Rss Feed

జ్యోతిబసు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుధీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్చంతంచేసుకున్న జ్యోతిబసు ( Jyoti Basu) జూలై 8, 1914న కోల్కతాలో జన్మించాడు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ కి చెందిన జ్యోతిబసు 1977 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినాడు. అంతకు ముందు 1967-69 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సి.పి.ఐ.పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయినాడు. 2000లో మఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన జ్యోతిబసు జనవరి 17, 2010న 96 సంవత్సరాల వయస్సులో మరణించాడు. 

బాల్యం


జ్యోతిబసు జూలై 8, 1914న కోల్‌కతలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి నిశికాంత్ బసు వైద్యుడిగా పనిచేసేవాడు. తల్లి హేమలతా బసు. స్థానికంగా కలకత్తా (ఇప్పటి కోల్‌కత) లోనే జ్యోతిబసు విద్యాభ్యాసం కొనసాగింది. ఇతని అసలుపేరు జ్యోతికిరణ్ బసు కాగా పాఠశాల దశలో ఉన్నప్పుడు తండ్రి జ్యోతిబసుగా పేరును తగ్గించాడు. ప్రెసిడెన్సీ కళాశాల జ్యోతిబసు తన డిగ్రీ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం 1935లో ఇంగ్లాండు బయలుదేరాడు. ఇంగ్లాండులో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించుదశలోనే గ్రేట్బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1940లో యాయశాస్త్రవిద్య పూర్తిచేసుకొని మిడిల్ టెంపుల్ వద్ద బారిస్టర్‌గా అర్హత పొందినాడు. అదే సంవత్సరంలో భారతదేశానికి తిరిగివచ్చాడు. 1944లో ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలో పాలుపంచుకొని ఆ తరివాత యూనియన్ ప్రధానకార్యదర్శి అయ్యాడు.

రాజకీయ జీవితం

ఇంగ్లాండులో ఉన్నప్పుడే జ్యోతిబసు రాజకీయాలవైపు ఆకర్షితుడైనాడు. 1938లో జవహర్‌లాల్ నెహ్రూ లండన్ పర్యటన సమయంలో సదస్సు నిర్వహణ బాధ్యతను జ్యోతిబసు చేపట్టినాడు. సుభాష్ చంద్రబోస్ పర్యటన సమయంలో కూడా జ్యోతిబసు ఏర్పాట్లు చేసినాడు. స్వదేశానికి తిరిగివచ్చిన పిదప 1946లో తొలిసారిగా బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యాడు. బి.సి.రాయ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాడు. 1967లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అజయ్ ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ప్రభుత్వంలో 1967 నుండి 1969 వరకు పశ్చిమబెంగాల్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. 1972లో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో జ్యోతిబసు కూడా తన శాసనసభ స్థానంలో కూడా ఓడిపోయాడు. జూన్ 21, 1977 నుండి నవంబరు 6, 2000 వరకు నిరాటంకంగా జ్యోతిబసు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. దీనితో దేశంలో ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డును కూడా జ్యోతిబసు స్వంతంచేసుకున్నాడు. సి.పి.ఐ.పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. 2000లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి పదవిని నుండి వైగొలిగినాడు. జనవరి 17, 2010న కోల్‌కతలో మరణించాడు.