-
"సిరివెన్నెల" గారి" అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా"?
Posted by
సుమన్.గద్దె
on 14, అక్టోబర్ 2008, మంగళవారం
Labels:
సమీక్షలు
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?
ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా?
చిన్నప్పుడు పాటలు వినే కొత్తలో శ్రీశ్రీ రచించిన పాడవోయి భారతీయుడా అనే పాట చాలా గొప్పపాట అని అమ్మ వినిపించేది. పాట వచ్చి ముప్పయ్యేళ్ళు గడిచినా చూడు ఇప్పటికీ ఆ పాట ఎంత రెలవెంటుగా ఉందో అని చెప్పేది. అప్పటిలో శ్రీశ్రీ దార్శనికత మీద గొప్ప అభిమానం పెంచేసుకున్నా కూడాను. కొన్నాళ్ళ తర్వాత అర్థమయ్యింది – రాయడంలో శ్రీశ్రీ గొప్పతనం ఎంతలా ఉన్నా – ఆ పాటని నిజం చెయ్యడంలో సమాజం “గొప్పతనాన్ని” కూడా తక్కువ అంచనా వేయకూడదని. సిందూరం అనే సినిమాలో వ్రాయబడ్డ ఈ పాటగురించి కూడా పై అభిప్రాయం వర్తిస్తుందనుకుంటాను. ఈ పాట పదేళ్ళక్రితం యాభయ్యవ స్వాతంత్ర సంబరాల సమయంలో అనుకుంటా వ్రాయబడింది. నిన్నే ఎందుకో హమ్ముకుంటుంటే – ఆహా! అయితే మనం గత పదేళ్ళలో పెద్దగా ఒరగబెట్టేసినదేమీ లేదన్నమాట అనిపించింది. పాట వింటూ అనిపించిన కొన్ని అనుభూతుల్ని మీతో పంచుకుందామని…
శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చినబహుమానం – ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా – ఓ పవిత్ర భారతమా!
అవ్వడానికి సింధూరమే – పవిత్రమే – తెచ్చినదే ఎక్కడనుండి – కపోతాన్ని – అదే శాంతికపోతపు రక్తంతో భరతమాతకి సింధూరం దిద్దుతున్న సమాజం గత యాభయ్యేళ్ళలో అస్సలు మారలేదు. నాటి దేశవిభజన గొడవలనుండి – నేటి ఒరిస్సా మారణహోమాల దాకా – ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం – కృష్ణగీత ఆపిందా నిత్యకురుక్షేత్రం – మారదు లోకం – మారదు లోకం.
కులాలకోసం గుంపులు కడుతూ మతాలకోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే – జనాలు తలలర్పిస్తారే
సమూహక్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం- తెలిసీ భుజంకలిపి రారేం
అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి – పోరి ఏవిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం – ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా – ఓ అనాధ భారతమా!
ఒకవంక కులాల కురుక్షేత్రం. మరొకవంక మతాల మారణహోమం. పోనీ ఇవన్నీ అలా జరిగిపోతున్నాయా – కాదే - జరిపింపబడుతున్నాయి. ఎందుకు అని తెలిసినవాళ్ళంతా బానే ఉన్నారు. తెలియని మూర్ఖజనాలు బలవుతున్నారు. ఆపగలిగిన మేధావివర్గం దేశం అనే భావనే టెర్రరిజానికి మూలం – కాబట్టి దేశభక్తన్న భావనే పోవాలి అంటుంది. స్వేఛ్చ దేనికయ్యా అంటే కొట్టుకోవడానికి – ఎవరు ఎవరికోసం ఎవరితో కొట్టుకుంటున్నారు – ఎందుకోసం కొట్టుకుంటున్నారు – నూరుకోట్లమంది నీ నీడలో, నీ తిండి తింటూ, ఆనందంగా కొట్టుకుంటూ స్వేఛ్చని అనుభవిస్తున్నారు. నువ్వుమాత్రం అనాధవే… అమ్మ తుఝే సలాం.
అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
క్రూరమృగంలా కారడువుల్లో దాక్కుని ఉండాలా – వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువుతో పోరాడే సైన్యం – శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతివీరులనణిచే విధిలో కవాతు చెయ్యాలా – అన్నలచేతిలో చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి – తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ సమరం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం
చీకటివైపా వేకువలోకా ఎటు నడిపేనమ్మా – గతి తోచని భారతమా
ధైర్యమూ, ధర్మమూ రెండూ సమాజంలో ఉంటే ఆ సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఆ రెంటినీ సమాజం పంచేసింది. ఒకభాగం అడవిలో నక్సలైట్లకిచ్చి, మరోభాగం పోలీసులకిచ్చి ఆ కలహాన్ని చూస్తూ సంఘం శిలలా చూస్తూ ఉంటే… సమాజంలో జీవం ఎక్కడుంది? అలాంటి జీవంలేని శవాల్లా సమాజంలో నడుస్తున్న మేధోజనాలం మనం. మన సిగలో నెత్తుటి మందారాన్ని తురుముతున్న ఈ సింధూరసంధ్య ఎటు తీసుకుపోతుందో? ఈ సంధ్య ఉదయసంధ్యో, సాయంసంధ్యో అర్థం కావడం లేదు. మనందరికీ ఒకటే తృప్తి. సాయం సంధ్య అయినా రాత్రంతా గడిచైనా రేపుదయం వస్తుందని. మనకేమన్నా తొందరా? మనం నడిచి వెళ్ళాలంటే సమస్య – మనం నడవనంతవరకూ ఎవరెక్కడికి పట్టుకెళ్ళినా మనకి పరవాలేదు. వీలైతే స్పందించడమే మానేద్దాం. లేదంటే నక్సలైట్లదే తప్పని కాస్త అరుద్దాం. కాదంటే పోలీసులదే తప్పని గోలచేద్దాం. లేదంటే హిందూమతానిదే పాపం అని ప్రశ్నిద్దాం. పోదంటే ముస్లిములే తీవ్రవాదులని నిర్ణయిద్దాం. మరింత ఆజ్యాన్ని రగిలిద్దాం. ఆ చితిమంటల వెలుగులో మనం చలికాచుకుందాం.
అంతేనా…
తనతలరాతను తనే మార్చగల అవకాశాన్నే వదలుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని పిలిచే జాతిని ప్రశ్నించడమే మానుకుని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితిమంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాలభారతమా ఓ విషాద భారతమా!
అస్సలు ఈ పాటకి మీకు మధ్య నేనుండాలా అనిపిస్తుంది. కళ్ళున్న జాతిని కళ్ళు తెరవమని చెప్పడానికి అటు ఆవేశానికీ, ఇటు అధికారానికీ తీరుబడిలేదు గానీ, నడిపించడానికి మాత్రం వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఈ కురుక్షేత్రానికి అతిముఖ్యలోపం గమ్యం లేకపోవడం – గమ్యం తెలియకపోవడం. ఈ చితిమంటల సింధూరం చూస్తూ కూడా నిదురిస్తావా అని భారతానికొక ప్రశ్న.
భారతమంటే నేను కాదు అని అనేసుకుని పక్కకు వెళ్ళిపోకండేం!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి