సిద్ధాంతాలనూ వెక్కిరిస్తూ, ఖండిస్తూ ఓ కవిత రాశాడు (ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ శ్రీశ్రీపై ప్రచురించిన మోనోగ్రాఫ్ లో బూదరాజు రాధాకౄష్ణగారు రాశారు, కాని, ఆ కవిత ఏమిటో చెప్పలేదు. ఎవరైనా సేకరిస్తే బాగుంటుంది)

* కొసమెరుపు - 'మహాప్రస్థానం' గేయాల్ని మొదట 'భారతీ పత్రికకు పంపిస్తే అవి తిరిగొచ్చాయి.

['మహాప్రస్థానం' లోని గీతాలను చాలా తెలుగు సినిమాల్లో ఉపయోగించుకున్నారు. వాటి వివరాలు ఎవరైనా సేకరించి ఉంటే తెలుపగలరు]