-
సుబ్రమణ్యపురం
Posted by
సుమన్.గద్దె
on 11, అక్టోబర్ 2008, శనివారం
Labels:
సినిమాలు
తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు.
ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రమణ్యపురం సినిమా ఈ దశాబ్దపు ఉత్తమ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.
ఈ సినిమా కథ చెప్పి ఈ సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులను నిరాశ పరచడం ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే “1980 లలో మధురై లోని సుబ్రమణ్యపురం లో నివసించే ఒక ఐదుగురి యువకుల కథ ఇది”.
కథ, కథనం తో పాటు బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, సరైన సంగీతం ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ గా నిలబెడుతుంది.ఈ సినిమా నాకు బాగా నచ్చడానికి కొన్ని కారణాలు:
1. కథ మొదలైన తీరు నచ్చకపోయినా సినిమా ముగిసే సరికి కథ అలానే మొదలవ్వాలని దర్శకుడు కన్విన్స్ చేయగలగడం.
2. అంతా కొత్త వారైనా ప్రతి నటుడూ తమ పాత్రను అధ్భుతంగానే కాదు అవలీలగా పోషించారు.
3. ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ లేకపోవడం.
4. 1980 కాలాన్ని అత్యంత నేర్పుగా రిక్రియేట్ చేయడం.
5. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా తీసి దాన్ని బ్లాక్ బస్టర్ గా మలచిన తీరు.
6. మన టివిల్లో యాంకర్ గా ఒక వాగుడుకాయగా పరిచయమున్న స్వాతి కళ్ళతోనే గొప్ప నటన ప్రదర్శించింది.
7. పరుతి వీరన్, కల్లూరి, తమిళ్ MA సినిమాలలో క్లైమాక్స్ సెన్సేషనలైజ్ చేయకుండా ఈ సినిమా క్లైమాక్స్ కేవలం అంతకముందు జరిగిన సంఘటనల natural consequence గా మాత్రమే వుంటుంది.
8. వయొలెన్స్ అధికంగా వున్న సినిమా అయినా ఈ సినిమాలో అధిక శాతం వయొలెన్స్ మన మైండ్ లో ఊహించుకుంటాం కానీ తెరపై మనకి కనిపించదు.
9. ఈ సినిమాలో అణువణువనా వ్యక్తమయ్యే రియలిజం.
10. మొదటి పదిహేను నిమిషాలు తప్పితే ఊపిరి సలుపుకోలేని వేగంతో నడిచే కథనం.
ఒక వేళ మీకు పరుతి వీరన్, ఆటోగ్రాఫ్, కల్లూరి లాంటి సినిమాలు నచ్చుంటే ఈ సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చకపోతే ఈ సినిమా మీకు గ్యారంటీగా నచ్చుతుంది.
ఇంకా కాదు అంటే మీకు పల్ప్ ఫిక్షన్, సిటీ ఆఫ్ గాడ్స్ నచ్చి వుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చలేదంటే దయచేసి ఈ సినిమా కి దూరంగా వుండండి.ఈ సినిమా మీలాంటి టేస్ట్ లేని వాళ్ళకు కాదు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి